Previous Page Next Page 
కొత్తనీరు పేజి 37


    సూర్యనారాయణ తిరిగి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చేడు. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. పిల్లలు భోజనాలు చేసి సావిట్లో నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు. తండ్రి రాగానే కాస్త బెరుకుగా చూశారు. శకుంతల వంటింట్లో పిల్లల ఎంగిళ్ళు తీస్తూంది. సూర్యనారాయణ చాటుచాటుగా వెళ్ళి నాలుగు గదులూ చూశాడు. రాధ జాడ కనబడలేదు. భార్యని అడగాలంటే అభిమానం అడ్డు వచ్చింది. తన అలజడి పైకి కనపడనియ్యకుండా, మామూలుగా బట్టలు మార్చుకుని, వచ్చి భోజనానికి కూర్చున్నాడు.
    శకుంతల మౌనంగా వడ్డించింది. భార్య యేమన్నా చెపుతుందేమో అని ఎదురుచూసిన సూర్యనారాయణకి ఆమె మౌనం భరించరానిదైంది. ఇంక ఆగలేకపోయాడు.
    "అనూ ఏది?" నసుగుతూ అడిగాడు.
    "వెళ్ళిపోయింది!" శకుంతల నెయ్యి వేస్తూ నిర్వికారంగా అంది.
    సూర్యనారాయణ చకితుడై చూశాడు.
    "వెళ్ళిందా?.....ఎక్కడికి?.....అది వెడుతూంటే నువ్వెలా ఊరుకున్నావు? ఆడపిల్ల ఇల్లు వదిలి పోతూంటే, ఆపాలన్న జ్ఞానం లేదూ!" తను బాధ్యతగల తండ్రిలా శకుంతల మీద నెపం వేశాడు.
    "నేనేం చేస్తాను! ఇటు మీరు వింటారా, అటు అది వింటుందా నా మాట! ఎవరికి చెప్పగలను నేను?" అని నిష్టూరంగా అంది శకుంతల, సందు చూసుకుని.
    "చేతిలో డబ్బుగాని, ఉద్యోగం గాని లేకుండా యేం చేస్తుంది? ఎక్కడికి వెడుతూన్నట్టు? పోనీ అదైనా అడిగావా లేదా?" సూర్యనారాయణ తన ఆదుర్దా కప్పిపుచ్చుకోలేక పోయాడు. భార్య ఏం చెబుతుందో అని ఎదురు చూశాడు.
    శకుంతల ఉండబట్టలేక తన సలహా సంగతి చెప్పింది. విని ముఖం మాడ్చుకున్నాడు అతను. అన్నం అంతా కెలికి, ఇంత మజ్జిగ వేసుకుని తిని లేచి వెళ్ళాడు.
    ఆ రాత్రి అంత నిద్రపట్టక పక్కమీద దొర్లుతూనే ఉన్నాడు సూర్యనారాయణ.
    
                                       13
    
    జగన్నాథంగారు మంచి రోజు చూసి, అన్ని యేర్పాటులు చేసుకొని బయలుదేరారు తీర్ధయాత్రలకి. మొత్తం ఓ నెలా పదిహేను రోజులు అన్ని ఊళ్ళు తిరిగి రావటానికి యేర్పాటు చేసుకున్నారు! ముందుగాదారిలో శకుంతల ఇంటికి వెళ్ళి కూతుర్ని చూసి బయలుదేరడానికి నిశ్చయించారు.
    శకుంతల కీసారి కానుపు చాల కష్టమైంది. రెండు రోజులు యమయాతన పడింది. సవ్యంగా పురుడు రానందున డాక్టర్లు ఆపరేషన్ చేసి మృతశిశువుణు బయటికి తీశారు. మొత్తం పదిహేను రోజులు ఆస్పత్రిలో ఉండి కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని యింటికి వచ్చింది శకుంతల. తల్లి కొడుకుమరణదుఃఖంలో ఉందని, పురిటికి ఆడపడుచుణు సహాయానికి రప్పించుకుంది శకుంతల-
    తల్లి సంగతి అంతా శకుంతలకొడుకు వాసు జగన్నాథం గారికి రాశాడు. ఆ ఉత్తరం చూసి తీర్దయాత్రలకు బయలుదేరుతున్న జగన్నాథంగారు దారిలో కూతురిని చూసి వెళ్ళాలని అనుకున్నారు.  అల్లుడి కోపం, పంతం అన్నీ తెలిసినా కూతురిని చూడకుండా ఉండలేకపోయారు.
    తల్లిని తండ్రిని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది శకుంతల. ఈసారి కానుపుతో పూర్తిగా డీలా అయిపోయి, బల్లిలా పక్కని అంటిపెట్టుకున్న శకుంతలని చూసి పార్వతమ్మ ఎంతో భయపడింది, "ఇదేమిటే అమ్మా! ఇలా అయిపోయావు.....ఇంత జరిగినా నా కెందుకు రాయలేదే?"
    "ఏం రాయమంటావు, అమ్మా? నీ దుఃఖంలో నువ్వున్నావు. ఈ గొడవ అంతా నీకు రాసి మరింత బాధ పెట్టటం ఇష్టంలేక రాయలేదు." పేలవంగా నవ్వి అంది శకుంతల.
    "బాగుంది.....పోయినవాడితోపాటు నేనూ పోలేనుగదా? ఈ ప్రాణం ఉన్నన్ని రోజులు మీ గురించి తపన తప్పదు గదా!" చనిపోయిన కొడుకుని, కూతురి అనారోగ్యాన్ని తలచుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది పార్వతమ్మ.
    "సరే.....దేవుడి దయవల్ల నువ్వు క్షేమంగా బయటపడ్డావు. అంతేచాలు!" జగన్నాథంగారు తేలికగా నిట్టూర్చారు.
    అల్లుడిలో ఇదివరకటి కంటే కాస్త మార్పు వచ్చినట్టు కనిపెట్టారాయన. ఇంటికి వచ్చారనో.మరెందుకనో మామగారిని పలకరించాడు సూర్యనారాయణ. పూర్వపు కోపం, పంతం అవీ తగ్గినట్టు అనిపించింది ఆయనకి. మనిషిలో ఇదివరకంత కాఠిన్యం కనబడలేదు. ఎందుకో కాస్త కుంగినట్టు కనిపించాడు.
    ఆ మార్పు వయసుతోపాటు వచ్చిందేకాక, బహుశా పరిస్థితుల ప్రభావం వల్ల కూడా వచ్చివుండవచ్చు అనుకున్నారు. ఆర్ధికమైన ఇబ్బందులు, పంతం కొద్దీ ఎవరి మాటా లెక్కచేయకుండా పిల్లల్ని కన్న ఫలితం, అన్నిటికంటే ఈసారి భార్య అనారోగ్యంవల్ల గలిగిన ఇబ్బంది అతన్ని కలవరపెట్టి ఉంటాయని ఊహించారు. ఇవేకాక కూతురు తన్ను దిక్కరించి వెళ్ళిపోవడంతో కాస్త అహం తగ్గి ఉంటుంది. వీటన్నింటికి తోడు కాస్త మంచి చదువు చదివి తనను ఆదుకుంటాడని ఆశించిన పెద్ద కొడుకు పరీక్ష తప్పడం .....కుంగదీసి ఉంటుంది.
    అల్లుడు లేకుండా చూసి కూతురిదగ్గర ఈ విషయం ప్రస్తావించారాయన.
    "మారక ఏం చేస్తారు నాన్నా? ఇటు చూస్తే డబ్బు ఇబ్బంది, అటు వాసూ పరీక్ష తప్పడం. అనూరాధ ఇంట్లోంచి వెళ్ళిపోవడం, నా అనారోగ్యం-ఇన్నీ ఒక్కసారి రావడంతో ఎలాంటి వారైనా లొంగిరాక యేం చేస్తారు?"
    "రాధ వెళ్ళినప్పుడు ఏమైనా గొడవ జరిగిందా?"

 Previous Page Next Page