లేదండి వర్ధం ఏమన్నా తగ్గిందేమోనని చూశాను. ఇందాకటి కంటే ఎక్కువయింది. గాలి ఎగరగొట్టేస్తుంది. మరి తగ్గదో ఏమిటో. అప్పుడే పదకొండు అవస్తుంది ...." ఆందోళనగా అన్నాడు. "మరేం చేస్తారు..... ఏదో తుఫానులా వుంది. ఆ గాలిలో ఎలా వెళ్ళగలరు" అంది సీతమ్మ. ఓ క్షణం అలోచించి ఆమె "మీ కభ్యంతరం లేకపోతే అలా ఆ మంచం మీద పడుకోండి. బీదవాళ్ళం అంతకంటే ఏర్పాటు చెయ్యలేం. పడుకోండి. వర్షం తగ్గాక వెళ్ళిపోదురు గాని మీరు మాత్రం ఎంతకని అలా కూర్చుంటారు."
"నా పడుక్కోడానికేం లెండి. నా బాధ అల్లా ఈ ఒక్క గదిలో నేనూ చేరి మీ కిబ్బంది కలిగించానని."
"మీరేం చేస్తారు. పరవాలేదు లెండి.... పడుకోండి ." సీతమ్మ ఓ తలగడ దుప్పటి తీసి మంచం మీద పెట్టింది. అసలు అతని మాట దేముడేరుగు ఆమెకు నిద్ర ముంచుకు వస్తుంది. ఇంకా మొహమాటానికైనా అలా కూర్చోడం నిద్ర ఆపుకోవడం ఆమె వశంలో లేకుండా వుంది. అతనూ పడుకుంటే తనూ నడుం వాల్చచ్చు. ఈ రాత్రి గడిపెయ్యాలి. చూస్తూ చూస్తూ ఓ గొప్పింటి బిడ్డని యీ వానలో ఎలా పోమ్మనగలదు బయటికి.
"సరే, నా గురించి మీరు మేలుకోకండి. పడుకోండి. అంతగా వర్షం తగ్గితే, నేను వెళ్ళేముందు మిమ్మల్ని లేపి వెళ్ళిపోతాను " అన్నాడు.
సీతమ్మ తల ఊపి దీపం బాగా తగ్గించి గదిలో ఓ వార పెట్టింది. పిల్లల పక్కన చోటు చేసుకుని , చీర కొంగు వంటి నిండా కప్పుకుని ముడుచుకుని పడుకుంది.
తన కాళ్ళు సగం వరకే వచ్చిన ఆ నులకమంచం మీద పడుకోడానికి నానా అవస్థలు పడి యిటు తిరిగి అటు తిరిగి ఎటూ సరిపోక ఆఖరికి కాళ్ళు ముడిచి వెల్లకిలా పడుకున్నాడు అతను. అతనికి నిద్ర పట్టడం లేదు. ఆ గాలికి, ఆ వర్దానికి , సగం తడిసిన బట్టలు, షర్టు లేకుండా వున్న అతనికి చలి పుట్టుకొస్తుంది లోపల్నుంచి. సిగరెట్టూ మరోటి తీసి వెలిగించాడు. కాని ఆ వేడి అతనికి చాలటం లేదు. ఈ డర్టీ వర్షం లేకపోతే ..... హాయిగా యీ పాటికి డాక్ బంగాళా లో డన్ లప్ పరుపుమీద ....."నీలూ" కౌగిలిలో వెచ్చగా పడుకుని ఉండేవాడు! ఈ దరిద్రపు వర్షంతో పాటు స్కూటర్ లో పెట్రోలూ అయిపోవాలా! పెట్రోలు అయిపోకపోతే యీ వర్షం గాదు.... ఏదీ తనని ఆపలేక పోయేది! వర్షం వస్తుందనే మేఘాలు కమ్ముకోస్తున్నాయన్న భయంతోనే ప్రతీసారి కంటే తొందరగా బయలుదేరాడు తను. ఆ హడావుడిలో పెట్రోలు సంగతి చూసుకోలేదు. పాపం నీలూ ఒక్కర్తీ ఎలా వుందో అక్కడ! నీలూ వచ్చిందో లేదో! అసలు యీ వర్షానికి రాలేక పోయిందేమో!.... ఈ వర్షంలో ఏ టాక్సీ వాడు మాత్రం వస్తాడా? వస్తే ఒక్కర్తీ , దూరంగా వున్న ఆ డాక్ బంగళాలో , ఎవరూ లేని చోట , వంటరిగా ఎలా వుందో ఏమిటో? ప్చ్! కారు తీసుకు రావాల్సింది! ఇంట్లో రెండు కార్లు తగలడ్డా అవసరానికి ఎప్పుడూ వుండవు! తండ్రి క్లబ్ కి, అన్నగారు వదినగారు సినిమాలకి వేం చేశారు గదా! అసలు కారు తీసుకొస్తే ఎక్కడికి , ఎందుకు , ఎప్పుడోస్తావు అన్న ప్రశ్నలు వస్తాయని ఇలాంటప్పుడు కారు ముట్టుకోడు తను. స్కూటరయితే తన రాకపోకలని ఇంటిలో పట్టించుకోరు. రాత్రి రాకపోయినా, చదువుకుంటూ ఏ ఫ్రెండు రూములోనో పడుకుండిపోయాననవచ్చు! ఆ అలవాటు తోనే స్కూటరుతో బయలుదేరాడు! వర్షంతో త్రోవ కనిపించకపోయినా, గాలి తోసేస్తున్నా అలాగే మొండిగా ఇక్కడి దాకా వచ్చాడు! పెట్రోలు అయిపోకపొతే ఆ రెండూ మైళ్ళూ అలాగే వెళ్లి చేరేవాడు. వెళ్ళి హాయిగా నీలూ అతనూ ..... ప్చ్ , ఏం చెయ్యడం ఇప్పుడు! నడిచి వెళ్ళగలడా ఈ వర్షంలో. ఇంకా రెండు మైళ్లుంది, వెళ్ళినా, నీలూ వచ్చి వుండకపోతే.....
అతనికి చాలా చిరాగ్గా వుంది. క్రింద నులకమంచం గుచ్చుకుంటోంది. తలక్రింద తలగడ కంపు కొడుతుంది. డన్ లవ్ ల మీద పడుకునే అతని దేహం అక్కడ పడుకోనని మొరాయిస్తుంది. ఉన్ని రగ్గూ లేక, నీలూ లేక ఆతను చలితో వణికేడు. వున్న ఆఒక్క సిగరెట్టు తీసి వెలిగించాడు.
ఆ గుడ్డి వెలుతురులో గువ్వపిట్టలా ముడుచుకు పడుకున్న సీతమ్మని చూశాడు! అలా చూస్తుంటే .... పాపం ఈవిడే డబ్బున్న అవిడయితే ..... మంచి చీరలు గట్టి, ముస్తాబు చేసుకుంటే ఏ ఆధునిక యువతికి తీసిపోదనిపించింది. ఆ మాట కొస్తే ....నీలూ...... నీలు అంత డబ్బుండి..... శరీరాన్ని పాలతో పళ్ళతో పోషిస్తూ...... అందమైన చీరలు కడితే , నీలూ కంటే బాగానే వుండవచ్చు నెమో ! పాపం!
నిజమే పాపం సీత! .... ముప్పై ఏళ్ళు నిండా లేకుండానే మొగుడు పోగానే , వంటలక్క కాంగానే "సీతమ్మ' అయి కూర్చుంది. మొగుడు బ్రతికుండగా , మొగుడు గుమస్తా అయినా, వున్న ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని వున్నంతలో అందరూ ఆనందంగా హాయిగానే వుండేవారు. పచ్చగా వత్తయిన నొక్కుల జుత్తుతో , సీత ఏ ఆభరణాలు లేకపోయినా కళకళలాడే బొట్టుతో అందంగానే వుండేది. సీత అందాన్ని చూసి కట్నం లేకుండానే పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి అయి పట్టుమని పదేళ్ళు అవకుండానే దురదృష్టం లారీ రూపంలో వచ్చి సీత భర్తని పొట్ట పెట్టుకుంది. నిండా ముప్పై ఏళ్ళన్నా లేని సీత, వెనకాల ఆస్థి పాస్తులే కాక ఆదుకునే వారు లేని సీత, ఆమె స్థితికి కంటతడి బెట్టె వారు తప్ప కంట నీరు తుడిచే వారెవరూ లేని సీత, ధర్డు ఫారం మాత్రం పాసయిన సీత , వంటరిగా యీ పిల్లలని పెట్టుకుని ఎలా బ్రతుకను భగవంతుడా అని ఏడ్చిన సీత -- త్వరలోనే తన ఏడ్పు తనే ఏడవాలని గ్రహించుకుంది. గుండె దిటవు చేసుకుంది. భర్త ప్రావిడెంటు ఫండు, ఇన్సురె డబ్బు అన్నీ కలిపి మూడువేలు వాస్తే ఆ డబ్బు చిల్లర మల్లరగా ఖర్చుయిపోక ముందే తలదాచుకోడానికి ఓ గూడు అవసరం అని, ఆఫీసు వాళ్ళంతా చందాలు వేసుకుని ఊరికి దూరంగా చవకగా దొరికిన స్థలాన్ని కొని ఇస్తే ఆ మూడు వేలు పెట్టి ఓ గది వేసుకుంది. పంచదించి అక్కడ వండుకుంటూ గది కట్టించుకోడానికి మాత్రం సరిపోయింది ఆ డబ్బు. గూడు ఎర్పాదాక రెక్కాడితే గాని డొక్కాడని స్థితి వచ్చిందని తెలుసుకుంది. తన విద్య ఏ ఉద్యోగాన్ని ఇవ్వదని ఆమెకి తెలుసు. ఆమె కొచ్చిన విద్య --- అదే వంట. అదే ఆమె జీవనాధారమైంది. ప్లీడరు గారింటిలో ముప్పై రూపాయలకి వంటకి కుదిరింది. వాళ్ళు పెట్టిన భోజనం తింటున్నంత సేపూ ఇంటిలో పచ్చడి మెతుకులు తినే పిల్లలు కనిపించీ మింగుడు పడేది కాదు ఆమెకి. 'అమ్మా నా పిల్లలతో పాటు కలో గంజో తాగుతాను. నాకీ భోజనం వద్దు తల్లీ, దాని బదులు డబ్బే ఇప్పించండి " అని వేడుకుంది. వారిచ్చే ఏభై , మధ్యాహ్నం పూట ఇరుగు పొరుగు చిన్న పిల్లలకి చదువు చెప్పి సంపాదించే పాతిక మొత్తం డెభై ఐదు రూపాయలతో ఇద్దరి పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో చదివించుకుంటూ ఎలాగో బ్రతుకు వెళ్ళదీస్తుంది సీత, మంచి రోజుల కోసం ఎదురుచూస్తూ-------
మనసులో బాధ, అలవాటు లేని శ్రమ, హటాత్తుగా పైన బడిన వైధవ్యం అన్నీ కలిసి ముప్పై ఏళ్ళ సీతని 'సీతమ్మ' గా మార్చేశాయి.