Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 37

 'కాల్బాట్ పోత, ఉండరో' అంటే 'కాలిబాటతో పోతూ ఉన్నారు' అనీ, 'కై వద్దులో' అంటే 'చెయ్యి వదులు' అనీ అయి ఉండాలి.
ష్యూర్ !
'కొండ మొదలు రెడ్లు' అనబడే గిరిజనులు పాడుకునే పాత ఒకటి గుర్తొచ్చింది సందీప్ కి. 'కై బింద్ లాగ్ తోండ్' అని అంటుంది ఒక పడుచు, అంటే చేతిలోని బిందె లాగుతున్నాడు అని అర్థం!"
"యాం జెబరో!" అంది యువరాణి కోపంగా.
"మేము మీ శత్రువులం కాదు. ఒక పనిమీద ఇటు వచ్చాం." అన్నాడు మాటలకు హావభావాలు జోడిస్తూ.
అర్థం కానట్లు చూసింది ఆమె.
భూతాలరాజు అందుకుని, సందీప్ మాటను సుళువుగా ఆ భాషలోకి తర్జుమా చేసి చెప్పాడు.
భూతాలరాజు విలువ ఏమిటో మొదటిసారిగా తెలిసింది సందీప్ కి.
"యాం పన్నో ?" అంది యువరాణి.
చెప్పాడు సందీప్. భూతాలరాజు అనువాదం చేశాడు.
అలవోకగా నవ్వింది యువరాణి. కొండమీదనుంచీ జలపాతం జారుతున్నట్లు వుంది ఆ శబ్దం. నవ్వాపుకుని, "సింబా!" అంది. తన అనుచరులవైపు తిరిగి కనుబొమలు ఎగరేస్తూ.
'సింబా' అంటే, ఆఫ్రికన్ స్వాహిలీ భాషలో సింహం అని అర్థం.
సింహం అని మెచ్చుకుంటోందా తనని? లేకపోతే వెక్కిరిస్తోందా ? ఆఫ్రికన్ పదాలు కూడా కలిశాయా వీళ్ళ భాషలో? అసలు 'సింబా' అనే పదం ఇండియానుంచీ ఆఫ్రికాకు ఎగుమతయిందా. ఆఫ్రికా నుంచి ఇండియాకు దిగుమతి అయిందా?
"నా పేరు నెఫ్రె తీతీ ?" అంది యువరాణి, తమ భాషలో.
ఉలిక్కిపడ్డాడు సందీప్. 'నెఫ్రె తీతీ' అనేది ఒక పురాతన ఈజిప్టు వంశపు రాణి పేరు. అంటే అద్భుతమైన అందగత్తె అని అర్థం. ఈజిప్టు ఆఫ్రికాలో ఉంది.
చరిత్రకి అందని కాలంలో, వేల సంవత్సరాల క్రితం ఈజిప్టు నుంచీ సముద్రయానం చేస్తూ భారత తీరాన్ని చేరి స్థిరపడిపోయిన జాతి మనుషులా వీళ్ళు ?"
లేదా వీళ్ళ పూర్వీకులే కొందరు ఈజిప్టుకి వెళ్ళి స్థిర నివాసం ఏర్పరుచుకుని కూడా ఉండవచ్చు.
అంటే -
ఈజిప్షియన్ ఆచారం ప్రకారం ఒక రాకుమారిని మమ్మీగా మార్చి ఈ అరణ్యంలో ఎక్కడో సమాధి చేసి ఉండడం కేవలం పుక్కిటి పురాణం కాదా? నిజమే అయి వుండవచ్చా? నిజానికి దగ్గరగా వస్తున్నదా తను?
"పరుగ్ తోండ్ వాతా జేరో!" అంది యువరాణి.
ఇద్దరు అమ్మాయిలూ పరుగున వెళ్ళి ఎర్రగా కాల్చిన తీగెను పట్టకారుతో పట్టుకొచ్చారు. అడల్ట్ మే ఫ్లై ఆకారంలో ఉంది అది. నేరుగా స్వప్న దగ్గర ఆగి, నెఫ్రె తీతీ వైపు చూశారు. నెఫ్రెతీతీ మొహంలోకి జెలసీ కనబడుతోంది.
జరగబోయేది ఏమిటో అర్థమవగానే వళ్ళు గగుర్పొడిచింది సందీప్ కి. అందగత్తెలకు అందగత్తెలాంటి నెఫ్రెతీతీ తనకంటే అందంగా వేరే అమ్మాయి ఉండడం భరించలేదు. అందుకే తక్కిన యువతులందరికీ బుగ్గలమీద కీటకం బొమ్మ 'బ్రాండ్' చేయించింది. తను మాత్రం ఏ మచ్చా లేకుండా ఉండిపోయింది.
ఇప్పుడు స్వప్న బుగ్గమీద కూడా వాతపెట్టబోతున్నారు. అది శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది. క్లిష్టమైన ప్లాస్టిక్ సర్జరీ చేసి తొలగిస్తే తప్ప. తను మళ్ళీ సిటీకి తిరిగి వెళ్ళాక, బుగ్గమీద మచ్చతో బతకడం ఎంత ఇబ్బంది!
నెఫ్రెతీతీ సోగకన్నులతో సైగ చేసింది. స్వప్న బుగ్గకి ఆ తీగె ఆనించబోయింది ఒక అమ్మాయి.
"న్నో!" అంటూ అడ్డు నిలుచున్నాడు సందీప్. స్వప్నకి, అప్పటికే గుడ్లు కనురెప్పలలోకి పోతున్నాయి. స్పృహ తప్పేటట్లు ఉంది తనకు.
తీగెని పట్టుకున్న అమ్మాయి ఆగి, సందిగ్ధంగా నెఫెర్ వైపు చూసింది.
అలవోకగా చెయ్యి ఎత్తింది. నెఫెర్ - ఆగమన్నట్లు ఆమె పెదిమలు మీద తెల్లటి చిరునవ్వు విషం చిలికితే వచ్చిన నురుగులా ఉంది. ఆమె చూపులు సందీప్ ని ఆపాదమస్తకం ఇష్టంగా తడుముతున్నాయి. కాల్చేసేటట్లు స్వప్నని చూస్తున్నాయి.

 Previous Page Next Page