రెండేళ్ళు గడిచి మనిషి పొడుగయ్యాక అప్పుడు మోటార్ సైకిల్ ఫీట్స్ మొదలెట్టాడు రాజా. కళ్ళు తిరిగేంత వేగంతో అతను గ్లోబులాంటి దాన్లో రైడ్ చేస్తూ వుంటే కళ్ళార్పకుండా చూసేవాళ్ళు ప్రేక్షకులు.
తర్వాత జీపుని వేగంగా నడుపుతూ వచ్చి జంప్ చేయించడం నేర్చుకున్నాడు. పులుల్ని ఆడించడం నేర్చుకున్నాడు.
అవి ప్రేక్షకులు చేసి మెచ్చుకునే ఫీట్సు.
ఇవే కాకుండా....
అవసరమైతే ఆర్కెస్ట్రాలో కూర్చుని గిటార్ వాయించేవాడు.
వంటవాళ్ళలో ఎవరైనా వంట్లో బాగుండక పడక వేస్తే వాళ్ళ ప్లేస్ లోకి తను వెళ్ళేవాడు.
అందుకని సహజంగానే సర్కస్ యజమాని గోపాలన్ కి రాజా అంటే అంత అభిమానం కలిగింది.
గోపాలన్ అభిమానాన్ని గుర్తుంచుకున్నాడు రాజా. సహచరుల అసూయని అలక్ష్యం చేశాడు.
తన పనేదో తను చూసుకున్నాడు.
అక్కడ నేర్చుకోదగ్గ విద్యలన్నీ నేర్చుకున్నాడు.
సర్కస్ ఓనర్ గోపాలన్ తో తను కుదుర్చుకున్న అగ్రిమెంటు పిరియడ్ ముగియడంతో సర్కస్ కి గుడ్ బై చెప్పేశాడు రాజా.
అన్ని సంవత్సరాలలో ఏనాడూ కూడా అతను తన తొలి గురువు ఫోటోని కళ్ళకద్దుకోకుండా కళ్ళు తెరవలేదు.
ఆయన చేసిన హితోపదేశం ఏ క్షణం కూడా మరవలేదు.
ఏం చెప్పాడు కృష్ణాజీ?
"రాజా! నీ దేహం ఈ దేశం కోసమే అంకితం కావాలి. నా కోరిక తీరుస్తానని మాట యివ్వు"
అది ఆయన కోరిన కోరిక.
తను ఇవ్వవలసిన గురుదక్షిణ కూడా అదే.
దేశసేవకే తన జీవితం అంకితం చెయ్యాలి.
దేశసేవ చెయ్యాలంటే అసలు దేశం ఎట్లా ఉందో తెలుసుకోవాలి. అందుకుగానూ దేశాటనం చెయ్యాలి. నలు వైపులా తిరగాలి. దేశమంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ మనుషులే కాదు, ఈ భాషే కాదు.
ఊళ్ళు తిరగటం మొదలెట్టాడు రాజా.
వారానికో ఊరు చూడడం.
ఏ పని దొరికితే ఆ పని చెయ్యడం.
తన కళ్ళు అనే కెమేరాలతోనే దృశ్యాలని రికార్డు చేసుకోవడం. మెదడు అనే డైరీలో పాయింట్స్ నోట్ చేసుకోవడం.
ఎవరో కామెంట్ చేసినట్లు -
బహుశా దైవాంశ సంభూతుడేనేమో ఈ రాజా.
ఎక్కడికెళ్తే అక్కడి భాష పట్టుబడేది అతనికి. ఏ ఊరికెళితే ఆ ఊరి యాస అంటుకునేది.
తిరిగాడు తిరిగాడు....
చూశాడు చూశాడు....
విన్నాడు విన్నాడు....
ప్రతి రోజూ ఒక కొత్త అనుభవం!
ప్రతి రోజూ ఒక కొత్త అడ్వెంచరు!
రకరకాల మనుషులు! రకరకాల మనస్తత్వాలు!
పవిత్రులు, పతితులు, పర్వర్టెడ్ మెంటాలిటీ ఉండేవాళ్ళు...
అందరితో అంటీ ముట్టనట్లు ఉండేవాడు రాజా.
కానీ ఒక్కడితో మాత్రం అలా నిర్లిప్తంగా ఉండడం కుదరలేదు.
అతనే కీర్తి! కీర్తికుమార్!
రాజా వెళ్తున్న సర్క్యూట్ లో చాలాసార్లు తగిలాడు అతను.
మిల్టన్ "పారడైజ్ లాస్ట్"లో రాశాడు సైతాన్ గురించి. సైతాన్ దేవుడికి ప్రత్యర్థి. దేవుడితో తగువు పెట్టుకోగలిగినంత తాఖత్ ఉన్నవాడే సైతాన్ కూడా. అతను కూడా ఒక ప్రిన్సే! ప్రిన్స్ ఆఫ్ డార్క్ నెస్. చీకటి రాజ్యానికి అధిపతి.
కీర్తి కూడా సైతాన్ లాంటివాడే అతనిదీ అన్నిటిలోనూ రాజాకి వ్యతిరేకమైన స్వభావం.
రాజా మంచివాడయితే కీర్తి చెడ్డవాడు.
రాజా అందగాడయితే కీర్తి కురూపి.
రాజా పరోపకారి. కీర్తికి పరపీడనం అంటే ప్రమోదం.
రాజాది పాజిటివ్ థింకింగ్. కీర్తిది పూర్తిగా నెగెటివ్ థింకింగ్.
అతన్ని ఇగ్నోర్ చెయ్యాలనీ, మర్చిపోవాలనీ చాలా ట్రై చేశాడు రాజా. కానీ అది కుదరలేదు. చాలా తరచుగా కీర్తి గుర్తు వస్తూనే ఉంటాడు రాజాకి.
ఈ కీర్తిని గురించి ముందు ముందు....
తను నేర్చుకున్న విద్యలని ఒలింపిక్స్ లో టెస్ట్ చేసుకోదలుచుకున్నాడు రాజా.
ఒలింపిక్స్ కి వెళ్ళడానికి నానా తిప్పలూ పడవలసి వచ్చింది అతనికి. అతనిలో ఉన్న అద్భుతమైన, అనితర సాధ్యమైన టాలెంటుని చూసీచూడగానే గుర్తుపట్టేశారు సెలెక్టర్లు.
కానీ రాజా సెలెక్ట్ కాలేదు.