"ఆయన్నడిగే దేమిటిలెండి- మన కాలనీవాళ్ళ మొఖాలకు ఒక పిక్నిక్కులేదు పాడులేదు. తెల్లారిలేస్తే మన కాలనీలోనే ఒకరి మొఖాలొకరు చూసుకోవటం - మనమీదపడే అవాంతరాలు సరిదిద్దుకోవటంతోనే సరిపోతోంది. అందరం సరదాగా వెళ్దామని మా ఆడాళ్ళంతా నిర్ణయించుకున్నాం-" అంది మా శ్రీమతి లోపల్నుంచీ.
ఆ పరిస్థితుల్లో ఇంక మాకు గత్యంతరం లేక బయల్దేరడానికి వప్పుకున్నాం. సాయంత్రం ఆరుగంటలకల్లా బయల్దేరింది బస్. అనుకున్న దానికంటే ఎక్కువమంది బయల్దేరేసరికి బస్ ఫుల్ అయిపోయింది. దారిలో జనార్ధన్ పిల్లలకూ ఆడాళ్ళకూ తమ సినిమా ఫీల్డ్ తాలూకూ విశేషాలు వివరిస్తున్నాడు.
"ఆ సినిమా షూటింగవుతూండగానే ఇంకా బోలెడు ఆఫర్లు వచ్చాయ్ పార్వతీదేవి గారూ! నన్నూ చిరంజీవినీ పెట్టి ఇద్దరూ హీరోలుగా సినిమా తీయాలని ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. కానీ నేనే వప్పుకోలేదు."
"ఎందుకని?" ఆశ్చర్యంగా అడిగింది సావిత్రమ్మగారు.
"ఎందుకేమిటి?" టైటిల్స్ వేసేప్పుడు- మా ఇద్దరిలో ముందు ఎవరిపేరు వేస్తారని అడిగాను! చిరంజీవి పేరు ముందువేసి తరువాత నాది వేస్తామన్నారు. నాకది నచ్చలేదు. ముందు నా పేరు వేయమన్నాను."
"అబ్బ!-" అందరూ ఆశ్చర్యపోయారు.
"అవునుమరీ! చిరంజీవికి నాకంటె ఎక్కువమంది అభిమానులుండవచ్చు. రేపు ఈ పిక్చర్ రిలీజయాక నాకు మాత్రం అభిమానులుండరూ?"
బస్ విజయవాడలో ప్రవేశించేసరికి రాత్రి ఒంటిగంటయిపోయింది.
తీరా గవర్నర్ పేట్ దగ్గర కొచ్చేసరికి బస్ ఓ పోలీస్ వాన్ మా కెదురుగ్గా వచ్చింది. అందులోనుంచి ఓ కానిస్టేబుల్ దిగి బస్ ఆపమని సైగచేశాడు.
బస్ ఆపాడు డ్రైవర్.
మరుక్షణం నలుగురు కానిస్టేబుల్స్ బస్ లో జొరపడ్డారు.
"దిగండి అందరూ-" అరచాడొకతను.
"ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు శాయిరామ్.
"బస్ చెక్ చేయాలి!"
"ఎందుకు?"
"ముందు దిగవోయ్-" మీదకొస్తూ అన్నాడతను.
ఇంకేమయినా మాట్లాడితే ఈసారి 'రా' అంటాడని ఊహించి అందరం బస్ దిగాం.
బస్ అంతా అయిదు నిమిషాల పాటు వెతికారు వాళ్ళు.
"ఏదీ? మీరు దొంగతనం చేసిన సామాను?" కిందకు దిగి అడిగాడు ఓ కానిస్టేబుల్.
"దొంగతనమేంటి."
"హైద్రాబాద్ పొలిమేరలో దొంగతనం చేసి ఒక పెద్ద గాంగ్ బస్ లో ఇటే పారిపోయివచ్చినట్లు తెల్సింది మాకు-"
"అంటే మేం డెకాయిట్స్ లాగా కనబడుతున్నామా?"
హఠాత్తుగా పోలీస్ వాన్ లోనుంచి ఓ గొంతు కర్ణకఠోరంగా, ముద్దగా వినిపించింది.
"ఒరే శ్రీశైలం- ఆళ్ళనిలా తీసుకురా!"
"పదండి-" అన్నాడు కానిస్టేబుల్.
నేనూ, శాయిరామ్, జనార్ధన్, యాదగిరి, రంగారెడ్డి, గోపాల్రావ్ వాన్ దగ్గరకెళ్ళాం, వాన్ లోనుంచి బ్రాందీవాసన గుప్పుమంది.
ముందుకూర్చున్న పోలీస్ అధికారి మా మొఖాల మీద టార్చ్ లైట్ వేశాడు.
"ఎవర్రామీరు?"
మాకు కోపం పొడుచుకొచ్చింది. మా ఆఫీస్ లో పెద్ద అధికారి కూడా మమ్మల్ని 'రా' అనడు.
"మర్యాదగా మాట్లాడండీ! 'రా' అంటారేమిటి?" అన్నాడు శాయిరామ్ ధైర్యంచేసి.
లోపలి ఆకారం టార్చిలైట్ శాయిరామ్ మొఖం మీద ఫోకస్ చేశాడు.
"నువ్వెవర్రా?"
"'రా' అనవద్దనే చెప్తోంది!"
"వీడిని లోపల వేసేయండ్రా!" అరిచిందా గొంతు.
మరుక్షణంలో ఇద్దరు కానిస్టేబుల్స్ దిగివచ్చి శాయిరామ్ ని లాక్కెళ్ళి వాన్ వెనుక తలుపులు తెరచి శాయిరామ్ ని లోపలకు తోసి తలుపు వేసేశారు మళ్ళీ.
"వీళ్ళతో తలనొప్పి ఎందుగ్గానీ సరిగ్గా సమాధానం చెప్పి మన్దారిన మనం పోవటం మంచిది" అన్నాడు రంగారెడ్డి.
మాకు భయంవేసింది ఈ గొడవెంతదూరం వెళ్తుందోనని! అసలే ఫామిలీ చిల్డ్రన్స్ తో ఉన్నాం.
"మాట్లాడరేంరా- ఎవరు మీరు?"
ఎదురు తిరగటం కంటే జవాబు చెప్పటమే మంచిదని తెలిసిపోయింది.
"మేం హైదరాబాద్ నుంచి వస్తున్నాం-" అన్నాడు రంగారెడ్డి.
"హైద్రాబాద్ నుంచి వస్తున్నారని మాకు తెలుసోయ్! మీరెవరు?"
"నా పేరు ఉదయార్కర్ ఇతని పేరు రంగారెడ్డి- ఇతను..."
"ఆ విషయం మాకూ తెలుసోయ్- మీరెవరు?"
నేను రంగారెడ్డి వంక చూశాను. రంగారెడ్డి నావంక చూశాడు. ఏం చెప్పాలో ఇద్దరికీ అర్థం కాలేదు.
"ఒకవేళ ఉద్యోగం అడుగుతున్నారేమో-" అన్నాడు రంగారెడ్డి.
"మేము గవర్నమెంట్ సర్వెంట్స్-" అన్నాన్నేను.
"గవర్నమెంట్ సర్వెంట్స్ అని తెలుసోయ్- మీరెవరు?"
మా గొడవ చూసి తను ముందుకొచ్చి నిలబడ్డాడు గోపాల్రావ్
"వాట్ జ్ ది ప్రాబ్లమ్!" అడిగాడు గోపాల్రావ్ నిద్రకళ్ళతో.
"హూ ఆర్ యూ?" కమిషనర్ గోపాల్రావ్ నడిగాడు.
"పేరు గోపాల్రావండీ!"
"గోపాల్రావ్ అని తెలుసోయ్- నువ్వెవరు?"
"జర్నలిస్ట్ నండీ!"
"జర్నలిస్ట్ వని మాకు బాగా తెలుసురా! నువ్వెడివి?"
గోపాల్రావ్ కి వళ్ళు మండిపోయింది.
"మా వాడి నెందుకు వాన్ లో పడేశారు ముందు చెప్పండి."
"నువ్వెవడ్రా అడగటానికి?"
"నేనెవరో రేపు పేపర్ చదువుతే తెలుస్తుంది."
"వీడిని కూడా లోపలేసెయండ్రా-"
కానిస్టేబుల్స్ గోపాల్రావ్ కూడా ఈడ్చుకెళ్ళి వాన్ లోపలకు తోసేశారు.
"బస్ చెక్ చేశారా?" అడిగిందా గొంతు కానిస్టేబుల్స్ ని.
"చెక్ చేశాం సార్!"
"ఏమయినా దొరికాయా?"
"ఏమీ దొరకలేదు సార్! ఈ క్షణం న్యూస్ పేపర్ హైదరాబాద్ ఎడిషన్ దొరికింది." ఆ పేపర్ అందిస్తూ చెప్పాడు కానిస్టేబుల్.
ఆ ఆకారం పేపర్ తీసుకుని టార్చ్ లైట్ ఫోకస్ చేసి చూసింది.
"విజయవాడలో పోలీసు దౌర్జన్యకాండ!" గట్టిగా చదివాడతను.
"ఈ పేపర్ ఎవర్దిరా?"
రాజేశ్వరి ముందుకొచ్చి 'నాది' అంది. అతను టార్చ్ లైట్ రాజేశ్వరి మొఖం మీద వేశాడు.
"హైదరాబాద్ నుంచి ఈ పత్రిక ఇక్కడికెందుకు తెచ్చావ్?"