Previous Page Next Page 
జైలు పేజి 37


    బుద్ధుడు వెనక్కి తిరిగి "ఇంతమంది జనాన్ని చూస్తూ వీధిలో తిరగడం ఎంత థ్రిల్లింగ్ గా వుందో. బందిఖానాలో వున్నప్పుడే స్వేచ్ఛ విలువ తెలిసేది అది సరే, నువ్వు భిక్షగాడు కాబట్టి నిదానంగా నడవాలి. మరి మేమెందుకు చిన్నగా నడవాలి?" అని నవ్వాడు.

 

    ఉత్తరుడు అచ్చు చిన్నపిల్లాడిలా ఆనందపడిపోతున్నాడు. ఎదురుపడ్డ ప్రతి వ్యక్తివైపు మూకుడ్ని తీసి, "ధర్మం బాబూ! మీ దగ్గర ఎంతుంటే అంతే వేయండి బాబూ, పదిపైసలు... పావలా... అర్థ... రూపాయి... పది...." అంటూ చివరికొచ్చేసరికి నాలుక కరుచుకుంటున్నాడు.

 

    తిలక్ కి అది ఓవర్ యాక్షన్ లా కనిపించి "ఎవడైనా పది రూపాయలు దానం చేస్తాడా? అర్థరూపాయి వరకు ఆపెయ్" అన్నాడు.

 

    "అలానే బాసూ!" అని తిరిగి ఎదురుపడ్డ వాళ్ళకు అడ్డం పడుతున్నాడు.

 

    మరో గంట వరకు తమను ఎవరూ గుర్తించకపోతే టౌన్ దాటేస్తామనుకున్నాడు తిలక్. దాదాపు గంటనుంచి వాళ్ళు నడుస్తున్నారు. కారులోనో, మరో వాహనం లోనో వెళితే పోలీసులు పట్టుకుంటారన్న అనుమానంతో భిక్షగాళ్ళ వేషం వేశారు.

 

    ముందు అనుకున్న పథకం ప్రకారం అన్నీ జరిగిపోతున్నాయన్న ఆనందం తిలక్ ముఖంలో తాండవిస్తోంది. తను చెప్పినట్టే లాలస లారీని తీసుకువచ్చి కాంపౌండ్ వాల్ కు గుద్దించింది. ముందే పెళ్ళలు వూడబెరకడం వల్ల ఆ మేరకే గోడ పడిపోయి కంతలా ఏర్పడింది. దాంతో కరెంట్ తీగలు ముట్టుకోనవసరం లేకుండా కంతలో దూరి బయటపడ్డారు.

 

    ఆ కాలనీలోనే వున్న లాలస స్నేహితురాలి ఇంట్లోకి వెళ్ళి వేషాలు మార్చుకున్నారు.

 

    తమను మరోసారి పరీక్షగా చూసుకున్నాడు తిలక్. సాధారణంగా అయితే ఎవరికీ డౌట్ వచ్చే వీలులేదు. మరో రెండు కిలోమీటర్లు నడిస్తే వూరు దాటిపోతుంది. అంతవరకు జాగ్రత్తగా వ్యవహరించాలని మరింత గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.

 

    బుద్ధుడు, ఉత్తరుడు మాత్రం ఇదంతా తాత్కాలికంగా మరిచిపోయారు. వీధుల్లో తిరిగి కొన్ని సంవత్సరాలు కావడంతో అంతా కొత్త కొత్తగా వుంది. ట్రాఫిక్ ఐలెండ్ దగ్గర పోలీసును చూసినప్పుడు మాత్రం వెనక్కి తగ్గుతున్నారు.

 

    ఈ కారణాలు కాదుగానీ, మరో కారణంచేత లాలస కూడా వర్షంలో తడుస్తూ ఆనందిస్తున్న చిన్నపిల్లలా ఉక్కిరిబిక్కిరవుతోంది. తిలక్ చేతిని తను పట్టుకోవడం వల్ల కలుగుతున్న మధుర సంచలనం ఆమె శరీరంలో వెచ్చటి ఆవిర్లను రేపుతోంది. ఎప్పుడో పడుకున్న అమ్మ ఒడి ఆమెకు గుర్తువస్తోంది. తనకూ ఓ తోడు వున్నాడన్న భావన కళ్ళను నక్షత్రాలను చేసింది. ఇంకెప్పటికీ తిలక్ చేయిని వదలకూడదని నిర్ణయించుకుంది.

 

    ఆమె చేయి తిలక్ చేతి చుట్టూ మరింతగా బిగుసుకుంది.

 

    అంతలో ముందు నడుస్తున్న ఉత్తరుడు ఆగాడు. మూకుడులో వుండే చిల్లరను లెక్కబెట్టాడు. మొత్తం రెండు రూపాయలా తొంభై పైసలున్నాయి.

 

    పక్కగా నడుస్తున్న బుద్ధుడితో "మరీ డల్ కలెక్షన్ కాదు బుద్ధా! కాకా టీ హోటల్ లో టీ తాగి ఎన్ని రోజులైందో? బాసును అడిగి టీ కొడదాం" అన్నాడు.

 

    తిలక్ సరేననడంతో నలుగురూ టీ కొట్టుకు వెళ్ళారు.

 

    ఉత్తరుడు ఉత్సాహంగా "నాలుగు స్ట్రాంగ్ టీ, చిరుచేదు నాలుకను పిడచ కట్టించాలి" అని చెప్పాడు.

 

    నలుగురూ టీ తాగారు.

 

    మిగిలిన తొంభై పైసలతో మూడు చార్మినార్ సిగరెట్లు కొన్నారు.

 

    తిలక్ కీ, బుద్ధుడికీ చెరొకటి ఇచ్చి, తనొకటి వెలిగించాడు. గట్టిగా గుండె కదిలేటట్టు బలంగా ఓ దమ్ము లాగాడు ఉత్తరుడు.

 

    నలుగురూ అక్కడి నుంచి కదిలారు.

 

    ఉత్తరుడు తిరిగి ప్రారంభించాడు. "ధర్మం బాబూ!"

 

    తిలక్ అతని దగ్గరికి వచ్చి "చేతిలో సిగరెట్ అయిపోయేవరకు అడగొద్దు  జన్మ నిన్ను కొట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు"

 

    "అలానే బాసూ!"

 

    లాలస తిలక్ చేతిని పట్టుకుని నడిపించుకు వెళుతోంది.

 

    మరో అరగంటకు వూరి చివరికొచ్చారు వాళ్ళు. మరో రెండు ఫర్లాంగులు నడిస్తే వూరు దాటిపోతుంది. అక్కడి నుంచి అడ్డదారుల గుండా బ్రిడ్జి దగ్గరకి వెళ్ళి, అటునుంచి గ్రామాలగుండా పోవాలన్నది వాళ్ళ ప్లాన్.

 

    త్వరత్వరగా నడుస్తున్నారు.

 

    జనసంచారం బాగా తగ్గింది.

 

    రోడ్డు చివరికంటా వచ్చారు.

 

    నలుగురూ ఆగి, ఏవైనా వాహనాలు వస్తున్నాయేమోనని చూశారు.

 

    అలా చూస్తున్న నలుగురూ చిన్న జర్క్ ఇచ్చారు.

 

    స్పీడ్ గా వస్తున్న పోలీస్ వ్యాన్ బలిసిన అల్షేషన్ కుక్కలా వుంది. అది తమను గుర్తించి మొరుగుతున్నట్టు హారర్ శబ్ధం భయంకరంగా వినిపిస్తోంది.

 

    మరో క్షణం అది సడన్ బ్రేక్ తో ఆగింది.

 

    వ్యాన్ ముందు సీట్లో కూర్చున్న ఎస్.ఐ. కిందకు దిగాడు.

 

    ఉత్తరుడు తుఫానుకు కదిలిపోతున్న మొక్కలా వణికిపోయాడు.

 

    ఎస్.ఐ. వాళ్ళ దగ్గరకు వెళ్ళి "బద్మాష్ గాళ్ళారా! మీకోసం వూరంతా తిరిగి ఛస్తున్నాం. ముందు వ్యాన్ ఎక్కండి. ఎదురు తిరిగారో వున్నవి వూడిపోతాయ్" అని చేతిలో నున్న కర్రను స్టయిల్ గా తిప్పాడు.

 

    ముందు తేరుకున్నది తిలక్. "సార్..." అని ఏదో చెప్పబోయాడు.

 

    ఎస్.ఐ. అసహనంగా ముఖంపెట్టి "స్టాప్ ది నాన్సెన్స్ మీరు నాకు ఏమీ చెప్పకండి. మీ జాతకాలు అన్నీ తెలుసు నాకు. ముందు కదలండి. లేకుంటే వున్నవి వూడిపోతాయ్" అన్నాడు చివరి మూడు పదాలు మరీ వత్తి పలుకుతూ.

 

    వాళ్ళు నలుగురూ కదలలేకపోయారు. మెదడు ఆజ్ఞలను శరీరం పాటించడం లేదు.

 

    "రేయ్ గుడ్డోడా! యాక్షన్ మానెయ్ రా. నీకు కళ్ళు బావున్నాయని నాకు తెలుసురా. కాదు గీదు అన్నావో, వున్నవి వూడిపోతాయ్ జాగ్రత్త" అని ఎస్.ఐ. గుడ్లురిమాడు.

 

    వాళ్ళు కదలక పోయేసరికి ఆయన చిరాకు తారాస్థాయికి అందుకుంది.

 

    "నేను మూడు లెక్కపెడతాను. అప్పటికీ మీరు వ్యాన్ ఎక్కకపోయారో ఏమౌతుందో తెలుసా?" అని పక్కనున్న కానిస్టేబుల్ వైపు చూశాడు.

 

    "ఉన్నవి వూడిపోతాయ్!" కానిస్టేబుల్ మెల్లగా చెప్పాడు.

 

    ఇక లాభం లేదని తిలక్ ముందుకు నడిచాడు. ఇంత దారుణంగా తమ ప్లాన్ ఫెయిలవుతుందని అనుకోలేదు. అందుకే అతను నిరాశతో కుమిలిపోయాడు.

 Previous Page Next Page