Previous Page Next Page 
సాహసి పేజి 37


    "నువ్వు దేవులపల్లి కోట యువరాణివని తెలిస్తే, నువ్వు నిధికోసమే వచ్చావని తెలిస్తే, మహా కర్కోటక విషయంకన్నా ప్రమాదభరితులైన ఆ కొండరెడ్లు నిన్ను బతకనివ్వరమ్మా... అందువల్ల నీ ప్రయత్నాన్ని మానుకో, వెళ్ళిపో. ఒక ఆప్తుడిగా నేనిచ్చే సలహా ఇది"

    అంత దూరం వచ్చాక అలాంటి పరిస్థితి ఎదురౌతుందని ఊహించలేదు ఇందుమతి.

    "అదికాదు పగడం దొరా! నువ్వు నాకెంతో సహాయం అందిస్తావనుకున్నాను. నువ్వే నిరాశపరుస్తావనుకోలేదు..." నెమ్మదిగా అంది ఇందుమతి. దానికి వెంటనే జవాబు చెప్పలేదు పగడం దొర. ఒకింతసేపు ఆలోచిస్తూండి పోయాడు.

    "ఒకప్పటి పరిస్థితుల్లో... నేను... సహాయం అందించేవాడ్నే కానీ, ఆ చంద్రకోన కుటుంబం నామీద కక్షతో నేను దేవులపల్లి రాజులపక్షం వహిస్తున్నానన్న కక్షతో... కొత్తగా పెళ్ళయిన నా కూతురు, అల్లుడు సరదాగా ఆ కొండలవేపు వెళితే- సింహబల సంపన్నురాలైన నా కూతుర్ని హింసించి, హింసించి, చెరిచి, నా అల్లుడ్ని దారుణంగా చంపేసారమ్మా-

    ఆ దారుణాన్ని తట్టుకోలేని నా కూతురు... భయంకరమైన తాగుడికి విచ్చలవిడి జీవితానికి అలవాటుపడిందమ్మా... నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన, ఆ చంద్రకోన కుటుంబాన్ని, సర్వ...నాశనం చెయ్యడమే నా కర్తవ్యం... సమయం కోసం... చూస్తున్నానమ్మా..."

    "నీకో కూతురుందా..." ఆశ్చర్యంగా అడిగింది ఇందుమతి.

    "అవునమ్మా!"

    "ఇప్పుడెక్కడుంది"

    "ఎక్కడుంటుందో తెలీదు. ఎప్పుడొస్తుందో తెలీదు"

    "అడవిలో ఒంటరిగా తిరగడానికి భయం వెయ్యదా ఆమెకు"

    "లేదమ్మా- నా కూతురు సింహిక గురించి, నీకు తెలీదమ్మా. సింహంతో, పులుల్తో ఎదురుగా పోరాడగలిగే, మహాపరాక్రమవంతురాలమ్మా... కానీ... తాగుడు- తాగుడు లేకుండా, అది ఉండలేదమ్మా-" నెమ్మదిగా బాధగా చెప్పాడు పగడం దొర.

    "మరి నువ్వు నాకు ఏ రకమయిన సహాయాన్ని అందించలేవా పగడం దొరా"

    "అంటే... నువ్వు... నిధి అన్వేషణకు, వెళ్ళడానికే నిశ్చయించుకున్నావా"

    "అవును-" దృఢంగా నిశ్చయంగా అంది ఇందుమతి.

    "అలాగైతే నీ కెప్పుడు ఏ సహాయం అందించడానికైనా నేనూ, నా తెగ సిద్ధంగా ఉంటాం. నీకింకా ప్రత్యేకంగా, ఏ సహాయం కావాలన్నా అడుగు!"

    ఒక్కక్షణం ఆలోచనలో పడింది ఇందుమతి.

    "నాతో నీ కూతురు సింహికను పంపగలవా"

    ఆ మాటకు బిత్తరపోయాడు పగడందొర. ఏమాలోచించాడో, ఏమో-

    "ప్రభువులు అడిగిన కోర్కెను కాదనడం మా ఆచారం కాదమ్మా! నువ్వు దేవీశక్తి స్వరూపిణివి. విజయం నీకు సిద్ధిస్తుందని నాకు నమ్మకం వుంది. సింహికను నీతో పంపుతాను..." వాగ్దానం చేసాడు పగడం దొర.

    ఆ సమయంలో ఇందుమతి మనసెందుకో సంతృప్తిగా వుంది.

    పగడం దొర లేచి నిలబడ్డాడు.

    అదే సమయంలో, ఆ గుడిసె బయట ఎండుటాకుల మీద నుంచి ఎవరో పరుగెడుతున్న చప్పుడు.

    గాభరాగా బయటికొచ్చాడు పగడం దొర. అతని వెనక ఇందుమతి.

    ఎవరూ కన్పించలేదు.

    అంతా చీకటి. ఆ చీకట్లో ఓ బండ చాటునుంచి-

    ఓ రెండు కళ్ళు తన వేపు అదేపనిగా చూడడం గమనించింది ఇందుమతి.

    ఆ కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి.

    ధైర్యంగా ఆ బండవేపు అడుగువేసింది ఇందుమతి.

    ఆ కళ్ళు-

    రాకీవి.


                   *    *    *    *


    దట్టమైన చెట్ల నడుమ, అన్యులకు కనబడని ఏకాంత ప్రదేశంలో ఉందా చెరువు. చెరువు ఒడ్డున గౌరవంగా ఇద్దరు ఆటవిక స్త్రీలు నించున్నారు. చెరువు నీళ్ళలో ఇందుమతి తనివి తీరా స్నానం చేస్తోంది. రకరకాల పువ్వులు, పూలతేనెలు, మిశ్రమం వల్ల, ఆ చెరువు నీరు- సుగంధ భరితంగా వుంది. వంటికి మనసుకు అంటుకున్న శ్రమనంతా ఆ నీరు దూరం చేస్తోంది. సరిగ్గా-

    ఆ సమయంలో, కపాలకోనని రెండు భాగాలుగా చీల్చినట్లుగా భయంకరమైన కేక విన్పించింది.

    గాండ్రు, గాండ్రుమని... అల్లకల్లోలంగా... అరుస్తూ, దూసుకొస్తున్న పెద్దపులి... పులి గర్జన వినగానే, ఆటవిక స్త్రీలు చేతిలోని దుస్తుల్ని కిందపడేసి... విహల్వంగా కేకేస్తూ, గ్రామంవైపు పరుగెత్తారు.

    పులి గాండ్రింపుకు గిరిజన గ్రామంలో కలకలం మొదలైంది. ఇందుమతి నీళ్ళలోంచి, గబుక్కున ఒడ్డుకొచ్చి, చీర చుట్టబెట్టుకుని- గ్రామంవేపు పరుగు దీయబోయి-

    తన ఎదురుగా, పది అడుగుల దూరంలో తనవేపు ఆవురావురు మంటూ చూస్తున్న పెద్దపులిని చూడగానే, ఆమెకు వంటినిండా చెమటలు పట్టేశాయి.

    కెవ్వున కేక వేసి చెట్టు చాటుకెళ్ళబోయింది. అప్పటికే పెద్దపులి పడగ లాంటి పంజాను విప్పి, ఇందుమతి వేపు దూకింది.

    మరో ఘడియకు...

    పులి పంజా దెబ్బకు ఇందుమతి భుజం తునాతునకై పోయి ఉండేది. ఇందుమతి దేహం రక్తక్షేత్రమై పోయుండేది.

    సరిగ్గా-

    ఆ సమయంలో-

    ఎత్తిన పులిపంజాకు తన చేయి అడ్డుపెట్టి అమితమైన బలపరాక్రమంతో సింహనాదం చేస్తూ ఎడం కాలితో, పులిడొక్కలో తన్నిన ఆ మహాకాయాన్ని చూసిన పులి...

    వంటిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

    డొక్కలో బలంగా తగిలిన దెబ్బకు పులి వెల్లకిలా పడిపోయింది. భయంకరంగా అరుస్తూ...

    స్పృహ తప్పిపోతున్న ఇందుమతి.

    పులి ఎదురుగా నిల్చున్న ఆ ఆడపులిని చూసింది.

    ఆ ఆడపులి ఏడడుగుల ఎత్తుంది. కండలు దీరిన దేహం- కట్టలు గట్టిన జుట్టు- రక్తగోళాల్ని కళ్ళల్లో అమర్చుకున్నట్లుగా ఎర్రటి కళ్ళు.

    పొడవాటి బలమయిన చేతులు, కాళ్ళు, కాళ్ళకు మందమయిన బంగారు కడియాలు.

    కటి ప్రదేశంలోనూ, రొమ్ము ప్రదేశంలోనూ ఆకుల ఆచ్చాదితం సింహిక...

    సింహబల సామానురాలైన సింహిక.

    పగడం దొరకి ఏకైక కుమార్తె సింహిక.

    రామాయణంలో తాటకిలా ఆ పులిమీద పడింది.

    పులి, సింహికల మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. పులి గాండ్రింపులతో సింహిక నినాదాలతో, కపాలకోన దద్దరిల్లిపోతోంది.

    ఆఖరికి-

    పులి... రెండు కాళ్ళూ పట్టుకుని... బొమ్మను తిప్పినట్లు, గిర గిర తిప్పి చెట్టుకేసి కొట్టింది.

    ఆ దెబ్బకు పులి కాలిగోళ్లు ఎగిరిపోయి, అల్లంత దూరాన పడ్డాయి. దేవదారు వృక్షం కింద పులి పడి, లేవడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న దశలో... పరుగు పరుగున వెళ్ళి దాని మెడమీద కాలేసి నించుంది.

    ఆ కాలు, యముని కాలులా ఉంది పులికి.

    పులి గాండ్రింపు తగ్గింది. నెమ్మది నెమ్మదిగా తల పక్కకు వంచేసింది.

    అరగంటసేపు-

    జరిగిన ఆ మహా పోరాటాన్ని చెట్లమీంచి, గుట్టలమీంచి, చూస్తున్న ఆటవికులు జయ జయధ్వానాల్తో ముందుకొచ్చారు.

    ఎవరో తెచ్చి, లోటాతో ఇప్పసారాను అందించారు సింహకకు. ఆ సారాను తాగేసి సింహిక అందరివేపూ చూస్తూ నవ్వింది. అక్కడికి పరుగు పరుగున వచ్చాడు పగడం దొర.

    స్పృహ తప్పిపోయిన ఇందుమతి మీద, ఒక ఆటవిక స్త్రీ నీళ్ళు జల్లింది. ఇందుమతిని లేపి కూర్చో పెట్టింది వైశాలి.

    యువరాజు, కపాలేశ్వర్, ముత్యాలనాయుడు గొంతారిపోయి చూస్తున్నారు. అపరిచితుల్ని చూడగానే సింహిక తండ్రి పగడం దొరవేపు చూసింది. పగడం దొర చెప్పాడు... వాళ్ళు మాట్లాడుకునే భాషలో- మన ప్రభువు మన యువరాణి... దేవీబాల ఇందుమతి. ఇందుమతిని ఆరాధనా పూర్వకంగా చూసి ఆచారం ప్రకారం ఆమె పాదాలను ముద్దు పెట్టుకుంది సింహిక.


                   *    *    *    *


    ఇందుమతి బృందంతో వెళ్ళడానికి సింహిక ఒప్పుకుంది.

    "నేను వెళ్ళేది... నిధి అన్వేషణకు కాదు తండ్రీ- నిధి అన్వేషణ యువరాణివారు చూసుకుంటారు- నిధి దొరుకుతుంది... నాకా నమ్మకం వుంది... నేను వెళ్ళేది నా శత్రువుల్ని హతమార్చడానికి" కసిగా చెప్పింది సింహిక.

    వాళ్ళందరూ బయలుదేరే ముందు-

    పగడం దొర, ప్రత్యేకంగా ఇందుమతిని పక్కకు పిల్చి చెప్పాడు. "చూడమ్మా... దేవీబాలా... సింహికకు ఎప్పుడూ కోపం తెప్పించకు. దాని బలహీనతను ఎప్పుడూ కాదనకు. దానికి తాగుడు, మగవాడు రెండే రెండు బలహీనతలున్నాయి. ఆ మగవాడు ఎవరైనా నువ్వు పట్టించుకోకు.

    ఒకటి మాత్రం గుర్తుంచుకో... తాగినప్పుడు దానికేమీ బలం వుండదు. అదప్పుడు నీ అంత సౌకుమార్యంగానే ఉంటుంది. దాని బలాన్ని మన శత్రువుల సంహారానికి ఉపయోగించుకో.

    ఇంకొక విషయం... ఇక నుంచి నువ్వు అతి ప్రమాదకరమైన లోయలో అడుగుపెడుతున్నావు. అందరూ అప్రమత్తంగా ఉండండి. కనిపించిన ప్రతివాడూ... దేవులపల్లి కోట శత్రువే... ఎవర్నీ బతకనివ్వకండి. ఏదైనా ప్రమాద సమయంలో నాకు వర్తమానం చెయ్యి... నీకు రక్షణగా మేం తరలి వస్తాం.

    ఇకనుంచి రాత్రివేళ ప్రయాణాలు చెయ్యకండి ఊబులుంటాయి. మొదట మీకు దబ్బలపాడు జలపాతం తగులుతుంది. ప్రస్తుతం అక్కడ జలపాతం లేదు. ఒకప్పుడు ఉండేది. దాని పక్కనే పసరిక లోవ... అది దాటితే చంద్రకోనలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ నుంచి మీరు ప్రతి నాలుగు గవ్వతిలకు ఒక్కొక్క గిరిజన తెగకు చెందిన ఒక్కొక్క గిరిజన గ్రామాలు తగులుతాయి" చెప్పాడు పగడం దొర.

 Previous Page Next Page