తను జైలుకి వెళ్ళవలసి వస్తే తన భార్య, కూతురు ఉరిపోసుకు చావడం ఖాయం...
ఇప్పుడతని కళ్ళముందు తన అపార వ్యాపార అనుభవం, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల దిగుమతిలో తను చూపించే ప్రజ్ఞాపాటవాలు ఎదుట నిలిచి పరిహసిస్తున్నట్టుగా వుంది.
ఆ పరిహారపు పద ఘట్టన ముందు తన ముద్దుల కూతురు, పెళ్లిచేయలేని తన తండ్రి నిస్సహాయతకు గుండె పగిలి చనిపోతుంది. పాతికేళ్ళుగా ప్రేమను, అనురాగాన్ని పంచి ఇచ్చిన తన సహధర్మచారిణి తన భర్తకు పట్టిన దుర్గతికి తట్టుకోలేక ప్రాణాలు వదుల్తుంది.
ఓరి... దుర్మార్గుడా... ? ఎంత సేవ చేయించుకున్నావురా నాతో... లక్ష రూపాయిలకు నా కుటుంబాన్నే రోడ్డుకీడ్చావు గదరా?... కోట్లు ఆర్జించి పెట్టే విదేశీ పారిశ్రామిక పథకాల్ని నీ సొంతం చేసి పెట్టాను నీకు...
ఇప్పుడతనికి కళ్ళముందు కనిపిస్తున్న దారి ఒక్కటే- మనస్సు చంపుకొని సుదర్శన్ రావుకి సరెండర్ అయిపోవడం.
సుదీర్ఘమైన మానసిక సంఘర్షణ తర్వాత, బాధ్యతల బందీగా మనస్సు చంపుకోవడానికే సిద్ధపడ్డాడు గుప్తా.
ఆ నిర్ణయానికొచ్చాక మరొక్క క్షణం ఆలస్యం చేయలేకపోయాడు.
శిలాప్రతిమల్లా కూర్చున్న భార్య, బిడ్డలవేపు దిగులుగా చూస్తూ రోడ్డెక్కాడు.
సరీగ్గా అప్పుడే అతని పక్కన ఒక జీప్ వచ్చి ఆగింది.
జీప్ ఆగిన శబ్దానికి ఉలికిపాటుగా ఆలోచనల్నుంచి తేరుకుని జీప్ లోకి చూసి ఆశ్చర్యపోయాడు గుప్తా. జీప్ లో త్రినాధ్ వున్నాడు.
ఓ పావుగంట తర్వాత వసుంధర ఇండస్ట్రీస్ ఆఫీసులో త్రినాధ్ కి ఎదురుగా కూర్చున్నాడు గుప్తా.
"ఎక్కడికి బయలుదేరారు...?" త్రినాధ్ సౌమ్యంగా అడిగాడు.
వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు గుప్తా. త్రినాధ్ టేబుల్ సొరుగులోంచి ఒక రిసీప్ట్ తీసి గుప్తాకి అందించాడు.
దాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయాడు గుప్తా. నమ్మలేనట్లుగా ఒకటికి రెండుసార్లు ఆ రిసీప్ట్ వేపు, త్రినాధ్ వేపు చూశాడు అయోమయంగా.
త్రినాధ్ ముఖం మామూలుగానే వుంది. క్రమంగా గుప్తా ముఖంలో విషాద ఛాయలు తొలగిపోయాయి.
ఆనందోద్వేగంతో చటుక్కున సీట్ లోంచి లేచి త్రినాధ్ రెండుచేతుల్ని పుచ్చుకుని కృతజ్ఞతతో ఏదో అనబోయి గొంతు పూడుకుపోవడంతో ఏం అనలేకపోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళు.
గుప్తాని అనునయించి కూర్చోబెట్టాడు త్రినాధ్. బాయ్ ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పి సాభిప్రాయంగా గుప్తావేపు చూశాడు. ఇప్పుడతని కళ్ళముందు కనిపిస్తున్నది గుప్తా కాదు, మాలిని.
అప్పుడతను మాట్లాడడం ప్రారంభించాడు. "ఆధునిక వ్యాపార ప్రపంచ నీతి సూత్రాల్ని నేనింకా నేర్చుకోలేదు. నిరామయమయిన నిస్పృహ నుంచి హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆవలించిన వాడ్ని, ప్రస్తుతానికింకా ఆకళింపులోనే వున్నాను. మీ అవసరాన్ని అతను గుర్తించాడు కాని మీ సామర్ధ్యాన్ని మీరే గ్రహింపులోకి తెచ్చుకోలేకపోయారు. అతని అవసరానికి వానపాములా ఉపయోగపడ్డారే తప్ప మీ అవసరం అంటూ వస్తే ఎలా తీర్చుకోవాలో తెల్సుకోలేకపోయారు..."
అంతలో కాఫీ వచ్చింది. దాన్ని గుప్తాకి స్వయంగా అందించి మరలా ప్రారంభించాడు- "అతను చట్టరీత్యా అప్రోచ్ అయ్యాడు..."
సడన్ గా త్రినాధ్ మాటల్ని కట్ చేస్తూ ఆవేశంగా అన్నాడు గుప్తా.
"ఎంత చాకిరి చేశాను? కనీసం కొద్దిపాటి విశ్వాసం కూడా లేకపోయింది..."
త్రినాధ్ నిశ్శబ్దంగా నవ్వాడు.
"గతం గురించి ఎక్కువ వర్తమానాన్ని వృథా చేయడం మంచిదికాదు. మీరు కోర్టులో కట్టవలసిన మొదటి వాయిదాని నేను కట్టాను. ఆత్మవంచన నా కిష్టం లేదు. మీకు ఒక అత్యవసరం వుంది. దాన్ని నేను తీర్చాను..." త్రినాధ్ ఓ క్షణం ఆగిపోయాడు.
ఇప్పుడతని స్మృతిపథంలో మాలినిదేవి చెప్పిన ఆధునిక వ్యాపార మంత్రం-
'అవసరాన్ని గుర్తించి పూర్తిచేయ్.'
'FIND A NEED AND FILLIT' మెదిలినట్లయింది.
"నాకు ఓ అవసరం వుంది. అది మీ ద్వారా పూర్తవుతుంది. మీరు కట్టవల్సిన లక్ష నేను కడతాను కోర్టులో. నా పని పూర్తిచేసి పెట్టండి. అదీ యుద్ధప్రాతిపదికపై..." అంటూ ఓ ఫైల్ అందించాడు త్రినాధ్.
నిజాయితీగా, మనస్సులో ఏదీ దాచుకోకుండా నిర్మొహమాటంగా మాట్లాడుతున్న త్రినాధ్ వేపు వింతగా చూస్తూ ఆ ఫైల్ ని అందుకొని చూడడం ప్రారంభించాడు - గుప్తా.
సరీగ్గా ఇదే సమయంలో సుదర్శనరావు వాయిదా కట్టలేని గుప్తా భయపడి తన కాళ్ళ దగ్గరకే వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నాడు.
* * * *
ఉదయం పదిన్నర అవుతోంది.
ఛటర్జీ తన సీట్లో కూర్చుని ఒక్కో ఫైల్ తిరగేస్తూ వెళ్తున్నాడు.
సరీగ్గా ఏదో అప్లికేషన్ వసుంధరా ఇండస్ట్రీస్ ది. మెరుస్తున్న కళ్ళతో దాన్ని పరిశీలిస్తూ ఇమ్మీడియట్ గా లైసెన్స్ ఆర్డర్స్ పాస్ చేశాడు.
చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి.
గుప్తా త్రినాధ్ మీద కృతజ్ఞతతో, సుదర్శన్ రావు మీద కోపంతో వాయిదా కొనుగోలు పద్ధతిలో నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఢిల్లీ) ద్వారా జెకొస్లవేకియా నుంచి లూబ్రికేటింగ్ మెషిన్ ని అతి తక్కువ కాలంలో తెప్పించగలిగాడు.
ఈలోపు బోస్, హిందూ రాత్రింబవళ్ళు శ్రమించి కూలిపోవడానికి సిద్ధంగా వున్న ఓ షెడ్ ని అద్దెకు తీసుకొని దాన్ని బాగుచేసి సిద్ధంగా వుంచారు.
ఓ శుభోదయాన మెషిన్ ని అందుకున్నాడు త్రినాధ్. అందుకున్నానన్న తృప్తికన్నా దాన్ని నడిపించగల సాంకేతిక నిపుణుడికోసం శోధన ఎక్కువయింది.
అప్పటికే నాలుగు వందల డ్రమ్ములు వుపయోగించిన లూబ్రికెంట్ ఆయిల్ ని నిల్వ చేయించాడు త్రినాధ్.
ఇప్పుడతనికి అన్నీ సమకూరాయి కానీ ఆపరేటర్ మాత్రం దొరకలేదు.
రాత్రి పదకొండు గంటలవుతోంది సమయం, ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. త్రినాధ్ మాత్రం బాహ్యప్రపంచంతో సంబంధం లేనట్లుగా టేబుల్ మీదకు తలవాల్చి నిస్త్రాణగా వున్నాడు.
లైసెన్స్ దొరికింది-
మెషిన్ దొరికింది-
షెడ్ దొరికింది-
ముడిపదార్ధం వుంది-
తయారయిన ఉత్పత్తి క్వాలిటీ బావుంటే ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. కొనేందుకు సిద్ధంగా వుంది.
అన్నీ సవ్యంగానే జరిగిపోయాయి. కాని ఆ అత్యాధునిక యంత్రాన్ని కదిలించగల వ్యక్తి ఎక్కడ...?
అర్దరాత్రి కావడానికి మరొక్క నిమిషమే వుందనగా గుప్తా హడావుడిగా వచ్చాడు. అతని ముఖంలో లీలామాత్రంగా ఆనందం కనిపిస్తోంది.
త్రినాధ్ కి ఒకింత ఆశ చిగురించింది.
"దొరికారా గుప్తాగారు--?"
త్రినాధ్ కంఠంలో తొంగి చూసిన నిరాశకు గుప్తా కదిలిపోయాడు.
దొరికాడు. బెంగుళూర్ లో మైక్ ఇండస్ట్రీస్ లో మన యంత్రాన్ని రన్ చేయగల వ్యక్తి వున్నాడు. అయితే అతను అంత మంచి కంపెనీని వదులుకొని ఇక్కడకు రావడానికి సిద్ధపడతాడా-"
గుప్తా సందేహాన్ని మధ్యలోనే కట్ చేశాడు అప్పుడే వచ్చిన బోస్.
"రాకుంటే ఎముకలు విరిచేస్తాను - " అన్నాడు ఆనందోద్రేకంతో బోస్.
బోస్ ని ఆగమన్నట్లు కళ్ళతోనే సైగ చేసి "అతని వివరాలు?" అడిగాడు త్రినాధ్.
గుప్తా చెప్పుకుపోతున్నాడు.
నిశ్శబ్దంగా వున్న ఆ నీరవ వాతావరణంలో గుప్తా కంఠమే వినిపిస్తోంది స్పష్టంగా.
సరీగ్గా అప్పుడే ఆ గది తలుపు ముందు నుంచుని చెవులు రిక్కించి వింటున్నాడు సైంటిస్ట్.
గుప్తా చెప్పుకుపోతూనే వున్నాడు.
త్రినాధ్ సీట్లోంచి లేచి పచార్లు చేయసాగాడు. ఆ ముగ్గురూ అలా రాత్రి ఒంటిగంటయ్యేవరకు మాట్లాడుకుంటూనే వుండిపోయారు.
* * * *
ఆ రోజు ఉదయమే వసుంధరా ఇండస్ట్రీస్ ఆఫీసు లోనికి టెలిఫోన్ కనెక్షన్ ఇచ్చారు.
త్రినాధ్ ఫోన్ వేపే చూస్తూ కూర్చున్నాడు. ఆ ఫోన్ పని చేయడం ప్రారంభించిన రెండో నిమిషంలోనే ఫోన్ రింగయింది.
త్రినాధ్ ఆశ్చర్యపోతూ ఫోన్ ఎత్తాడు.
"హలో - " మృదువుగా వుంది కంఠం.
చటుక్కున గుర్తుపట్టేశాడు త్రినాధ్. క్షణాల్లో అతని పెదవులమీద చిరునవ్వు ప్రత్యక్షమయింది.
"శుభం... ఫోన్ ఓపెనింగ్ ఓ ఆడపిల్ల కంఠంతో- థాంక్యూ..." అన్నాడు చిరునవ్వుతో త్రినాధ్.
ఫోన్ కి ఆవల వున్న ప్రియాంక ఉక్రోషపడింది.
"నీకు జరగబోయే ఒక అశుభం తెలియపర్చడానికే ఫోన్ చేశాను" కసిగా అంది.
"అశుభమా? నాకా? అప్పటికే త్రినాధ్ కి అనుమానం వచ్చింది. అదేదో తెల్సుకొనేందుకే ఇలా రెచ్చగొట్టాడామెను.
"నిజంగానే నేను చెప్పే న్యూస్ నీపట్ల షేక్ అవుతుంది. లూబ్రికెంట్ స్పెషలిస్ట్- ఫ్రమ్ మైకో బెంగుళూరు మార్గమధ్యంలోనే అదృశ్యమైపోతాడు... బీ రెడీ ఫర్ ది ఫీట్..." ఫోన్ కట్ చేసింది ప్రియాంక.
ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు త్రినాధ్. అప్పుడే అంత దూరం ఆ వార్త ఎలా వెళ్ళిపోయింది... "
అతని మెదడు చురుకుగా పనిచేసుకుపోతోంది.
* * * *
"నాన్నగారూ- మీరింతకాలం నేనతని గురించి చెబుతుంటే ఉపేక్షిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు-" ప్రియాంక ఒకింత కోపంగా అంది.
అది సుదర్శన్ రావు ఆఫీసు గది.
ఆరంతస్థుల ఆ అత్యాధునిక భవనం నుంచే సుదర్శన్ రావు కార్యకలాపాలు నిర్వహించబడు తుంటాయి. ఏడుగురు డైరక్టర్స్ తో వ్యవస్థాపిత మయిన ఆ వ్యాపారసంస్థలకు సుదర్శన్ రావు చైర్ మన్.
ఫైవ్ స్టార్ హోటల్ సూట్ లా అత్యంత విలాసవంతంగా వున్న ఆ పెద్ద గదిలో ఇప్పుడు సుదర్శన్ రావు, ప్రియాంక, సుదర్శన్ రావు కొడుకు యోగేష్ వున్నారు.
"డాడీ మీరు వూ... అనండి... వాడి అంతు తేల్చిపడేస్తాను" యోగేష్ ఆవేశపడుతున్నాడు.
అయినా సుదర్శన్ రావు మౌనంగా వున్నాడు.
"నేనెన్నిసార్లు చెప్పినా ఆ... వాడేం చేయగలడన్నారు. ఇప్పుడు చూడండి- ఆరు వేల స్థలాన్ని పన్నెండు వేలకు కొనిపించాడు మీతోనే. యాదవ్ లాంటి భయంకరమైన గూండాని మట్టికరిపించి ఫ్రీగా ఆ బిల్డింగ్ నే తన ఆఫీసుగా మార్చుకున్నాడు.