Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 37

    గది దద్దరిల్లేట్టు ఓ స్త్రీ కంఠం విన్పించింది.
   
    ఎక్కడివాళ్ళక్కడ బిగిసిపోయారు.
   
    అది ఆర్తనాదమో, వెర్రికేకో, పిచ్చిఅరుపో ఎవరికీ అర్ధంకాలేదు.
   
    డాక్టర్ ఒక్క అంగలో వెళ్ళి కార్పెట్ మీద కుప్పలా పడివున్న సుధను చేతుల్లోకి తీసుకున్నాడు.
   
                                               25
   
    "డాక్టర్ సుధకెలా ఉందీ!" రమణమూర్తి దిగులుగా అడిగాడు.
   
    పోలీసు దర్పమంతా దిగిపోయింది.
   
    అతని చూపుల్లో మునుపటి చురుకుదనం కన్పించడంలేదు. మూడురోజుల్లోనే మనిషిలో మూడేళ్ళ మార్పొచ్చింది.
   
    "మీరు వర్రీకావద్దు. బాగానే వుంది. త్వరలోనే కోలుకోగలదు. కొద్దిగా షాక్ తింది. గతవారం పదిరోజులుగా ఆమె మానసిక సంఘర్షణకి గురిఅయింది. కృష్ణ మద్రాస్ నుంచి తిరిగొచ్చినప్పటినుంచీ ఎన్నో రకాలుగ మానసిక హింసను అనుభవించింది. ఒకరకంగా కాదు. అనేక విధాలుగా కృష్ణ ఆమెను బాధపెట్టాడు. ఆమె మనసు నిప్పులమీద మరుగుతున్న నీళ్ళ కుండలా వుంది. నిన్న అదికాస్తా బద్దలైంది. తన భర్తలో దాగివున్న మరో పర్సనాలిటీని అదే జగన్మోహనరావును చూసి ఆమె గుండె బద్దలైంది. అది సహజమేకదా?"
   
    డాక్టర్ సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు.
   
    "అలాంటప్పుడు మీరు సుధను ఆ గదిలోకి రానివ్వకుండా వుండాల్సింది" రమణమూర్తి క్రాస్ గ అన్నాడు.
   
    డాక్టర్ గట్టిగ పొగపీల్చి వదిలాడు.
   
    ఆ సంగతి నాకు తెలియనిది కాదు. నేను కావాలనే మీ అందరికీ జగన్మోహన్ పర్సనాలిటీ తో పరిచయం చేశాను. ముఖ్యంగా సుధకు అవసరం వుంది. ఎందుకంటే ఇంకా కొంతకాలం అతనిలో ఈ రెండు వ్యక్తిత్వాలూ వస్తూ పోతూంటాయి. ఎప్పుడు ఏది వస్తుందో, ఏది పోతుందో తెలియదు. ఆ రెండింటిలో ఏది కృష్ణ వ్యక్తిత్వమో, ఏది జగన్మోహన్ వ్యక్తిత్వమో పోల్చుకోగల అనుభవముండాలి. అందుకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. భార్యగ, సహధర్మచారిణిగ సుధ అతడితోనే కాలం గడపాలి కాబట్టి ఆమె జగన్మోహన్ ను గురించి తెలుసుకోవడం అవసరం. పెద్దగా డామేజ్ జరక్కుండానే నా ప్రయత్నం విజయవంతమైంది. మూడు నాలుగురోజుల్లో సుధకు పూర్తిగా స్వస్థత చేకూరుతుంది. ఈలోపల మనం చెయ్యాల్సిన కార్యక్రమం చాలా వుంది."
   
    సిగరెట్ గట్టిగా పీల్చి యాష్ ట్రేలో పడేశాడు డాక్టర్.
   
    "ఏమో డాక్టర్! ఇదంతా ఏదో సాలెగూడులా ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ నా బిడ్డ సుఖపడుతుందనే నమ్మకం నాకులేదు. డ్యూయల్ పర్సనాలిటీ అనండి, మరొకటి అనండి-ఏదైనా పిచ్చేగా? ఆ పిచ్చివాడితో నా బిడ్డ కాపరం చెయ్యడం నాకిష్టంలేదు. ఇప్పటికే దానికి సగం మతిపోయింది. ఇలా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ పోతే మిగతా సగంకూడా పోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనమేమిటి?"
   
    "అంటే ఇప్పుడేమి చెయ్యదల్చుకున్నారూ?" రమణమూర్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు డాక్టర్.

    వాళ్ళిద్దరి సంభాషణ వింటూ, ఎటూ చెప్పలేక, రమణమూర్తిపక్కన మౌనంగ కూర్చున్నాడు చౌదరి.
   
    "ఇప్పటికే కథ చాలాదూరం నడిచింది. పొరపాటు నాదే. కృష్ణ పెక్యూలియర్ గ వింతగ ప్రవర్తిస్తున్నాడని తెలిసినప్పుడే సుధను తీసుకొని వెళ్ళిపోవాల్సింది."
   
    "భర్తనలా ఒదిలేసి మీ అమ్మాయి మీతో వచ్చేదంటారా?" ఆశ్చర్యంగ అడిగాడు డాక్టర్.
   
    "రాకేం చేస్తుంది? ఆ పిచ్చివాడితో కాపరమెలా చేస్తుంది? పైగా అతను కోరుకుందికూడా అదే. మోహనో, జగన్మోహనో, వాడిదగ్గరకు వెళ్ళిపొమ్మంటున్నాడుగా?"
   
    "అదిసరే రమణా! సుధను తీసుకెళ్ళి ఏంచేస్తావ్?" చౌదరి గొంతు తీవ్రంగ ఉంది.
   
    ఆగలేక అడిగేశాడు.
   
    "కృష్ణ పిచ్చివాడని సర్టిఫికెట్ తీసుకొని కోర్టులో డైవర్స్ కేసు పడేస్తాను."
   
    "పడేస్తావూ-డైవర్స్ కూడా ఇస్తావూ-ఆ తర్వాత?" లాగి చెంపమీద కొట్టినట్టు అడిగాడు చౌదరి.
   
    "సుధకు అంత వయసేమీ మించిపోలేదు."
   
    "అంటే?"
   
    "ఏం? ఇంకా అర్ధంకాలేదా? మళ్ళీ పెళ్ళిచేస్తాను."
   
    "మళ్ళీ పెళ్ళా?" ఆయన తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది.
   
    "జస్టు ఏ మినిట్ సార్!" డాక్టర్ కల్పించుకున్నాడు.
   
    ఓ క్షణం ఏదో గుర్తుచేసుకుంటున్నట్టు ముఖంపెట్టాడు.
   
    "అదెలా సాధ్యం రమణమూర్తిగారూ!"
   
    "ఏం ఎందుకుకాదు?" సవాల్ చేస్తున్నట్టుగ ఉంది పోలీసాఫీసర్ ధోరణి.

    "మీ అమ్మాయి గర్భవతి."
   
    రమణమూర్తి నెత్తిన పిడుగుపడింది. కూర్చొన్న కుర్చీతోసహా భూమిలోకి దిగబడిపోతున్నట్టయింది.
   
    డాక్టర్ మరో సిగరెట్ తీసి వెలిగించాడు. సిగరెట్ తోపాటు అతడి కళ్ళల్లో వెలుగు కన్పించింది.
   
    రమణమూర్తికి బ్రేక్ వేశాడు డాక్టర్.
   
    లేకపోతే ఏమిటి? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దురాలోచనలు చేస్తున్నాడు.
   
    చౌదరి లో లోపలే ఆనందపడ్డాడు. డాక్టర్ ని మనసులోనే అభినందించుకున్నాడు.
   
    చౌదరికి కృష్ణమీద పుత్ర వాత్సల్యంలాంటిదేదో అనుబంధం ఏర్పడిందనే చెప్పాలి. అతనికి అన్యాయం జరిగితే సహించలేడు. ఆ అభిమానంతోనే అతడు చేసిన దూషణ-భూషణ, తిరస్కారాలన్నిటినీ భరించగలిగాడు.
   
    "డాక్టర్ అదేమీ పెద్ద అడ్డంకుకాదు." మరో నిముషంలో ఉరితీయబోయేముందు, ఉరితీసేవాడి ముఖంలో కన్పించే భావమే రమణమూర్తిలో కన్పించింది చౌదరికి.
   
    "వాడ్డూయూ మీన్?" ఎప్పుడూ బాలెన్స్ తప్పని డాక్టరే అరిచాడు కోపంగా.
   
    "చాలా సింపుల్! ఎబార్షన్ లీగలైజ్ చేశారని మీకు తెలుసు" కూల్ గ అన్నాడు మూర్తి.
   
    పోలీసువాడి లాఠీదెబ్బ తిన్నగా కణతమీదే తగిలినట్టుగ అయింది డాక్టర్ కు.
   
    "చౌదరికయితే గుండెకాయ ఊడి గొంతుక్కు అడ్డుపడ్డట్టు అయింది.
   
    "అందుకు కృష్ణ అనుమతి కావాల్సివుంటుంది. మెడిలో లీగల్ కేసు మీకు తెలిసే ఉండాలి.
   
    "అది నార్మల్ పరిస్థితుల్లోనైతే! పిచ్చివాడి పర్మిషన్ ఏమిటి? అది పరిగణనలోకి తీసుకోరు."
   
    "సారీ! మీతో అంగీకరించలేను. పిచ్చివాడికి సంబంధించినదేదైనా అతడి వారసులకు చెందుతుంది. వారసులు లేకపోతే ప్రభుత్వానికి చెందుతుంది. అందువలన మీ కూతురు గర్భంలో పెరిగే మురళీకృష్ణ బిడ్డమీద అతని వారసులకూ ప్రభుత్వానికీ అధికారముంది. తల్లి అయిన సుధకు అధికారముంది. అంతేకాని మీకెలాంటి అధికారమూ లేదు.
   
    రెచ్చగొట్టిన పులిలా ఐపోయాడు రమణమూర్తి. కళ్ళల్లో ఎర్రజీరలు కదిలాయి.
   
    "నాకు తెలుసు ఏం చెయ్యాలో? ఈ విషయములో నాకెవరి సలహా సంప్రదింపులూ అవసరంలేదు" పెడముఖం పెట్టి చెప్పాడాయన.
   
    "మీ ఇష్టం! ఇట్ ఈజ్ లెఫ్ట్ టు యూ!" భుజాలెగరేసి గాల్లోకి చేతులు లేపాడు డాక్టర్.
   
    రమణమూర్తి లేచి నిలబడ్డాడు.
   
    "ఇంకా కూర్చున్నావెందుకూ?" అన్నట్టు చౌదరికేసి చూశాడు మూర్తి.
   
    కృష్ణను డిస్ చార్జి చెయ్యమన్నారా?" ముభావంగ అన్నాడు రమణ మూర్తితో డాక్టర్.
   
    "డిస్ చార్జి చెయ్యడమెందుకూ? మీ ట్రీటుమెంటేదో మీరుచెయ్యండి మీ బిల్లు నేను చెల్లిస్తాను" అన్నాడు మూర్తితో డాక్టర్.
   
    "డిస్ చార్జి చెయ్యడమెందుకూ? మీ ట్రీటుమెంటేదో మీరుచెయ్యండి మీ బిల్లు నేను చెల్లిస్తాను" అన్నాడు మూర్తి.
   
    ఈసారి డాక్టర్ కు నిజంగానే కోపమొచ్చింది.
   
    "ఐయామ్ నాట్ ఇంటరెస్టెడ్ ఇన్ యువర్ బిల్! మీరిచ్చే డబ్బు మీద నాకు వ్యామోహంలేదు. డాక్టర్ భాటియా రికమెండ్ చేశాడని ఈ కేసు తీసుకున్నాను. ఇలాంటి కేసుల్లో అందరి సహకారముంటేనే మేమేధైనా చెయ్యగలిగేది. మీపాటికి మీరు ఏవేవో నిర్ణయాలు తీసుకొంటూ ఉంటే, మేము, సైకియాట్రిస్టులం చేయగలిగింది చాలా తక్కువ. మీరు అడ్మిట్ చేశారుకానుక మా క్లినిక్ నుండి  తీసుకెళ్ళే బాధ్యత మీదే. అతణ్ణి మీకప్పగించే బాధ్యత నాది" డాక్టర్ రిసీవర్ ఎత్తి, డాక్టర్ దయాసాగర్ ను రమ్మని చెప్పాడు.
   
    "డాక్టర్ మీరుకూడా తొందరపడటం బాగాలేదు, కృష్ణ నా కొలీగ్, నాకు బిడ్డలాంటివాడు. అతని బాధ్యత నేను వహిస్తాను. మీ ట్రీటుమెంటు కొనసాగించండి" అన్నాడు చౌదరి.
   
    రమణమూర్తి తెల్లముఖం వేసి అతడికేసి చూశాడు.
   
    రమణమూర్తి తెల్లముఖం వేసి అతడికేసి చూశాడు.
   
    "రమణా! నవ్వు చాలా తొందరపడి ఏదేదో మాట్లాడావు. డాక్టర్ గారి మనసుకు కష్టం కలిగించావు. నీ ప్రవర్తన చాలా అసహ్యంగ ఉంది. స్నేహితుడినైన నాకే ఎంతో బాధాకరంగ వుంది. నువ్వు ఇంత అసహ్యంగ దుర్మార్గంగ ప్రవర్తించగలవని నేనెప్పుడూ ఊహించలేదు. ఇట్ ఈజ్ ఎ పిటీ!" చౌదరి కంఠం రుద్దమైంది.

 Previous Page Next Page