"అబ్బో అబ్బో చాలా చక్కగా కూర వండటం వచ్చేసింది. కూరలో ఓ గుప్పెడు మెంతులు కూడా వేస్తే బాగుండేది" అంతకు మించి బాధనెలా వ్యక్తం చేయాలో తెలియక పళ్ళ బిగువునా కోపాన్ని ఆపుకుంటూ అడిగాడు ఇందర్.
"నాకు మెంతులు మాట గుర్తు రాలేదు. కూర దింపే ముందు వేసి ఓసారి కలియపెట్టి కాసేపు పొయ్యిమీద వుంచి తీసేదాన్ని?"
"ఈ తఫా గుర్తుంచుకొని కూరలో మెంతులు వేస్తాను. సరీగ గుప్పెడు చాలుగా."
"ఆ! తిందువుగాని అమృతం లాంటి కూర" అంటూ ఇందర్ వెళ్ళాడు.
ఇంట్లో జయా పచ్చళ్ళు, కందిపొడి వున్నాయి. అప్పడాలు వడియాలు వేయించి అన్నం ఒకటీ వండాడు ఇందర్. ఆ కూర చూపింతరువాత ఆ పూటకి మరే కూర చేయబుద్ది పుట్టలేదు ఇందర్ కి.
ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు.
ఇందర్ యిద్దరి కంచాలలో కూర వడ్డించాడు.
తను ఆతృతగా కూర తినకపోతే ఇందర్ అనుమానిస్తాడనుకున్న అవంతి ముందుగా కూర ముద్ద నోట్లో పెట్టుకుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అనుకుంటూ.
"గోవిందా గోవిందా" అనుకున్నాడు ఇందర్.
అవంతి పెద్ద ఆర్తనాదం చేసి నోట్లో ముద్దని వుమ్మేసి "యాక్ ధూ....ఛీ....ఛా...." అంది.
ఇందర్ కి నవ్వు ఆగలేదు. నవ్వితే బాధపడుతుందని "యాక్ ధూ ఛీ ఛా" యిది చైనా భాష కాదు కదా!" అన్నాడు.
"నా బొంద"
"అదేంటి!"
"కూర తిని చూడండి"
ఇందర్ ఒకే ఒక దొండకాయ ముక్కని నోట్లో పెట్టుకుని దాన్ని వుమ్మేసి "యాక్ ఛీ ఛా" అని, అరె! నాకు చైనా భాష వచ్చేసిందే!" అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు.
అవంతికి నవ్వాగలేదు.
ఇందర్ కూడా నవ్వేశాడు యింక ఆపుకోలేక.
"కూర అస్సలు బాగుండలేదు" విచారంగా చెప్పింది అవంతి.
"మెంతులు వేస్తే బాగుండేది" కందిపొడి కలుపుకుంటూ ఇందర్ మామూలుగా అన్నాడు.
"ఇప్పుడు మెంతులు వేసి పొయ్యిమీద పెడితే బాగుంటుందా!"
"బాగుండదు"
"ఇంత కూర పారేయ్యాల్సిందే కదా!"
"పోయిన దాని గురించి బాధపడకూడదు. ఇంకా కూర సంగతి వదిలేసి హాయిగా భోంచేయి."
"ఈ తఫా కూర చేస్తే మెంతుల మాట మర్చిపోను."
ఇందర్ కి పొలమారింది. మాడు మీద కొట్టుకుని మంచి నీళ్ళు తాగాడు. ఈ తఫా కూర మెంతులు డబ్బా కూడా ఖాళీ.
"మీ వాళ్ళు ఎవరో మిమ్మల్ని తల్చుకుంటున్నారు." అవంతి అంది.
"నా వాళ్ళంటూ నాకెవరున్నారు. చంద్ర తప్ప! సర్వం ఆ బడుద్దాయే నాకు" ఇందర్ చెప్పాడు.
"ఓహో" అనుకుంది అవంతి.
అవంతి అలా అనుకోటానికి తగినంత కారణం వుంది. అవంతి ఎవరో ఆమె తాలూకా బందుమిత్రులు ఎంతమందోనని మాటల్లో పెట్టి ఇందర్ తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు. అవంతి చాలా పొదుపుగా తన విషయంలో మాట్లాడేది అలాగే....
ఇందర్ గురించి తెలుసుకోటానికి అవంతి అతన్ని మాటల్లో పెట్టేది. అసలు విషయం తన గురించి చెప్పాల్సి వచ్చే సరికి ఇందర్ మాట దాట వేసేవాడు.
ఫలితం!
ఇందర్ గురించి అవంతి గానీ అవంతి గురించి ఇందర్ గాని ఏదీ పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ",మీ వాళ్ళు ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నరని" అవంతి అంటే ఇందర్ తెలివిగా "నా వాళ్ళంటూ ఎవరూ లేరు చంద్ర తప్ప" అంటూ మాట దాటవేశాడు. ఈ విషయంలో ఎవరికెవరూ తీసిపోవటం లేదు.
"ఇందర్ నన్నెలాగూ అమాయకురాలి ననుకుంటున్నాడు కదా! తన వాళ్ళ విషయం అంత రహస్యం దేనికి! బహుశా అతని రహస్యం చాలా పెద్దదయి వుంటుంది. అయ్యగారిది పెద్ద హ్యాండ్ లాగుంది" అనుకుంది అవంతి.