తేజ స్పందించాడు వెంటనే. "నాగకుమారి ఉలూచిన్ని చూసి అర్జునుడు చెప్పిన పద్యమిది. చేమకూర వెంకటకవిగారి విజయవిలాసంలోనిది."
అప్పుడు చూశారు తేజాని అంతా.
ఇందాక పరిచయాల్లో అంతగా పట్టించుకోని కొందరు "అంటే మీకు అర్థమూ తెలుసుండాలి" అన్నారు.
"వాడు రీడింగ్ రైటరండీ...... తెలియకపోవడమేమిటి?" శ్రీమంత్ అన్నాడు "సులభంగా చెప్పగలడు."
"అందులో అశ్లీలత లేదు. ఉలూచిని అందానికి, హావభావాలకి అర్జునుడిలో కలిగిన స్పందన వుంది. అంతే!" తప్పించుకున్నాడు తేజ.
"అంతేనా?" నీరసాన్ని అభినయించింది మార్గరెట్. "పెద్దాయన మరికాస్త లోతుగా వెళతాడనుకున్నాను. అంతటితో ఆపేస్తాడనుకోలేదు."
లక్ష్మణరావు కూడా ఎగతాళిగా అన్నాడు. "లోతుగా వెళ్లడం నాకు అభ్యంతరం కాదు మిస్ మార్గరెట్! కానీ ఇది అకేషన్ కాదనిపిస్తుంది."
"అకేషన్ సరికాదనా లేక లొకేషన్ సవ్యంగా లేదనా?"
శ్రీమంత్ జోక్కి చప్పట్లు కొట్టారంతా.
మార్గరెట్ మరీ దూకుడుగా మాట్లాడింది. "లొకేషన్ ఏదైతేనేం- వెకేషన్ తీసుకునే వయసులో ఏ మగాడైనా ఏం చేయగలడని?"
"దీనికి డాక్టర్ రంజిత్ జవాబు చెప్పాలి" అన్నాడు శ్రీమంత్.
"షీ యీజ్ రైట్" అంటూ తప్పించుకున్నాడు రంజిత్.
లక్ష్మణరావు మొహం జేవురించుకుపోవడాన్ని గమనించిన తేజ ఇక నిశ్శబ్దంగా కూర్చోలేకపోయాడు. "అందరూ అనుమతిస్తే నేను మాట్లాడతాను.
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
"వెల్ కమ్" అన్నాడు శ్రీమంత్.
"ఒకప్పుడు మాటెలా వున్నా యిప్పుడు వయసుతోబాటు శృంగారపటిమ తగ్గిపోతుందన్నమాట ఒక మూఢవిశ్వాసం అని నిరూపించింది మోడరన్ సైన్స్......"
వయసుడిగిన మార్గరెట్ కీ అది ఉత్సాహకరమైన చర్చగా అనిపించడంతో "అయితే రైటర్ గారు విపులంగా ఆ సైన్సు గురించి మాట్లాడతారు" అంది తేజాని చూస్తూ.
తేజ చెప్పటం ప్రారంభించాడు "మన దేశంలో ఇలాంటి సర్వేలు చేయడమన్నది అంతగా ప్రాచుర్యం పొందకపోయినా ప్రతి అంశం గురించి కూలంకషంగా రీసెర్చి చేయబడే అమెరికాలో చాలా డిటైల్డ్ గా వయసుకీ, సెక్స్ పటిమకీ వున్న సంబంధం గురించి తెలియచెప్పబడింది. వయసుతోబాటు సెక్స్ పై ఆకాంక్ష తరగదు. డెబ్బై అయిదు శాతం అమెరికాలోని వృద్ధులు సెక్స్ లో పటిష్టంగానే వున్నారు. ఇంకా వివరంగా చెప్పాలీ అంటే ఆరుగురిలో ఒక వ్యక్తి శృంగారంలో మరింత ఆసక్తిని కనబరుస్తున్నాడట."
లక్ష్మణరావుకి ఓ గొప్ప సపోర్టు దొరికిన ఉత్సాహంతో తేజాని అడిగాడు "కానీ యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే వుండే ఆసక్తి క్రమముగా శారీరకమైన శక్తి క్షీణించడంతో తగ్గిపోతుందంటారుగా?"
"ఇట్సే మిధ్. వయసులో ఉధృతంగా వుంటుంది. నిజమే! కానీ పిల్లలు పుట్టాక వాళ్ళమీద ప్రేమ, పెరుగుతున్న బిడ్డలకోసం తీసుకునే బాధ్యతలు కొంతవరకూ సెక్స్ మీద ఆసక్తి తగ్గటానికి కారణం అవుతాయి. ఆ తర్వాత పిల్లలు ఎదిగి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో అడుగు పెట్టాక భార్యాభర్తలకి మళ్ళీ ఏకాంతం లభించటంతో సెక్సువల్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అది పురుషుల్లో ఏభై నుంచి అరవై నాలుగేళ్ళ దాకా, స్త్రీలలో అరవై అయిదు దాటాక ఎక్కువగా వుంటుందని అమెరికాకి చెందిన డాక్టర్ శామ్యూల్ జానస్, డాక్టర్ సింధియా జానస్ లు రూపొందించిన 'ది జానస్ రిపోర్టాఫ్ సెక్సువల్ బిహేవియర్ ద్వారా తెలియజేశారు.'"
"కానీ స్త్రీలలో అరవై అయిదు దాటాక ఎక్కువగా వుంటుందన్నది నమ్మబుద్ధి కావటంలేదు" అంది మార్గరెట్.
"నలభై నుంచి ఏభైయేళ్ళ వయసున్న స్త్రీలలో కన్నా అరవై అయిదో ఏట అడుగుపెట్టిన ఆడవాళ్ళలో ఎక్కువ ఆసక్తి వుంటుందని ఆ రిపోర్ట్ తెలియచెప్పింది మిస్ మార్గరెట్."
"కానీ ఒంట్లో ఓపిక మాటేమిటి?" మరెవరో అడిగారు.
"సెక్స్ విషయానికి వస్తే దశాబ్దాల అనుబంధం అసలు ప్రక్రియకన్నా ఎక్కువ మానసికమైన సంతృప్తినిస్తూందంటుంది సైన్సు."
"అంటే సెక్స్ అన్నది మానసికమే అంటారు?" మార్గరెట్ మళ్ళీ అడిగింది.
"ఎస్! అందుకే వేగం, ఒడుపుకన్నా ఎక్కువ సంతృప్తినిచ్చేది ఆ ప్రక్రియలో ఒకరికొరకు ఒకరు చూపించే కన్ సర్న్ అంటారు అమెరికన్ సైంటిస్టులు. పైగా....." క్షణం ఆగాడు తేజ, అది అందరిముందూ ముఖ్యంగా ఓ స్త్రీ ముందు చెప్పే విషయం అవునో, కాదో అన్నట్టు సంశయం.
"ఇది సైంటిఫిక్ చర్చ కాబట్టి నా గురించి మీరేం సందేహించనవసరంలేదు" అంది మార్గరెట్ తేజా ముఖకవళికల్ని గమనిస్తూ.
"ఒకరకంగా ట్విన్ ఏజ్ లోని మగాడు చూపించే దూకుడు, తొందరపాటు స్త్రీకి చాలావరకూ అసంతృప్తిని మాత్రమే మిగిల్చితే- స్టిమ్యులేట్ కావటానికి ఎక్కువ టైం అవసరమయ్యే వయసు పెరిగిన మగాడిలోని స్లోనెస్ స్త్రీని మానసికంగా ఎక్కువ ప్రిపేర్ చేసి తద్వారా సంతృప్తిని కలుగచేస్తుందంటారు."
"కానీ స్త్రీలలో మెనోపాస్ తర్వాత సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోతుందంటారుగా?" శ్రీమంత్ అడిగాడు.
"అది మానసికమైన నిబ్బరంలేని స్త్రీలలో, భర్తపోయిన వితంతువుల్లో అంటాడు న్యూయార్క్ కి చెందిన హ్యూమన్ సెక్సువాలిటీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ రావ్. కాకపోతే మెనోపాస్ తర్వాత వజీనల్ లూబ్రికేషన్ తగ్గుతుంది కాబట్టి అది స్త్రీలలో రిప్రషన్ కి కారణమవుతుందంటాడు. అలాగే కొన్ని రకాల జబ్బులు, మందులు, సెక్సువల్ ఇన్ స్టింక్ట్ ని తగ్గిస్తాయి."
"అసలు ఏ వయసులో సెక్స్ ఆరోగ్యానికి మంచిదంటారు?" అడిగాడు ఓ డాక్టరు తనూ ఓ విద్యార్థిలా.
అది తనను పరీక్షించడమో లేక ప్రశ్నించి తెలీని మోడరన్ థియరీని తెలుసుకోటానికి చేస్తున్న ప్రయత్నమో ముందు అర్థం కాలేదు తేజాకి.