ఒక అభిమాని విషయంలో అతడు ఇలాంటి స్థితికి చేరుకోవడం ఇదే తొలిసారి.
* * * *
"డియర్ ఫ్రెండ్స్!" కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్న వ్యక్తుల్ని చూస్తూ శ్రీమంత్ అన్నాడు "నిజానికి ఇది మా సంస్థ వార్షికోత్సవమైనా పెద్దగా ఆర్భాటం చేయటం ఇష్టంలేక నాకు ఆత్మీయులయిన కొందరు మిత్రుల్ని పిలవటం జరిగింది. ఏడాది పొడవుగా బిజీగా వుండే మీరుగాని, నేనుగానీ తరచూ కలుసుకోవటం అసాధ్యం కాబట్టి దీన్ని ఓ అకేషన్ గా భావించి ఓ గెట్ టు గెదర్ లా అందర్నీ రప్పించాను. కాబట్టి ఎవరికి తోచింది వారు రెచ్చిపోయి మాట్లాడతారని ఆశిస్తూ ఒకరికొకర్ని పరిచయం చేస్తున్నాను"
అక్కడ ఉన్న వ్యక్తులంతా విభ్రమంగా చూసుకున్నారు ఒకరినొకరు.
శ్రీమంత్ చిత్రమైన మనస్తత్వం కలవాడని తెలుసుగాని అసలు ఈ ఫంక్షన్ దేన్నివుద్దేశించి ఏర్పాటు చేసిందీ తేజాకి ఖచ్చితంగా అర్థం కాలేదు.
అతడి మార్కెటింగ్ బిజినెస్ కి సంబంధించిన వ్యక్తుల్ని పిలవలేదు ఎక్కువగా. అక్కడ సమావేశమైన వాళ్ళలో నలుగురైదుగురు బిజినెస్ మేగ్నేట్స్, అయిదారుగురు స్టేట్ గవర్నమెంటులో పొజిషన్స్ లో వున్న అఫీషియల్స్ వున్నారు. మిగతా పాతికమందిలో కొందరు డాక్టర్సు, మరికొందరు లాయర్సు.
"రెచ్చిపోయి ఏం మాట్లాడాలి?" అంది మార్గరెట్ అనే ఓ బ్యూటిషియన్. మధ్యవయస్కురాలైనా ఇంకా రెండు పదులు దాటని యవ్వనంలో ఉన్నట్టు చాలా అందంగా అలంకరించుకుంది. అలంకరించుకోవటము మూలంగా అందంగా కనిపిస్తూందో లేక నిజంగా అందగత్తో తేజాకి స్పష్టంగా బోధపడలేదు.
"నిన్నే" రెట్టించింది మార్గరెట్ శ్రీమంత్ ని చూస్తూ "రెచ్చిపోయి ఏం మాట్లాడాలి?"
"లక్ష మాట్లాడొచ్చు. అంతెందుకు నువ్వు ఆడది-అంతం అనే సబ్జెక్టు మీద లెక్చరివ్వొచ్చు లేదూ ఇక్కడ వున్న మిగతా ఫ్రెండ్స్ నీ అందం గురించో లేదూ వాళ్ళ ప్రొఫెషన్స్ గురించో ఏదైనా సర్దాగా ప్రారంభించొచ్చు "ఓ మూల కూర్చుని మార్గరెట్ ని రెప్పలార్పకుండా చూస్తున్న ఓ వృద్ధ లాయర్ ని గమనిస్తూ అన్నాడు శ్రీమంత్ "ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ శ్రీ లక్ష్మణరావుగారు...."
ఉలికిపాటుగా తన దృష్టి మరల్చుకున్న లక్ష్మణరావు "ఏమిటీ?" అన్నట్టు చూశాడు.
మార్గరెట్ అందాన్ని ఓ కవితలా వర్ణించి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు" శ్రీమంత్ వాక్యాన్ని పూర్తి చేశాడు.
"అబ్బే...... నేనా...... కవిత చెప్పడమా?" తొట్రుపడ్డాడాయన.
"పోనీ ఓ నాలుగు వాక్యాల్లో వివరించండి" మరెవరో అన్నారు.
"నాకు అభ్యంతరం లేదు" మార్గరెట్ కూడా రెచ్చగొడుతున్నట్టుగా అంది. "పైగా నన్ను పరాయి మగాడు పొగుడుతుంటే పట్టించుకోటానికి మా ఆయన కూడా లేడు."
"ఏమయ్యాడు?"
ఎవరో అడిగితే శ్రీమంత్ టక్కున చెప్పాడు "అసలు మార్గరెట్ కి పెళ్ళే కాలేదు."
"అలాగా! అందుకే ఆ వయసులో కూడా అందమైన శిల్పంలా వుంది" అనేశాడు లక్ష్మణరావు టక్కున.
"ఒకటయ్యింది" అన్నాడు శ్రీమంత్. "అదేసార్! నాలుగు వాక్యాల్లో మొదటి వాక్యం పూర్తయిందని చెబుతున్నా."
మార్గరెట్ ముసిముసిగా నవ్వింది.
ఒక ప్రత్యేకమైన సమావేశంలా కాక సర్దాగా కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ కాబట్టి శ్రీమంత్ అందర్నీ ఉత్సాహపరుస్తుంటే తేజా ఏకాగ్రతగా గమనిస్తున్నాడు.
"సర్!" శ్రీమంత్ మళ్ళీ అందుకున్నాడు "కోర్టు హాల్లో అంతరేంజిలో అదరగొట్టే మీరు ఇక్కడ మరో మూడు వాక్యాలు చెప్పటానికి ఇంతగా సంశయించడం బాగోలేదు. చెప్పాలి."
"అవును...... లక్ష్మణరావుగారు మాట్లాడాలి" కొంతమంది శ్రీమంత్ కి వత్తాసులా అన్నారు.
"తప్పదు" ఈసారి మార్గరెట్ అంది లక్ష్మణరావుని చూస్తూ. "మీరు సగంతో వదిలిపెట్టక పూర్తిచేయటం మంచిది" అంది అంతర్లీనంగా మరేదో శ్లేష ధ్వనించేట్టుగా.
లక్ష్మణరావు యిబ్బంటిగా చూశాడు.
"స్టార్టింగు బాగుంది కాని మధ్యలో ట్రబులేమిటి?" అంది మార్గరెట్ మళ్ళీ.
ఘొల్లున అందరూ నవ్వడంతో రోషంగా అన్నాడు లక్ష్మణరావు-
"నాగరిక ముద్రగల మంచి బాగరియట
నాగవాసములో వింత నటనలదట
కులుకు గుబ్బల ప్రాయంపు గోమలియట
వలచి వలపింపదే యెంత వానినైనా."
అంతా అవాక్కయి చూస్తుంటే శ్రీమంత్ తేరుకుంటూ అన్నాడు- "ఏమిటీ...... ఇప్పుడు మీరు కవిత్వం చెప్పారా?"
"కాక కాకరకాయ కబుర్లనుకుంటున్నావా?"
"కానీ నాకు అర్థంకాలేదుగా?" అంది మార్గరెట్.
"అర్థమైతే అదిరిపడతావని అలా చెప్పాను."
"అందులో అంత బూతు వుందా?"
మార్గరెట్ అడగడంతో ఇరుకునపడ్డాడు లక్ష్మణరావు.
"ఉన్నా నేను ఫీలవను. ఏముందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. అంతే!"
"చెప్పండి సర్!" అడిగాడు శ్రీమంత్.
"ఎప్పుడో - ఎక్కడో చదివిన పద్యం."
"అంటే?" మార్గరెట్ కవ్వింపుగా అంది "వయసు మీరడంతో పద్యం కూడా సొంతంగా చెప్పలేకపోయారన్నమాట"
లక్ష్మణరావు మొహంలో రంగులు మారుతుంటే శ్రీమంత్ జోక్యం చేసుకున్నాడు "మొత్తానికి మాంచి పద్యం చెప్పారు సర్! అసలు అది ఏ కావ్యంలోదో చెబితే సంతోషిస్తాను."