అది తనను పరీక్షించడమో లేక ప్రశ్నించి తెలీని మోడరన్ థియరీని తెలుసుకోటానికి చేస్తున్న ప్రయత్నమో ముందు అర్థం కాలేదు తేజాకి.
"సెక్స్ అన్నది ఏ వయసులో అయినా అనారోగ్యకరమైన ప్రక్రియ కాదు. నిజానికి వయసు ఉడిగిపోతున్న వాళ్ళలోని మానసికమైన అశాంతిని పారద్రోలటానికి, స్ట్రైన్ ని తగ్గించటానికి సెక్స్ దివ్యౌషధం లాంటిదంటారు కూడా."
అప్పటికి ఓ రెండుసార్లు హార్టెటాక్ వచ్చిన ఓ ఎగ్జిక్యూటివ్ తన వంతు సందేహాన్ని నివృత్తి చేసుకోటానికి అన్నట్టుగా అడిగాడు "'డెత్ బై ఆర్గజమ్' గురించి చాలామంది చెబుతుంటారు. అంటే హార్టెటాక్స్ వచ్చిన వాళ్ళలో కొందరు సెక్స్ ప్రక్రియలో వుండగానే తిరిగి స్ట్రోక్ కి గురై......"
"అది కేవలం వన్ పర్సంట్ మాత్రమే అని నిరూపించాడు అమెరికా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ డాక్టర్ రాబర్ట్ బట్లర్. అయితే అక్రమ సంబంధాలలో మాత్రం ఆ సమస్య కాస్త ఎక్కువ శాతం వుంటుందట. కారణం...... అలాంటి సంబంధాలలో గిల్టీనెస్ అన్నది గుండెపై ఒత్తిడికి కారణము అవుతుంది కాబట్టి. అయితే హార్టెటాక్ తర్వాత సెక్స్ ద్వారా ఎదురయ్యే రిస్క్ ఉదయాన్నే గభాల్న బెడ్ పై నుంచి లేచేటప్పుడు సహజంగా వచ్చే స్ట్రోక్ రిస్క్ కన్నా తక్కువంటారు. సో...." అందరికేసి చూస్తూ మృదువుగా అన్నాడు తేజ "హార్టెటాక్ వచ్చినవాళ్ళు కూడా ఓసారి డాక్టరుతో చర్చించి యధాతథంగా సెక్స్ లో పాల్గొనవచ్చు."
"వండర్ ఫుల్" లక్ష్మణరావు అభినందనగా చప్పట్లు కొట్టాడు. "రచయితగా పేరు ప్రఖ్యాతలు గల మిస్టర్ తేజా ఇప్పుడు మనలో చాలామందికి అవసరమైన విషయాల్ని విపులంగా చెప్పారు. సో..... మైడియర్ ఫ్రెండ్స్! మనలో కాస్త వయసు పెరిగిన వాళ్ళు అంతా అయిపోయిందని ఫీలవనవసరం లేదు. ఎవరికి వాళ్ళు రెచ్చిపోవచ్చు."
"అలా తొందరపడకండి....." మార్గరెట్ పరిహాసంగా అంది.
"ఆనక మోకాళ్ళ నొప్పులో, నడుం నొప్పిలాంటిదో వచ్చి మీ వయసు ఫలానా అని గుర్తుకొచ్చే ప్రమాదముంది."
"యూ ఆర్ నాట్ రైట్ మిస్ మార్గరెట్" తేజ నవ్వేశాడు. "రిసెర్చర్స్ చెప్పిన దాన్నిబట్టి సెక్స్ అన్నది 'యూజిట్ ఆర్ లూజిట్' థియరీకి చెందింది. సెక్సువల్ గా ఏక్టివ్ గా వుంటే వయసు పెరిగినా వృద్ధాప్యం రాదంటున్నారు కాబట్టి అది అందరికీ ఉపయోగకరమైనదే."
"మొత్తానికి దంచేశావురా తేజా" శ్రీమంత్ అభినందనగా అన్నాడు. "రాయటంలోనే కాదు మాట్లాడ్డంలోనూ, మనుషుల్ని కన్విన్స్ చేయటంలోనూ దిట్టవనిపించుకున్నావు. ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకైనా గానీ నీ జనరల్ నాలెడ్జితో చాలామందిని యువకులుగా మార్చావు."
"ఎస్! యూ ఆర్ రైట్" శ్రీమంత్ కి సపోర్టుగా ముందుకొచ్చాడు మరో యువకుడు. "చదవడం వేరు...... చదివింది క్లారిటీతో ఎక్స్ ప్రెస్ చేయటం వేరు."
తేజా యధాలాపంగా చూస్తుంటే "బై దిబై..... ఈయన నాకు స్నేహితుడు మిస్టర్ భాస్వంత్! ఎస్ ఎఫ్ సిలో ఎగ్జిక్యూటివ్" అంటూ పరిచయం చేసిన శ్రీమంత్ "అసలు చిత్రమేమిటంటే ఎవర్నీ తొందరగా అంగీకరించని భాస్వంత్ నీ విషయంలో ఇంప్రెస్ కావటం" అన్నాడు మరింత ఆశ్చర్యంగా.
"థేంక్స్ ఎలాట్" అన్నాడు తేజా మనస్ఫూర్తిగా.
"నేనెక్కువ చదవను కాబట్టి రచయితగా మీ టాలెంటేమిటో చెప్పలేను. బట్..... మొదటి పరిచయంలోనే మీరంటే యిష్టం ఏర్పడిపోయింది. అయితే ఓ సందేహం."
"అడగండి."
"ఇప్పుడు మన సమావేశంలో చాలామంది డాక్టర్సున్నారు. వాళ్ళని మించి మెడికల్ సైన్సు గురించి మాట్లాడారూ అంటే మీరు బాగా చదువుతుంటారనుకుంటాను."
"అఫ్ కోర్స్" నవ్వేశాడు తేజా. "నా నాలెడ్జీకి పరిధి వుంటుందిగా. అందుకే చాలా చదవాల్సి వుంటుంది."
"అంటే అంతా వూహించి రాయరన్నమాట."
"ఊహకి కొంత వాస్తవమైన పరిజ్ఞానాన్ని జోడిస్తుంటాను. అలా పాఠకులకి కొత్త విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటాను."
"ఇప్పటికి అర్థమైంది."
"ఏమిటి?" శ్రీమంత్ అడిగాడు.
"నావెల్సు చదువుతూ కొందరు ఎందుకంతగా పరిసరాల్ని మరిచిపోయుంటారో."
నిజానికి భాస్వంత్ ఈ మాటన్నది అతడి భార్యని వుద్దేశించి. కానీ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.
"ఈసారి కలిసినప్పుడు మీతో వివరంగా మాట్లాడతాను."
"వెల్ కమ్" అన్నాడు తేజా.
"బై!"
భాస్వంత్ ఆ తర్వాత వెళ్ళిపోయాడు.
శ్రీమంత్ ఇంకా నిశ్చేష్టుడిలా చూస్తుంటే "ఏమైందిరా" అన్నాడు తేజ.
"భాస్వంత్ నాకు బిజినెస్ పరంగా పరిచయమే అయినా ఏనాడూ నాతో ఇంతగా మాట్లాడలేదు. కానీ నీ ముందు ఇలా ఎమోషనల్ గా రియాక్టయ్యాడూ అంటే బహుశా ఏదో పర్సనల్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాడనుకుంటాను."
"ఐ డోంట్ థింక్ సో" తేజా అన్నాడు.
"నో...... నో..... నాకు తెలిసీ భాస్వంత్ దాంపత్య జీవితంలో అంతహేపీగా లేడు."
"ఎందుకలా అనుకుంటున్నావు?"
ఖచ్చితంగా చెప్పలేకపోయాడు శ్రీమంత్. కానీ ఎప్పుడో ఒకటీ అరా ఫంక్షన్సుకి అతడు భార్యతో రావటాన్నీ, ఆమె సమక్షంలో అతడు ప్రవర్తించే విధానాన్నీ గుర్తుచేసుకుంటూ అన్నాడు- "అసలు భార్యని ఏ పార్టీలకైనా తీసుకురావడమే అరుదు. అదికూడా కాదు- భాస్వంత్ కి స్త్రీలు అన్నా, వాళ్ళు స్వాభిమానంతో ప్రవర్తించడమన్నా గిట్టనట్టుగా అనిపిస్తాడు.