Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 36


    మార్కండేయులు నిశ్చేష్టుడయిపోయాడు.
    అతనలా షాక్ తినటం చూసి అదే ఛాన్సని ఆ వచ్చిన వ్యక్తి తన బ్రీఫ్ కేసులోని నోట్ల కట్టలన్నీ ఆయన టేబుల్ మీద కుమ్మరించాడు.
    అంత డబ్బు సడెన్ గా చాలాకాలం గ్యాప్ తరువాత చూసేసరికి మార్కండేయులుకు స్పృహ తప్పింది. వెంటనే అతనిని తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో చేర్పించేశాడు భవానీశంకర్.
    తిరిగి రాత్రి రెండు గంటలకు కళ్ళు తెరిచాడు. తెరుస్తూనే "నేనెక్కడున్నాను?" అన్నాడు చుట్టూ నిలబడ్డ భవానీశంకర్ నీ, ప్రకాష్ నీ, ప్రతిమనూ, ఇద్దరు డాక్టర్లనూ చూస్తూ.
    "అలా ఫోర్త్ గ్రేడ్ కొశ్చెన్స్ వేయకు ఫాదరిన్లా! మరీ ఇరవై ఏళ్లక్రితం సినిమాల్లో వాడిన ప్రశ్న అది. ఇద్దరు డాక్టర్లూ, నలుగురు నర్సులూ, హాస్పిటల్ బెడ్డూ ఇన్ని కనబడుతున్నా కూడా ఇంకా నేనెక్కడున్నానేమిటి? కొశ్చెన్ మార్చేయండి వెంటనే" అతనికి సలహా ఇచ్చాడు భవానీశంకర్.
    మార్కండేయులు అతి కష్టం మీద కోపం అణుచుకున్నాడు.
    "డోంటాక్ రాట్!" అన్నాడు మండిపడుతూ.
    "అదిగో మళ్ళీ ఇంగ్లీష్" చిరాకుపడ్డాడు అతను.
    "యూ ఆర్ డెవిల్! బేబీ! ఏమయినా సరే నువ్వీ డెవిల్ ని చేసుకోడానికి వీల్లేదు" ప్రతిమతో ఆవేశంగా అన్నాడు.
    "మీరు పొరపడుతున్నారు డాడీ! అతను డెవిల్ కాదు. గ్రేట్ జీనియస్!"
    "ఆల్ ట్రాష్! వాడో ఇంటర్నేషనల్ ఇడియట్! వీళ్ళిద్దరివల్లా ఆ చెత్త ప్లాట్ కోసం పదిహేనులక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కేవలం రెండు లక్షలు ఖరీదుచేసే ప్లాటుకి పదిహేను లక్షలా? ముందు వాళ్ళిద్దర్నీ బయటకు గెంటెయ్యండి. వాళ్ళ ముఖాలు చూడటం కూడా నాకిష్టం లేదు."
    "అదికాదు ఫాదరిన్లా!"
    డోంటాక్ రాట్. నేన్నీ ఫాదరిన్లా కాదు. నువ్వు నా సన్ ఇన్ లా కాదు."
    "ఆల్ రైట్! మీ కోరిక ప్రకారం నేనూ కె.యస్.ప్రకాష్ వెళ్ళిపోతున్నాం. కానీ మన సినిమాకి పాతిక లక్షల లాభంతో అమ్మేయడానికి సిద్ధంచేసిన కాంట్రాక్ట్ అన్నీ చింపి అవతలపారేసి ఆ బయ్యర్స్ అందరినీ బయటకు గెంటి అప్పుడు వెళ్తాం, అండర్ స్టాండ్?"
    అతని మాటలు మార్కండేయులుకి ఓ పట్టాన అర్థం కాలేదు. ఆలోచిస్తున్న కొద్దీ అన్ని విషయాలూ ఠకీమని గుర్తుకొచ్చేశాయి. ఆ ఉదయం నిద్రలేచేసరికి తనింటి గేటు ముందు పెద్ద సంఖ్యలో బయ్యర్స్ గుమిగూడటం, తన సినిమా కావాలని తహతహలాడిపోవటం...దాంతో అదిరిపడి లేచి కూర్చున్నాడు మంచంమీద.
    "ఏరీ బయ్యర్సేరి? నా సినిమా క్లయింట్స్ ఏరి?" అరిచాడు గాబరాగా.
    "వాళ్ళందరితో బేరాలాడి రెట్లు ఫిక్స్ చేసి హోటల్ కి పంపించేశాను."
    "మరి అడ్వాన్స్ ఎప్పుడిస్తారు?"
    "ఇంకెందుకిస్తారు! అవన్నీ క్యాన్సిల్ చేసిపారేసి వాళ్ళను ఇప్పుడే హోటల్నుంచి గెంటివేస్తాం" భవానీశంకర్ ప్రకాష్ భుజం మీద చేయివేసి బయటకు నడవబోయాడు.
    మార్కండేయులు ఒక్క దూకు దూకి భవానీశంకర్ కి అడ్డం నిలబడ్డాడు "నిజంగా నా సినిమాకి పాతిక లక్షలు లాభం వస్తోందా?"
    "పాతిక లక్షల డెబ్బయ్ ఎనిమిదివేలు. మేము వెళుతున్నాం" అతనిని తప్పించుకుని బయటకు నడవబోయాడతను.
    "అహ్! మిస్టర్ భవానీశంకర్ వన్ మినిట్! లెటజ్ టాక్" గాభరాగా మళ్ళీ అడ్డం వచ్చాడు మార్కండేయులు.
    "నోనోనోనో! మనకేం మాటలుంటాయ్? పైగా మా ఇద్దరి ముఖాలు చూపించవద్దని ఇప్పుడేగా గేదెలా అరిచారు?"
    "అహ్హహ్హ! అదా! అదీ జస్ట్ జోకింగ్! నేనెప్పుడూ జోక్ చేస్తుంటాను అందరితో. కావాలంటే ప్రతిమనడుగు! అయామే జోవియల్ క్రీచర్ లలంలా-టటటాటా! చూశావా! ఎంత జోవియలో?"
    "ఐ డోంట్ లైక్ జోవియల్ క్రీచర్స్" మళ్ళీ ముందుకి నడవబోయాడు భవానీశంకర్.
    మార్కండేయులు అతనివెంట పడ్డాడు. "అదికాదు భవానీ! మీ ఇద్దరూ ఇంత ఇంటెలిజెంట్ గా, ఇంత అద్భుతంగా, ఇంత ఇదిగా ఆ దివాళాకోరు సినిమా అమ్మేశారంటే ఐ యామ్ రియల్లీ ఫ్రౌడాఫ్ యూ! యూ ఆర్ గ్రేట్ మాన్."
    "ఇందాక నన్ను డెవిల్ అన్నట్లు గుర్తు?"
    "డెవిల్ అన్నానా? నో నెవ్వర్! డెవిల్ అని నేనంటానా? ఇంపాజిబుల్! నేనెప్పటికీ అలా అనను కదు బేబీ?"
    "కానీ ఇందాక అన్నారు డాడీ."
    "అన్నానా? నేనా? గుర్తుకొచ్చింది! గుర్తుకొచ్చేసింది! యాంజెల్ అనబోయి డెవిల్ అని వుంటాను. రెండు పదాలూ చాలా దగ్గరగా వుంటాయి కదా? రెండూ 'వై' అనే అక్షరంతోనే మొదలవుతాయి. కదూ ప్రకాష్?" ప్రకాష్ వైపు అభిమానంగా చూస్తూ అన్నాడు.
    "కాదు! రెండింటికీ ఏమాత్రం సంబంధం లేదు. 'వై' అనే అక్షరమే రెండింటిలోనూ లేదు. నువ్వు మాట్లాడిందంతా ట్రాష్ అంకుల్! ప్యూర్ ట్రాష్" అన్నాడు ప్రకాష్ తిరగబడిపోతూ.
    మార్కండేయులు ముఖం మాడిపోయింది. అయినాగానీ భవానీశంకర్ వైపు చిరునవ్వుతో చూశాడు.
    "అదికాదు మైడియర్ సనిన్లా!"
    "డోంటాక్ రాట్! నేను మీ సనిన్లా కాదు, మీరు నా ఫాదరిన్లా కాదని ఇందాక మీరే అన్నారు."
    "అదా" అంటూ పొట్ట చేత్తో పట్టుకుని విరగబడి నవ్వసాగాడతను గదంతా ఎగురుతూ.
    నవ్వుతూ నవ్వుతూనే మధ్య మాట్లాడసాగాడు "అదీ...అది...సరదాకి అలా మాట్లాడాను. అది నిజం అనుకుంటున్నారు? అహ్హహ్హ ఆహ్హాహ్హా పిచ్చివాళ్ళు నిజమనుకున్నారు."
    "భవానీ అయిందేదో అయిపోయింది డాడీ సరదాకి మాట్లాడానంటున్నారు కాబట్టి..." అంది ప్రతిమ సర్ది చెపుతూ.
    భవానీశంకర్ అనుమానంగా మార్కండేయులు వైపు చూశాడు "నిజంగా సరదాగా మాట్లాడారా?"
    "ఒట్టు! ప్రామిస్! బైగాడ్" అతని చేయి లాక్కుని ఒట్టు వేస్తూ అన్నాడు మార్కండేయులు.
    "ఆల్ రైట్! అయితే పదండి ఇంటికెళ్ళిపోదాం! తెల్లారగానే అగ్రిమెంట్లు సైన్ చేయాలి."

 Previous Page Next Page