Previous Page Next Page 
జయ - విజయ పేజి 36


    "ప్రేమ గురిచి నేనేర్పరుచుకున్న ఊహలూ, అభిప్రాయాలూ అన్నీ తప్పేమో అనిపిస్తోందక్కా..."
    "అంటే ఇంకా అతనిని మర్చిపోలేకపోతున్నావా?"
    "ఎలా మర్చిపోనక్కా! ఓ ప్రక్క పుట్టబోయే పాపాయే నాకు ఎన్నో జ్ఞాపకాలు తీసుకొస్తుంటే మరచిపోవడం సాధ్యమేనా?"
    "కానీ జయా! నువ్వు ఇప్పుడు చంద్రకాంత్ భార్యవి. నీకు ఈ విషయం గుర్తుంటే చాలు."
    "నవ్వొస్తోందక్కా నాకు! భర్త అంటే అర్థమే తెలీటం లేదు. లోపల పెరుగుతోన్న పాప ఒకరిది! ఆ భారం మోసేది మరొకరూ! ఇంత వంచన చేయడం నాకు నచ్చడం లేదు. నేను ప్రేమించింది ఒకరిని. వివాహం చేసుకున్నది మరొకరిని. ఇక ఆయనేమో! నిన్ను చేసుకుంటున్నానన్న భ్రమలో నన్ను చేసుకున్నారు. ఇక ఆనందం ఎక్కడనుంచి వస్తుందక్కా ఈ సంసారంలోకి"
    విజయకు అర్థమైపోయింది. ఇదంతా తనవల్లే జరిగిందనిపిస్తోంది. ఈ పాపానికి కారణం నిస్సందేహంగా తనే! అటు జయకూ ఆనందం లేదు. ఇటు చంద్రకాంత్ కీ లేదు. మరోపక్క తను జీవితంలో ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి చంద్రకాంత్ ని తన చేతులారా దూరం చేసుకుంది.
    తన ప్రేమను అజ్ఞాతంగా దాచివేసింది.
    ఇప్పుడిక ఎవరూ చేయగలిగేదేమీలేదు. చంద్రకాంత్ ని రోజూ చూచుకుంటూ అతని సమక్షంలోనే గడిపే అవకాశం తనకు భగవంతుడే ఇచ్చినట్లుంది. జీవితాంతం తనను అక్కడే ఉండనిస్తే అంతకంటే కోరుకునేదేమీ వుండదు. అజ్ఞాతంగా నయినా చంద్రకాంత్ కి సేవచేసే అవకాశం తనకు లభిస్తే అదే పదివేలు.
    మర్నాటినుంచీ విజయ తనే చొరవగా ఇంటిపనంతా నెత్తిన వేసుకుంది. ఉదయం చంద్రకాంత్ మొఖం కడిగి లోపలికొచ్చేసరికి అతని టేబుల్ మీద కాఫీ పొగలు గ్రక్కుతూ కనిపించింది. అతనికి ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. జయ అలా తను లేవగానే కాఫీ అందించి చాలారోజులు అయిపోయింది. వివాహమైన కొత్తలో కొద్ది రోజులు! అంతే! ఆ తరువాత తనే కాఫీ కాచుకునేవాడు.
    పడగ్గదిలోకి నడిచాడతను కాఫీ కప్పు తీసుకొని. జయ ఇంకా నిద్రపోతూనే వుంది. అతనికి ఇది మరింత ఆశ్చర్యం కలిగించింది.
    అయితే ఇంత శ్రద్ధ తీసుకుంది జయ అన్నమాట.
    అతను కాఫీ త్రాగడం పూర్తయ్యేసరికి విజయ గది బయటే నిలబడి కనిపించింది.
    "స్నానానికి వేడినీళ్ళు తోడాను." అందామె తలవంచుకుని. ఆమెకు కృతజ్ఞతలు తెలియజేద్దామనుకుంటూండగానే ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయింది.
    చంద్రకాంత్ స్నానం ముగించి వచ్చేసరికి కాఫీ ఫలహారాలు టేబుల్ మీద సిద్ధంగా ఉన్నాయ్.
    అప్పటికి జయ కూడా నిద్రలేచింది.
    "మీ జయ చూశావా_ఎంత తేలిగ్గా చేస్తోందో ఈ పనులన్నీ..." నవ్వుతూ అన్నాడతను.
    జయ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అతనివేపు చూసింది.
    మరికాసేపటి తర్వాత జయ, చంద్రకాంత్ లు ఆఫీస్ కి బయలుదేరారు.
    "మీకు ఇంట్లో బోర్ కొడుతుందనుకుంటాను. ఈ వీధి చివర్లో లైబ్రరీ ఉంది. అక్కడికెళ్ళి కూర్చోండి కాసేపు." విజయతో అన్నాడు చంద్రకాంత్.
    "సరే..." తలూపింది విజయ.
    నిజానికి ఆమెకెక్కడికీ కదలాలనిపించడంలేదు.
    వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా సర్ది ఓ కొలిక్కి తీసుకువచ్చింది జయ.
    సాయంత్రం వాళ్ళు వచ్చేసరికల్లా వంట కూడా ముగించేసింది.
    ఇంటికి వస్తూనే ఇంట్లో జరిగిన మార్పులు గమనించి ఆనందపడిపోయాడు చంద్రకాంత్.
    విజయకూ జయకూ ఎంత తేడా వుందో తెలిసిందతనికి. ప్రతి స్త్రీ జయలా ఉంటే ఎంత బావుండు అనుకున్నాడతను.
    "చూశారా! మీరు వచ్చేసరికి ఈ ఇల్లు రూపమే మారిపోయింది. ఇక మీరు వివాహం అయ్యి వెళ్ళేవరకూ మా ఇల్లు ఇలా స్వర్గంలానే ఉంటుంది." అన్నాడతను ఆమెతో.
    విజయ అతనివేపు ధీనంగా చూసింది.
    "నాకు వివాహమా? వద్దండీ! నాకా ఉద్దేశ్యమే లేదు. దయచేసి మా అమ్మ చెప్పిన మాటలు పట్టించుకోకండి! నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. ఇలాగే జీవితం గడిపేయాలని..."
    అతను ఆశ్చర్యపోయాడు.
    "అదేమిటి? తోడంటూ లేకుండా జీవితమంతా ఎలా గడుపుతారు? జీవితాంతం మిమ్మల్ని ఎవరు ఆదరిస్తారు?"
    "మీరు! చిరునవ్వుతో అందామె. "మీ ఇంట్లో వంట మనిషిగా ఉంటాను! అప్పుడు మీరు నన్ను కనిపెట్టి ఉండరా?"
    ఆమె మాటలకు అతని హృదయం ద్రవించిపోయింది.
    "సారీ! మీరు నాకు బరువని నేను అలా మాట్లాడడం లేదు. కానీ మీరు వివాహం చేసుకుంటే మీ జీవితం మీరు సంతృప్తిగా గడపగలరన్న ఉద్దేశ్యంతో చెపుతున్నాను."
    "ఊహు! నాకా ఆలోచనే లేదు. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చేయకండి!"
    అతనింకేమీ మాట్లాడలేకపోయాడు. ఆమె మాటలు విచిత్రంగా కనిపించినాయి అతనికి.

 Previous Page Next Page