Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 36


    'కుమారి సుజాత....!' లాయరు కంచుకంఠం విని ఈ లోకంలోకి వచ్చి అయోమయంగా చూసింది. "నా ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఆరోజు ఆవేశంతో ఆనంద్ ని ఏమన్నావు! ఆనందరావు ఏమన్నాడు? ఏం జరిగింది? ఆ వివరాలు చెప్పమని అడుగుతున్నాను.... నా ప్రశ్నలకి సమాధానం చెప్పు...."
    కోర్టంతా నిశ్శబ్దంగా కుతూహలంగా సుజాత జవాబుకి ఎదురుచూస్తూంది. కమల ఆరాటంగా ఆమె జవాబుకి ఎదురుచూస్తూంది. సుజాత నెమ్మదిగా శుష్కహాసం చేసింది.
    "చెప్పడానికి ఏముంది. ఆనందరావుని ఏమంటాను. ఓ మోసపోయిన వంచించబడిన స్త్రీ ఆ బాధలో ఆవేశంలో ఏం అంటుంది? మోసగాడివన్నాను. ఇంత నీచుడవనుకోలేదు. నాకు చేసిన అన్యాయానికి ఎక్కడోకాదు యిక్కడే నా చేతిలోనే శిక్ష అనుభవిస్తావు" అని కసిగా నిందించాను.
    "ఆనందరావు అప్పుడు ఏమన్నాడు?"
    "ఏమంటాడు? దోషిలా తల వంచుకున్నాడు! నిర్దోషిలా అమాయకంగా మొహంపెట్టాడు.... క్షమించమని ప్రాధేయపడ్డాడు. నిన్ను ఇంట్లో వుంచుకుంటూ, నీకన్యాయం చెయ్యనన్నాడు. ఉంపుడుకత్తెగా వుంచుకుంటావా' అని వికటంగా నవ్వాను. రెండోపెళ్ళికి తన భార్య వప్పుకోడం లేదని నెమ్మదిమీద వప్పిస్తానని నచ్చచెప్పబోయాడు. అతని మొహం చూస్తూంటే అదంతా నన్ను అప్పటికి తప్పించుకోడానికి ఆడుతున్న నాటకం అని అర్థంచేసుకున్నాను.... అలాంటి మనిషిని _ అలాంటి నీచుడిని వదిలిపెట్టకూడదని ఆవేశపడి ఆ ఆవేశంలో..."
    "ఏం చేశావు?"
    "ఆ ఆవేశంలో పిస్టలు కాల్చాను"
    "నీకు పిస్టలు ఎక్కడిది?"
    "ఆనందరావ్ తెచ్చాడు నన్ను నమ్మించడానికి. 'సుజాతా, నన్ను నమ్మలేకపోతే ఇదుగో నీ చేతుల్తోనే నన్ను చంపి నీ కసి తీర్చుకో' అంటూ గొప్పగా పిస్టలు అందించాడు.... అతను వూరికే అన్నది నేను నిజం చేశాను. ఆనందరావుని కాల్చాను...."
    "ఆనందరావుని చంపితే నీకు శిక్ష పడుతుందని నీవు తప్పించుకోలేవనీ తెలుసుండే ఆ పనిచేశావా?...."
    "అవును. ఆనంద్ లేని బ్రతుకు నాకక్కరలేదని, ఆనంద్ లేని క్షణాన నేను వుండరాదని, ఆనంద్ ని చంపి నేను చావాలనుకున్నాను. కాని ఈలోగానే అతని భార్య కేకలు పెట్టడం అంతా రావడంతో నేను గాభరాపడిపోయి నన్ను నేను చంపుకోవాలన్నది మరిచిపోయి వుండిపోయాను. యువర్ ఆనర్, దయచేసి నన్నింక ఇలా నా ఆనంద్ నించి దూరం చేసి బాధించకండి. దయచేసి నా ఆనంద్ దగ్గిరకి నన్ను పంపండి. నన్నింక ఎవరూ ఏమీ అడగవద్దు. నేనింకేమీ చెప్పను. యువర్ ఆనర్, నన్ను ఖైదు చేసి బ్రతుకంతా ఆనందు కోసం ఏడ్చేట్టు చెయ్యొద్దు. నామీద దయదలచి నన్ను ఆనందు దగ్గిరకు పంపండి. అంతకంటే నేను కోరుకునేది ఏమీలేదు" ఆవేశంతో, దుఃఖంతో సుజాత చేతులలో మొహం కప్పుకుంది.
    కోర్టులో కలకలం గోల గోలగా తయారయింది. సుజాత తండ్రి వెలవెలబోయాడు. డిఫెన్సు లాయరు ముద్దాయి తన నేరాన్ని అంతలా తేల్చేసి చెప్పుతుంటే ఆమెని ఎలా రక్షించాలో తెలియక గాభరాపడిపోయాడు. కేసు వాయిదా కోరాడు. ఆ రోజుకే టైము అయిపోవడంతో జడ్జిగారు మర్నాటికి వాయిదావేసి లేచిపోయారు. జనం అంతా గోలగోలగా సుజాతకి ఏ శిక్ష పడపోయేది చర్చిస్తూ బయటికి వెళుతున్నారు, అంతవరకు నిశ్చేష్టురాలిలా కూర్చున్న కమల తేరుకుని ఒక్క ఉదుటున లేచి సుజాత దగ్గిరకు రాబోయింది. పోలీసు కస్టడీలో వెడుతున్న సుజాతతో మాట్లాడలేక నిస్సహాయంగా వుండిపోయింది.

                                        *    *    *    *

    మర్నాడు పోలీసు పర్మిషన్ తీసుకుని సుజాతని చూడడానికి వెళ్ళింది కమల. సుజాతని చూస్తూనే ఆరాటంగా ఆమె చేతులు పట్టుకుని.... నన్ను క్షమించు, క్షమించానను సుజాతా... నీదింత గొప్ప హృదయమని తెలుసుకోలేకపోయాను"... ఆమె చేతులతో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడవసాగింది కమల. ఆమె గుండెలలో భారం అంతా దిగిపోయేట్టు. ఆమె దుఃఖం అర్థం అయింది సుజాతకి. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కమల భుజాల మీద ఓదార్పుగా చెయ్యివేసింది సుజాత. "యిందులో నా మీ గొప్పతనం ఏమీ లేదమ్మా, ఏదన్నా వుంటే అది ప్రేమ గొప్పతనం మాత్రమే. నా ఆనందు పిల్లలకి తండ్రి ఎలాగు లేడు, తల్లిని కూడా లేకుండా చేసి వాళ్ళని అనాధలు చెయ్యగలనా".... సుజాత కళ్ళలో వెలుగుని ఆమె మొహంలో వెల్లి విరుస్తున్న సంతృప్తిని తెల్లపోతూ అర్థం కానట్టు చూసింది కమల!

                                                                                                             (యువ మాసపత్రిక)

                                                   *  *  *  *

 Previous Page Next Page