Previous Page Next Page 
కొత్తనీరు పేజి 36


    "అనూరాధండీ!" సూర్యనారాయణ కూతురి తరఫున జవాబిచ్చుకున్నాడు. మళ్ళీ ముఖముఖాలు చూసుకున్నారు పెళ్ళివారు.
    "పాటలు, సంగీతం అవీ ఏమైనా వచ్చా?"
    "రావు!" కచ్చితంగా జవాబిచ్చింది రాధ. శకుంతల గాభరాగా చూసింది. పెళ్ళివారి వైపు, కూతురివైపు సూర్యనారాయణ కఠినంగా చూశాడు.
    ఏమనుకున్నారోగాని ఇంక యే ప్రశ్నలు అడగలేదు పెళ్ళివారు. అనూరాధ ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంది. పెళ్ళివారు కాఫీలు పూర్తిచేసి, ఆఖరిసారిగా రాధని చూసి లేచి నిలబడ్డారు.వాళ్ళునిలబడగానే....అనూరాధ టక్కున లేచి గిరుక్కున లోపలికి వెళ్ళిపోయింది. పెళ్ళికొడుకు తెల్లబోయి చూశాడు. శకుంతల తల వంచుకుంది. సూర్యనారాయణ ఆ వాతావరణాన్ని తేలిక పరుస్తూ, యేదో కల్పించుకొని మాట్లాడుతూ వారిని వీధి వరకు సాగనంపి టాక్సీ వెళ్ళగానే లోపలికి వచ్చాడు.
    "ఏదీ అది?.......ఇలా రమ్మను.....ఇప్పుడు చెప్పమను దాన్ని- నలుగురిలో నన్ను ఇంత అవమానపరుస్తుందా....దీని అంతుతేలుస్తాను ఈవేళ! పిలు దాన్ని.....ఇంతపొగరా-యేడుపు ముఖం పెట్టుకుని కూర్చుంటుందా? అడిగితే జవాబులియ్యదూ? ఇంత తలబిరుసుగా ప్రవర్తిస్తుందా వాళ్ళ దగ్గర.....దీని ముఖం చూసి వాళ్ళు యెలా చూసుకున్నారో చూశావా?.....యేం చూసుకుని దీని కింత పొగరు? పెళ్ళి చేసుకోదూ? చేసుకోకుండా అడుక్కుతింటుందా? దీని మొహానికి ఇంతకంటే గొప్పవాడు వస్తా డనుకుంటూందా?" .....చిందులు తొక్కాడు సూర్యనారాయణ, కోపంతో గట్టిగా అరుస్తూ.
    "ఊరుకోండి.....అయిందేదో అయింది.....నలుగురూ ఈ భాగోతం అంతా విని నవ్వాలా?..."
    "ఊరుకోను....దాని సంగతి ఈ వేళ తేల్చేస్తాను.....పెళ్ళి పెడాకులు లేకుండా, ఇంట్లో తిని కూర్చుని వెధవ వేషాలు వేద్దామనుకుంటూందా!...రాధా.....ఇలారా....రా ముందు బయటికి...." అరిచాడు సూర్యనారాయణ.
    రాధ నెమ్మదిగా వచ్చి నిలుచుంది.
    "నీ ఉద్దేశం యేమిటి? వాళ్ళ ఎదుట ఎందుకంత పొగరుగా ప్రవర్తించావు?......నీకు పెళ్ళి అవాలని లేదా? నీ తలబిరుసుతనం చూశాక వాళ్ళు చేసుకుంటారా ఇంకా!"
    "చేసుకోకూడదనే నా ఉద్దేశం!" నిర్లక్ష్యంగా జవాబిచ్చింది రాధ.
    సూర్యనారాయణ తీక్షణంగా చూశాడు. "పెళ్ళి చేసుకోకుండా యేం చేద్దామని?"
    "ఉద్యోగం చేద్దామని!"
    ఆ మొండి సమాధానాలు సహించలేక పోయాడు సూర్యనారాయణ.
    "అయితే, పో, నా ఇంట్లోంచి.....నా మాట వినని నువ్వు నా కూతురివి కావు.....నేను నీకు తండ్రినికాను. తక్షణం నా ఇంట్లోంచి పో...." కోపంతో వణికిపోతూ వేలుతో గుమ్మం చూపిస్తూ అన్నాడు సూర్యనారాయణ.
    శకుంతల ఆందోళనగా చూస్తూ అంది:
    "ఏమిటండీ.....మతిపోతూందా ఏమిటి? ఊరుకోండి ఇంక. ఎవరైనా వింటే నవ్వుతారు. ఉన్నపాటున పొమ్మంటే ఎక్కడికి పోతుంది? యేదో ఉద్యోగం చూసుకుని అదే వెడుతుంది...."
    "అదంతా వీల్లేదు....ఇప్పుడే పోవాలి! దానికి తండ్రి మంచీ చెడూ యేమీ అక్కరలేనపుడు, అది ఎలా చచ్చినా నా కక్కరలేదు. పొమ్మను యింట్లోంచి!"
    "అలాగే.....అలాగే పోతాను!" అంటూ గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళింది అనూరాధ.
    "పో.....పో.....అడుక్కు తిను.....అప్పటికి కాని నీకు బుద్ధి రాదు.....నీ బుర్ర తిరుగుడు తగ్గదు...." సూర్యనారాయణ విసవిసా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
    శకుంతల గాభరాగా రాధ గదిలోకి వెళ్ళింది.
    రాధ గబగబ తన బట్టలు, పుస్తకాలు పెట్టెలో సర్దుతూంది. "రాధా.....యేమిటిది? మీ నాన్నతోపాటు నీకూ మతిపోయిందా? ఎక్కడికి వెడదామనుకుంటున్నావు?" అని గద్దించి అడిగింది శకుంతల.
    "ఎక్కడికో వెడతాను."
    "ఉద్యోగం సద్యోగం చూసుకోకుండా ఉన్నపాటున యిల్లు వదిలి యేం చేద్దామనుకుంటున్నావు? బొత్తిగా జ్ఞానం లేకుండా పోయిందే!....మీ నాన్న యేదో కోపంలో అంటే, దాని కింత రాద్దాంతమా?"
    "నాన్న పొమ్మన్నారు.....ఇంక ఈ ఇంట్లో ఉండను."
    "నాన్న ఆ మాత్రం అనతగరా! ఆ కోపం తగ్గితే ఆయనే ఊరుకుంటారు. నువ్వు మాత్రం తక్కువ దానివా? నువ్వు చేసిన పని బాగుందా? ఆయనకు కోపం వచ్చిందంటే రాదూ? పెళ్ళి వద్దు పెడాకులు వద్దులే.....ఉద్యోగం వచ్చాక, నీ దారిని వెడుదువుగాని..... ఇలా ఉన్నపాటున వెళ్ళిపోతే అంతా యేమనుకుంటారు?....నా మాట విను...."
    "ఉద్యోగం దొరికే వరకు, యే స్నేహితురాలి ఇంటిలోనో ఉంటాను.....ఈ నరకంలో ఇంక ఒక్క క్షణం ఉండను! నాన్న పొమ్మన్నాక యిల్లు పట్టుకు వేళ్ళాడడానికి నేనంత చేతకాని దాన్ని కాదు...." రాధ పౌరుషంగా అంది పెట్టె మూస్తూ.
    "అంతేనా!..... నా మాట వినవా?" అంటూ నీరసంగా గోడకి చేరగిల పడింది శకుంతల.
    రాధ జవాబియ్యకుండా చీర మార్చుకుని, చెప్పులు తొడుక్కుంది. కూతురు నిర్ణయం మారదని అర్ధం అయింది శకుంతలకి. కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
    "ఇంక ఈ గోల నేను భరించలేను తల్లీ! నీ యిష్టం వచ్చినట్లు చెయ్యి.....నీ గీత ఎలా వుంటే అలా జరుగుతుంది......అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు...." అని చేతులెత్తి నమస్కరించింది శకుంతల.
    అనూరాధ ఒక్కక్షణం తటపటాయించింది. తల్లి ఆవేదన చూసి.
    "రాధా.....ఈ స్నేహితురాలి ఇంట్లోనో, ఆ స్నేహితురాలి దగ్గరో ఉండేకంటే, యేదన్నా ఉద్యోగం దొరికే వరకు పూర్ణ పిన్ని గారి ఇంట్లోనో, తాతగారి దగ్గరో ఉండు.....ఇదిగో ఈ యేభై పట్టుకు వెళ్ళు.....నా మాట మీద యేమన్నా గౌరవం వుంటే, నేను చెప్పినట్లు చెయ్యి."
    రాధ ఒక్క క్షణం ఆలోచించి అంది : "పిన్నింటికి వెడతాను. ఉద్యోగం దొరికే వరకు అక్కడ వుంటాను."
    
                                       *    *    *

 Previous Page Next Page