Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 37


    నిప్పు పొగచేతను, అద్దము దుమ్ముచేతను, గర్భము మాయ చేతను కప్పబడి యుండును అట్లే జ్ఞానము కామముచే కప్పబడి యుండును.
        ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా
        కామరూపేణ కౌంతేయ! దుష్ఫూరేణానలేన చ 39

    కామము అగ్నితో సమానమైనది. అది చల్లారదు. అది జ్ఞానులకు నిత్యవైరి. అది నరుని జ్ఞానమును చుట్టివేయును.
        ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠాన ముచ్చతే
        ఏతైర్విమోహయ త్యేషః జ్ఞాన మావృత్య దేహినమ్ 40

    ఇంద్రియములు కామ, బుద్ధికోర్కెలకు నివాస స్థానములు. ఇవి జ్ఞానమును కప్పివేయును. జీవాత్మను సమ్మోహితునిగా చేయును.
        తస్మాత్త్వ మిద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ!
        పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనమ్ 41

    కావున అర్జునా! మొదట ఇంద్రియములను వశపరచుకొనుము. తదుపరి జ్ఞానమును నశింపజేయునట్టి మహాపాపియైన కామమును, సర్వశక్తులతో రూపుమాపుము.
        ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః
        మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః 42
    
    శరీరము కంటే ఇంద్రియములు శ్రేష్ఠములు. ఇంద్రియముల కంటే మనస్సు దానికంటెను బుద్ధి, బుద్ధికంటెను అత్యంత శ్రేష్ఠమైనది, సూక్ష్మమైనది ఆత్మ అగుచున్నది.
        ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన మాత్మనా
        జహి శత్రుం మమాబాహో! కామరూపం దురాసదమ్ 43

    బుద్ధికంటే ఆత్మ పరమైనది. సూక్ష్మము, బలీయము మిక్కిలి శ్రేష్ఠము. దీనిని తెలుసుకొనుము. బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకొనుము. దుర్జయ శత్రువులైన కోరికలను రూపుమాపుము.

    దీపిక:

    స్వామి సూటిగా, స్పష్టముగా, అందముగా చెప్పుచున్నాడు. రజోగుణము వలననే కామ, క్రోధములు కలుగునన్నాడు. ఇంకను స్పష్టముగా అగ్నిపొగవలె కామము జ్ఞానమును కప్పివేయుచున్నదని చెప్పియున్నాడు.
    కామము లైంగితము మాత్రము కాదు. కోరిక కామము. పసిబిడ్డను ముద్దు పెట్టుకొనవలయును అనుటయు కామమే అగును. కామమునకు ఇంద్రియములు మొదటి కారణము. కన్ను, చెవి, ముక్కు ఇవి మంచి పదార్థములను అనుభవించవలెనను కొనుము. చేతలు పదార్థములను అందుకొనవలయునని అనుకొనును. కాళ్ళు మంచి చోటుకు పోవలయునని అనుకొనును. ఇది అనుకొనుట మాత్రమే. హస్తవముగా అందదు.
    అప్పుడు బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పదార్థములను సక్రముగా సంపాదించవలెనా, అక్రమముగా సంపాదించవలెనా అని ప్రణాళిక సిద్ధము చేయును. మనస్సు సాధారణముగా మంచినే బోధించును కాని దాని స్వభావము దూకుడు. బుద్ధి గెలిచిన పాపము, మనసు గెలిచిన పుణ్యము అగుచున్నవి.
    కోరికలు సామాన్యములు కావు. అవి ప్రత్యక్ష భూతముల వంటివి. ఆశ, కోరికలు లేకుండా మనిషి జీవింపజాలడు. కాని చెడు కోరికలు, లేక దురాశ మనిషి పతనమునకు కారణములు. ఇంద్రియములకు అందునని కోరికలు, అందనివి చెడుకోరికలు. అట్లే అందునది ఆశ, అందనిది దురాశ.
    సామాన్య మానవుడు దురాశలకు పోడు. వున్న దానితో తృప్తి పడును. ఇట్టివారు సమాజములో తొంబది శాతముందురు. ఇంకను కావలయునను వారి శాతము సుమారు 9 సమస్తము తనకే కావలయునని కోరువారు నూటికి ఒక్కరు వుండునో వుండరో తెలియదు.
    గీతలో కోరికలను కట్టివేయుట లేక జయించుట ప్రధానాంశమగుచున్నది. ఈ సందేశము నూటికి పదిమంది అయినా దురాశా పరులకు అందినచో అర్థమైనచో, ఆచరించినచో, సమాజమున శాంతి సౌఖ్యములు వెల్లివిరియును. కాని యీ పదిమంది భగవద్గీత పారాయణము వలన తమ పాపములను దూరము చేయవలయును అనుకొనుచున్నారు. ఇది గీతను సహితము తమ వశమున నుంచుకోవలెనను దుర్మార్గపు కోరిక. ఇది సాధ్యపడునది కాదు. కర్మ అనుభవించక తప్పదు. యజ్ఞయాగాదులు గూడా యిందుకు తోడ్పడవు.
    మానవునికి కర్మ నీడవంటిది. అది వెన్నంటుచునే యుండును. కర్మ అనిన మనము చేయుపని మాత్రమే. మధుమేహము వాడు చక్కెర తినును. అది కర్మ బాధ అనుభవించవలెను. అది ఫలితము.
    ఈ కర్మ జన్మతో వదులునది కాదు. మోక్షము లభించునంత వరకు జన్మజన్మలకు అనుభవించవలసినదే.
    ఇది ఒక చాలా స్పష్టమైన ఉపదేశము.
    శరీరముకంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనసు, దానికంటె బుద్ధి, బుద్ధికంటే ఆత్మ శ్రేష్ఠములు అని చెప్పుచున్నారు. ఇందులో ప్రాణముల గురించి లేదు. ఆత్మయే ప్రాణమగునా?
    కర్మయోగమును మూడవ అధ్యాయము ముగిసినది.

                                          ఓం శాంతిః శాంతిః శాంతిః

 Previous Page Next Page