నాలుగవ అధ్యాయము
జ్ఞాన కర్మ సన్యాస యోగము
దీపిక:
జ్ఞానము తెలియటము వేదము తెలియటము దేనివి తెలియటము? దేనిని తెలియటము! తెలియని దానిని తెలియటము. ఇహలోకంలో శాంతి సుఖ జీవనాలు గడపడం. మరో జన్మలో సద్వంశములో జన్మించడము. సత్యమును తెలియడానికి ప్రయత్నించడము అదే విధముగా మోక్షము వచ్చేదాకా అన్ని జన్మలలోను, సమ్యక్ జీవితాన్ని గడపడము.
ఇది తెలియడము మాత్రమే. ఇది చాలా కొద్దిమందికే తెలుస్తుంది. ఇది మొదటి సోపానము.
తెలిసినదంతా అర్థమైనట్లుగాదు. అర్థము అగుట రెండవ మెట్టు.
తెలిసి అర్థమైనదానిని ఆచరించడము లక్ష్యాన్ని చేరినట్లు,
ఈ మూడింటిలో ఏ ఒక్కదానికి ప్రయత్నించినా అది పూర్వ జన్మ సుకృతము. మరో జన్మలో యీ జన్మ ఫలితము లభిస్తుంది.
శ్రీ భగవానువాచః
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహ మవ్యయమ్
వివస్వాన్ మనవే ప్రాహ మమ రిక్ష్వాకవే -బ్రవీత్ 1
ఇది నిత్య సత్యమైన యోగము. అవ్యయమైన యీ యోగమును నేను సూర్యునకు ఉపదేశించాను. సూర్యుడు మనువునకు ఉపదేశించినాడు. మనువు ఇక్ష్వాకునకు ఉపదేశించినాడు.
ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః
స కాలేనేహ మమతా యోగో నష్టః పరంతప! 2
ఇది పరంపరగా ప్రాప్తించినది. రాజరుషులు దీనిని తెలిసినారు. అర్జునా! కాలక్రమముగా యీ మహా యోగము లుప్తమైనది.
స ఏవాయం మయా తే - ద్య యోగః ప్రోక్తః పురాతనః
భక్తో - సి మే సుఖా చేతి రహస్యం హ్యేత దుత్తమమ్! 3

ఇది పురాతనమైన యోగము. పరంపరాగతమైన యోగము. రహస్యమైన యోగము. నీవు నాకు భక్తుడవు. సఖుడవు. అట్లని పురాతనమైన యోగమున నీకు ఉపదేశించు చున్నాను.
దీపిక:
1. మన జీవితము పరంపరలోనే గడుస్తున్నది నిలుచుట, ఆర్జించుట, అనుభవించుట. ఇవి అన్నియు మనకు తండ్రి తాతల నుండియే వచ్చుచున్నవి.
వివాహము, కుటుంబము, సంతానము ఇవి అన్నియు పరంపరాగతములే. సృష్టి మొదలైన నాటినుండి సంతానము పరంపరగా వస్తున్నది. ఇది భగవానుడు ఏర్పరచిన క్రమము. ఇది సృష్టి ప్రళయము వరకు కొనసాగుతున్నది.
2. స్వామి అర్జునుని భక్తునిగను, సుఖనిగను పేర్కొన్నాడు. అట్లనిన ప్రాణి జాలము సాంతము స్వామికి సఖులే. భక్తులు కావలసియున్నది.
క్షణములో గుడి కట్టించాడు భక్తి ఆవేశముతో ఒకడు. మనసు మాత్రము పాపిష్టిదే. జన్మలో భక్తుడు కాలేకపోయినాడు.
3. రహస్యము - అర్జత కలవానికి తెల్పునది రహస్యము. ఆకలి అయిన వానికి అన్నము పెట్టుట దానము.
అర్జున ఉవాచః
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః
కథమేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి 4
మీ జన్మ యిప్పటిది. సూర్యుడు కల్పాదివాడు. అతనికి మీరు ఉపదేశించుట ఏమి? దానిని నేను నమ్ముట ఎట్లు?
దీపిక:
1. ఇది అర్జునునకు మాత్రము సంబంధించినది కాదు. సర్వమానవులకు సంబంధించినది. స్వామి ఎదుటనే వుంటాడు. అజ్ఞాని గుర్తించలేడు.
2. అర్జునుడు అవసరానికి శిష్యుడు శరణాగతుడు అయినాడు. ఇది నిజమైనా అర్జునుడు కృష్ణుని అడుగరాదు. అడుగుట తప్పు. అడుగుట దోషము. అర్జునుడు యిప్పుడు సామాన్యుడు.
భగవానువాచః
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప 5
నీకును, నాకును అనేక జన్మలు గడచినవి. గడచినా జన్మలు నాకు తెలియును. నీకు తెలియదు.


