చిన్నపిల్లలెవరూ కనబడటం లేదు! ముసలీ ముతకా ఎవరూ లేరు !
మాటవరసకైనా ఒక్క పురుషుడు కూడా కనబడటం లేదు !
పదిమంది అమ్మాయిలు కలిసి వాళ్ళ ముగ్గురినీ వలలో నుంచీ కిందికి దింపారు. వాళ్ళు తప్పించుకు పోకుండా చుట్టూతా గుమిగూడారు మిగతా అమ్మాయిలందరూ. చేతులతో గట్టిగా పట్టేసుకున్నారు.
పెనుగులాగుడు సందీప్. వాళ్ళు చూడడానికి కసుమ కోమలంగా కనబడుతున్నా, చాలా బలిష్టంగా ఉంది వాళ్ళ పట్టు. లతలు కూర్చి పేనిన తాడుతో మదపుటేనుగుని బంధించినట్టు ఉంది ఆ దృశ్యం.
సున్నితమైన దౌర్జన్యంతోనే, వాళ్ళ ముగ్గురినీ తమ నాయకురాలి దగ్గరకు తీసుకెళ్ళారు.
ఒక చెట్టు కింద, పరుపులా అమర్చిన పూలమీద కూర్చుని ఉంది తను. అందరికంటే పొడుగ్గా ఉంది ఆ అమ్మాయి. ఆరడుగులపైనే ఉండవచ్చు. అంత పొడుగు ఉన్నా అదీ అందమే అనిపిస్తోంది గానీ ఎబ్బెట్టుగా కనబడటం లేదు.
ఎవరినీ లక్ష్యపెట్టనట్లు దర్పంగా కూర్చుని ఉంది తను. ఆమె మొహంలో చెప్పలేనంత అందం ఉందిగానీ స్త్రీ సహజమైన కరుణా, దయా మచ్చుకైనా కనబడటం లేదు!
సిసలైన ప్రకృతి కన్యలాగా ఉంది తను. భూమాత తన వంటి రంగే ఆ అమ్మాయికి ప్రసాదించినట్లు ఉంది. చెంపలకి పుప్పొడి అద్ది ఉంది. కలువ రేకులలాంటి కళ్ళు, సంపంగి పువ్వులాంటి నాసిక, తాంబూల సేవనలతో మోదుగ పూరేకులా మారిన పెదవులు, తామర తూడుల లాంటి చేతులు, లేత తమలపాకులలాంటి పాదాలు, వేళ్ళు గోరింటాకుతో పండి నారింజరంగుకి తిరిగి ఉన్నాయి.
కస్తూరి మృగాన్నీ, పునుగుపిల్లినీ పీడించి రాబట్టిన సుగంధ ద్రవ్యాలు వంటికి రాసుకొని ఘుమ ఘుమలాడుతోంది ఆ అమ్మాయి.
ఆమె బుగ్గన మాత్రం అడల్ట్ మే ఫ్లై పచ్చబొట్టు లేదు.
ఆమె రెండు చేతులతో పెద్ద ముత్యపు చిప్పను పట్టుకొని ఉంది. లేత బంగారు రంగు మద్యం ఉంది దానిలో.
చివరి చుక్క మద్యం తాగి, ముత్యపు చిప్పను కిందపెట్టి పెదిమలకు అంటిన నురగను సుతారంగా తుడుచుకుంది యువరాణి. తర్వాత ప్రశ్నార్థకంగా తన అనుచరుల వైపు చూసింది.
"కాల్బాట్ పోత ఉండరో !" అంది ఒకమ్మాయి.
తల పరికించి "కై వద్దులో !" అంది యువరాణి.
అప్పటి వరకూ వాళ్ళని చేతులతోనే బంధించి ఉంచిన అమ్మాయిలు పట్టు సడలించి వాళ్ళని వదిలారు.
"మీర్ యారో ? యాం వజిరో ?"
తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సందీప్. ఏం భాష అయ్యి ఉంటుంది ఇది? చిన్న పిల్లలు ఆటల్లో 'క' భాష మాట్లాడినట్టు వీళ్ళు 'ఓ' భాష మాట్లాడుతున్నట్లు ఉంది. ప్రతీ వాక్యం 'ఓ' తో ముగుస్తోంది.
తనకు తెలిసిన ఫైలాలజీ, ఫోనెటిక్సూ గుర్తుకు తెచ్చుకున్నాడు సందీప్. లీలగా ఏదో స్ఫురిస్తున్నట్లు ఉందిగానీ, అందినట్లే అంది దూరంగా పోతోంది ఆ ఆధారం.
"మీర్ యారో ? యాం వజిరో ??" అంది యువరాణి కఠినంగా. ఆమె చూపులు అసహనంగా స్వప్న మీదికి ప్రసరిస్తున్నాయి మాటిమాటికీ.
అప్పుడు చటుక్కున స్ఫురించింది సందీప్ కి. వాళ్ళు మాట్లాడుతున్నది రూపాంతరం చెందినా తెలుగు, గిరిజన పదాలతో కూడిన భాష!! ఆఫ్రికన్ దేశాల్లో కూడా చాలా చోట్ల అంతే! ఇంగ్లీషువారితో సంపర్కం ఏర్పడిన తర్వాత ఆఫ్రికన్, ఇంగ్లీషు పదాలతో కూడిన 'వుడ్గిన్' భాషలు ఉద్భవించాయి. వీటికి వ్యాకరణం అంతగా ఉండదు.
ఉదాహరణకు ఆస్ట్రేలియా దగ్గర వున్న న్యూగినీలో ఒక స్లోగన్ వుంది. 'యూమీ వాన్ పెలా పీపల్' అంటే 'యూ అండ్ మీ వన్ ఫెల్లో పీపుల్' 'మన మనరం ఒక్కటే' అన్న నినాదం!
అలాంటి పుడ్గిన్ భాషే అయి ఉంటుంది వీళ్ళు మాట్లాడేది. "మీర్ యారో? యాం పజిరో!" అంటే మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? అని అయుండాలి.