Previous Page Next Page 
హ్యూమరాలజీ - 3 పేజి 36

                                 


                     పోలీస్ బిల్ వస్తోంది! పారిపోండి!


                


    మన రాష్ట్రంలో ఫైవ్ డేవీక్ వచ్చిందని మా కాలనీ వాళ్ళందరూ ఎంతో సంతోషించారు గానీ మా సంతోషం ఎంతకాలం నిలువలేదు. వారానికి రెండురోజులు ఖాళీ దొరికేసరికి శాయిరాం మరింత విజృంభించాడు. ప్రతి చిన్న సంఘటనకీ నానా హడావుడీ చేసి కొంపలు మునిగిపోయినట్లు పెద్ద మీటింగ్ ళు పెట్టేస్తున్నాడు.

 

    శుక్రవారం నాడు ఉదయం నేను నిద్రలేస్తూనే మా పక్కింటివాళ్ళ పిల్లి మొఖం చూశాను. పొద్దున్నే పిల్లిని చూస్తే అశుభం అని మా పక్కింటివాళ్ళు దానిని రాత్రే బయటకు తోలేసి తలుపులు వేసేస్తూంటారు. అంచేత అది మిగతా ఇళ్ళల్లో ఎక్కడో పడుకుని పొద్దున్నే కిటికీలోనుంచి దర్శనమిస్తూంటుంది.

 

    "పిల్లి శకునం మంచిదికాదు కదా- ఏం జరుగుతుందో" అని అనుకుంటూ "ఈ క్షణం" పేపర్ తీసుకున్నాను.

 

    ఈలోగా బయట పెద్ద కోలాహలం బయల్దేరింది.

 

    మరి కాసేపటికి మా శ్రీమతి రానేవచ్చేసింది.

 

    "త్వరగా బయటకురండి- సినిమా యాక్టర్లు వచ్చారు.." అందామె నాకేం అర్థం కాలేదు. బయటకొచ్చి చూశాను. అదే సమయానికి రంగారెడ్డి, గోపాల్రావ్, శాయిరామ్, చంద్రకాంత్ అందరూ కళ్ళు నులుముకుంటూ వాళ్ళిళ్ళల్లోంచి బయటకొచ్చారు.

 

    కాలనీ మధ్యలో ఆడాళ్ళూ, పిల్లలూ గుమిగూడిపోయారు. మధ్యలో జనార్ధన్, యాదగిరి నిలబడి ఉన్నారు.

 

    "సినిమా యాక్టర్లంటే వీళ్ళా?" నిరాశగా అన్నాడు చంద్రకాంత్.

 

    అందరం వాళ్ళ దగ్గరకెళ్ళాం.

 

    జనార్ధన్ ఆడాళ్ళకూ పిల్లలకూ సినిమా ఫీల్డు గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పేస్తున్నాడు.

 

    "చిరంజీవి తెలీకపోవటం ఏమిటి? రోజూ నేను చిరంజీవీ కలిసే భోజనం చేసేవాళ్ళం స్టూడియోలో-"

 

    "మరి కృష్ణతో మాట్లాడావా?"

 

    "మాట్లాడ్డమా? వాళ్ళింట్లో రెండు రోజులున్నాను-"

 

    కొంతమంది పిల్లలు సంతోషం పట్టలేక తప్పట్లు కొట్టారు.

 

    "మీ పిక్చర్లో మీ పక్కన హీరోయిన్ ఎవరు?" అడిగింది రాజేశ్వరి.

 

    "విజయశాంతిని బుక్ చేస్తామన్నారుగానీ నేనొప్పుకోలేదు. కొత్తవారికి అవకాశం ఇచ్చాం-"

 

    "ఎవరయినా మంచి యాక్టర్స్ ఉన్నారా మీ పిక్చర్లో?" అడిగింది పార్వతీదేవి.

 

    జనార్ధన్ కి కోపం వచ్చింది.

 

    "అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? మేము మంచి యాక్టర్స్ కాదనా?"

 

    పార్వతీదేవి తడబడింది.

 

    "అబ్బే అలా అని కాదు. పేరున్నవాళ్ళు ఇంకెవరయినా-"

 

    "మా పిక్చర్ రిలీజయాక చూడరాదూ? మా ఇద్దర్లో ఎవరో ఒకళ్ళకు బెస్ట్ యాక్టర్ ఎవార్డొస్తది-" అన్నాడు యాదగిరి.

 

    అప్పుడు మమ్మల్నందర్నీ చూశాడు జనార్ధన్.

 

    "నమస్తే అన్నా!" అన్నాడు విష్ చేస్తూ.

 

    "పిక్చర్ పూర్తయిపోయిందా?" అడిగాన్నేను.

 

    "ఆ అయిపొయింది! వచ్చేవారమే రిలీజ్-" అని నావేపు అనుమానంగా చూశాడతను "సారీ! ఏమీ అనుకోవద్దు- మీ పేరు ఉదయార్కర్ కదూ?"

 

    "నాకు మళ్ళీ మండిపోయింది. రెండు నెలలకే పేర్లు మర్చిపోయినట్లు నటనా?

 

    "ఏం సినిమాల్లో కెళ్ళాక మతిపోయిందా?" శాయిరామ్ వెటకారంగా అడిగాడు.

 

    "అబ్బే మర్చిపోవటం కాదు! జస్ట్ కన్ ఫ్యూజన్ బలరామ్ గారూ-"

 

    "నాపేరు శాయిరామ్! బలరామ్ కాదు-"

 

    "ఓ! అవునవును- వెరీసారీ! వేలమంది అభిమానులుండట వల్ల ఈ జ్ఞాపకశక్తితో మహా ఇబ్బందిగా ఉంది రఘురామరెడ్డిగారూ!"

 

    "పోజులు కొట్టకు! నా పేరు రంగారెడ్డి-" చిరాగ్గా అన్నాడు రంగారెడ్డి.

 

    "ఓ- అయామ్ సారీ! ఆ మధ్య గుమ్మడీ నేనూ కలసి షూటింగ్ కెళ్ళినప్పుడు ఇలాగే.."

 

    ఈలోగా వాళ్ళావిడ వచ్చింది.

 

    "ముందింటికి పదండి! తరువాత తీరిగ్గా చెప్దురుగాని మీ అనుభవాలు-" అంటూ అతగాడి సూట్ కేస్ బాగ్ తీసుకుని వెళ్ళిపోయింది.

 

    దాంతో జనార్ధన్ యాదగిరి అయిష్టంగానే ఇళ్ళల్లోకి వెళ్ళక తప్పలేదు. అయితే వెళ్ళేప్పుడు జనార్ధన్ అచ్చం సినిమా హీరోలాగానే అందరికి చేయి ఊపుతూ వెళ్ళాడు.

 

    "ఇంక మనాడి ఫోజులు భరించలేమనుకుంటాను-" అన్నాడు రంగారెడ్డి.

 

    "వచ్చే శని ఆదివారాల్లో మన కాలనీ తరపున మనవాడికి సన్మానసభ ఏర్పాటు చేద్దాం!" అన్నాడు శాయిరామ్ ఉత్సాహంగా.

 

    నేనూ, గోపాల్రావ్ శాయిరామ్ వంక తీక్షణంగా చూశాం.

 

    ఆ వారం రోజులూ జనార్ధన్ మా కాలనీలో అందరికీ 'సినిమా' అంటే విరక్తి కలిగేంతగా బోర్ కొట్టి వదిలేశాడు.

 

    గురువారం ఉదయం జనార్ధన్, యాదగిరి, శాయిరామ్ మా ఇంటికొచ్చేశారు హడావుడిగా.

 

    "గురూ! మా పిక్చర్ రేపు విజయవాడలో రిలీజవుతోంది! మనందరం వెళ్ళి సినిమా చూసివద్దాం!" అన్నాడు జనార్ధన్.

 

    "విజయవాడకు వెళ్ళాలా?" ఆశ్చర్యంగా అడిగాను.

 

    "అవును!"

 

    "అక్కడి కెళ్ళడం ఎందుకు? ఇక్కడే చూడవచ్చుకదా?"

 

    "ప్రస్తుతానికి ఇక్కడ రిలీజవటం లేదు-"

 

    "ఎందుకని?"

 

    "ఈ ఏరియాలో ఎవరూ కొనటం లేదు. అంచేత ముందు విజయవాడ ఒక్క ఊళ్ళోనే రిలీజ్ చేస్తున్నారు. అదికూడా మార్నింగ్ షోస్ మాత్రమే. అంచేత మనం ఇవాళ సాయంత్రమే బయల్దేరి వెళ్దాం! ప్లీజ్! మా ప్రొడ్యూసర్ కూడా ఫామిలీతో బయల్దేరుతున్నాడు. ఒక బస్ బుక్ చేశాం. మనందరికోసం."

 Previous Page Next Page