కాలం తీసుకొచ్చిన ఈ మార్పుకి సుందరబాబు ఎంత కుంగిపోతే అతని తల్లి అంత సంతోషించేది. నాటకాల పిచ్చివల్లే తన కొడుకు పెళ్ళిచేసుకోవడానికి ఇష్టపడడం లేదని ఆమె అనుమానం. నాటకాలపిచ్చి జనానికి తగ్గడంతో ఆటోమేటిక్ గా సుందరబాబుకి పని బాగా తగ్గింది. ఎప్పుడో ఏ పది, పదిహేను రోజులకో అతను ఒక్కడే హార్మోనియంను ముందేసుకుని నాలుగు పద్యాలు పాడుకుని లేచేవాడు. ముందులా జనం మూగడంలేదు.
సరిగ్గా అలాంటి సమయంలో అతనికి మునగలపాళెం సంబంధం వచ్చింది.
అమ్మాయి ఒక్కత్తే. ఆమె తల్లిదండ్రులు స్వంత ఇల్లుతో సహా ఎదో కొంత భూమీ పుట్రా, అంతో ఇంతో నగా నట్రా వుండేవాళ్ళు. ఈ సంబంధం రావడంతోనే సుందరబాబు తల్లి ఎగిరి గంతేసింది. ఈ సంబంధమైనా కుదిరి కొడుకు ఒక ఇంటివాడైతే తిరుమల కొండకు నడిచి వస్తానని మొక్కుకుంది.
అమ్మాయి తల్లిదండ్రులు ముందే సుందరబాబు గుణగణాలు విని వుండడంవల్ల ఎదో పద్ధతిని పాటిస్తున్నట్టు ముందు వచ్చి సుందరబాబుని చూసి వెళ్ళారు. మరో వారానికి ఉత్తరం రాశారు పిల్లను చూడడానికి రమ్మని.
సుందరబాబు, అతని మిత్రుడు రాజేశం గౌడ్, అతని తల్లి మునగలపాళెం వెళ్ళారు.
తన కొడుకుకు పిల్ల నచ్చుతుందో లేదోనన్న ఆరాటం కొద్దీ బస్సు దిగగానే సుందరబాబు తల్లి పిల్ల ఇంటికి పరుగులాంటి నడకతో చేరింది. పిల్లను చూడగానే దేవుడు తన పక్క వున్నాడనుకుంది.
అమ్మాయి కుందనపు బొమ్మలా వుంది. మంచి పొడవుతో, ఆరోగ్యంగా, అందంగా వుంది. ఇప్పటి నాగరికతను అనుసరించి అలంకరించుకున్నా అందానికి మించిన హుందాతనం వుంది.
సుందరబాబు, రాజేశం గౌడ్ రాగానే సకల మర్యాదలు చేశారు పిల్ల తల్లిదండ్రులు.
వీరు వెళ్ళిన గంటకు అమ్మాయిని చూపించారు. ఆమెను చూడగానే సుందరబాబుకు గుండె లయ తప్పింది.
పెద్ద కళ్ళు- ఆ కళ్ళలలో అందమైన భావనలూ, పొడవాటి కురులు- వంకీలు పోయి చీకటి తరంగాల్లా వుండడం, విల్లులా వంగిన ముక్కు సంపంగి పూవులా అనిపించడం, ఎర్రటి పెదవులు - వాటిలో మూర్చనలు పోయిన కోరికలూ- ఇవన్నీ కనిపించాయి సుందరబాబుకు ఆమెలో.
ఏ పెళ్లి సంబంధంలోనూ అంత ఉద్వేగపడని అతను ఎదో వత్తిడికి లొంగిపోతున్నట్టు అనిపించగానే పిల్ల నచ్చిందని రూఢీగా తెలిసిపోయింది అతని తల్లి అనసూయమ్మకు.
ఆ తంతు ముగిశాక ముగ్గురూ వూరికి బయల్దేరారు.
పెళ్ళివారిల్లు దాటగానే "ఏం నాయనా! పిల్ల నచ్చిందా?" అని అడిగింది ఆమె కొడుకును.
"అమ్మాయి చాలా బావుంది. అదే నాకు కావల్సింది. నేను ఒప్పుకుంటున్నాను. కట్నం తీసుకోవడం నాకిష్టంలేదని నీకు తెలుసు. అందుకే అవేమీ అడగవద్దు. పెళ్ళి చేసివ్వమను చాలు, అదీ వాళ్ళకు వెసులు బాటుంటే. కానీ ఒక్క విషయం, ఆ అమ్మాయికి నేను నచ్చానో లేదో కనుక్కో" అన్నాడు సుందరబాబు.
ఆమె వుబ్బి తబ్బిబ్బయిపోయింది.
"ఆ మాట నువ్వంటే చాలు. మిగిలిన విషయాలు నాకు వదిలెయ్. నేను ఇప్పుడే వెళ్ళి, అన్ని విషయాలూ మాట్లాడుకుని వస్తాను. మీరెళ్ళండి వూరు. నేను ఈ రోజు ఆగి రేపు వస్తాను" అని ఆమె అక్కడే నిలబడిపోయింది.
తల్లి తొందరను చూసి సుందరబాబు ముసిముసిగా నవ్వుకుని "సరే నీ ఇష్టం" అన్నాడు.
మిత్రులిద్దరూ బస్టాండ్ చేరుకున్నారు.
సుందరబాబుకి ఇంతకాలానికి పిల్ల నచ్చడం రాజేశానికి ఆనందంగా వుంది.
"రేయ్, ఎట్టకేలకు నీకు పెళ్ళి కూతురు నచ్చిందిరా. నువ్వు ఎవరినీ ఇష్టపడకపోతే ఈ జన్మకు పెళ్లికాదని అందర్లాగే నేనూ అనుకున్నాను. అలాంటిది ఈ అమ్మాయిని నువ్వు ఇష్టపడడం చాలా ఆనందంగా వుందిరా" అన్నాడు రాజేశం.
"అవును నాకూ సంతోషంగా వుంది అమ్మ కోరికను తీర్చుతున్నానని. నాకు పెళ్ళిమీద కొన్ని అభిప్రాయాలు వున్నాయి. మన కోసం తప్ప కడకు తల్లిదండ్రుల కొసమైనా ఇష్టంలేని పెళ్ళి చేసుకోకూడదు. పెళ్ళి అంటే రెండు హృదయాలను కట్టిపడేసే తంతుకావాలి. అంతే తప్ప అది ఇద్దరికీ గాలి ఆడని ఇరుకు గది కాకూడదు. నాకు నిజంగా పెళ్ళి అంటే ఇష్టం. నన్ను ప్రేమించి, నన్నే సర్వస్వం అనుకునే ఓ అమ్మాయి వుండడం ఎంత థ్రిల్లింగ్ గా వుంటుందో. ఆ అమ్మాయి నన్ను ప్రేమించినట్టే నేనూ ప్రేమించగలగాలి. అందుకే నాకు ఇష్టమయ్యే అమ్మాయి కోసం ఇంతకాలం ఆగాను. పెళ్ళికి ముందు నేను ఎంత పవిత్రంగా వున్నానో, పెళ్ళయ్యాక కూడా అంతే. ఆ అమ్మాయిని ఏ విధంగానూ మోసం చేయకూడదనేది నా అభిప్రాయం. ఏ విషయంలోనైనా సరే. నేను ఈ అభిప్రాయం మీదే వుండాలంటే బేసిక్ గా అమ్మాయి నాకు నచ్చాలి" అన్నాడు సుందరబాబు. అతని గొంతులో భావోద్వేగపు వణుకు వుండడం రాజేశం గమనించాడు.
తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుని, ఆ అమ్మాయితోనే జీవితాన్ని ముడివేసుకోవాలంటున్న సుందరబాబును చూసి రాజేశం మెచ్చుకోలుగా నవ్వాడు.
ఇద్దరూ బస్సెక్కి వూరికి వచ్చారు.
మరుసటి రోజు వుదయానికల్లా సుందరబాబు తల్లి దిగింది.
ఆమె ముఖం వెలిగిపోతూ వుంది.
పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు నచ్చాడు. అంతకు ముందే సుందరబాబు గుణగణాలను విని వుండడం వల్ల ఆడపిల్ల వారికి ఏమీ అభ్యంతరం లేకపోయింది.
ఒక్కడే కొడుకు, అందునా ఎలాంటి దురదలవాట్లులేని సద్గుణుడు, భూమీ పుట్రా వున్నవాడు-కోరి చేసుకుంటానంటే కాదనలేకపోయారు. పైపెచ్చు ఎంతో ఆనందించారు. ఆ రాత్రే అన్ని విషయాలూ మాట్లాడేశారు. పెళ్ళి మాఘమాసంలో చేస్తానన్నారు మాఘమాసం మరో నెల వుంది.
సుందరబాబు తల్లి తన కొడుకు చెవిలో ఆ శుభవార్త వేసింది. వూర్లోని ఇంటింటికీ వెళ్ళి తన కొడుక్కి పెళ్ళి కుదిరిందని చెప్పింది. ఆ రోజు నుంచే పెళ్ళి ఏర్పాట్లు ప్రారంభించింది.
ఆ శుభ ఘడియా రానే వచ్చింది. పెళ్ళి పందిట్లో పెళ్ళికూతురిని చూసి అందరూ తెగ మెచ్చుకున్నారు. సుందరబాబుకు తగినట్టుంది. మంచి పొడవుతో అందంగా వున్న పెళ్ళికూతుర్ని చూసి ఇంతకాలం ఇలాంటి అప్సరస కోసం కాబోలు సుందరబాబు పెళ్ళి చేసుకోంది అనుకున్నారు.
ఇక అతని తల్లి ఆనందం చెప్పనలవి కాదు. పెళ్ళిపందిరంతా తనే అన్నట్టు తిరిగింది. కొడుకుని, కోడల్ని చూసి మురిసిపోయింది. జంట చూడముచ్చటగా వుంది అని ఎవరైనా అంటే ఆమె కళ్ళనుంచి ఆనందబాష్పాలు రాలాయి.