అంత చక్కటి హాస్యప్రియుడు కొన్ని సంవత్సరాల తరువాత మౌనంగా పశ్చాత్తాపంతో కుమిలిపోతాడని ఎవరూ ఊహించలేదు. అందుకే విధి బలీయమైంది అని పెద్దలనేది.
ఇంతమంది ఇంతగా అభిమానించే సుందరబాబును ద్వేషించేది ఒక్క జీవే. ఆ జీవి అతని కన్నతల్లి.
సుందరబాబు తన ఇంట్లో అంతమందిని చేరదీస్తున్నాడని గానీ, డ్రామాల పిచ్చిలో పడి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడనిగానీ ఆమె ద్వేషించడంలేదు. నిజానికి అది ద్వేషించడం కూడా కాదు- బాధ! ఆ బాధ కూడా అతను ఇంకా పెళ్ళి చేసుకోలేదనే.
ముప్పై ఏళ్ళు వచ్చినా తన కొడుకు పెళ్ళి చేసుకోలేదన్నదే ఆమె చింత. సుందరబాబు ఒక్కడే ఆమెకు సంతానం. ఆమె భర్త చనిపోయి అప్పటికే పదిహేనేళ్లయింది.
కొడుక్కి ఇరవయ్యోఏడు అడుగు పెట్టగానే సంబంధాలు వెదకడం మొదలెట్టింది. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి పెళ్ళి చేసెయ్యాలన్నదే ఆరాటం. వాడి కడుపున ఒక్క నలుసుగాస్తే, ఆ మనవడ్ని ముద్దులాడుకుంటూ, కొడుక్కి కష్టం తెలియకుండా తనే కష్టపడి వ్యవసాయం చేసి ఇంటిని అభివృద్ధి చేయాలన్నది ఆమె కోరిక. అయితే ఆ కోరిక గత పది సంవత్సరాల నుంచి తీరలేదు.
ఏ పిల్లను చూపించినా ఏదో వంక చెప్పేవాడు సుందరబాబు. అదీ నిజమే. అతను ఆరడుగుల అందగాడు. పొడవుకు తగ్గ లావుతో ఆరోగ్యంగా వుండేవాడు. పెద్ద పెద్ద కళ్లు, కొనదేలిన ముక్కూ, ఎర్రటి పెదవులు, విశాలమైన నుదురుతో చాలా అందంగా వుండేవాడు. అందుకే అతను ఎప్పుడైనా కృష్ణుడు, రాముడు పాత్రలు వేస్తున్నాడంటే ఆ నాటకానికి జనం తండోప తండాలుగా వచ్చేవాళ్లు. తన కొడుక్కి తగ్గ భార్య దొరుకుతుందో, దొరకదో అనే అనుమానం కూడా వుంది ఆమెకు. వాళ్ళ కులం వాళ్లు చాలా తక్కువ మందుంతారు. అంత తక్కువ జనాభాలో తన కొడుక్కి ఈడూ జోడూ కుదిరే అమ్మాయి దొరకడం కష్టమని ఆమెకు తెలుసు. సుందరబాబుకు వయసు పెరిగే కొద్దీ ఎవరో ఒకర్ని కట్టబెట్టాయ్యాలన్న ఆరాటం కూడా ఎక్కువైంది ఆమెకు.
అయినా సుందరబాబు ఏ పిల్లనూ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. పిల్ల నల్లగా వుందనో, పొడవు తక్కువనో, సన్నగా వుందనో, శుభ్రంగా లేదనో, స్టయిల్ గా కనిపించలేదనో అమ్మతో చెప్పేవాడు.
"నీకు పగలు పుట్టిన పిల్లా వచ్చేట్టులేదు. రాత్రి పుట్టిన పిల్లా వచ్చేట్టు లేదు. మరిక ఏ పిల్లను నీకు కట్టబెట్టను?" అని విసుక్కునేది.
సుందరబాబు అలాంటి సమయంలో నవ్వి వూరుకునేవాడు. ఇలా ముప్పై ఏళ్ళు వచ్చాయి సుందరబాబుకు. అతని తల్లి కూడా పెళ్ళి సంబంధాలు చూసి, చూసీ విసిగిపోయింది. 'ఎప్పుడైతే అప్పుడే అవుతుంది పెళ్ళి' అని వూరకుండిపోయింది. కానీ ఇంతమందిని చూపించినా ఏ ఒక్కర్నీ అతను ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటో ఆమెకు బోధపడలేదు.
పోనీ సుందరబాబుకు చెడు తిరుగుళ్ళు వుండి, పెళ్ళి గురించి పట్టించుకోవడం లేదు అని అనడానికి లేదు. అతనా విషయంలో నిప్పు అని అందరికీ తెలుసు. గొప్ప అందగాడు, మంచి కళాకారుడైన అతడంటే పడి చచ్చే ఆడవాళ్ళు చాలా మందే వుండేవారు. ఎవర్నీ దగ్గరకు చేరనిచ్చేవాడు కాదు. పెళ్ళయిన స్త్రీలు కూడా అతనితో స్నేహం చేయాలని వుబలాటపడి విఫలమయ్యారు. నాయుడు పేట నిర్మలయితే సహజ సిద్ధమైన సిగ్గు కూడా విడిచి అతని పొందుకోసం ఎంతో ప్రయత్నించింది. తనే వుత్తరాలు రాసింది, తోటి కళాకారులతో రాయబారం పంపింది. దగ్గరపడి ఏడ్చింది. ఎంత చేసినా సుందరబాబు లొంగలేదు. కొంతకాలం తను వేషాలు వేయడానికి రానని బెట్టుచేసింది నిర్మల. అయినా సుందరబాబు తన హద్దును దాటలేదు. ఇక లాభంలేదని ఆమె అతనికోసం ప్రాకులాడడం మానేసింది.
అలాంటి సుందరబాబు పెళ్ళెందుకు చేసుకోలేదో చాలామందికి తెలీదు.
ఎవరైనా సన్నిహితంగా వుండేవాళ్ళు ఆ ప్రశ్న అడిగితే "నన్ను కదిలించే ఆడపిల్ల తగిలినప్పుడు చిటికెలో పెళ్ళి చేసుకుంటాను. ప్రేమ వేరు, సెక్స్ వేరు, పెళ్ళి వేరు అనుకోను నేను. అవన్నీ ఒకటే. 'ఒక ఆడపిల్లకు ఒక మగవాడు' అన్న ఆదర్శాన్ని నమ్ముతాను. నమ్మడమే కాదు జీవితంలో ఖచ్చితంగా పాటిస్తాను. అలా అని నాకు పెళ్ళికి ముందే ఆ అమ్మాయిని ప్రేమించాలన్న ధ్యాసలేదు. అమ్మ చూసిన పిల్లయినా నాకు నచ్చితే, జీవితాంతం నన్ను కట్టి పడేసే ఆకర్షణ ఆ అమ్మాయితో వుందని అనిపిస్తే చాలు పెళ్ళి చేసుకుంటాను" అని చెప్పేవాడు సుందరబాబు.
కానీ అతని వుద్దేశ్యం తెలియని అతని తల్లి మాత్రం పెళ్ళి చేసుకొమ్మని యాగీ చేసేది. ఇంటికెళ్ళిన ప్రతివాడికీ కొడుకు పెళ్ళి చేసుకోవడంలేదని చెప్పి మీరైనా వాడికి నచ్చజెప్పి, పెళ్ళి చేసుకునేట్టు చేయండని ప్రార్థించేది.
ఇలా వుండగా నాటకాల ప్రాభవం తగ్గిపోవడం ప్రారంభించింది. పల్లెటూళ్ళకు పట్టణాల వాసన సోకడంతో నాటకాలకు ఆదరణ తగ్గడం ప్రారంభమైంది. అంతకు ముందు సంవత్సరానికి నాలుగు నాటకాలు వేయించే సుందరబాబు అప్పటికి రెండు నాటకాలు ఆడించే స్థితికి వచ్చాడు. నాటకమంటే ఎగిరిగంతేసేవారు నాటకం అనగానే పెదవి విరచడం మొదలెట్టారు. ఒకప్పుడు పాత్రలకంటే ఔత్సాహిక నటులు ఎక్కువైపోయి ఎవరిని డ్రాప్ చేయాలో తెలియక గింజుకునే సుందరబాబు ఇప్పుడు మొదటి కృష్ణుడు ఇస్తామన్నా ముఖానికి రంగు పూసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.
10
ఆ వూర్లోనే కాదు, పక్కనున్న పల్లెటూళ్ళలో కూడా ఇదే పరిస్థితి. అంతకు ముందయితే నాటకం ప్రారంభమైనప్పటి నుంచి పండుగలా వుండేది. రోజూ రిహార్సల్స్ తో వూరు హోరెత్తిపోయేది. ఇక నాటకం ప్రదర్శించే రోజు తిరునాళ్ళలా వుండేది. నాయుడు పేట నిర్మల, మరో ఇద్దరు నటీమణులు వచ్చి సుందరబాబు ఇంట్లో బస చేసేవాళ్ళు.
వాళ్లను చూడడానికి జనం విరగబడేవారు. సాయంకాలానికల్లా వూరికి పెళ్ళి కళ వచ్చేది. స్టేజ్ డెకరేషన్స్, కర్టెన్ కట్టడం, టికెట్ల అమ్మకం, రిహార్సల్స్, మేకప్ సామాగ్రిని అమర్చుకోవడం- వీటన్నిటినీ పర్యవేక్షించే వాళ్లతో, పరిశీలించే వాళ్ళతో గందరగోలంగా వుండేది. ఇక మైక్ సెట్ వచ్చి, పాటలు పెట్టడం ప్రారంభమైతే పిల్లలంతా లౌడ్ స్పీకర్ల ముందు చేరి గెంతేవాళ్లు.
చీకట్లు పడే కొద్దీ టికెట్ల అమ్మకం జోరుగా సాగేది. పక్క వూర్లలోంచి వచ్చినవాళ్లు, వేషం కట్టే వ్యక్తి ఇంటికి వచ్చిన బంధువులతో వూరు గగ్గోలెత్తేది.
సుందరబాబు అయితే ఆ రోజు ఎంతో బిజీగా వుండేవాడు. ఒక పక్క తోటి కళాకారులు, మరోపక్క సాంకేతిక నిపుణులు, మరోపక్క చివరి రిహార్సల్స్- ఇలా సుడిగాలిలా తిరుగుతూ అన్నీ చూసుకునేవాడు.
ఇప్పుడు ఆ హడావుడంతా తగ్గింది. నాటకం వేసే రోజున ఏ సందడి వుండేది కాదు. ఏదో మొక్కుబడిగా ఇంకా పాత వాసన పోని వాళ్ళు, రంగు పిచ్చోళ్ళు- అదీ టికెట్టు కొనకుండా నాటకం ప్రారంభమయ్యేక టెంట్ లో దొంగతనంగా దూరేవాళ్ళు.