Previous Page Next Page 
చెక్ పేజి 38


    పెళ్లి జరిగిపోయింది.

 

    పెళ్ళికూతురింట్లో మూడు రాత్రులు గడిపాక చెల్లూరు కొచ్చారు కొత్త దంపతులు.

 

    పెళ్ళికాగానే సుందరంబాబు దినచర్యలో మార్పొచ్చింది. నాటకాలు పెద్దగా లేకపోవడం వల్ల వ్యవసాయం చూసుకోవడం ప్రారంభించాడు.

 

    ఉదయం లేవగానే పొలానికి వెళ్ళేవాడు. అక్కడంతా తిరిగి, పనివాళ్ళకు పని పురమాయించి, పదిగంటలకు ఇంటికి వచ్చేవాడు. అప్పుడు భోజనం చేసి, విశ్రాంతి తీసుకొనేవాడు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకల్లా పడక నుంచి లేచి, పొలానికి వెళ్ళేవాడు. అప్పుడెళితే కూలివాళ్ళు పని ముగించాక తిరిగి ఇంటికి వచ్చేవాడు. రాత్రిళ్లు కొంతసేపు పండరి భజన దగ్గరవుండేవాడు.

 

    అప్పుడప్పుడు పాత గాయకులంతా అతనింటి దగ్గరచేరి పద్యాలు పాడుతూ గడిపేవాళ్ళు. సుందరబాబు భార్య ప్రసూన అప్పటికే చాలా మంచిపిల్ల అని పేరు పడ్డది.

 

    సుందరబాబు, ప్రసూన చాలా అన్యోన్యంగా వుండేవాళ్ళు. ఇద్దరూ ఎప్పుడూ ప్రేమగా, స్నేహంగా వుండేవారు.

 

    పగలు ఎవరి పనులలో వాళ్లున్నా సాయంకాలం నుంచి రాత్రి పడుకునేవరకు వాళ్ళిద్దరూ గూటిలో చేరి,సరసాలు పోయే పావురాళ్ళలా వుండేవాళ్ళు.

 

    సాయంకాలం సుందరబాబు పొలం నుంచి రాగానే ఇద్దరూ శుభ్రంగా తయారై అలా షికారు వెళ్ళేవారు. ఊరి నుంచి ఏరు కిలోమీటరు దూరం వుండేది. అంతవరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కాసేపు గడిపి ఇంటికొచ్చేవాళ్లు.

 

    వారానికోమారు తప్పకుండా సినిమా కెళ్ళేవారు. రేణిగుంటలో అప్పుడే ఓ థియేటర్ కట్టారు. అందులో సినిమా చూసి, చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి, బస్సెక్కి ఇంటికొచ్చేవాళ్ళు.

 

    ఇక రాత్రి ఇద్దరూ డాబా మీదకు వెళ్ళేవారు. అక్కడే వాళ్ళపడక, బోదతో చిన్న గదిలాంటిది వేసుకున్నారు. హార్మోనియం అక్కడే వుండేది.

 

    ఆయన పద్యం ఆలపిస్తుంటే ఆమె మాధుర్యపు సుడిగుండంలో తను చిక్కుకుపోయినట్టు అనుభూతించేది. పద్యం అయిపోయాక మెచ్చుకోలుగా అతనిని గట్టిగా పట్టుకుని చుంబించేది. ప్రసూనకు అందంతో పాటు, కళా హృదయం కూడా వుండడంతో ఆమెను పువ్వుల్లో పెట్టి పూజించసాగాడు సుందరబాబు.

 

    ఎప్పుడూ సరదాగా, స్నేహంగా, ప్రేమగా వున్న ఆ జంటను చూసి అందరూ ఆనందించారే తప్ప ఈర్ష్యపడలేదు. బయట వ్యక్తుల దగ్గర వాళ్ళిద్దరూ ఎంతో గౌరవంగా, హుందాగా మసలుకునేవారు. దీంతో వాళ్ళిద్దర్నీ అందరూ పొగిడేవాళ్ళు.

 

    సుందరబాబు తల్లి అనసూయమ్మలాంటి అదృష్టవంతురాలు ప్రపంచంలో లేదని అందరూ అనుకునేవారు. ఆమె కూడా పెళ్ళయి కోడలు ఇంటి కొచ్చిన రెండోరోజునే తను చాలా అదృష్టవంతురాలనుకుంది.

 

    నాటకాల్లోపడి చెడిపోతాడనుకున్న కొడుకు శుభ్రంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన పాదాన్ని కింద మోపనివ్వకుండా కోడలే ఇంటి పనంతా చేసుకుంటూ వుంది. పై పెచ్చు స్వంత కూతురిలా తన ఆలనా, పాలనా చూసుకుంటూ వుంది.

 

    మనవడో, మనవరాలో పుడితే తన బ్రతుక్కి అదే చాలు అని తన ఇంటికొచ్చిన ఆడవాళ్లతో చెప్పుకునేది ఆమె.

 

    సంవత్సరం రోజులు ఇట్టే గడిచిపోయాయి.

 

    తన కోడలి కడుపున అంత కాయ కాస్తే చూసి తరించాలనుకుంటున్న అనసూయమ్మ కోరిక మాత్రం తీరలేదు.

 

    ఈ మధ్య ఆవేదన ఎక్కువైపోయింది ఆమెకు.

 

    వీధిన పోయే కోయవాళ్ళను పిలిచి, తన కోడల్ని కూర్చోపెట్టి, సంతానం ఎప్పుడు కలుగుతుందో చెప్పమనేది. అప్పుడప్పుడు జాతకాలు కూడా చూపించడం ప్రారంభించింది.

 

    ప్రసూన చేయి చూసిన వాళ్లంతా సంతాన రేఖ జెర్రిపోతులా వుందని చెప్పేవాళ్ళే. దీంతో సంతృప్తి పడ్డా, ఆ ఘడియకోసం ఎదురు చూడసాగింది అనసూయమ్మ.

 

    మరో ఏడు గడిచింది. అనసూయమ్మ వేదన ఎక్కువైంది. తన కోడలికి నెల తప్పకపోవడం ఆమెను కుంగదీస్తూ వుంది. మెల్లగా పుడతారని ఎంత సరిపెట్టుకున్నా ఏదో బాధ ఆమె మనసులోంచి పోలేదు.

 

    దీంతో అనసూయమ్మ ఎక్కడెక్కడో తిరిగి స్వాములను ఇంటికి తీసుకొచ్చి, శాంతి పూజలు చేయించసాగింది.

 

    ప్రసూనకు వీటి మీద నమ్మకం లేకపోయినా అత్తగారికి అడ్డు చెప్పలేక వూరకుండిపోయింది. సుందరబాబు అప్పుడప్పుడూ తల్లిని మందలించినా, ఆమె తాపత్రయాన్ని అర్థం చేసుకుని కేకలు వేయడం మానేశాడు.

 

    మరో సంవత్సరం కూడా వెళ్లిపోయింది. దీంతో అనసూయమ్మ డీలా పడిపోయింది. అయినా పట్టువదలకుండా కోడల్ని ఎక్కడెక్కడో తిప్పింది. పుట్టపర్తికి తీసుకెళ్ళింది. సత్యసాయిబాబా ఆశీర్వాదం పొందింది. కోడల్ని ఆయన కాళ్ళ దగ్గర పడవేసింది. శ్రీకాళహస్తికి పిలుచుకుపోయింది. 'నా కొడుక్కి ఒక బిడ్డను ఇవ్వు తండ్రీ' అని చేతులెత్తి మొక్కింది శ్రీశైలం, అన్నవరం, మధురై, కంచి, రామేశ్వరం అన్నీ కోడల్ని వెంటబెట్టుకుని తిరిగి వచ్చింది.

 

    కనపడిన వాళ్ళు ఏది చెబితే అన్నీ చేసింది. తన కోడలి చేత చేయించింది. అయినా ఫలితం లేకపోయింది.

 

    వివాహమై అయిదు సంవత్సరాలైపోయాయి. సుందరబాబు నాటకాల జోలికి వెళ్ళడంలేదు. ఊర్లోనే చిన్న, చిన్న కాంట్రాక్ట్ పనులు ప్రారంభించాడు. మంచి లాభాలే వస్తున్నాయి. చెరువు రిపేరు, రోడ్లు వేయడం, బావులు తవ్వించడంలాంటి కాంట్రాక్ట్ పనులతో పాటు వ్యవసాయమూ బాగా కలిసొస్తోంది. సుందరబాబు ఆర్థికంగా బాగా పుంజుకుంటున్నాడు.

 

    వివాహం జరిగి అన్నేళ్ళయినా సుందరబాబు, ప్రసూన మొదట ఎలా వున్నారో ఇప్పటికీ అలానే వున్నారు. సుందరబాబు కాంట్రాక్టర్ అయిపోవడంతో ముందులా భార్యతో గడపడానికి టైమ లేకున్నా, తీరిక దొరికిన సమయాల్లో మాత్రం భార్యకు అతుక్కుపోయేవాడు.

 

    సమితి స్థాయిలో కాంట్రాక్టర్ గా సుందరబాబు ఎదిగిపోవడంతో తీరిక దొరికినప్పుడు భార్యా భర్త ఇద్దరూ తిరుపతికి వస్తున్నారు.

 

    తిరుపతిలో లాడ్జి తీసుకుని, హోటల్లో భోజనం ముగించి, ఒకటి రెండు సినిమాలు చూసి ఇంటికొచ్చేవారు.

 

    అనసూయమ్మ మాత్రం బాగా తగ్గిపోయింది. తన కొడుక్కి పిల్లలు పుట్టలేదనే చింత ఆమెను కుంగదీస్తోంది. ఇంట్లోంచి బయటకు రావడం మానేసింది. ఎప్పుడూ పూజ గదిలోనే రకరకాలు పూజలు చేస్తూ వుంది. అన్ని పూజలూ ఒక్క కోరిక కోసమే తన కోడలు కడుపు పండాలని.

 

    సరిగ్గా అదే సమయంలో ఆ వూరికి వచ్చాడు అవధూత స్వామీజీ. స్వామీజీ అంటే ఏ అరవయ్యేళ్ళ ముసలివాడో కాదు. ముప్పై అయిదేళ్ళు దాటవు. పొట్టిగా వున్నా చక్కటి శరీరచ్ఛాయతో దొండ పండులా వుండేవాడు.

 

    ఆయన వచ్చాడని తెలియగానే అనసూయమ్మ పరుగున వెళ్లి ఆయన కాళ్ళమీద పడింది. తనకు వచ్చిన బాధనంతా చెప్పుకుంది. తన కొడుకుని సంతానవంతుడ్ని చేసి, తన వంశ వృక్షాన్ని నిలబెట్టమంది. ఆయన ఆమె చెప్పినదంతా మౌనంగా విని అలాగేనని తల ఆడించాడు.

 Previous Page Next Page