Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 37


    "వొద్దు సుభద్రా! ఇక్కడ వుంటే నిన్ను ఎవరు చూస్తారు చెప్పు? మనకి మరో ఆడదిక్కు లేదు. నామాట విని అక్కడకు వెళ్ళు. నేను ఇంతకంటే ఇంక నాశనం కాను."

 

    "తిరిగి..." అందామె రుద్ధకంఠంతో.

 

    "నీవు డెలివరీ అవగానే వైర్ యిప్పించు. పరిగెత్తుకుంటూ వస్తాను. మనకి మరో బాబు కలిగితే వాడిని చూసుకొని నేను..." అతని కంఠం తడబడింది. "ప్రమాణం చేస్తున్నాను సుభద్రా! అప్పుడు నేను మామూలు మనిషిని అవుతానని నమ్మకముంది."

 

    బరువయిన మనస్సుతో, శుష్కించిన ఆశతో పుట్టింటికి బయలుదేరింది ఆమె.


                                           11


    అదేరోజు ఉదయం మద్రాసునుంచి కలకత్తా పోయే మెయిలులో ఓ ఫస్టుక్లాస్ కంపార్టుమెంటులో ఓ యువకుడు, అతనికి ఎదురుగా పసిడినిగ్గులా లేలేత వయసులో వున్న ఓ యువతి, ఆమె ప్రక్కన బలహీనంగా కనబడుతున్న ఓ నడివయసు దాటిన స్త్రీ ప్రయాణం చేస్తున్నారు.

 

    ఆ యువకుడికి ఇరవైఏడు, ఇరవయ్యెనిమది సంవత్సరాలుంటాయ్. బలంగా, అందంగా, ఆరోగ్యంగా వున్నాడు. అతనే రామం. అతని కోసమే కాకినాడలో తలిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ట్రైన్ బాగా లేటయింది. అందుకని ఆలస్యంగా చేరుకుంటోంది.

 

    ఆ యువతి పేరు వసంతబాల. లేత యవ్వనంలో, సహజమయిన శరీరపు సొబగులతో, మత్తెక్కించే అందచందాలతో మెరిసిపోతోంది. ఆమె ప్రయాణపు బడలికకు కొద్దిగా వదిలినా, ఆమె ముఖం మరింత ఆకర్షణీయంగా కనబడుతోంది. అన్నిటికంటే కొట్టిచ్చినట్లు కనబడే ఆమెలోని అమాయకత్వం చూపరులను ముగ్థులను చేసేదిగా వుంది.

 

    ఆమెప్రక్కన బాలీసుకి ఆనుకుని నీరసంగా వెనక్కి జారగిలబడి వున్న స్త్రీ ఆమె తల్లి. ఆమెకి నలభయి అయిదేళ్ళు దాటివుంటాయి. దీర్ఘవ్యాధిచేత తీసుకుంటున్నట్లు ఆమెముఖం చూడగానే ఎవరికైనా స్ఫురిస్తుంది.

 

    రామం వ్యాపారపు పనిమీద మద్రాస్ వెళ్లినప్పుడు వాళ్ళతో పరిచయం కలిగింది. అతను మామూలుగానే హోటల్లో దిగాడు.

 

    అతని వ్యాపారం ఇప్పుడు మునుపటికన్నా ఎంతో అభివృద్ధి చెందినది. మనోరమ తనని విడిచి వెళ్ళిపోయిన దగ్గర్నుంచీ అతను మనశ్శాంతిలేక ఎక్కువకాలం బిజినెస్ వ్యవహారాలలోనే వెచ్చించసాగాడు. ప్రతిపనీ దగ్గరుండి శ్రద్ధగా చూడసాగాడు. ఇతర విషయాలమీదికి మనసుని పోనీకుండా జాగ్రత్తగా అరికట్టేవాడు.

 

    మద్రాసులో వున్నప్పుడు సాయంత్రమవగానే ఏమీ తోచేదికాదు. అందుకని ఏ సినిమాకో, షికారుకో, అలా విలాసంగా తిరిగి వస్తూండేవాడు. అతని అంతరంగిక మిత్రులు ఆ ఊళ్ళో ఎవరూ లేరు. అందుకని ఎక్కడికైనా ఒంటరిగా టాక్సీలో తిరగుతుండేవాడు.

 

    ఓ సాయంత్రం హోటలునుంచి అలా నీట్ గా డ్రెస్ చేసుకుని పోతూండగా వాణి మహల్ లో డ్యాన్స్ ప్రోగ్రాం వున్నట్లుగా చూశాడు. నాట్యకత్తె పేరు వసంతబాల.

 

    వసంతబాల పేరు అతను అప్పుడప్పుడు పేపర్ లలో చూస్తూండేవాడు. ఆమె ఈమధ్యనే తరుచు నృత్య ప్రదర్శనలు ఇస్తూ పేరు తెచ్చుకుంటోంది. ఆమెపేరు చూడగానే అతనికి నాట్యం తిలకిద్దామనిపించింది. వెంటనే ఓ ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని హాలులోకి పోయి కూర్చున్నాడు.

 

    మరో పావుగంటకు వసంతబాల రంగముమీదకు సాక్షాత్కరించింది.

 

    ఎక్కడో మెరుపు మెరిసినట్లయింది.

 

    అతని శరీరం స్పందించింది.

 

    ఆమె నాట్యం, లాస్యం, కళావైదగ్థ్యం, వికసించే సౌందర్యం, మెరిసే చురుకుదనం చూసి చలించిపోయాడు, మైమరచిపోయాడు.

 

    తిరిగి ఇన్నాళ్ళ తర్వాత అతని హృదయంలో ఆర్ద్రభావాలు కలిగినయ్.

 

    ఒక్కసారి అతని గత జీవితమంతా కళ్ళముందు మెదిలింది. ఒకప్పుడు తను ఎంత అల్లరి చిల్లరిగా తిరిగేవాడు! తనకోసం యెంతమంది తపించేవాళ్ళు?

 

    నందనవనమనుకున్న తన జీవితంలో భయంకర పరిణామాలు జరిగిపోయాయి.

 

    మొండిగా, ఎండుగా తయారైనాడు చివరకు.

 

    అతని కళ్ళు చెమర్చినయ్.

 

    చేతిరుమాలుతో తుడుచుకుని, మళ్ళీ యీ లోకంలోపడి ఆ నృత్యాన్ని శ్రద్ధగా అవలోకించసాగాడు. రెండున్నర గంటలసేపు స్వల్ప విరామాలతో, అపురూపంగా సాగాక ఆనాటి నాట్యప్రదర్శనం ముగిసింది.

 

    ప్రేక్షకుల్లోంచి విపరీతంగా కరతాళధ్వనులు చెలరేగాయి. ప్రతిఒక్కరూ ముగ్ధులయ్యారు.

 

    రామం చాలా ఆవేశపరుడు. సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా అణుచుకోలేడు. వెంటనే లేచి ముందూ, వెనకా చూడకుండా అక్కడున్న వాలంటీర్లని తోసుకుని గ్రీన్ రూంలోకి పరిగెత్తాడు.

 

    గ్రీన్ రూమంతా మనుషులతో హడావిడిగా వుంది. వసంతబాల అద్దం ముందు కూర్చుని చిన్న టవలుతో ముఖం తుడుచుకుంటోంది.

 

    "మిస్ వసంతబాలా! నిజంగా మీ డ్యాన్స్ అపూర్వం, మార్వలెస్ నా కంగ్రాట్యులేషన్స్ స్వీకరించరూ?"

 

    ఆమె ఉలిక్కిపతి ముఖం వెనక్కి త్రిప్పి చూసింది. ఆ అపరిచిత యువకుడ్ని చూసి కొంచెం బెదిరింది. చేతులు జోడించి "థాంక్స్" అంది.

 

    "పేపర్లో మీగురించి చాలాసార్లు చదివాను. కాని ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి. మీది ఈ వూరేనా వసంతబాలగారూ!"

 

    "అవునండీ" అందామె విస్మయంగా.

 

    "అలా అయితే చూడండి. ఇక్కడ చాలామంది వున్నారు. ఇంతమందిలో మాట్లాడుకోవటం అస్థిమితంగా వుంటుంది. మీ ఇంటికి వచ్చి మాట్లాడవచ్చా? మీ ఇంటి అడ్రసు చెబుతారా?"

 

    ఆమెకి ఏమి జవాబు యివ్వటానికి వ్యవధానం లేనంతగా తొందరగా వొరవడిగా వేశాడు ప్రశ్నలు. నాగరీకంగా, ఠీవిగా కనబడుతున్న ఈ యువకుడి అభ్యర్థనను నిరాకరించలేక "అలాగే రావచ్చు. మా యిల్లు వెస్టుమాంబళంలో వుంది" అని సన్నని కంఠంతో తన ఇంటి చిరునామా చెప్పింది.

 Previous Page Next Page