Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 38


    "రేపు మధ్యాహ్నం మూడుగంటలకి వస్తే ఇంట్లో వుంటారా?"

 

    ఆమె ఒక నిముషం ఆలోచించి "ఉంటాను. అలాగే రండి" అంది.

 

    ఆమెను అలానే ఆశ్చర్యంలో వుంచి అతను బయటకు వచ్చేశాడు. తను ఆమెతో మాట్లాడుతున్నప్పుడూ, అనుకోకుండా అంత సమీపంలోకి పోగలిగి నందుకు కలిగిన అనుభూతి తలచుకుంటున్నప్పుడూ అతను పులకాంకితుడై రోడ్డుమీద నెమ్మదిగా నడిచిపోసాగాడు.


                                                                  *  *  *


    మరునాడు మధ్యాహ్నం నిర్ణీత సమయానికి అతను వెస్టుమాంబళం చేరుకొని, వెతుక్కుంటూ ఆమెయింటికి చేరుకున్నాడు.

 

    ఆ ఇల్లు అంత పెద్దదికాదు. అది వాళ్ల స్వంతఇల్లు అవునో కాదో కూడా తెలియదు. గేటు తెరుచుకొని మెల్లగా లోపలకు ప్రవేశించాడు.

 

    వసంతబాల ముందుగదిలో సోఫాలో కూర్చుని రేడియో వింటోంది. రామాన్ని చూసి చప్పున లేచి నిలబడి "రండి" అంది ఆహ్వానిస్తూ.

 

    తనకూ, ఆమెకూ బొత్తిగా పరిచయం లేకపోవడం, అయినా తను చొరవ తీసుకుని అక్కడికి రావటం. ఈ సన్నివేశం అంత సహజమైంది కాదని రామానికి తెలుసు. అయినా కొన్ని ఆకర్షణల ప్రభావమో ఏమిటోగాని, అవి మనిషికి సహజం, అసహజం ఆలోచించుకోనియ్యకుండా చేస్తాయి.

 

    "కూర్చోండి" అంది వసంతబాల.

 

    అతడు ఆసీనుడై "క్షమించాలి. నా గురించి మిమ్మల్ని చాలా ఇబ్బందిలో పెట్టినట్లుగా వున్నాను" అన్నాడు మర్యాదగా.

 

    ఆమె కాస్త నవ్వి "లేదులెండి" అంది.

 

    "మీ ఇంటికి వస్తానంటే మీరు నిరాకరిస్తారనుకున్నాను."

 

    వసంతబాల మళ్ళీ నవ్వింది. "ఎందుకు నిరాకరించటం?"

 

    "నేను అపరిచితుడ్ని."  

 

    "అయితే?"

 

    "ఏంలేదు లెండి."

 

    ఆమె ఓ క్షణం ఆగి "మీ పేరు చెప్పనేలేదు" అంది.

 

    అతను చెప్పి "నిజమే. నా పేరయినా మీకు తెలియకుండా నన్నిక్కడికి ఆహ్వానించేటట్లు చేసుకున్నాను. వట్టి అమర్యాదస్థుడ్ని" అన్నాడు ఎంతో నొచ్చుకుంటూ.

 

    "భలేవారే. అవకాశం లేక చెప్పలేదు. దీనికింత బాధపడతారు దేనికండీ? అవునూ, మీకు నాట్యమంటే ఎంతో ఇంటరెస్టా?"

 

    "అబ్బే. అలాంటిదేమీ లేదండీ. నిన్న అనుకోకుండా మీ ప్రదర్శనానికి రావటం తటస్థించింది. నాట్యం మీరు చేయగా బాగుంది."

 

    ఆమె నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది. "భలేవారండి మీరు. ఈ రకం కాంప్లిమెంటుని ఇదే మొదటిసారి వినటం" అంటూ తనూ అతని కెదురుగా కూర్చుంది.

 

    తర్వాత ఇద్దరూ అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు. వసంతబాల ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంది. ఆమెకి చిన్నతనంనుంచీ నాట్యం, సంగీతాలంటే అభిలాష వున్నది. చదువుమీదకూడా అంతే ఆసక్తి వున్నది గానీ, ఈ కార్యకలాపాలన్నిటికీ టైం చాలకపోవటంవల్లా, తల్లికి కూడా అంత అభిరుచి లేనందువల్లా ఉద్వాసన చెప్పాల్సి వచ్చింది.

 

    "నాకు డాక్టర్ని అవుదామని వుండేది. కాని డ్యాన్సర్ని అయ్యాను" అంది వసంతబాల.

 

    "మా అమ్మకి నన్ను ఉత్తమ కళాకారిణిని చెయ్యాలని ఆశయం. నేనిందులో హిమోన్నతాలు చేరుకోవాలనీ, ఎనలేని కీర్తిప్రతిష్టలు ఆర్జించాలనీ కలలు కంటుంది" అంది.

 

    "అవి నిజాలయే కలలు" అన్నాడు రామం.

 

    ఆమె ఓ నిట్టూర్పు విడిచి "ఇందులోని బరువూ, బాధ్యతలు మీకు తెలీవు రామంగారూ! ఈ కీర్తి కండూతి, నిరంతర సాధన మనిషిని సంగ్రామజీవిగా తయారుచేస్తున్నాయి. అదీగాక నాకు జీవితాన్ని ప్రయోగశాలగా చేసుకోవాలంటే భయం. నాకు ఆసక్తిగానీ, అభిరుచిగానీ లేదు. చాలామంది నేను సినిమాల్లో చేరాలనీ, నాట్యగత్తెగా, నటిగా ఘనత కెక్కాలనీ నూరిపోశారు. సినిమాల్లో చేరటం దుస్సాధ్యమేమీ కాదు నాకు. కాని అది నేను వాంఛించలేకపోతున్నాను" అంది.

 

    "ఎందుకని"   

 

    "ఎందుకనా? ఈ ప్రశ్నకి సమాధానం ఏంచెప్పేదీ. నాకోసం నేనుగాని నా స్వార్థంకోసం నేను కాదనిపిస్తుంది. నాకు సంపూర్ణ జీవితం కావాలి."

 

    'అంటే..."

 

    "నూటికి నూరుపాళ్ళూ స్త్రీత్వం వుండాలి నాలో."

 

    "అంటే?"

 

    "నాకు తెలీదు" వసంతబాల ముసిముసిగా నవ్వింది.

 

    "ఇంత ముఖ్యమైన విషయాన్ని గురించి మీకు ఎందుకు తెలీదు" అని రామం తనూ నవ్వి మళ్ళీ ప్రశ్నించాడు.

 

    "చాలా ముఖ్యమైన విషయాల గురించే మనకు స్పష్టంగా తెలుస్తూ వుండదు. కాఫీ తెస్తాను వుండండి" అంటూ ఆమె లేచి లోపలకు వెళ్లింది.

 

    ట్రేలో కాఫీ తెస్తూ ఆమె లోపలినుండి తల్లినికూడ తీసుకువచ్చింది. మా అమ్మ అని పరిచయం చేసింది.

 

    ఆమె సోఫాలో వెనక్కి జారగిలపడి కూర్చుంది. "మా అమ్మాయి, నేనూ ఇద్దరమే వుంటాం యింట్లో. మాకు వేరే దిక్కులేదు" అంది.

 

    ఆవిడముఖం శుష్కించిపోయి వున్నా, ఒకనాటి సౌందర్యరేఖలింకా ఆమె వదన మండలంనుండి చెరిగిపోలేదు. సౌమ్యత, సంస్కారం వుట్టిపడుతున్నాయి  ఆమె మాటల్లో.

 

    "మీకు వంట్లో స్వస్థతగా లేదా?" అని అడిగాడు రామం.

 

    "లేదు బాబూ. ఈమధ్య వరుసగా కొన్నాళ్ళబట్టి గుండెలో నెప్పి వస్తోంది. ఇహ అట్టే రోజులు బ్రతకననుకుంటాను."

 Previous Page Next Page