Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 36


    అనంతరావుకి యీ నిషాలో పరబ్రహ్మ కనిపిస్తున్నాడు.

 

    భర్తలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పు మొదట్లో సుభద్రకి అర్థంకాలేదు. అయినా అడిగే స్థితిలో లేదప్పుడు. కాని రానురాను అతని వాలకం ఆమెను కలవరపర్చసాగింది. ఇంటినుంచి తీసుకుపోతున్న ఈ డబ్బంతా ఏం చేస్తున్నాడు అతను? ఆమెకి భయం వెయ్యసాగింది. ఒకనాడు భర్త గదిలో ఒంటరిగా కూర్చుని సూది గ్రుచ్చుకోవటం చూసింది. నిలువునా వొణికింది. అమాంతంగా పోయి అతని కాళ్ళమీద పడిపోయి రెండుపాదాలూ పుచ్చుకుని 'ఏమిటండీ యిది? మీకేం జబ్బుచేసింది! ఎందుకిలా చేస్తున్నారు!" అని గొల్లున ఏడవసాగింది.

 

    అనంతరావు చలించలేదు. "నాకేం జబ్బు చేయలేదు" అన్నాడు శూన్యంలోకి చూస్తూ. "నేనిప్పుడు బాగా వున్నాను. నాకు ఉత్సాహంగా వుంది. బ్రతుకుమీద ఆసక్తి కలుగుతోంది."

 

    "అయితే... అయితే యిదేమిటి? ఏమండీ నాకు చెప్పరూ! రోజూ యిలాగే చేసుకుంటున్నారేం! మీకేం జరిగింది! ఎందుకిలా అయిపోతున్నారు!"

 

    "నిజంగా నాకేమీ కాలేదు సుభద్రా" అన్నాడు అనంతరావు శాంతంగా. "ఇది నా మంచికోసమే. అభివృద్ధికోసమే."

 

    సుభద్ర విన్నది. "వొద్దు మానివేయండి. దేముడు మనకు చేసిన అన్యాయం చాలదా?" అంది.

 

    అతనికి ఆమెపైన మితిలేని జాలికలిగింది. ఆప్యాయత నణచుకోలేకపోయాడు. ఆమెను పైకి లేవదీసి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె కన్నీటిని తుడిచాడు. "ఏంచెయ్యను సుభద్రా? ఎలా బ్రతకమన్నావ్ నన్ను! నువ్వే చెప్పు. నన్ను చూస్తే జాలి వేయటంలేదూ నీకు!"

 

    సుభద్ర గుండె పగిలిపోయింది ఈ మాటలకు. కాని కష్టంమీద మనసు స్వాధీనం చేసుకుంది. "ఏమండీ! ఇలా నావంక చూడండి. ప్రపంచంలో ఎంతమంది పుట్టి చచ్చిపోవడంలేదు! అందుకోసం జీవితాలకు జీవితాలు నాశనం చేసుకోవటమా? ఈ ప్రపంచం విశాలమైందికదా. ఇందులో ఒడిదుడుకులన్నీ కలిసిపోయి, సమసిపోయి తిరిగి బ్రతుకులు కొత్త చిగుళ్ళు తొడగవా! విషాదమేనా జీవిత పరమార్థం! మనం మళ్ళీ మామూలుగా ఎందుకు వుండలేము? ప్రయత్నిస్తే సాధించలేమా! మీరు కొన్నాళ్ళదాకా యిల్లు కదలొద్దు. నన్ను విడిచి ఒక్కక్షణంకూడా వుండొద్దు. మనం మారదాం" అంది ఆవేశంగా.

 

    అతను మంత్ర ముగ్ధుడయినట్లుగా విని చంటిపిల్లాడిలా తల వూపాడు.

 

    అప్పట్నుంచీ సుభద్ర తెల్లవారుజామునే నిద్రలేచేది. భర్తని లేపేది. అతనికి ధైర్యంగా వుండటానికి ఒక గంటసేపు భగవద్గీత వినిపిస్తూండేది.

 

    దేహీ నాస్మిన్ యధా దేహే కౌమారం యోవనంజరా,
    తధా దేహాంతర ప్రాప్తీర్ధీర స్త్రత్రన ముహ్యతి||

 

    "చోశారా౧ పాత వస్త్రాన్ని తొడుక్కోవడంలాంటిది మరణమంటే, మనం కర్మవాదులం. దీన్నిగురించి బెంబేలు పడిపోయి, జీవితాన్ని శాశ్వతంగా చీకటి మాయం చేసుకోవటమెందుకు!"

 

    అతనికి తాత్కాలికంగా ఉపశమనం కలిగేదిగాని కొంతసేపు గడిచిపోయాక తిరిగి పాతవేదన చుట్టుముట్టి, లాచి పీల్చి పిప్పిచేసేది. తన గదిలోకి పరిగెత్తుకు పోయేవాడు.

 

    మళ్ళీ మార్ఫియా!

 

    "నన్ను క్షమించు సుభద్రా! ఈసారికి, ఈ ఒక్కసారికీ, ఇది లేనిదే నా కాలూ చెయ్యీ కదపలేకుండా వున్నాను. గుండె పనిచెయ్యదేమో అనిపిస్తోంది. మనుగడ ఇంతటితో ఆఖరు అనిపిస్తోంది" అనేవాడు కళ్ళనీళ్లు కారుతుండగా.

 

    సుభద్ర తల గుమ్మానికేసి బాదుకుని సొమ్మసిల్లిపడిపోయేది.

 

    తనదగ్గర మార్ఫియా నిండుకాగానే అతను బజారుకి తయారయ్యేవాడు.

 

    సుభద్ర అతనిదారికి అడ్డుగా నిలిచి హృదయవిదారకంగా వేడుకునేది.

 

    "లే! నా దారికి అడ్డులే! లెమ్మని చెబుతూంటే నీక్కాదూ? నేను బ్రతకాలని లేదా నీకు? నేను సుఖంగా వుండటం ఇష్టంలేదా? ఇష్టం లేకపోతే పుట్టింటికి వెళ్ళిపో! నన్ను వేధించకు" అంటూ ఆమెని పక్కకి త్రోసి బయటికి వెళ్ళిపోయాడు.

 

    ఇలా ఎన్నోసార్లు జరిగింది. సుభద్ర తన శాయశక్తులా అతన్ని మామూలు మనిషిని చేయటానికి ప్రయత్నించి విఫలురాలయింది.

 

    కొన్నాళ్ళకి అతను తిరిగి ఉద్యోగంలో చేరాడు. కాని తన ప్రవర్తన మార్చుకోలేదు.


                                       *  *  *


    రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వారి అస్పష్టజీవితాలు అలా మసకగా ముందుకు సాగిపోతున్నాయి.

 

    చాలాకాలానికి తిరిగి సుభద్ర గర్భిణి అయింది.

 

    ఏడో నెల వచ్చాక విశ్వనాథంగారు కూతుర్ని పంపించమని రాశారు.

 

    "నేను వెళ్ళను మిమ్మల్ని విడిచి. మీరు మరీ విచ్చలవిడి అయిపోతారు" అని గోల పెట్టింది సుభద్ర.

 Previous Page Next Page