రకరకాల ఫీలింగ్స్ తో ఆ ముగ్గురూ బ్యారెక్కు నుంచి బయటపడ్డారు.
యధాప్రకారం కాలకృత్యాలు తీర్చుకున్నారు.
టిఫిన్ రుచించడంలేదు. టిఫిన్ అంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలో చింతపండు కలిపి దానికి పులిహోర అని పేరు పెట్టారంతే.
ప్రతి ఖైదీకి ఏ పూట ఎంత పెట్టాలో లెక్క వుంటుంది. అయితే జైలు అధికారులు వాటిని పాటించరు. ఏదో యిష్టం మొచ్చినంత వేస్తారు. తోటలో పండిన కూరగాయలను సైతం ఖైదీలకు పెట్టకుండా జైలు సిబ్బంది తమ మార్కెట్లకు తరలిస్తారు.
అలా ప్లేట్లలో చేతుల్ని అటూ ఇటూ కదిపేలా చేశారు.
అంతక్రితం తిలక్ చెప్పినట్లే తోట తూర్పుభాగంలో ఉత్తరుడు, బుద్ధుడు తోటలోకి వంగారు. తిలక్ పడమరవైపున చెట్లకు నీళ్ళు పట్టడం ప్రారంభించాడు.
అతనికి పదడుగుల దూరంలో కాంపౌండ్ వాల్ వుంది. దానిని ఆనుకుని రైల్వే క్వార్టర్స్ వున్నాయి. వాటి మధ్యనున్న తారురోడ్డు కాంపౌండ్ వాల్ వరకు వచ్చి ఆగిపోయి వుంది.
తిలక్ ప్రతి అయిదునిముషాలకోమారు కాంపౌండ్ వాల్ కేసి చూస్తున్నాడు.
తను చెప్పినట్టు లాలస అన్ని పనులూ చేసివుంటే రోడ్డుకు సరిగ్గా అవతలవైపున కాంపౌండ్ వాల్ లో కొంతభాగం పెచ్చులు వూడిపోయి వుండాలి. ఆడుకునే మిషతో పసిపిల్లలు పెచ్చులు పెరికేటట్టు ఏర్పాటు చేయమని తను లాలసకు చెప్పాడు. అదే జరిగివుంటే ఆ భాగం వీక్ గా తయారై వుండాలి.
అతను తల పైకెత్తి చూశాడు. సూర్యుడు అప్పుడే తూర్పుకొండను ఎక్కేశాడు టైమ్ తొమ్మిదై వుంటుందనుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మరో గంట తరువాత తాము జైలు నుంచి బయటపడతామనుకున్నాడు.
ఎవరికీ ఏ అనుమానమూ రాకుండా చెట్లకు నీళ్ళు పెట్టడంలో నిమగ్నమయ్యాడు.
బుద్ధుడు, ఉత్తరుడు తమ బాస్ నే గమనిస్తున్నారు. అతనిచ్చే సంజ్ఞ కోసం వాళ్ళు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
వాళ్ళతోపాటు మరో ఏభైమంది ఖైదీలు కూడా తోటలో పని చేస్తున్నారు. మొత్తం నలుగురు వార్డర్లు ఓ చెట్టుకింద కూర్చుని పులి మేక ఆడుకుంటున్నారు. మరో చెట్టు నీడ కింద దాదా, నైఫ్, గన్, బాంబు మాట్లాడుకుంటున్నారు.
కిచెన్ లో అప్పుడే వంటలు ప్రారంభమయ్యాయి. అందులోంచి వస్తున్న పొగవల్ల ఆ ప్రాంతమంతా మసగ్గా కనిపిస్తోంది. ఈ కారణం చేతనే తిలక్ పారిపోవడానికి ఈ టైమ్ కుదిర్చాడు.
టైమ్ పది అవుతుందని అనిపించగానే తిలక్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మిత్రులిద్దర్నీ తన దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశాడు.
పలుగులు పట్టుకునే బుద్ధుడు, ఉత్తరుడు అక్కడకు చేరుకున్నారు. వూరికే వుంటే అనుమానమొస్తుందని మొక్కలకు పాదులు తీయడం మొదలెట్టారు.
సరిగ్గా అప్పుడే జైలును కుదిపేస్తున్నట్టు వినిపించింది పెద్ద శబ్దం.
ఆకాశం విరిగి మీద పడిపోయినట్టు, భూమి బ్రద్ధలైనట్టు ఆ భయంకరమైన శబ్దానికి ఖైదీలు మూలకొకరు పరుగెత్తారు.
తిలక్ కి కూడా కావాల్సింది అదే.
ఎవరు ఎటు పరుగెడుతున్నారో తెలియడం లేదు.
ఆ శబ్ధానికి తమ చెవులు వూడిపడిపోయినట్టు వార్డర్లకు అనిపించింది. వాళ్ళు కూడా ఏదో పేనిక్ తో చెల్లా చెదురైపోయారు.
ఆ సమయానికి ఆఫీసులో వున్న శ్రీపతి హడావుడిగా కిందకు దిగాడు. గార్డులు తుపాకులు చేతపట్టుకుని తోటలోకి వురికారు.
పొయ్యిలో మండుతున్న కట్టెలపై ఎవరో అప్పుడే నీళ్ళు చల్లడంతో పొగ మరింత ఎక్కువై కళ్ళు మండుతున్నాయి.
కాసేపటికి పొగ తగ్గింది.
ఇప్పుడు అంతా స్పష్టంగా కనిపిస్తోంది.
వార్డర్లు శ్రీపతిని చూసి అలెర్ట్ అయిపోయారు.
"అదిగో అటు చూడండి" ఓ వార్డర్ కంగారుగా అరిచాడు.
శ్రీపతితోపాటు అందరూ అటు చూశారు.
అక్కడ కాంపౌండ్ వాల్ ను ఢీకొని కొంతభాగం ముందుకొచ్చిన లారీ మూతి కనిపించింది. అందులోంచి పొగ చాలా నీరసంగా పైకిలేస్తోంది.
"లారీ అవతలనుంచి మన ప్రహరీగోడకు డ్యాష్ ఇచ్చినట్టుంది సార్" జైలర్ వామనరావు నెమ్మదిగా చెప్పాడు శ్రీపతితో.
"బాంబులు పేలాయేమోనని భయపడిపోయాను. థాంక్ గాడ్ లారీ గుద్దడం వల్ల కంత ఏర్పడినట్టుంది. అందులోంచి ఏ ఖైదీ అయినా పారిపోగలడు జాగ్రత్త అక్కడ ఇద్దరు గార్డులు వుండండి" అని శ్రీపతి ఆర్డర్ వేశాడు.
ఈ మాటలు విన్న వార్డర్ ఆర్ముగానికి డౌట్ వచ్చింది. తన సందేహాన్ని తీర్చుకోవడం కోసం అధికారులకు దూరంగా నిలబడ్డ ఖైదీల దగ్గరకి వెళ్ళాడు.
అందర్నీ పరిశీలిస్తున్న అతను చివరికొచ్చేసరికి "సార్" అని కేకపెట్టి శ్రీపతి దగ్గరకు రెండు అంగల్లో చేరుకున్నాడు.
ఆందోళనగా చూశాడు ఆయన ఆర్ముగంవైపు.
"సార్! దారుణం జరిగిపోయింది. తిలక్, బుద్ధుడు, ఉత్తరుడు కనపడడం లేదు. అయిదు నిముషాల ముందు ఇక్కడే వున్నారు సార్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయినట్టు? బహుశా..." ఇక మాటలు రాక ఆగిపోయాడు ఆర్ముగం.
తనకు స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది శ్రీపతికి. బలవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు. పిచ్చి పిచ్చిగా లారీవైపు చూశాడు. అటు తరువాత సిబ్బందివైపు తిరిగాడు.
`"వాళ్ళు పారిపోయారు అది యాక్సిడెంట్ కాదు, పథకం ప్రకారం గోడకు లారీని గుద్దించారు" కలలో మాట్లాడుతున్నట్టు మెల్లగా అన్నాడు.
* * * *
నలుగురు భిక్షగాళ్ళు వీధుల్లో నడుస్తున్నారు. ఫుట్ పాత్ మీద పోతున్న జనానికి అడ్డం పడుతూ "ధర్మం బాబూ" అని దీనాతిదీనంగా ముఖాలు పెట్టి అడుగుతున్నారు.
అందులో ఒక వ్యక్తి గుడ్డివాడు. అతను వేసుకున్న ప్యాంటు ఆకుపచ్చ రంగులో బూడిదరంగు మాసికలతో పచ్చని చేలకు బూడిద తెగులు పుట్టినట్టుంది. అతన్ని ఓ అమ్మాయి చేయిపట్టుకుని లాక్కెళుతోంది. ఆమె మాసిపోయిన చీరలో శాపవశాత్తు పేదదైపోయిన మహారాణిలా వుంది.
వీళ్ళ ముందు నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు పంచెలు కట్టుకుని వున్నారు. అవి తుఫానులో చిక్కుకుపోయి చిరిగిపోయిన గాలిపటాల్లా వున్నాయి. వాళ్ళు వేసుకున్న ముప్పాతిక చేతుల షర్టులు కాళ్ళు నరికేసిన గొర్రె తోళ్ళలా వున్నాయి వాళ్ళ చేతుల్లో రెండు మూకుళ్ళు వున్నాయి. వాటిలోని చిల్లర నాణాలు లేబర్ కాలనీ మధ్యలో ఆడుకుంటున్న పసిపిల్లలా వున్నాయి.
"బుద్దా! చిన్నగా నడువ్. ఎవరైనా మనల్ని పరిశీలిస్తే నిజం కనుక్కునేట్టున్నారు. అంత తొందరెందుకు?" తిలక్ మెల్లగా మందలించాడు.