Previous Page Next Page 
సాహసి పేజి 36


    ఇందుమతి కులదైవాన్ని జ్ఞాపకం చేసుకుని దేవతా విగ్రహంవేపు చూసింది.

    అదే సమయంలో నీళ్ళు తేవడానికి ఆటవిక స్త్రీలు ముందుకు నడుస్తున్నారు.

    గిరిజన యువకులు... దూరంగా వున్న కపాలేశ్వర్, పగడందొర ఇందుమతి నగ్నత్వాన్ని చూడడానికి ఉవ్విళ్ళూరుతున్నారు.

    ఆ దృశ్యాన్ని చూడలేక యువరాజు కళ్ళు మూసుకున్నాడు. అతని నరనరంలోని నెత్తురు సెగలుగా మండుతోంది.

    సరిగ్గా-

    ఆ సమయంలో-

    ఉధృతంగా గాలి వీచడం... దేవతా విగ్రహం ముందున్న ఆముదపు దీపంతోపాటు,గిరిజన యువకుల దగ్గరున్న కాగడాలు కూడా మంత్రం వేసినట్లుగా ఆరిపోవడం-

    దేవతా విగ్రహానికున్న ఎర్రరంగుచీర, గాల్లో కెగిరి ఎవరో అదృశ్యశక్తి తెచ్చి కట్టినట్లుగా-

    దేవీబాల ఇందుమతి వంటి మీద పడటం అంతా- కొన్ని ఘడియల్లో జరిగిపోయింది.

    చీకట్లో ఏం జరిగిందో... ఎవరికీ తెలీదు.

    అందరూ-

    లబలబమంటూ ఆముదపు దీపాన్ని, కాగడాల్ని అర్జంటుగా వెలిగించారు. దేవతా విగ్రహం మీద చీర లేకపోవడాన్ని మొదట గమనించిన వ్యక్తి పగడం దొర.

    వెంటనే అతని చూపులు ఇందుమతివేపు మళ్ళాయి.

    దేవి చీరలో ఇందుమతి-

    అపరశక్తి రూపిణిగా కనిపించింది.

    ఆ దృశ్యానికి-

    ఆటవికులందరూ నిరుత్తరులై, నిశ్చేష్టులైపోయారు.

    పగడందొరకు కోపం వచ్చింది.

    "ఈ శత్రువులకి మాయలు, మంత్రాలు తెలుసు. వీళ్ళని బతకనివ్వకండి. చంపెయ్యండి. రాళ్ళతో కొట్టి చంపెయ్యండి. నిప్పుతో కాల్చి చంపెయ్యండి. భూమిలో పాతిపెట్టి చంపెయ్యండి" ఉగ్రంగా అంటూ కుర్చీలోంచి లేచాడతను.

    దొర ఆజ్ఞతో, ఆటవికుల్లో కలకలం మొదలైంది.

    సరిగ్గా-

    అదే సమయంలో-

    "పగడం దొరా" అంటూ కేక వినబడింది. ఆ కేకకు ఎక్కడి వాళ్లక్కడ స్తంభించిపోయారు.

    పగడందొర ఆశ్చర్యంగా ఆ కేక వినిపించిన వేపుకు చూసాడు- అక్కడ ముత్యాలనాయుడు.

    దూరం నుంచి పరుగు, పరుగున వచ్చిన ముత్యాలనాయుడ్ని చూడగానే, అతనెవరో చటుక్కున గుర్తుకొచ్చింది పగడందొరకు.

    "ముత్యాలనాయుడు" తనలో తనే గొణుక్కున్నాడు పగడం దొర.

    అరక్షణంలోనే పగడందొర మదిలో ఎన్నో జ్ఞాపకాలు మెదిలాయి. గబగబా ముందుకు నడిచి నవ్వుతూ- ముత్యాలనాయుడుని ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు పగడం దొర.


                                         *    *    *    *


    "అమ్మా... యువరాణీ క్షమించమ్మా... తెలియక చేసిన తప్పు ఇది. ఎప్పుడైతే దీపం ఆరిపోయి ఆ దేవీమాత చీర నిన్ను చుట్టుకుందో అప్పుడే నా మారుమూల మనసులో ఎక్కడో దివ్వె వెలిగిందమ్మా... కానీ అంతగా ఆలోచించ లేకపోయాను. అమ్మ దేవీబాలా మీ తండ్రిగారి పట్టాభిషేకానికి మా తండ్రితో వచ్చానమ్మా నేను. కబురుచేస్తే కాకిలా, నేనేవచ్చేవాడ్ని కదమ్మా... ఏంటిది ఈ మారుమూల కీకారణ్యానికి ఎందుకొచ్చారు? సెలవివ్వండి" అమితమైన గౌరవంతో, అభిమానంతో అడిగాడు పగడందొర. వచ్చినవాళ్ళు శత్రువులు కాదని- తమ ప్రభువులని పగడం దొర చెప్పడంతో ప్రాయశ్చిత్తంగా ఆడా మగా అందరూ నేలమీద అయిదుసార్లు పొర్లి-

    ప్రతి ఒక్కరూ ఇందుమతి పాదాలకు నమస్కారం చేశారు.

    వినోద కాలక్షేపం తర్వాత-

    విందు జరుగుతోంది.

    అందరికీ మడ్డికల్లుని సర్వ్ చేసారు. మడ్డికల్లు, దుప్పి మాంసం- కొర్ర బియ్యంతో చేసిన ప్రత్యేక వంటకం...

    "అమ్మా ఇందుమతీ ఇది కపాలకోన సరిహద్దు. ఈ యాభైమైళ్ళ సరిహద్దు ప్రదేశాన్ని ఎప్పుడో మా తాతల తరంనాడు... మీ తాతలు మాకిచ్చారు. నా అధికారం ఈ యాభైమైళ్ళు మాత్రమే. కంచూరువాక నాది కాదు కంచూరువాక తొమ్మిది కొండల మధ్య వుండడం మాత్రం నిజం. అక్కడ సూర్యదేవాలయం- నా చిన్నప్పుడు వుండేది. ఇప్పుడు లేదు. శిధిలమై పోయింది" చెప్పాడు పగడం దొర.

    "కంచూరువాక... తొమ్మిది కొండలమధ్య వుండడం నిజం కదా" ఇందుమతి కళ్ళల్లో అంతులేని కాంతి మెరిసింది.

    "మా వంశ మూలపురుషుడు... ఆదిత్యభూపతి మీ గిరిజన తెగకు చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారట గదా... నిజమేనా?"

    "ఆ అమ్మాయి గిరిజనుల అమ్మాయే... కానీ మా తెగ అమ్మాయి కాదు- కొండరెడ్ల అమ్మాయి. తొమ్మిది కొండల నడుమ చంద్రకోన అనే ఒక గిరిజన గ్రామం వుంటుంది. ఆ గ్రామంలో ఒకే ఒక కొండ రెడ్ల కుటుంబం వుంది. ఆ గిరిజన గ్రామ ప్రజలు మహాబల సంపన్నులు. ఒక మేకని, ఒక ఏటనైనా ఒక్కరే అవలీలగా తినేస్తారు. మహాక్రూరులు. ప్రమాదకరమైన వాళ్ళు కూడా. వాళ్ళంతా ఆ కొండరెడ్ల కుటుంబాన్ని పూజిస్తారు, ఆరాధిస్తారు. వాళ్ళ మీద ఈగవాలనివ్వరు. మాక్కూడా వాళ్ళంటే భయమే. ఆ కుటుంబానికి చెందిన అమ్మాయినే ఆదిత్యభూపతి రాజావారు వివాహం చేసుకున్నారని చెప్తారు. అలాగే ఆ అమ్మాయి పేరున... చంద్రదుర్గం అనే విహార మందిరాన్ని కట్టించారని నా చిన్నప్పుడు చెప్పేవారు. ప్రస్తుత ఆ కోనే వుంది. ఆ దుర్గం కాలగర్భంలో కలిసిపోయిందంటారు" చెప్పాడు పగడందొర.

    "ఆదిత్యభూపతి రాజావారు వివాహం చేసుకున్న ఆ అమ్మాయి పేరేంటి?" అడిగాడు యువరాజు.

    "చంద్రయ్యమ్మ..."

    "ఆదిత్య భూపతి అపారమైన నిధి, నిక్షేపాల్ని- ఆ ప్రాంతంలో భద్రపరిచారని అంటారు నిజమా-" అడిగాడు ముత్యాలనాయుడు.

    "లేదు. నిధి నిక్షేపాల గురించి నేనూ విన్నాను వివరాలు తెలుసుకోవటం ప్రమాదమని తెలుసుకోలేదు. ఆదిత్యభూపతికి విహార మందిరానికి సంవత్సరానికి ఒకే ఒకరోజు చైత్ర పౌర్ణమిరోజున వచ్చేవారట. ఆయన తరువాత రుద్రభూపతి కూడా ఆ విహార మందిరానికి అదేరోజు వచ్చేవారట. అంతే- తర్వాత ఏ రాజూ ఇటు పక్క రాలేదు. మేమే కోటకు వెళ్ళేవాళ్ళం" చెప్పాడు పగడం దొర.

    "ఎవరైనా, విదేశీయులు ఇటుపక్క వచ్చారా- ఇప్పుడు కాదు పదిహేను- ఇరవై సంవత్సరాల క్రితం-" అడిగాడు కపాలేశ్వర్.

    "తెల్లతొక్కల వాళ్ళేనా- వచ్చారు. మమ్మల్ని నయానా, భయానా ఒప్పించడానికి చూసారు. అడవిని శోధించడానికి వచ్చామన్నారు. నా సహాయం కావాలన్నారు. మావాళ్ళు వాళ్ళని చంపబోయారు. రాత్రికి రాత్రి పారిపోయారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఎవరూ రాలేదు మీరు తప్ప..."

    "ఈ ప్రాంతంలో ఏదయినా విమానం కూలడం- నీకు తెలుసా"

    "లేదు- అలాంటివేమీ ఇక్కడ కూలలేదు"

    రాత్రి బాగా పొద్దుపోయింది. అందరూ నిద్రపోయారు. పగడం దొర దగ్గర, చాలా విశేషాలు తెలుస్తాయని ఆశించిన ఇందుమతికి పెద్దగా మిగతా విశేషాలేం తెలియకపోవడంతో నిరాశగా వుంది. అందరూ బాగా అలిసిపోవడం వల్ల సొమ్మసిల్లి నిద్రపోతున్నారు.

    ఇందుమతి-

    పగడందొర ఇంటిముందున్న ఆవరణలో, ప్రత్యేకంగా వేసిన పడకమీద పడుకొని ఆకాశంలోని చుక్కలవేపు, చంద్రుడివేపు చూస్తోంది.

    పగడం దొరకి నిజంగా ఏమీ తెలీదా? తెలిసి చెప్పడం లేదా ఆలోచిస్తున్నది ఇందుమతి.

    పక్కల అడుగుల చప్పుడికి, తలతిప్పి చూసింది.

    పగడం దొర!

    లేచి రమ్మన్నట్లు సంజ్ఞ చేసి తను ముందుకి నడిచాడతను. అతని వెనకే, అరకిలోమీటరు నడిచింది ఇందుమతి ధైర్యంగా.

    అక్కడో చిన్న గుడిసె!

    ఆ గుడిసెలో ఒక మూల ఆముదపు దీపం- మిల మిలా మెరుస్తోంది.

    "చూడమ్మా ఇందూ- తరతరాలుగా మా రక్తం ప్రభువుల సేవకు అంకితమైంది. ప్రభువుల రహస్యాలు కాపాడడమే మా ధర్మం. ఆదిత్య భూపతి గురించి, చంద్రయ్యమ్మ గురించి ఇందాక నేను కొన్ని వాస్తవాలు చెప్పలేదు. 

    ఎందుకు చెప్పలేదో తెలుసా- మేము రాజుల్నే నమ్ముతాం- మా రాజ కుటుంబాన్నే నమ్ముతాం. అందరూ వుండగా, అందరూ వింటూండగా చెప్పడం ఇష్టం లేకపోయింది. చెప్పకూడదు కూడా.

    ఇప్పుడు చెప్తాను- విను.

    ఆదిత్యభూపతి- చంద్రయ్యమ్మను, అందరూ అనుకున్నట్టుగా వివాహం చేసుకోలేదు. వారిద్దరూ కలిసి మాత్రమే వున్నారు. వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి పదేళ్ళ వయసు వచ్చిన కాలంలోనే చంద్రయ్యమ్మ కోరిక మేరకు నిధిని ప్రక్షిప్తం చేశారని- మా తాతల ద్వారా నాకు తెలిసింది. ఆ నిధి తన కొడుక్కి చెందాలని- ఆ నిధితో పాటు, ఈ అడవిని కూడా ఆ కొడుక్కి ఇవ్వాలని, అడవికి తన కొడుకుని రాజుని చెయ్యాలని చంద్రయ్యమ్మ పట్టుబట్టిందట- ఆదిత్యభూపతి రాజావారికి అది ఇష్టం లేకపోయిందట.

    రాజావారు తన కోరిక మన్నించలేదన్న కోపంతో, చంద్రయ్యమ్మ ఈటెల్తో తనను తాను పొడుచుకుని, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందట.

    ఆ కొడుకు ఏమయ్యాడో తెలీదు- తన తల్లికి జరిగిన అన్యాయానికి బాధపడి- తనకు న్యాయం చెయ్యమని- ఆ కొడుకు దేవులపల్లి కోటకు వెళ్లాడట- ఆదిత్యభూపతి రాజావారిని కలవడానికి- కానీ వాడి దురదృష్టం- అంతకు ముందురోజే- ఆదిత్యభూపతి రాజావారు చనిపోయారు.

    ఆ కొడుకు... మళ్ళీ అడవికి రాలేదట. ఏమయ్యాడో తెలీదు. దాదాపు మూడువందల యాభై సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. అందుకే, చంద్రయ్యమ్మనీ, ఆవిడ కొడుకునీ ఇలవేలుపుగా కొలిచే కొండ రెడ్ల కుటుంబానికి దేవులపల్లి రాజులంటే కోపం, పగ వున్నాయి.

    ఆ విషయం తెలిసే... ఆ తర్వాత తరం రాజులెవ్వరూ... చంద్రకోన వేపు ఎవరూ వెళ్ళలేదు. నిధి విషయం పట్టించుకోలేదు" చెప్పడం ఆపేడు పగడందొర.

    ఈ విషయం తన తండ్రి, కౌశికభూపతికి కూడా తెలియకపోవడము ఆశ్చర్యంగా ఉంది ఇందుమతికి.

    "ప్రస్తుతం... నిధి అక్కడ ఉన్నట్టా- లేనట్టా..." అడిగింది ఇందుమతి.

    "ఉందనే నేను నమ్ముతాను. ఎందుకంటే అక్కడున్న ఏకైక కొండరెడ్ల కుటుంబం కూడా నమ్ముతోంది కాబట్టి. ఆ నిధిని పొందడమే వాళ్ళ ఆశయం. అందుకే... వారు ఆ పరిసర ప్రాంతాలకు మిగతా వాళ్ళనెవ్వరినీ రానివ్వరు. ఆఖరుకు మమ్మల్ని కూడా... ఎందుకంటే మేం దేవులపల్లి రాజులకు విశ్వాస పాత్రులం కాబట్టి..." కథ ఇలా మలుపు తిరుగుతుందని ఊహించని ఇందుమతి దీర్ఘాలోచనలో పడింది.

 Previous Page Next Page