వెయ్యి సంవత్సరాలు వెనక్కి ప్రయాణించి మన పూర్వీకులు ఎలా బ్రతికారో తెలుసుకోవాలనుకుంటున్నారా....?
రియల్ టార్జాన్ ని చూడాలని వుందా.....సరదాగా వేటాడాలని వుందా...?
స్టార్ హోటల్స్, బీచ్ రిసార్ట్స్, హిల్ రిసార్ట్స్ మీకు విసుగు పుట్టిస్తే మా డిస్నీలాండ్ కి ఒక్కసారి రండి.... ఒక గొప్ప అనుభూతిని మీ సొంతం చేసుకోవాలనుంటే చెప్పండి.....లాంటి స్లోగన్స్ తో ప్రచారం చేయాలి.
ఢిల్లీనుంచి వచ్చే యాత్రికులకు మన వెహికల్స్ అరేంజ్ చేద్దాం. యాత్రికులు పెరిగి, ఆదాయం పెరిగితే ప్రభుత్వమే రోడ్ ని బాగు చేయిస్తుంది. మిగతా సౌకర్యాలని ఏర్పాటు చేస్తుంది.
ఇది మీకు వింతగానూ, విచిత్రంగానూ అనిపించవచ్చు. అందరూ చేసేదే మనం చేస్తే ఏం ప్రయోజనం....? ప్రతి ప్రయోగమూ మొదట్లో వింతగానే వుంటుంది. ఆచరణకి అందని దానిలాగే కనిపిస్తుంది.
విజిపి గోల్డెన్ బీచ్ లో మెయిన్ గేట్ ఎదురుగా, రాజుల కాలంనాటి చెక్ పోస్ట్ ని నిర్మించి, అందులో కొన్ని వందల సంవత్సరాల క్రితం కోటలకు కాపలా వుండే సెక్యూరిటీ గార్డ్ డ్రస్స్ ని ఒక వ్యక్తికి వేయించి, రాజదండం చేతబూనించి విగ్రహంలా అక్కడ నిలబెట్టిస్తారు. సడన్ గా చూస్తే మనం అది విగ్రహమనే అనుకుంటాం.
కృత్రిమమైన గుళ్ళు, జలపాతాలు, కోతలు, దుర్గాలు, వెయ్యి సంవత్సరాల నాటి ఇళ్ళు, గుడిసెలు, పల్లెటూరిని సృష్టించాడు విజిపి. మద్రాస్ వెళ్ళిన వాళ్ళెవరయినా వాటిని చూడకుండా రాలేరు. ఆ ద్వారా కొన్ని కోట్లు గడించాడాయన. మొదట్లో అందరూ పన్నీర్ దాసుని హేళన చేసేవారట. మరిప్పుడు? మద్రాసు మహానగరానికి గొప్ప టూరిస్ట్ ఎట్రాక్షన్స్ విజిపి గోల్డెన్ బీచ్, విలేజ్, వండర్ లేండ్.
సహజత్వానికి దగ్గరగా భ్రమ కలిగించటం, మీ డిస్నీలాండ్ ప్రధానోద్దేశం ఇండియన్స్ లో ఇప్పుడిప్పుడే లీజర్ టైమ్ గురించి, ఎంటర్ టైన్ మెంట్ గురించి ఆలోచనలు రేకెత్తుతున్నాయి. వాటిని మనం కేష్ చేసుకుంటే చాలు.
ఇదీ నాకు తోచిన పరిష్కార మార్గం.
మీరూ ఆలోచించండి. మీకు నచ్చితే వర్క్ మొదలెట్టవచ్చు...." అంటూ చెప్పటం ముగించాడు విమల్.
ఆ ముగ్గురూ నోటమాట లేక, దిగ్బ్రాంతికి లోనయ్యారు.
అది కలో, నిజమో అర్ధంకాక ఆనందోద్వేగానికి గురయ్యారు.
కొద్దిక్షణాల వరకు వాళ్ళేం మాట్లాడలేకపోయారు. వాళ్ళకా పరిష్కారం నచ్చిందో లేదో తెలీక విమల్ తికమక పడిపోయాడు.
సెల్వరాజ్, మేఖల ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించబోతుండగా వినిపించాయి మాటలు.
"శెభాష్.....కష్టాన్నయినా, నష్టాన్నయినా సమాన దృష్టితో చూడగల సంయమనం, సమస్యల్ని తేలిగ్గా పరిష్కరించుకోగల సమయస్పూర్తి ఈనాటి యువతకు చాలా అవసరం అనివార్యం కూడా" అందరూ ఒక్కసారి గిరుక్కున తలలు తిప్పి మాటలు వినిపించిన వేపుకు చూశారు.
ద్వారబంధంలో మంత్రి ఆర్యభట్టు నిల్చుని చిరునవ్వుతో వారికేసి చూస్తూ కనిపించాడు.
ఆయన ఎవరైందీ విమల్, మేఖల గుర్తించారు. ఆ క్షణాన విమల్ పొందిన ఆనందం, అనుభూతి మాటలకందదేమో అన్నంతగా పులకరించి పోయాడు. ఆయన స్వరూపం త్రీడైమెన్షన్ లో కనిపిస్తోందా...? లేక ప్రొజెక్టెడ్ ఫేక్ ఇమేజా అన్నంత త్రిల్లిమ్గ్ కి గురయ్యాడు విమల్.
మరికొద్ది క్షణాలకు అయన లోపలకొచ్చారు 'ఫెంటాస్టిక్ సొల్యూషన్..... నీ కల నిజమవుతుంది. నీ ఊహ నిజమై సెల్వరాజ్ కి దారి చూపిస్తుంది. నువ్వు నా కొడుక్కి ఏదో పరిష్కారం చూపావన్న కృతజ్ఞతతో నేను మాట్టాడటం లేదు. ఇన్ జనరల్..... నీలాంటి మేథావుల కోసమే సమస్యల భారతం ఎదురు చూస్తోంది. మీ పని పూర్తికాగానే ఓసారి నన్ను కలవమని ఆహ్వానించేందుకే ఇప్పుడిక్కడికి వచ్చాను.....వస్తాను" అంటూ వచ్చినంత వేగంగా ఆయన క్రిందకు వెళ్ళిపోయారు.
విమల్, మేఖల ఆయన్ని అంత దగ్గరగా చూడగలిగామన్న ఆనందోద్వేగంలో మునిగి వుండగా-సెల్వరాజ్, అతని సెక్రటరీ మాత్రం ఆ గదిలో నడిచిన సంభాషణ ఆయనకెలా చేరిందని విస్తుపోయారు.
* * * * *
"అపారమైన వనరులున్నా, జనసంపద ఉన్నా మన దేశం నానాటికి ఆర్ధికంగా వెనక్కి వెళ్ళిపోతోంది. నాలో ఒక విచిత్రమయిన కల ఎప్పటినుంచో ఊపిరి పోసుకుంటోంది. దాన్ని నిజం చేయగల ఒక అద్భుత ప్రయోగం చేయాలని వుంది అందుకుగాను నాకు నీ లాంటి ఫైనాన్షియల్ జీనియస్ లు కావాలి.
ఊహ మాత్రమే నేను కల్పించగలను. దాన్ని అనలైటికల్ గా సమీక్షించుకుని, అమలు జరపగల ఎమోషనల్ అండ్ డెడికేటెడ్ ఇన్ స్ట్రుమెంట్ యువత రూపంలో నాకందుబాటులో వుండాలి.
ఎంతో రిస్క్ తీసుకొని, ఎందరి విమర్శల్నో ఎదుర్కొని, ఆ ప్రయోగాన్ని నిర్వహించాల్సి వుంటుంది. అందుకు ఉపయోగపడే యువకుల్లో స్థిరత్వం వుండాలి. మన దేశం బాగుపడాలనే చిత్తశుద్ది, సంకల్పం వుండాలి.
వ్యక్తిగత స్వార్ధాల్ని, కక్షలు, కార్పణ్యాల్ని, కుల, మత ద్వేషాల్ని త్యజించగల మానవతావాదులు కావాలి. కొందరికా ప్రయోగం నవ్వు తెప్పించవచ్చు.
మరి కొందరిలో కోపాన్ని, అసూయా ద్వేషాల్ని రగిలించవచ్చు. అయినా వెరవకూడదు" మంత్రి ఆర్యభట్టు చెప్పటం ఒకింతసేపు ఆపాడు.
కొద్ది క్షణాలపాటు ఆయనేదో ఆలోచిస్తూండిపోయాడు.
ఆ గదిలో అప్పుడు ఆయన, విమల్, మేఖల మాత్రమే వున్నారు.
ప్రపంచ ప్రజ అచ్చెరువందే అద్భుతమైన ఒక ప్రయోగానికి ఆయన తనను సమాయత్తం చేస్తున్నట్లుగా విమల్ భావించి ఉప్పొంగిపోయాడు.
మేఖలకయితే అది కలో నిజమో అర్ధం కాక దిగ్ర్భాంతికి లోనయింది.
"అది నా కల....నా లక్ష్యం....నా సర్వసం..... నాకీ మంత్రి పదవన్నది ఒక తృణప్రాణం. డామ్ ది బ్యూరో క్రాటిక్ అడ్మినిస్ట్రేషన్..... ఐ హేటిట్.....ఫైల్స్.... ఫైల్స్.... గుట్టలు గుట్టలుగా పేరుకుపోయే ఫైల్స్.
చట్టాల్ని రిఫర్ చేస్తూ, ఫైల్స్ మీద కామెంట్స్ రాసి, సంతకాలు చేసే స్టుపిడ్ క్లరికల్ వర్క్.....
బీరువాల నిండా, గదులనిండా ఫైల్స్.....
కాగితాలు గవర్నమెంట్ మేన్యువల్స్....లక్షలాది లా జర్నల్స్..... అన్ని పరిధుల్నీ అధిగమించి అనితర సాధ్యమైన ప్రగతికి శ్రీకారం చుట్టవలసిన మంత్రులు ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ, పర్మిట్లు యిస్తూ, ఎంతో విలువయిన కాలాన్ని దుర్వినియోగం చేస్తుంటారు.
ఒక మంచి చేయాలన్నా మైళ్ళ పొడవుండే ప్రొసీజర్ ని ఫాలో కావాలి.
ఇండస్ట్రీకి డిఫినేషన్ చెప్పలేని, నిరక్షరాస్యుడు కూడా ఈ దేశంలో ఇండస్ట్రీ మినిస్టర్ అయిపోతాడు.
ఆర్ధిక శాస్త్రం గురించి అ,ఆ లు రాణి అర్భకులు ఆర్ధికంగా మంత్రులయి పోతారు.
ఐ.పి.సి. లోని మొదటిపేజీ కూడా చదివెరుగని వ్యక్తి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని హోమ్ మినిస్టర్ అయిపోతాడు.
దేశాన్ని, దేశ ప్రజలను అభ్యుదయం వేపు, ఆర్ధిక ప్రగతి వేపు నడిపించే కీ పోస్టుల్లో వుండే వ్యక్తులకు తత్ సంబంధమైన అర్హతలక్కరలేదు.
సబ్జెక్ట్ తెలీని వీళ్ళంతా చచ్చినట్లు బ్యూరో క్రాట్ చేతుల్లో యిరుక్కుపోతారు.
బిహైండ్ ది డోర్స్....
వాళ్ళు ఏం చెప్పమంటే అదే పత్రికలకు, ప్రజలకు చెబుతారు.....దేశం బాగుపడాలనే తపన వుంటే చాలా?
ఎలా బాగుచేయాలనే నాలెడ్జి.....విషయ పరిజ్ఞానం అక్కర్లేదా?
డామ్ ది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్.
ఎలా....ఎలా ఈ దేశం బాగుపడుతుంది?
ఆకల్ని, సమస్యలను, రుగ్మతలను భరిస్తూ యింత నిరాసక్తంగా ఈ దేశ ప్రజ ఎలా జీవిస్తోంది?
క్రియేటివిటీ, ఊహాశక్తి, హేతువాదం లేని వ్యక్తుల మూలంగా దేశ మానవాళి మంచెలా జరుగుతుంది?
ఈ ప్రజలంతా ప్రయాణమై పార్లమెంటు ముందుకొచ్చి తెలివి, నీతి, నిజాయితీ విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత వున్న వ్యక్తులే ప్రభుత్వం లోని వున్నత పదవులు అలంకరించాలని అడగరేం? చట్టాల్ని మార్చమని కోరరేం? ఫూర్ పీపుల్
ఎలాగోలా జీవితాల్ని దొర్లించుకు బ్రతుకుతుంటారు. దేనిపట్ల ఎవేర్ నెస్ వుండదు.
ఏమి కావాలో తెలీదు.
ఎందుకు కావాలో అంతకంటే తెలీదు.
కులాల కొట్లాటలు....