"అడవి జంతువులు, బర్డ్స్, మమ్మాల్స్, చేపలు.....అన్ని రకాల జంతువులున్నాయి. వెళ్ళాలంటేనే భయం.....ఒకరిద్దరు నా మనుష్యులు వెళ్ళి వాటి బారిన పడ్డారు. చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిలో పారిపోయి వచ్చారు. ఆ లాండ్లోకి వెహికల్ వెళ్ళదు. ఫోర్ వీల్ డ్రైవింగ్ జీప్ అయితే కొంత వరకు వెళ్ళవచ్చు...." సెల్వరాజ్ దిగులుగా అన్నాడు.
"వైల్డ్ లైఫ్ మేన్యువల్ దొరుకుతుందా? అలాగే ఫారెస్ట్ మేన్యువల్ కూడా"
"ఇప్పుడే తెప్పిస్తాను...." అంటూ తన సెక్రటరీ కేసి చూశాడు సెల్వరాజ్.
అతను వెంటనే ఎక్కడికో ఫోన్ చేశాడు.
"మరో పది నిమిషాల్లో అవి మీ ముందుంటాయి" అన్నాడు సెక్రటరీ ఫోన్ పెట్టేస్తూ.
"మీరసలు, ఐదు పైసలు పెట్టుబడి లేకుండా మంచి ఆదాయం వచ్చే వ్యాపారంగా దాన్ని మార్చుతాను. నాకేమిస్తారు.....?" సెల్వరాజ్ బిత్తరపోయాడు.
తన చేతి డబ్బు ఐదు పైసలు కూడా పడకుండా దాన్ని ఇన్ కమ్ సోర్స్ గా మారుస్తాడా...? నిజంగా అంటున్నాడా? లేక ప్రాక్టికల్ జోక్ ప్లే చేస్తున్నాడా?
సెల్వరాజ్ కి అనుమానంతో పాటు ఒకింత కోపం కూడా వచ్చింది. కాని తన ఫీలింగ్స్ ని బయట పెట్టకుండా ఆగిపోయాడు.
ఏ పుట్టలో ఏ పాముందో....? అన్న సామెత గుర్తుకు రావటంతో తనని తాను నిగ్రహించుకున్నాడు.
"మీరేది అడిగినా ఇస్తాను.....బట్....మీరు చెప్పేది ఎలా సాధ్యమవుతుందో నాకర్ధం కావటంలేదు. పెద్ద పెద్ద వృక్షాలు, క్రూర మృగాలు.....డామ్ ది వేస్ట్ లాండ్....పైగా ఆ మృగాల్ని చంపితే అటవీ శాఖ నామీద కేసు పెడుతుంది. అది పెద్ద నేరం. వాటిని భయపెట్టి తరిమికొట్టి, చుట్టూ ఎత్తయిన ముళ్ళకంచె ఏర్పాటు చేయాలి. అలా చేసినా కొన్ని లక్షల ఖర్చవుతుంది సో.....టోటల్లీ ఐ యామ్ ఇన్ ది బ్లడీ సూప్.....ఎలా దీన్లోంచి నేను బయటకు రాగలను....?"
నిస్పృహగా తల విదిలిస్తూ అన్నాడు సెల్వరాజ్.
మేఖల, సెక్రటరీలకు ఎప్పుడో మతులు పోయాయి.....ఎలా సాల్వ్ చేస్తాడు....?
కఠినమైన వాస్తవాల్ని మరచి కలలు కంటున్నాడా....?!
వాళ్ళు అలా ఆలోచిస్తుండగానే ఓ వ్యక్తి రెండు పెద్ద గ్రంధాల్ని తీసుకొని వచ్చాడు.
సెక్రటరీ వాటిని అందుకొని విమల్ కి అందించాడు.
విమల్ అప్పటివరకు తను చూస్తున్న ఫోటోల్ని ప్రక్కన పెట్టి వైల్డ్ లైఫ్ మేన్యువల్ ని అందుకున్నాడు.
ముక్తిమార్గం కోసం తపస్సు చేసే మహామునిలా ఆ మేన్యువల్స్ ని తిరగవేయటంలో మునిగిపోయాడు విమల్.
అతనేం చేయబోతున్నాడో....ఏం సలహా ఇవ్వబోతున్నాడో అర్ధం కాక మిగతా ముగ్గురూ ఉత్కంఠనే ఊపిరిగా చేసుకొని ఎదురు చూస్తున్నారు.
ఇక్కడిలా ఉండగా సెక్రటేరియట్ కి వెళ్ళవలసి వున్న మంత్రి ఆర్యభట్టు విమల్ సూచించబోయే పరిష్కారం ఏమై వుంటుందన్న ఆసక్తితో ఆగిపోయాడు.
ఆ ఆసక్తి తన కొడుకు సెల్వరాజ్ ని ఒడ్డును పడేస్తుందన్న ఆలోచనతో వచ్చింది కాదు. నిజంగానే ఆ సమస్యకు పరిష్కారం కనుగొన గలిగితే తను సృష్టించాలనుకుంటున్న మరో ఇండియా....న్యూ ఇండియా ప్రయోగానికి అతను పనికి రాగలడన్న ఆశాభావంతో వచ్చిన ఆసక్తి అది..
కాలం దొర్లిపోతోంది.
క్షణాలు.,....నిమిషాలైపోతున్నాయి.
ఆ గదిలో ఉన్న ముగ్గురిలో ఉత్కంఠ రెట్టింపవుతోంది. సరీగ్గా అరగంటకు ఆ రెండు మేన్యువల్స్ నుంచి కొన్ని పాయింట్స్ ని వేరే పేపర్ మీద వ్రాసుకున్నాడు విమల్.
మరికొద్ది సేపు కళ్ళు మూసుకొని మౌనంగా వుండిపోయాడు.
ఆ తరువాత సెల్వరాజ్ వేపు చూస్తూ చెప్పటం ప్రారంభించాడు.
"ఆ లాండ్ ని మనం ఏమీ చేయవద్దు. ఐమీన్ ఎలాంటి మార్పులు అందులో ప్రవేశపెట్టవద్దు. ఉన్నది ఉన్నట్లుగానే వుంచి వుపయోగించుకుందాం." గంభీరంగా అంటున్న విమల్ కేసి షాక్ తిన్నట్లుగా చూశాడు సెల్వరాజ్.
"హ్....? ఎలా...?" తికమకపడిపోతూ లో వాయిస్ లో అడిగాడు సెల్వరాజ్.
"వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్.....అక్కడున్న జంతువుల్ని మనం తరిమికొట్టవద్దు.
వాటినలాగే ఉంచుదాం. అందుకు గాను వన్యమృగాల రక్షణ సంస్థ నుంచి ఫండ్ తీసుకుందాం. ఆ తరువాత అటవీ శాఖ నుంచి కొన్ని నిధుల్ని తీసుకుందాం. ఆపైన టూరిజం శాఖ మరికొన్ని నిధుల్ని మనకు సమకూర్చుతుంది. వాటితో మనం ఆ లేండ్ వైల్డ్ లైఫ్ సెంచురీగా మారుద్దాం. డిస్నీ లాండ్ ఆఫ్ ఫ్లోరిడా.....
డిస్నీ లాండ్ ఆఫ్ కెనడా....అలాగే మనం దాన్ని మినీ డిస్నీ లాండ్ గా మారుద్దాం.....మనకొచ్చే నిధులతో మనం పెద్ద పెద్ద చెట్లపై మంచెలు నిర్మించి, వాటి మీద ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్స్ ఏర్పాటు చేద్దాం.
మనం అసలు నేలను వాడుకోవద్దు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి మధ్య కర్రలతో, ఇనుప తీగెలతో, తాళ్ళతో వంతెనలు ఏర్పాటు చేద్దాం. మనిషిలో వేటాడే వ్యసనం ఖచ్చితంగా వుంటుంది. అక్కడకు వచ్చే యాత్రికులకు బాణాలు సప్లయ్ చేద్దాం. పైనుంచే వాళ్ళు క్రింద తిరుగాడే జంతువుల్ని వేటాడుతారు.
అయితే బాణాల మూలంగా ఆ జంతువులు చనిపోవు. మూర్చపోతాయి. ఒక ఆర్టిఫిషియల్ టార్జాన్ ని కూడా సృష్టిద్దాం. చెట్లపైకి రెస్టారెంట్స్, కాటేజీలు నిర్మిద్దాం. హాలీడే రిసార్ట్స్ నిర్మిద్దాం.
ఒక్క మాటలో చెప్పాలంటే కృత్రిమమైన ఆటవిక ప్రపంచాన్ని సృష్టిద్దాం.....అలాంటి అనుభవం ఆధునిక మానవుడికి మనం అందిద్దాం. సినిమాల్లో, టీవీల్లో, పుస్తకాల్లో చూడటం తప్ప ప్రత్యక్ష అనుభవం అసాధ్యం, అది మనం కల్పిద్దాం.
స్టార్ హోటల్స్, బీచ్ రిసార్ట్స్ అందరికీ తెలిసినవే.....డబ్బున్న ఎందరికో అందుబాటులో వున్నవే.
అందరికీ అడవిని చూడాలని, అడవిలో తిరుగాడే జంతువుల్ని చూడాలనే ఆసక్తి వుంటుంది. కాని నిజంగా అడవిలోకి వెళ్ళాలంటే భయపడతారు.
కొత్త హరహా డిస్నీలాండ్.....వైల్డ్ లైఫ్ సెంచురీ....ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు.
టూరిస్ట్స్ దీని గురించి వింటే తప్పకుండా వస్తారు. అటు ఫారెన్ కరెన్సీ, ఇటు దేశీయ యాత్రికుల ఆగమనం మనకు బాగా లాభాల్ని తెచ్చిపెడుతుంది.
ఒకప్పుడు హైదరాబాద్ లో హుసేన్ సాగర్ చుట్టూ డిస్నీ లాండ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. కాని అది నిజరూపం దాల్చలేదు.
హర్యానా చౌతాలా డిస్నీలాండ్ ఏర్పాటు చేయాలని ఎంతో ఉత్సాహపడుతున్నాడు.
అమెరికా వెళ్ళే ప్రతి విదేశస్థుడు అక్కడున్న డిస్నీలాండ్ చూడకుండా రాలేడు. అసలు కొంతమంది డిస్నీలాండ్ ని చూసేందుకే అమెరికా వెళుతుంటారు.
మద్రాసుకి దగ్గరలో, నెల్లూరు టు మద్రాసు రైల్వే లైన్ కీ దగ్గరలో సముద్రానికి ఆనుకొని వున్న దీవిలో పన్నెండు వందల ఎకరాలలో వి.జి పన్నీర్ దాస్ వి.జి.పి. వండర్ లాండ్ ని ఏర్పాటు చేయటం జరిగింది.
అలాగే మహాబలిపురం వెళ్ళే రహదారిలో సముద్రానికి ఒడ్డున వి.జి.పి. గోల్డెన్ బీచ్ ని, వి.జి.పి.విలేజ్ ని పన్నీర్ దాస్ ఏర్పాటు చేశారు.
ఇప్పుడు వాటికి రోజుకి కొన్నివేల మంది యాత్రికులు వెళుతుంటారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంట్రన్స్ ఫి వసూలు చేయకూడదు. అందుకని అక్కడ మనిషికి పది రూపాయల చొప్పున బోర్డింగ్ క్రింద వసూలు చేస్తారు. లోపలకు వెళ్ళగానే ఆ పది రూపాయలకు తగ్గ టిఫెన్ ఫ్రీగా చేయవచ్చు. అందుకుగాను వి.జి.పి గోల్డెన్ బీచ్ కి, విలేజ్ కి, వండర్ లాండ్ కి టూరిజమ్ డిపార్టు మెంట్ రుణాలిచ్చింది. పన్నీరుదాసుని బాగా ప్రోత్సహించింది.
మన ప్రయోగం అంతకంటే అద్భుతమైనది. నగర జీవితంతో విరక్తి చెందివుండే ప్రజలకు డిస్నీ లాండ్ వింత అనుభూతిని కలిగిస్తుంది.
అటు జంతువులు కాపాడబడతాయి. ఇటు ఫారెస్ట్ సంరక్షింపబడుతుంది. మనకు దాన్ని బాగు చేసుకొనే ఖర్చు తప్పుతుంది.
ప్రపంచం మొత్తం మీదనే ఒక డిఫరెంట్ డిస్నీ లాండ్ గా గుర్తింపబడుతుంది.
ఈ సందర్భంలో మనకు టూరిజమ్ డిపార్ట్ మెంట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ వింగ్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ చట్టబద్దంగానే సహాయం అందిస్తుంది.
మనకు ఎదురయ్యే మంచైనా, చెడైనా, మనకు అనుకూలంగా మార్చు కోవటమే నా సిద్దాంతం. మనకు కలిగే నష్టాల్లోంచి సయితం లాభాలు ఆర్జించాలన్నదే నా అభిమతం.
దేన్నయినా ఇది మన మంచికేనేమో అని భావించే ఆశావాదిని నేను.
మన డిస్నీలాండ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరిగేలా చూసుకుంటే మీరు లక్షలు కోట్లు ఆర్జించవచ్చు.
విదేశీ యాత్రికుల ప్రవాహం మొదలయితే, షెడ్యూల్ బ్యాంకుల నుంచి, రిజర్వ్ బ్యాంక్ నుంచి, ఆర్ధిక శాఖ నుంచి మీకు గొప్ప సహకారం అందుతుంది.
విదేశీ యాత్రికుల ఆగమనం దేశ ఆర్ధిక వ్యవస్థకు గొప్ప పరిపుష్టిని చేకూర్చగలుగుతుంది.