పైట కొంగుతో కళ్ళు వత్తుకోబోతున్న ఆమెను చూసి త్రినాధ్ చటుక్కున ఆమెను సమీపించి ఓ చేత్తో ఆమె గడ్డాన్ని ఎత్తి పట్టుకుని మరో చేత్తో ఆమె కన్నీటిని తుడిచాడు.
ఆమె చప్పున త్రినాధ్ చేతుల్లో తన ముఖాన్ని దాచుకుని చిన్నపిల్లలా బావురుమంది.
అప్పుడు త్రినాధ్ కి కనిపిస్తున్నది ఆమె కాదు... తన ప్రాణానికి ప్రాణమైన సిద్దప్ప తల్లి.
త్రినాధ్ కళ్ళు చెమర్చాయి ఆ జ్ఞాపకాలతో.
"మీరేం దిగులు పడకండమ్మా! ఒక తల్లి పెద్దకొడుకును, చిన్న కొడుకును బాగుచేయమని మాతృవాత్సల్యంతో శాసించాలేగాని, బేలగా అడిగితే ఎలా?"
ఆమె చటుక్కున తలెత్తి త్రినాధ్ వైపు మెరుస్తున్న కళ్ళతో చూసింది.
"తమ డిపాజిట్స్ కి బ్యాంక్ గ్యారంటీ అడిగిన మా సిబ్బందికి సమాధానం చెప్పింది మీరు. ఈ ప్రపంచంలో ప్రతి తల్లి, తండ్రి తాము డబ్బు సంపాదిస్తే చాలు తమ పిల్లలు సుఖపడిపోతారని గిరిగీసుకుని తృప్తిపడుతుంటే మీరు మాత్రం మీకొడుకు కేవలం డబ్బుతోనే వృద్ధిలోకి రాడని, ఎన్నో నేర్చుకోవాలని, ఆ నేర్చుకోవటం అన్నది డబ్బుతో కొనలేనిదని గ్రహించి నిజమైన తల్లనిపించు కుంటున్నారు. నేనెవరో తెలియదు. నా స్థితిగతులేమిటో తెలియదు. అయినా 6 లక్షల 80 వేలకు గ్యారంటీ ఇచ్చారు. వీటి వెనుక నన్ను ఆదుకోవాలన్న ఔదార్యం, మీ కొడుకును బాగుచేసుకోవాలన్న మాతృప్రేమ- చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా మీ భావాలకు. సంతానానికి వారసత్వంగా ఇచ్చే ఆస్తులకన్నా ఆత్మస్థయిర్యం గొప్పదని, అంతస్తులకన్నా ఆత్మాభిమానం, ఆదర్శాలు గొప్పవని, నాలుగు డబ్బులతో సోమరిగా సుఖపడటం కన్నా నలుగురితో శభాష్ అనిపించు కోవటం గొప్ప అనే మీ ఆలోచనలు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాయి. ఈరోజునుంచి బోస్ నాతోనే వుంటాడు. మరోసారి మీతో కంటతడిపెట్టించే స్థితికి దిగజారడు అని నేను హామీ ఇస్తున్నాను" అన్నాడు త్రినాధ్ ఆవేశంగా.
ఆమెకిప్పుడు తృప్తిగా వుంది, కృతజ్ఞతగా త్రినాధ్ వేపు చూస్తూ వెళ్ళిపోయిందామె.
కొద్ది నిమిషాలు ఆ గది నిశ్శబ్దంగా వుంది.
"ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన మొదటి పని హిందూకి క్షమాపణలు చెప్పటం ఆ తరువాత ఆమెకు తోడుగా వుంటూ మన బిజినెస్ వ్యవహారాలు చూడటం, అందుకుగాను నేనిచ్చే నెలసరి జీతంలోనే నీ తిండి బట్ట గడిచిపోవాలి. ఈరోజు నుంచి మీ నాన్న సంపాదనలోంచి పైసా కూడా ముట్టుకోకూడదు." సౌమ్యంగానే అన్నా త్రినాధ్ మాటల్లో ఒకింత కరుకుదనం తొంగి చూసింది. ఆ కరుకుదనంలో వేడివుంది. ఆ వేడితోనే అతన్ని మలచాలనే భావన వుంది.
ఆరోజునుంచే వసుంధరా ఇండస్ట్రీస్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
* * * *
"నువ్వా వివరాలు ముందుగా నాకు చేరవేసివుంటే ఆ సిబ్బంది డిపాజిట్స్ కట్టకుండా ఆపగలిగేదాన్ని" ఐదు పచ్చనోట్లు సైంటిస్ట్ వైపు నిర్లక్ష్యంగా విసురుతూ అంది ప్రియాంక.
"ఇప్పుడయినా ఆ పని చెయ్యొచ్చుగదా?" అతనికి త్రినాధ్ ప్రగతి కంటగింపుగా వుంది. వేలకు వేలుపోసి బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లో చదివిన తన చదువు, గోల్స్ మెడల్స్, పి.హెచ్.డి, డిగ్రీ తనకేం సాధించిపెట్టలేదు. అలాంటిది ఏ చదువూ లేకుండా, ఆర్ధికపరమైన అండదండలు లేకుండా పెరిగిన ఒక పాపర్ లాంటి త్రినాధ్ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు.
ఈ దేశంలో ఏదీ సాధించలేనివాడు- ఒకడు ఏదో ఒకటి ఎంతో కొంత సాధిస్తూ పోతుంటే, వాడితో తనకెలాంటి వైరం లేకపోయినా సరే వాడిని చూస్తూ పట్టుదల పెంచుకోడు. ఉత్తేజితుడవ్వడు సరికదా అకారణ శత్రుత్వాన్ని ప్రకటిస్తాడు. ఆ శత్రుత్వం అతని మానసిక రుగ్మతలోంచి పెల్లుబికే అసూయ మూలంగానన్న విషయాన్ని అతను గ్రహించేలోపు ఒక సివిక్ గా మారిపోతాడు. మన విలువైన కాలాన్ని మన అభివృద్ధికి వినియోగించుకోకుండా ఇతరుల అభివృద్ధిని చూసి నిప్పులు కురిపించటానికే సరిపెట్టుకుంటే మనిషి మృగంగా మారతాడు. మారణాయుధం అవుతాడు. అకాల మృత్యువుకు గురైపోతాడు.
ఇది ఒక్క సైంటిస్ట్ విషయంలోనే కాదు. ఈ దేశంలో కోట్లాదిమంది విషయంలో నిర్ధారణ అవుతున్న నగ్నసత్యం.
"చేస్తాను. అది సరే- ఇప్పుడతను చేయబోయే వ్యాపారం ఏమిటి?" ప్రియాంక తరచి అడిగింది.
"ఏదో ఆయిల్ ప్రోడక్ట్--"
ప్రియాంక అతనివైపు చిరాగ్గా చూస్తూ- "నీకు ఉద్యోగం లేదు. అతను ఇస్తానంటే వద్దన్నావ్. నీకై నీవు తెచ్చుకోలేవు. పోనీ కనీసం కొంత రహస్య సమాచారం సేకరించటం కూడా నీకు సాధ్యం కావటంలేదు. మరెలా నీకు గుర్తింపు లభిస్తుంది?" అతన్ని రెచ్చగొడుతున్నట్టుగా అంది.
అతను ముఖం గంటు పెట్టుకున్నాడు. ఇంత చదివిన తనను ఉపయోగించుకోలేక పోతున్నందుకు ఈ వ్యవస్థ మీద, దేశం మీద కసిగా, కోపంగా వుండేది యింతకాలం. ఇప్పుడు అందమైన ఆడపిల్ల మెప్పు సంపాదించలేక పోతున్నాననే ఉక్రోషం, కోపం అతనిలో చోటుచేసుకుంటున్నాయి.
అతనో నిర్ణయానికి వచ్చినవాడిలా దిగ్గున లేచి చరచరా బయటకు నడిచాడు.
* * * *
సాయంత్రం 6 గంటలు కావస్తోంది.
ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోవడంతో ఆ హాలంతా నిశ్శబ్దంగా వుంది.
త్రినాధ్ బోస్ ని ఆ రోజుకిక వెళ్ళమన్నట్టుగా చూశాడు.
బోస్ లేచి ఒకడుగు వేసేసరికి వెనుకనుంచి మాటలు వినిపించాయి.
"ప్రతి మనిషి తన కాళ్ళమీద తను నిలబడేందుకు ప్రయత్నించాలి.
మోకాళ్ళమీద నిలబడే ఒక జంటిల్ మన్ కన్నా, కాళ్ళమీద నిలబడగలిగే ఒక పేద రైతు ఎంతో గొప్ప.
ఇక్కడ మోకాళ్ళు అంటే తల్లిదండ్రులు, వాళ్ళు సంపాదించే ఆస్తిపాస్తులు అనర్ధం. పట్టుదలగా శ్రమించావో- ఆ ప్రియాంకకు అతి కొద్దికాలంలోనే బుద్ధి చెప్పగలవు.
నీ డైరీలో రాసుకోవల్సిన మొదటి వాక్యం గుర్తుంచుకో.
A tiller on his feet is higher than a gentleman on his knees ఇక వెళ్ళిరా" అన్నాడు గంభీరంగా త్రినాధ్.
* * * *
"అతని దగ్గర పనిచేసే సిబ్బంది 20 మంది. ఆ ఇరవైమంది అడ్రస్సులు సేకరించు. ఆ తరువాత ఒక్కొక్కర్ని నీ గ్రిప్ లోకి తీసుకో. వాళ్ళు వసుంధరా ఇండస్ట్రీస్ లో ఉద్యోగం మానేయాలి. వారి డిపాజిట్స్ ని వెనక్కు తీసుకోవాలి. ఈ పనెంత త్వరగా జరిగితే అంత మంచిది" అంది శాసిస్తున్నట్టు ప్రియాంక.
అతను సుదర్శన్ రావు ఆఫీసులో పనిచేసే ఉద్యోగి.
అంతకుముందే సుదర్శన్ రావు అతన్ని, మరొకతన్ని పిలిపించి "ఈరోజు నుంచి మీరు నా దగ్గర పనిచేయక్కర్లేదు. మా బేబీ దగ్గర చేయాలి. ఆమె ఏం చెబితే అది చేయండి" అని శాసించాడు.
అందుకే అతను ప్రియాంక చెప్పినదానికి వినయంగా తలూపి బయటకు నడిచాడు.
మరోసారి అతనివేపు చూస్తూ "అతనేం వ్యాపారం చేయబోతున్నాడో తెలుసుకో. తెల్సుకున్న మరుక్షణం అతనికి లైసెన్స్ దొరక్కుండా చేయాలి... ఇక నువ్వు వెళ్ళవచ్చు" అంది శాసిస్తున్నట్టుగా.
వాళ్ళు వెళ్ళిపోయాక ప్రియాంక ఒకింత అలసటగా బెడ్ మీద వాలిపోయింది.
చిరుతపులిలాంటి బోస్ ని ఎలా త్రినాధ్ తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగాడు...?
ఆ... వీడేం చేయగలడనుకున్న త్రినాధ్ చూస్తుండగానే కంపెనీ ప్రారంభించాడు.
మహా మేధావి మాలినితో పరిచయం ఏర్పడింది.
ఏమిటి ఈ మార్పుల పర్యవసానం... ?
తన తండ్రిలాగే తను త్రినాధ్ ని ఎందుకు నిర్లక్ష్యం చేయలేకపోతోంది? అంటే... అతని సామర్ధ్యాన్ని నమ్ముతున్నట్లేగా?
ఆ ఆలోచన రాగానే ఆమె ఓ క్షణం ఉలిక్కిపడింది.
ఛా... ఛా... అతని సామర్ధ్యాన్ని తను విశ్వసించడమేమిటి... ?
మరి... విశ్వసించనప్పుడు అతని కార్యకలాపాలపై తనెందుకు ఆసక్తి కనపరుస్తున్నట్టు...?
కొద్దిక్షణాలు అశాంతిగా బెడ్ మీద కదలాడింది. అలా కదలాడుతుండగానే ఆమె దృష్టి బెడ్ కి ఎదురుగా గోడలో తాపడం చేయబడిన నిలువెత్తు అద్దంమీద పడింది.
అంతే... చటుక్కున లేచి కూర్చుంది. అలా సడన్ గా లేచి కూర్చోవడానికి కారణం, ఆమెలోని ఆలోచనలు కాదు- అద్దంలో అందంగా, తడిదేరి గులాబీ రంగులో మెరుస్తున్న ఆమె పెదవులే.
ఆమెకు గతం ఒక్కసారి కళ్ళముందు నిలిచింది. పదిమందిముందు తన పరువును తక్కువ చేస్తూ త్రినాధ్ వేసిన ముద్ర... తొలి ముద్దు ముద్ర... అనాలోచనో, కోపమో తెలియని పిచ్చి ఆవేశంలో తన లేత పెదవుల్ని కసిగా కొరికేసుకుంది. ఆ మరుక్షణం ఉప్పగా తగిలింది నులివెచ్చని వేడి రక్తం.
అన్ని విధాల సమర్ధుడనిపించుకున్న, అనితరసాధ్యుడైన అందగాడికే తన పెదవుల మధురిమ దక్కాలనుకున్న మధురోహలు అనుకోని విధంగా ఓ మొరటువాడి సాహసానికి ఎంగిలిపడ్డాయి.
ఆమె కసిగా పళ్ళు పటపటా కొరికింది. పెల్లుబుకుతున్న ఉక్రోషము,
తనేం చేస్తుందో తనకే తెలియని ఉన్మాదంలో చరచరా వంటగది వేపు నడిచింది.
వంటగది చీకటి నిశ్శబ్దంలో నిద్రబోతోంది. చటుక్కున లైట్ వేసి గ్యాస్ స్టవ్ ని వెలిగించింది. ఫోర్క్ నొకదానిని తీసుకొని ఆ మంటపై పెట్టింది.
తన పెదవుల్ని తనే నాశనం చేసుకోవాలన్నంత సెల్ఫ్ శాడిజమ్ ఆమెలో బుసలు కొడుతోంది.
సరిగ్గా నిమిషానికి ఫోర్క్ వేడెక్కింది. ఉన్నట్టుండి ఆమె కెవ్వున కేక వేసింది.
బంగ్లాలో అందరూ ఉలిక్కిపడి నిద్రలేచారు ఆ కేకకు. ఒక్కొక్కరు ఒక్కో వేపునుంచి ప్రియాంక గదివేపుకి దూసుకుపోయారు.
సరీగ్గా అప్పుడే ఆ గది తలుపులు పెద్దశబ్దం చేస్తూ మూసుకుపోయాయి. జరిగిందేమిటో అర్ధంకాక మూసుకున్న గది తలుపుల వేపు చూస్తూ నిరుత్తరులైపోయారు.
* * * *
గుప్తాకి దిగులుగా వుంది.
తను దొంగిలించిన సొమ్ము తిరిగి దొంగిలించబడింది. అది ఆ సుదర్శనరావు పనే. అలా అని ఆవేశపడటమేతప్ప నిరూపించలేని నిస్సహాయత తనది.
కోర్టు తీర్పు ప్రకారం మొదటి వాయిదా పాతికవేలు కట్టవలసిన సమయం దాటిపోయింది.
ఇప్పుడిక తను జైలుకి వెళ్ళవలసిందీ, లేనిదీ తేల్చవలసింది సుదర్శన్ రావు మాత్రమే.