"ఓ పక్క తాటికాయంత అక్షరాలు కనపడుతూ వుంటే, నిజమేనంటారా ఏమిటండీ?" అంది కళ్యాణమ్మ.
"వాడు నా తమ్ముడే!" గర్వంగా అన్నాడు లక్ష్మణమూర్తి.
"సరేలెండి మీకన్నా ముందు నాకుతెలుసు. మరిదిగారికి వున్న తెలివితేటలు ఎవరికీలేవు. ఏ పనిచేసినా గప్ చిప్ గా చేస్తాడు. చేసేపనికూడా గొప్పగా వుంటుంది. మగవాడనం తరువాత అలాంటి గోప్పపనులే చేయాలి."
"అమ్మా! ఇప్పుడందరూ మెచ్చుకుంటున్నారుగానీ, ఈ ఇంట్లో అన్నయ్యని వెక్కిరించనిది ఎవరు? వాడు తలుపులు వేసుకున్నా తప్పే, ఒక వందరూపాయలు అడిగితే వెయ్యి ఆరాలు, మరొక వెయ్యిసార్లు ఎత్తిపొడుపులు.
ఫలానాది అని తెలియదుకానీ, చిన్నన్నయ్య ఎప్పటికైనా ఏదో పెద్దదే సాధిస్తాడని నాకు నమ్మకం. అందుకనే నేను ఎప్పుడూ ఏమీ అనేదాన్ని కాదు. ఇప్పుడు నేను కలెక్టర్ గారి చెల్లెల్ని హ్హహ్హహ్హా!" అంది సుమిత్ర తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.
"వాడు నిజం చెబితే ఎవరం ఏమీ అనేవాళ్ళంకాదు కాదే! అన్నింటికీ రెటమతం సమాధానాలూ, ఎదురుతిరిగిమాట్లాడటాలూ, పైగా వాడి మాటలు విని హడలిచచ్చేలాగా, తుపాకీపెట్టి కాల్చేయాలీ, కత్తితో పొడవాలి, నరికిప్రోగులు పెట్టాలి అంటూంటే ఎవరికి మాత్రం భయంవెయ్యదు?"
కళ్యాణమ్మ మాట పూర్తిచెయ్యక ముందే "అమ్మా!" అని పిలుస్తూ వాళ్ళముందుకి వచ్చాడు బోసుబాబు.
మితిమీరిన ఆనందం వస్తే, ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. అందరూ ఒక్కసారిగా లేచి నుంచెని బోసుబాబుని పొగిడేశారు.
బోసుబాబు మాత్రం మామూలుగా వున్నాడు. అతని పెదవులు మాత్రం చిరునవ్వు చిందిస్తున్నాయి. "కూర్చోండి! కూర్చోండి! ఈ యింట్లోవాళ్లు ఏదొచ్చినా పట్టలేరు. నేనేమీ ఘనకార్యం చేశాననుకోవటంలేదు. పేపర్ ఫ్రంట్ పేజీలో ఎక్కాలనుకున్నాను, ఎక్కాను.
నా యీ కోరిక తీరటానికి ఎంతో పట్టుదలగా, రాత్రింబవాళ్లూ కృషిచేశాను. మీ తిట్లే నాకు దీవెనలయ్యాయి. మీరు రెచ్చగొట్టిన కొద్దీ నాలో పంతం, పౌరుషం, పట్టుదలా పెరిగాయి...." అంటూ శాంతంగా చెప్పుకొచ్చాడు బోసుబాబు.
"నిజమేరా! నీ తెలివి గుర్తించక ఏదోకటి అనేవాళ్ళం. ఇంతకీ నీవలా తలుపులువేసుకునే లోపల ఏం చేసేవాడివి? ఇప్పటివరకూ అది ఎవరికీ అర్ధం కాలేదు?" కళ్యాణమ్మ అడిగింది.
"నేను మొదటినుంచీ ఫస్ట్ క్లాసులతో పాసవుతూ వచ్చాను. ఆటల్లో ఫస్ట్ వచ్చేవాడివి, చదువులో ఫస్ట్ వచ్చేవాడిని. ఏం లాభం నాకంటూ చిన్న ఉద్యోగం రాలేదు. ఎక్కడచూసినా అన్యాయాలూ, మోసాలూ, అప్లికేషన్లకి డబ్బుతగలేయటం తప్ప, జాబ్ వచ్చింది అంటూ ఏమీ లేదు. వెయ్యిరూపాయల ఉద్యోగానికి లక్షరూపాయల లంచం. ఈ వ్యవస్థ ఇలా అఘోరిస్తూ ఉంటే, మండిపోక ఏంచేస్తుందమ్మా!
ఓ పక్క నేను బాధపడుతూవుంటే, ఉద్యోగం రాకపోవట నా తప్పన్నట్లు ఇంట్లో మీరందరూ వెక్కిరించేవాళ్ళు. హేళనచేస్తూ మాట్లాడేవారు. ఈ వ్యవస్థమీద మీ అందరిమీదా, చదువుమీదా అంతులేని కసి ఏర్పడింది. ఇంకా చదువుతానూ అని చెబితే మీరు నన్ను ప్రోత్సహించకపోగా, వెక్కిరించే అవకాశమే ఎక్కువ వుంది.
రాత్రింబవళ్ళూ చదువుమీద మనస్సు లగ్నం చేయాలనుకున్నాను. కార్యసాధనకు పట్టుదల ముఖ్యం. అందుకనే పట్టుదల నాకు నేనే ఛాలెంజు చేసుకున్నాను. నా శ్రమని ధారపోసి క్షణం వేస్టు చేయకుండా చదువుతాను. ఈ దెబ్బతో కొట్టానా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. లేదా, అధికార దుర్వినియోగుల్ని నలుగురిని చంపి, నేను చద్దామనుకున్నాను.
నా ఆలోచనలు అంతదూరం పోయాయి. బహుశా ఈ రకమైన పట్టుదలే నాకీ విజయం సంపాదించి పెట్టి వుంటుంది. మీరు రెచ్చగొడుతూ వుంటే నాకు పిచ్చికోపం వచ్చేది. ఇప్పుడు అనుకుంటున్నాను. మీరు రెచ్చగొట్టబట్టే నేనిలా అద్భుతంగా ఫలితం సాధించగలనూ అని. ఈ విషయం నాకు నిన్ననే తెలుసు. పేపర్లో నా ఫొటో చూసి మీరందరూ పేపర్ చదివాకనే ఈ విషయం చెబుదామని ఆగాను" అంటూ బోసుబాబు విషయాన్ని వివరంగా వారికి చెప్పాడు.
"అనవసరంగా బోసుబాబుని తిట్టామే" అన్న పశ్చాత్తాపం వాళ్ళ ముఖాలమీద ఆవరించింది.
అందరినీ ఒక్కసారిగా కలయజూసి, "ఈ విషయం మీరు సీరియస్ గా తీసుకోవద్దు. వైద్యుడు చేదుమందు ఇచ్చినా రోగి బ్రతకటం ముఖ్యం. మనింట్లో అదే జరిగింది టేకిట్ ఈజీ!" చాలా తేలికగా అన్నాడు బోసుబాబు.
కొద్దిసేపు గలగలా ఆనందంగా మాట్లాడుకున్నారు అందరూ.
పట్టపగ్గాలు లేని ఆనందం, వాళ్ళందరినీ పరవశించేస్తోంది.
తెలిసినవాళ్ళకి ఈ శుభవార్త చెప్పటానికి అప్పటికప్పుడే జగన్నాధం, లక్ష్మణమూర్తి బయటకి వెళ్ళారు.
మాట్నీ సినిమాకి తీసుకెళ్ళి పార్టీ ఇస్తానని చెప్పటానికి సుమిత్ర ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళింది.
కల్యాణమ్మ పక్కింటికి వెళ్ళింది. పక్కింటావిడ చెవిలో ఈ వార్త వేద్దామని.
ఇంట్లో వదినా, మరిదీ మిగిలారు.
బోసుబాబు దగ్గరికి వచ్చింది సామ్రాజ్యలక్ష్మి.
"నిన్ను చాలాసార్లు హేళన చేసాను. మరిదీ! అదేమీ మనస్సులో పెట్టుకోకు!" సామ్రాజ్యలక్ష్మి భయపడుతూ అంది. ఇప్పుడు మరిది అంటే మామూలు మరిదికాదు కలెక్టరాయె.
"వదినా! అమ్మ తరువాత నువ్వే అమ్మవి నిన్నే ఒకసారి నేను ఏడిపించాను. పరీక్ష పాసయినందుకు ఒక పట్టుచీరా, నిన్ను ఏడిపించినందుకు మరో పట్టుచీరా. వదినగారికి రెండు పట్టుచీరలు కొనిస్తాను గిఫ్ట్ గా!" అన్నాడు నవ్వుతూ బోసుబాబు.
"రెండు పట్టుచీరలు!" సామ్రాజ్యలక్ష్మికి మూర్చ వచ్చినంతపనయింది.
బోసుబాబు నవ్వుకుంటూ బయటకి వెళ్ళాడు.
28
"డాక్టర్ సుఖదేవ్ పాండే"
"ఎమ్ డి. పైకో.డి.పి.యం.ఎఫ్.ఐ.పి.యస్"
మానసా నర్సింగ్ హోమ్ స్థాపించిన, డాక్టర్ సుఖదేవ్ పాండేకి, వున్న ఊరిలోనే కాక, దూరతీరాలలో కూడా మానసిక రోగుల విషయంలో వ్యాధులు నయం చేయడంలో ఆయన పేరు మారుమ్రోగిపోతూంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు ఈయన నర్సింగ్ హోమ్ కి వస్తూంటారు. ఏ రకమైన మానసిక వ్యాధి అయినా చేయిపడితే వెంటనే తగ్గుతుంది.
ఈ మధ్య, ఇన్ స్పెక్టర్ మనోజు, తన మామయ్య మీదే పరిశోధన మొదలుపెట్టాడు. ఆయన ఒంట్లో బాగోలేదని చెప్పటం అదే పనిగా దీర్ఘాలోచన చేయడం, విపరీతమైన మతిమరుపు. మాట్లాడితే ఏదో మాట్లాడటం, లేకపోతే పూర్తిగా మౌనం వహించటం. ఇదంతా చూసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు మనోజు.