పెద్దతనం వల్ల దీర్ఘాలోచన వల్ల. నిద్రపట్టక పోవటం మతిమరుపు ఈ వయస్సులో సహజమే అంటూ, డాక్టర్ కాంపోజు మాత్రలు ఇచ్చి పంపించాడు.
మనోజుకి ఆ డాక్టర్ వైద్యం మీద తృప్తి కలుగలేదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకు వెడతానని అడిగితే ఛటర్జీ రానంటే రానన్నాడు. ఒకటికి పదిసార్లు చెప్పినా కించిత్ ప్రయోజనం లేకపోయింది.
సైకియాట్రిస్ట్ దగ్గరికి రానని మామయ్య ఎందుకు మొండిపట్టుదల పడుతున్నాడో మనోజుకి అర్ధం కాలేదు.
విషయమేమిటో మామయ్యనే అడిగితే సరిపోతుంది కదా! అనుకున్నాడు మనోజ్. అడగటానికి లంచ్ సమయం ఎన్నుకున్నాడు.
ఇరువురు భోజనానికి కూర్చున్నారు.
ఛటర్జీ సరీగ్గా భోజనం చేయకుండా ప్లేటులో చెయ్యి మాత్రం కదుపుతూ అన్నాన్ని కెలుకుతున్నాడు.
మనోజ్ రెండు నిమిషాలు చూశాడు.
"మామయ్యా!"
ఛటర్జీ మాట్లాడలేదు.
"ఓ....మామయ్యా!"
ఈతఫా మనోజ్ గట్టిగా పిలిచేసరికి ఛటర్జీ చిన్న ఉలికిపాటుతో తెప్పరిల్లి "పిలిచావా!" అన్నాడు.
"మైడియర్ అంకుల్! నేను పిలువలేదు. నీ చెవి దగ్గర అరిచాను. మనోజ్ చిరునవ్వుతో చెప్పాడు.
ఛటర్జీ నవ్వేశాడు. "బాగుందిరా అబ్బాయ్!" అన్నాడు.
"బాగుందా: ఏమిటి బాగుంది అంకుల్! పొదీన ఆకు చట్నీయా! పాలకూర పప్పా, బీట్ రూట్ కర్రీయా!" మనోజ్ ప్లేటులోకి చూస్తూ అడిగాడు.
అప్పుడు చూసుకున్నాడు ఛటర్జీ తను తింటున్న ప్లేటు వేపు.
ప్లేటులో భోజనం ఎలా వడ్డించింది అలా వుంది. పొదీనాకు చట్నీ బీట్ రూట్ పాలకూర పప్పు ఎడాపెడా అన్నంలో కలిసి అచ్చం కోడి కెలికినట్లు వుంది. వేళ్ళతో కెలకటం తప్ప నోట్లోకి వక్కమెతుకు వెళ్ళకపోవటం వల్ల అన్ని కలిసిపోయాయి.
మామయ్య ప్లేటులోకి చూసి నాలుక కొరుక్కోటం గమనించిన మనోజ్ "మామయ్య! విషయం అదన్నమాట....!" అన్నాడు.
"విషయం అది ఇది అనకపోతే చెప్పొచ్చుకదా?" చిరుకోపం నటిస్తూ అన్నాడు ఛటర్జీ.
"బాగుంది మామయ్య! చిన్నపిల్లలకయితే చెపితే వినకపోతే ఓ కసురుకసిరి చెప్పొచ్చు. పెద్దవాళ్ళ విషయంలో....
"చాలు చాలు. చెప్పేదేదో గట్టిగా చెప్పక ఈ నాన్చుడు వ్యవహారందేనికి?"
"నేను అడిగిన దానికి సమాధానం కూడా గట్టిగ ముక్కుసూటిగా వుండాలి. అలా అయితేనే అడుగుతాను" మనోజ్ తెలివిగా అన్నాడు.
"అలాగే" బుద్ధిమంతుడిలాగా వప్పుకున్నాడు ఛటర్జీ.
"నీకీమధ్య మతిమరుపు, పరధ్యాన్నం ఏర్పడ్డాయంటే ఒప్పుకోలేదుకదా మామయ్యా! మరి ఇప్పుడు ఇరువురుమూ ఒకేసారి భోజనానికి కూర్చున్నాము. నేనేమో అప్పుడే కూర, ఛట్నీ పూర్తిచేసి పప్పన్నం కలుపుకోటం లోనికి వచ్చాను. నీవేమో ఇంకా మొదటి ముద్ద కూడా తినలేదు. మూడు ఐటమ్స్ కలిపి...."
"ఆగాగు నీ ప్రశ్న నాకు అర్ధం అయింది. నేను కావాలని మూడు పదార్ధాలు కలగాపులగం చేయలేదు. మనం పప్పు అయ్యేది కూర అయ్యేది విడివిడిగా కలుపుకు తిన్నా, కడుపులోకి వెళ్ళాక అన్నీ కలగా పులగం అవుతాయి కదా! ముందుగానే మనం అన్న ఒకేసారి కలుపుకుని తింటే సరిపోతుంది కదా! అన్నీ కొత్త ఆలోచనరాగా మూడు పదార్ధాలు అన్నంలో కలిపేశాను." ఛటర్జీ చిరునవ్వుతో చెప్పాడు.
"మామయ్యా! నీవు ఆడిన అబద్ధం కప్పి పుచ్చుకోవటానికి బాగానే వుంది కాని, నమ్మశక్యంగా మాత్రం లేదు." అలా అనుకున్న మనోజ్ పైకి.
"అలాంటప్పుడు ఒక పని చేస్తే బాగుంటుంది మామయ్యా!"
"ఏమిటా పని?" ఛటర్జీ ఆత్రుతగా అడిగాడు.
"వేరు వేరుగా పదార్ధాలు వండుకునే బదులు ఓ బీట్ర్రూట్ ముక్క జాస్త పాలకూర, గుప్పెడు పొదీనాకు తిరగమాతలో పారేసి అదే తినేస్తే పోలా! ఇలా విడిగా చేసే శ్రమా తగ్గుతుంది, సమయం కలిసి వస్తుంది కదా!"
"అప్పుడప్పుడూ అలాగూ చేస్తుంటాము కదా! దాని పేరు కూటు అంటారు."
"ఆ! ఆ! ఆ కూరేటే. రేపటినుంచీ అలాగే చేసుకుతిందాం! ఈ రోజుకు మాత్రం ఏ పదార్ధానికి ఆ పదార్ధం కలుపుకుని తిను మామయ్యా!" మనోజ్ అన్నాడు. మామయ్య అవస్తని గమనించి.
చెప్పటమయితే కబుర్లు చెబుతున్నాడు గానీ, ఛటర్జీకి మూడు కలగా పులగం చేసిన అన్నం తినటం కష్టంగానే వుంది.
"నా ఆలోచలేవీ సవ్యంగా వుండవురా మనోజ్! అన్నీ కలిపి వండిన పదార్ధాలు తినడం తేలికేగానీ వేరు వేరుగా వండి ఒక పదార్ధంగా కలుపుకుని తినడం కష్టం. నా పరిశోధన ఫలించలేదు. ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే రెండు ముద్దలు వాంతి అయ్యేటట్లు వుంది." అంటూ ఛటర్జీ అన్నీ కలగా పులగం చేసిన అన్నాన్ని ఖాళీ డిష్ లో పడేసి మూతపెట్టి వేరే అన్నం వడ్డించుకొని తినటం మొదలుపెట్టాడు.
అసలు విషయం ఎలా ఎత్తాలో మనోజ్ కి అర్ధంకాలేదు.
"పొదీనాకు పచ్చడి చాలా బాగుంది కదా!" ఛటర్జీ మరికాస్త పచ్చడి మారు వడ్డించుకుంటా అన్నాడు.
"చట్నీయే కాదు మామయ్యా! ఈ రోజు అన్నీ బావున్నాయి. ముఖ్యంగా పొదీనాకు జ్ఞాపకశక్తికి చాలా మంచిది."
మనోజ్ మాటలకి ఛటర్జీ నవ్వాడు. నవ్వటంలో పొలమారింది. మాడు మీద కొట్టుకుంటూ నన్నెవరో తలచుకుంటున్నారు రా! ఆ ఇంకెవరు తలచుకుంటారు నా బంగారుతల్లే తలచుకుంటూ వుంటుంది. దానికి లెటర్ రాసి వారంపైనే అయింది. నా మతిమరుపు మండిపోను మళ్ళీ లెటర్ రాయాలి మర్చేపోయాను సుమా! భోజనం కానిచ్చి వెంటనే లెటర్ రాయాలి. లేకపోతే మళ్ళీ మర్చిపోయే ప్రమాదం వుంది." గబగబా భోజనం కానిస్తూ అన్నాడు.
అనుకోకుండా ఛటర్జీ నోట్లోంచి మతిమరుపు అనే మాట వచ్చింది. మనోజ్ కి సమయం వచ్చింది.
"మామయ్యా! నేను అంటే కోపం గానీ నీకీ మధ్య చాలా మతిమరుపు వచ్చింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా వుంటున్నావు. నా మాట విని ఒకసారి డాక్టర్ దగ్గరకి వెళ్ళొద్దాం మామయ్యా!" మనోజ్ అన్నాడు.
"నీ గోల భరించలేక డాక్టర్ దగ్గరకి వెళ్ళొచ్చాం కదా! పెద్ద వయస్సులో మతిమరుపు సహజమే అంటూ కాంపోజ్ మాత్రలు ఇచ్చి పంపించాడు. కాంపోజ్ మాత్రలు నిద్రపట్టకపోతే యిస్తారు గాని, మతిమరుపుకి యివ్వరు. ఏం డాక్టర్లురా వీళ్లు. బోడిగుండు మీద జుట్టు మొలవటం ఎలా అని వెళితే మోకాలి చిప్పకి ఆపరేషన్ చేసి కట్టుకట్టి పంపించే రకాలు వీళ్ళు. వీళ్ళ డాక్టర్లు! రేపు షాలిని వచ్చిన తరువాత దానిదగ్గర ట్రీట్ మెంట్ తీసుకుంటాను." ఛటర్జీ గట్టిగా చెప్పేశాడు.