Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 36

    హడావిడిగా పరిగెత్తుకొస్తున్న విమలను చూసి ఆగిపోయాడు డాక్టర్.
   
    "డాక్టర్! డాక్టర్!" రొప్పుతోంది విమల.
   
    "ఏం జరిగిందమ్మా?" డాక్టర్ ప్రశ్నించాడు.
   
    "కృష్ణ నిద్రలేచాడు. సుధనూ, నన్నూ బయటికి గెంటేసి తలుపులు బిగించుకున్నాడు. లోపలేం చేస్తున్నాడో తెలియడంలేదు. సుధక్క ఎంత బతిమాలినా తలుపు తియ్యడంలేదు" గాభరాగా చెప్పింది విమల.
   
    డాక్టర్ చంద్ర చివాలున లేచి ఇద్దరు అసిస్టెంట్సును తీసుకొని, పదమూడో నంబరు గదికేసి బయలుదేరాడు.
   
    రమణమూర్తి, చౌదరీ, విమలా డాక్టర్ ని అనుసరించారు.
   
    పదమూడవ నంబరు గదిముందు నిలబడి డాక్టర్ తలుపు తట్టి పిలిచాడు.
   
    లోపలనుంచి సమాధానం లేదు.
   
    "నేను! డాక్టర్ ని పిలుస్తున్నాను తలుపు తెరువ్!"
   
    సమాధానంలేదు.
   
    "ఐయామ్ డాక్టర్ కాలింగ్ యూ! యు మస్టు ఆన్సర్ మీ!"
   
    "డాక్టర్ కంఠం గంభీరంగా ఉంది. స్పుటంగా ఉంది.
   
    అలా రెండుసార్లు పిలిచాక అతడి కంఠస్వరం తమాషాగా మారిపోయింది. మెత్తగ, సన్నగ, సాత్వికంగ మారిపోయింది.
   
    "హల్లో! జగన్మోహన్? జగన్మోహన్! ప్లీజ్ తలుపు తెరువు. నన్ను లోపలకు రానియ్. జగన్ మోహన్ తలుపు తీస్తున్నావుకదూ? అవును తీస్తున్నావ్! తీశావ్-"
   
    మెల్లగ తలుపు తెరచుకొంది.
   
    అందరినీ బయటే ఉండమని డాక్టర్ ఒక్కడే పదమూడవ నంబరు రూమ్ లో ప్రవేశించాడు.
   
                                                                      24
   
    సాయంత్రం 6 గంటలైంది.
   
    అప్పటికే రమణమూర్తి, చౌదరీ, సుధా, విమలా సైకోలాబ్ లో ఓ మూల ఒదిగి కూర్చొని ఉన్నారు.
   
    అది పొడుగాటి హాలు!
   
    హాలుపక్కగా రెండు గదులున్నాయి.
   
    ఓ గదిలో నుంచి డాక్టర్ చంద్ర బయటికొచ్చాడు. అతడు రాగానే గది తలుపులు మూయబడ్డాయి.
   
    డిమ్ లైటులో ఒకరి ముఖాలొకరికి సరిగా కన్పించడంలేదు. ఒక్కక్షణం హాలుమధ్యలో నిలబడి, గోడవారగా కూర్చున్న వాళ్ళని చూశాడు. కొలిచినట్టు నాలుగు అంగల్లో వాళ్ళముందుకొచ్చి నిలబడ్డాడు. తెల్లటి నిండుగౌను, గుబురు కనుబొమలు, బయటికి పొడుచుకొచ్చినట్టుగా ఉండే నల్లటి కను గుడ్లల్లోనుంచి విరిసిన బాకుల్లా దూసుకు వస్తూన్న ఆ చూపులు ఎదురుగా కూర్చున్నవాళ్ళ మస్తిష్కాల్లో ఏదో తెలియని మత్తుని ఆవహింపచేస్తున్నాయి.
   
    "జగన్మోహన్ మనసు విప్పి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు మీరూ వినొచ్చు" డాక్టర్ కంఠం గంభీరంగ వుంది.
   
    సుధ అయోమయంగా డాక్టర్ వేపు చూసింది.
   
    "ఆయనెప్పుడొచ్చాడండీ?" విమల కలవరపడింది.
   
    'మీరుండండి' అన్నట్టు సైగచేశాడు రమణమూర్తి.
   
    ఆ ఉదయం హేమచంద్ర చెప్పిన కేసు వివరణ సుధకానీ, విమల కానీ వినలేదు. అందువల్ల వాళ్ళకు సంగతి అర్ధంకాక గాభరా పడుతున్నారనుకున్నాడు చౌదరి.
   
    "ఎట్టకేలకు జగన్మోహన్ లొంగిపోయాడు- బాహాటంగ మన ముందుకు రావడానికి సిద్దపడ్డాడు. ప్లీజ్ కమిన్!" అంటూ అంతకుముందు తను వచ్చిన గదిలోకి దారితీశాడు డాక్టర్.
   
    అడుగులో అడుగు వేసుకొంటూ నిశ్శబ్దంగా అందరూ డాక్టర్ వెనకే గదిలో ప్రవేశించారు.
   
    గదిలో అడుగు పెడుతూనే గొంతు నొక్కివేస్తున్న శబ్దం వినిపించింది.
   
    డాక్టర్ గిర్రున వెనక్కు తిరిగి సుధను పట్టుకున్నాడు.
   
    "డోన్ట్ వర్రీ బేబీ! డోన్ట్ వర్రీ! అతనికేమీ అవలేదు. బాగానే వున్నాడు ట్రాన్స్ లో వున్నాడు నేనెప్పుడు కోరితే అప్పుడే లేచి కూర్చుంటాడు"
   
    పొడవాటి బల్లమీద పడుకొనివున్న మురళీకృష్ణని చూపిస్తూ చెప్పాడు డాక్టర్.
   
    "మరి జగన్మోహన్ రావెక్కడా?" గదంతా కలయజూస్తూ విస్మయంగా అడిగింది విమల.
   
    బల్లవైపు చూపుడువేలుతో చూపిస్తూ "ఆయనే జగన్మోహన్ రావు" చెప్పాడాయన.
   
    విమల నిర్ఘాంతపోయింది.
   
    సుధ మెదడు మొద్దుబారిపోయింది.
   
    ఆమె ఏమీ ఆలోచించే స్థితిలో లేదు.
   
    "హల్లో! జగన్మోహన్!" బల్లమీదకు వంగి పిలిచాడు డాక్టర్.
   
    "యస్ డాక్టర్!"
   
    "మురళీకృష్ణ నీకు తెలుసా?"
   
    "కొద్దిగా తెలుసు."
   
    "అంటే?"
   
    "పెద్దగా పరిచయంలేదు."
   
    "మొదటిసారిగా మురళీకృష్ణను ఎప్పుడు కలిశారు?"
   
    "వారంరోజుల క్రితం మద్రాసులో కలిశాను."
   
    "మద్రాసులో ఎక్కడా?"
   
    రతన్ బజార్లో రెడీమేడ్ గార్మెంటు సెంటరుదగ్గిర."
   
    "నువ్వక్కడ ఏంచేస్తున్నావ్?"
   
    "మా పాపకు గౌను కొంటున్నాను."
   
    "పాపా? ఎవరి పాప?"
   
    "నా పాపే?"
   
    "పాప పేరు?"
   
    "మోనా!"
   
    "మోనా తల్లి ఎవరు?"
   
    "చెప్పను."
   
    "ఎందుకని?"
   
    "ఆమె ఇప్పుడు మరొకరి భార్య."
   
    "ఆమెను నువ్వింకా ప్రేమిస్తూనే ఉన్నావా?"
   
    "అవును!"
   
    "ఆమె నన్నింకా ప్రేమిస్తోందా?"
   
    "తెలియదు."
   
    "ఆమె మురళీకృష్ణ భార్య అని నీకు తెలుసు?"
   
    "తెలియదు."
   
    "నీ ప్రియురాలు మురళీకృష్ణ భార్య ఐందని తెలిస్తే ఆమెను ప్రేమించడం మానేస్తావా?"
   
    ".... .... .... ...."
   
    "మాట్లాడవేం? మానేస్తావా?"
   
    "ఏమో! ఐ కాంట్ సే!"
   
    "మొదటిసారి మురళీకృష్ణను మద్రాసులో చూశావుగదూ?"
   
    "అవును!"
   
    "అబద్దం! యూ ఆర్ టెల్లింగ్ లైస్!" డాక్టర్ కంఠం కర్కశంగా ఉంది.
   
    అతను మౌనం వహించాడు.
   
    "మురళీకృష్ణ నీకెప్పుటినుండో తెలుసు! అవునా?"
   
    "బట్ ఐ హేట్ హిమ్! ఐ హేట్ హిమ్!"
   
    "వైసో?"
   
    "నాకు తెలియదు. ప్లీజ్! నన్నొంటరిగా వదిలెయ్యండి."
   
    "ఓ జగన్! ప్లీజ్ బికమ్ పోయిజ్ద్! ఉద్రేకపడకు. ప్రశాంతంగా ఆలోచించు."
   
    అరనిముషం అంతా నిశ్శబ్దం.
   
    "చూడు జగన్! ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. ఐ డోన్ట్ బాదర్ యూ ఫరదర్!"
   
    "ఓ.కే. అడగండి."
   
    "చాలారోజులుగా మురళీకృష్ణ నీకు తెలుసు. అయినా అతడితో నువ్వు  మాట్లాడలేదు. మొన్న హఠాత్తుగా మురళీకృష్ణ ముందుకొచ్చావు. కారణమేమిటి?"
   
    "నేను పాపకు గౌను కొంటున్నాను. వాడు పెళ్ళానికి చీర కొంటున్నాడు. నేను మోనాను ప్రేమిస్తున్నాను. వాడు సుధాప్రియను ప్రేమిస్తున్నాడు. బిడ్డను నాకొదిలేసి తల్లిని వాడు ఉంచుకున్నాడు."

 Previous Page Next Page