Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 36


    "పిచ్చికాదండీ. పాము.... పాము" అన్నాడు లింగం.

    "ఎక్కడా?" లోకనాధం కంగారుపడ్డాడు.

    "అదిగో. మందార చెట్లు వెనుకాలికి వెళుతోంది ఎలా వుందనుకున్నారు?" అరిచాడు లింగం.

     
                          *    *    *   

    "నల్లగా బారుగా నాగుపాములా వున్న నీ వాల్జడతో నా కంఠానికి ఉరి బిగించి నన్ను చంపెయ్యి" తదాత్మృతగా అన్నాడు రిషి.

    "రిషీ... ఇంకా ఎంతసేపు?" కళ్ళుమూసుకునే గుసగుసగా అంది ఆశ్రిత.

    "వస్తున్నా" రిషి ఆమె ముఖంమీద నుండి తన ముఖాన్ని కొద్దిగా క్రిందికి జరుపుతూ అన్నాడు.


                                                                *    *    *    *

    "నాగుపాము కాదురా అది చాంతాడు. ఛీ నీ మాట నమ్మి ఎంత కంగారుపడ్డాను ధూ!" తనమీద తనే ఉమ్ముకుంటూ అన్నాడు లోకనాధం.

    "ఒక్కోసారి ఈ పాపిష్టి కళ్ళే మనల్ని మోసం చేసేస్తాయండీ" అన్నాడు లింగం.

    "ఎందుకయినా మంచిది ప్రొద్దుట పరగడుపున ఓ పెద్ద గ్లాసెడు అల్లం రసంలో నిమ్మకాయ పిండుకుని తాగెసెయ్యి" అని లోపలికి నడిచాడు లోకనాధం.

    అతన్ని ఎలా ఆపాలో, అతని ఆగమనం లోపలివాళ్ళకి యెలా తెలపాలో తెలీక నెత్తి గోక్కుంటూ నిలబడ్డాడు లింగం.

    "ముందు ఓ స్ట్రాంగ్ టీ తాగాల్రా. తలంతా దిమ్ముగా వుంది" లోకనాధం వంటింటివైపు నడుస్తూ అన్నాడు.

    "బాబుగోరూ!" లింగం గావుకేక పెట్టాడు. లోకనాధం ఉలిక్కిపడి వీపుమీద చరుచుకుంటూ "నీకేం వచ్చిందిరా ఇట్టా అరిచి నాకు హార్ట్ ఎటాక్ తెప్పించేస్తున్నావ్?" అన్నాడు.

    "బాబుగారూ ఈ లింగం బ్రతికే వుండగా మీరు టీ పెట్టుకోవడం ఏవిటీ! నేను చచ్చాను అనుకున్నారా" లింగం కళ్ళనీళ్ళు చొక్కా కొనతో తుడుచుకుంటూ లోకనాధానికి అడ్డుగా వెళ్ళాడు.

    "నీ స్వామిభక్తి పాడయిపోను. అయితే నువ్వే తీసుకురా" అని లోకనాధం సోఫాలో కూలబడ్డాడు.

    లింగం హమ్మయ్య అని వూపిరి పీల్చుకుని వంటింటి గుమ్మందగ్గర నిలబడి మునివేళ్ళతో తలుపుమీద టక టక చప్పుడు చేసాడు.

    లోకనాధం ఆశ్చర్యంగా "నీకు నిజంగానే దయ్యం పట్టినట్లుంది. లోపలికి వెళ్ళడానికి  ఎవర్ని పర్మిషన్ అడుగుతున్నావురా పక్షీ" అన్నాడు.

    లింగం నవ్వి "లోపల ఎలుకలూ, బొద్దింకలూ వుంటే నాకు భయం అండీ. అందుకే వాటిని తోలడానికి .... చీ.... ఛీ .... అయ్యగారొచ్చేసారు. ఊర్నుండి వచ్చేసారు. పొండి" అని అరుస్తూ తలుపు తోసాడు.

    "రిషీ నాన్నగారొచ్చేసారుట. ఇప్పుడెలా?" ఆశ్రిత గాభరాగా అతన్ని వెనక్కి తోస్తూ అంది.

    "అబ్బ! ప్రతిసారీ ఏదో ఒక కీటకం మన ప్రేమకి అడ్డు వస్తూనే వుంది" రిషి విసుగ్గా అంటూ లేచాడు.

    ఆశ్రిత వంటగది తలుపు ఓరగా తెరిచి లింగంతో "నాన్నగారు ఎక్కడ వున్నారు?" అని రహస్యంగా అడిగింది.

    "హాల్లో కూర్చున్నారు. టీ కావాలిట" అని లింగం లోపలికి వచ్చాడు.

    "అయ్యో ఇప్పుడు రిషిని ఇక్కడ చూస్తే ఇంకేమైనా వుందా?" అని ఆశ్రిత వెనక్కి తిరిగేసరికి అక్కడ రిషి లేడు.

    "అబ్బాయి ఏడమ్మా?" లింగం అడిగాడు.

    "ఇప్పటిదాకా ఇక్కడే వున్నాడు, ఇంతలో ఎలా మాయం అయ్యాడూ?" అని ఆశ్రిత అనగానే.

    "ఎవరు? మాయమయ్యాడంటున్నావేమిటి?" అన్న లోకనాధం గొంతు వినిపించింది.

    ఆశ్రితకి తండ్రిని చూడగానే ఒంట్లోంచి రక్తం అంతా నీరైపోయి నంతటి భయం కలిగింది.

    "పుస్పీ నాన్నా. మన పుస్పీ గురించే అనుకుంటున్నాం" అంది కంగారుని కప్పిపుచ్చుకుంటూ.

    "గంగాళంలో దూరినట్లుంది చూడు!" అన్నాడు లోకనాధం.

    గంగాళం నెమ్మదిగా అటూ ఇటూ కదుల్తోంది.

    ఆశ్రిత వెంటనే "మీరు చాలా అలసిపోయారు నాన్న. వెళ్ళి స్నానం చెయ్యండి నేను టీ తీసుకొస్తాను" అంది.

    "అలాగేలే! ముందు ఆ పిల్లిని బయటికి తరిమేయ్. పాలు గట్రా తాగేస్తుంది దొంగపిల్లి" లోకనాధం ముందుకి రాబోయాడు.

    "దాని సంగతి నేను చూస్తానుగా అయ్యా. మీరు వెళ్ళండి" అని లింగం గంగాళానికి అడ్డుగా నిలబడ్డాడు.

    లోకనాధం ఓసారి ఆశ్రిత వైపూ, గంగాళం వైపూ అనుమానంగా చూసి "సరే" అని వెళ్ళిపోయాడు. లింగం కూడా వెళ్ళాడు.

    వాళ్ళు వెళ్ళగానే గుండెల మీద చెయ్యి వేసుకుని నిట్టూర్చి ఆశ్రిత గంగాళం వైపు తిరిగి "ఇంక బయటికి రండి దొరగారూ!" అని గంగాళం వైపు చూసి తెల్లబోయింది. అందులో నిజంగానే పిల్లి పిల్ల వుంది. విఠలాచార్య సినిమాలో లాగా రిషి పిల్లిగా మారిపోలేదు కదా అని అనిపించింది ఆమెకి. ఇంతలో నుదుటిమీద వెచ్చని స్పర్శ తగిలి వులిక్కిపడి తల ఎత్తింది అటక మీదనుండి రిషి తల వంచి ఆమె నుదుటిమీద చుంబించాడు.

    "ఇక దిగి రమ్మంటారా దేవిగారూ?" అన్నాడు.

    ఆశ్రిత నోటిమీద వేలు వేసుకుని మాట్లాడొద్దని సైగ చేసి నెమ్మదిగా బయటికి తొంగి చూసి అక్కడెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక రిషితో చెప్పింది. "చప్పుడు చెయ్యకుండా పారిపో! మా నాన్న చూస్తే నిప్పులేకుండా కాల్చెయ్యగలడు! నీళ్ళు లేకుండా ముంచెయ్యగలడు. నా వెనకాలే రా పెరటి తలుపు తీసి పంపుతా!"

                            *    *    *    *

    స్నానంచేస్తూ లోకనాధం ఆలోచించాడు. కూతురికి తనంటే విపరీతమైన భయం అని తెలిసినా, ఆ రోజు ఆమె కంగారు ఎందుకో అసహజంగా అనిపించి అతనిలో అనుమానాలు రేపింది. అన్యమనస్కంగా స్నానం పూర్తిచేసి టవల్ తో బయటికి వస్తున్న అతనికి ఇంటి వెనకాల ఎవరిదో అడుగుల చప్పుడు వినిపించింది. అలాగే ఇంటి వెనకాల వైపుకి వెళ్ళాడు. అక్కడి దృశ్యం అతనికి పిడుగుపాటుగా తోచింది! 

 Previous Page Next Page