ఆశ్రిత ఒక యువకుడి చేతుల్లో వుంది. అతను తమకంగా ఆమెని ముద్దు పెట్టుకుంటున్నాడు.
లోకనాధానికి కోపంతో ఒళ్ళు మండిపోయింది. తన ముందే తన కూతుర్ని ఎవరో అనామకుడు ముద్దాడడం చూడగానే అతడికి అక్కడే వారిద్దరినీ నరికిపారెయ్యాలనిపించింది. "ఒరే!...." అంటూ లోకనాధం ముందుకి వెళ్ళాడు.
అనుకోని ఆ సంఘటనకి రిషీ, ఆశ్రితా వులిక్కిపడి తిరిగి చూసారు. ఎదుట ప్రళయకాల రుద్రుడిలా లోకనాధం కనిపించాడు.
తండ్రి కోపం సంగతి తెలిసిన ఆశ్రిత వెంటనే "రిషీ పారిపో వెంటనే.... ఆలస్యం చేస్తే నామీద ఒట్టే" అని రిషిని గేటు అవతలకి తోసేసి తలుపు గడియ పెట్టేసింది. క్షణం పాటు లోకనాధం రిషి ముఖం చూడగలిగాడు!
ముందుకి వురికి రిషిని పట్టుకోవాలన్న లోకనాధం అలాగే స్థాణువులా నిలబడిపోయాడు.
ఆశ్రిత బలికి సిద్ధమైన ప్రాణిలా తండ్రి ముందు తల వంచి "నేను అతన్ని ప్రేమించాను. ఏదైనా చెయ్యాలనుకుంటే నన్ను చెయ్యండి. అతను అమాయకుడు" అంది.
లోకనాధం అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లు తెప్పరిల్లి "ఆ అబ్బాయి.... ఆ అబ్బాయి..... పట్టుకోండి .... పారిపోనివ్వకండి" అని అరిచాడు.
ఆ అరుపులకి రాంసింగ్, లింగం కూడా పరుగెత్తుకొచ్చారు. లోకనాధం గేటు తీసుకొని తువ్వాలుతో వున్నానన్న ధ్యాస కూడా లేకుండా పరుగు మొదలు పెట్టాడు. వెనకాలే పరిగెడ్తూ లింగం "మీరు వుండండి బాబుగారూ! వాడ్ని మేం పట్టుకుంటాం. మీరిలా తువ్వాలుతో రోడ్డుమీద పరిగెత్తడం చూసేవాళ్ళకి దడ పుట్టిస్తోంది" అన్నాడు.
లోకనాధం ఆగి వగరుస్తూనే "వాడు ఎక్కడుంటాడో నీకు తెలుసా?" అని అడిగాడు.
లింగం మాట్లాడలేదు. తల వంచుకున్నాడు.
"మాట్లాడవేం? వాడు నీకు తెలుసా?" లింగాన్ని పట్టి కుదిపేస్తూ అరిచాడు లోకనాధం.
"చిత్తం. అమ్మయిగారూ, ఆ అబ్బాయి...." అని నీళ్ళు నమిలాడు లింగం.
లోకనాధం అప్పుడే స్ఫురించినట్లు లింగాన్ని వదిలి ఇంటివైపు పరిగెట్టాడు.
* * * *
"దొరికితే నన్ను కండకో ముక్క క్రింద నరికి కాకులకీ, గద్దలకీ వేసేటట్లున్నాడ్రా బాబూ ఆశ్రిత వాళ్ళ నాన్న. ఆ తువ్వాలు బొజ్జ క్రింద కట్టుకుని వాడు తరుముకొస్తుంటే అచ్చం కబేళాలో మాంసం కొట్టేవాడిలా వున్నాడ్రా! ఇలాంటి విలన్లలాంటి అమ్మాయిల తండ్రులని ఎలా డీల్ చెయ్యాలో నీకు తెలుసా?" మధుని అడిగాడు రిషి.
మధు ఆలోచిస్తున్నట్లుగా చూసాడు. ఇంతలో తలుపు దబదబా బాదిన చప్పుడైంది.
"అదిగో వచ్చినట్లున్నాడు" అని రిషి మంచం క్రిందికి దూరాడు.
మధు వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా మల్లేష్ కనిపించాడు. "ఏంది గప్పుడే దర్వాజా బంద్ చేసిన్రు?" అన్నాడు.
"ఆ.... ఏం లేదు. మా వాడు చిన్న ఇబ్బందిలో పడ్డాడు. ఆ విషయమే డిస్కస్ చేస్తున్నాం" అన్నాడు మధు.
"ఏం పరేషానీ?" మల్లేష్ ఆతృతగా అడుగుతూ స్టూల్ మీద కూర్చున్నాడు.
వచ్చినది మల్లేష్ అని తెలిసాకా రిషి నెమ్మదిగా మంచం క్రింద నుంచి వచ్చి - "మంచంక్రింద పావలా పడిపోతే వెదుక్కుంటున్నాను. అంతే.... దాక్కోలేదు" అన్నాడు.
మల్లేష్ నవ్వి- "నువ్వెందుకు దాక్కుంటావు తీ! నువ్వు అసలు బుగుల్ పడ్తులేవు అని సమజ్ అయిందిగానీ ముందుగాల ఏమైందో గా ముచ్చట చెప్పు" అన్నాడు.
రిషి ఒంటికి పట్టిన చెమట్లు తుడుచుకొని "ఆశ్రితని నేను ముద్దు పెట్టుకుంటుండగా ఆమె తండ్రి చూసాడు. వెంటనే రేయ్ అంటూ యముడిలా నావెంట పడ్డాడు. అదే నువ్వయితే ఏం చేసేవాడివి?" సవాల్ చేస్తున్నట్లు అడిగాడు.
"సీ! నేనెందుకు గట్ల చేస్తా? ఆ పోరిని నేను సరింగ చూసింది బీ లేదు" అన్నాడు మల్లేష్.
రిషీ చిరాకుగా "ఆ అమ్మాయినంటే ఆ అమ్మాయికాదు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు ముద్దు పెట్టుకుంటుంటే ఆమె తండ్రి చూస్తే ఏం చేసేవాడివి?" అని అరిచాడు.
మల్లేష్ విచారంగా "గట్లనే జరిగింది తంబీ! నా బద్ నసీబ్ పట్టుబడిన నీ లెక్క వురకాల్సుండె" అన్నాడు.
రిషి ఆసక్తిగా "పట్టుబడిపోయావా? అప్పుడు ఏం జరిగింది?" అన్నాడు.
మల్లేష్ కోపంగా "ఇంకేం గావాలా? ఆ పోరితోనే లగ్గమయింది" అన్నాడు.
"ఆ! పట్టుబడితే పెళ్ళి జరిగేదా?" రిషి ఆనందంగా అడిగాడు.
"కొండొకచో ఏదో ఒక అవయవం నరకబడి నిరుద్యోగ సమస్య కూడా తీరిపోయే ఛాన్స్ వుంది" అంది వంటింట్లోంచి వస్తూ శ్రీజ.
"నిరుద్యోగ సమస్యా?" అడిగాడు మధు.
"అవును. కనీసం ఓ ఫోన్ బూత్ అయినా నడుపుకోవచ్చు" శ్రీజ చెప్పింది.
"ఆమె తండ్రి ఇంత డేంజరస్ ఫెలో అనుకోలేదు. ఇప్పుడేం చెయ్యడం?" ఆలోచనలో పడ్డాడు రిషి.