Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 35


    పావుగంట తర్వాత ఇందర్ వచ్చాడు.

    ఉడికిన పదార్ధం తాలూకూ ఘుమఘుమలు గదంతా వ్యాపించాయి.

    ఇందర్ యింట్లో అడుగు పెడుతూనే ముక్కు రెండుసార్లు ఎగబీల్చాడు.

    కుర్చీలోంచి అప్పుడే లేవబోయిన అవంతి తలుపు తీస్తున్న చప్పుడు కావడంతో అలా కూర్చుండి పోయింది. ఇందర్ లోపలికి రావడంతో గర్వంగా ఒక ఫోజు పెట్టింది.

    "ఏం జరిగి వుంటుందో అవంతి ఏం చేసి వుంటుందో ఇందర్ కి అర్ధమైంది. చేతిలో సంచీని అక్కడే పెట్టేసి కిచన్ గా వాడు బతుకున్న పక్కగదిలోకి పరుగుతీశాడు.

    దొండకాయ కూర అనబడే ఆ కొత్తకూర అప్పుడే చాలా కొద్దిగా అడుగంటటం ప్రారంభించింది. అడుగు కూర వుడికింది పై కూర అలాగే వుంది.

    ఇందర్ గిన్నె మీద మూత తీసి కూరని కలియ బెట్టాడు. వచ్చి ఆవాలు దర్శనం యిచ్చాయి. వేలితో తీసుకుని కూరని రుచి చూశాడు అంతే కూరగిన్నె కింద పెట్టి స్టవ్ ఆర్పేసి యివతలికి వచ్చాడు.

    "అపర్ణా!" తేనెలూరేలా పిలిచాడు ఇందర్.

    "ఏంటీ?" చిన్న దీర్ఘం తీసింది అవంతి.

    "కూర వండావే!"

    "ఊ....నాకు వంట రాదన్నావ్ కదా?"

    "అందుకని వండి చూపించావన్నమాట?"

    "అవును, అరగంటకల్లా తిరిగి వస్తానని ఎంతకీ రాకపోయేసరికి దొండకాయ కూర వండాను, కూర వుండకంగానే అన్నం కూడా వండి పారేద్దామనుకున్నాను"

    "నువ్వు వండింతరువాత పారేయడం తప్పుతుందా!" అనుకున్నాడు ఇందర్, అతని కళ్ళకి యింకా ఆ కూరే కనిపిస్తున్నది.

    "కూర వుడికిందేమో చూసి వస్తాను" అవంతి కుర్చీలోంచి లేవబోయింది.

    "లేవకు నేను చూసి వచ్చాను, కూర చక్కగా వుడికింది దింపి వచ్చాను, కూరగిన్నెని" కంగారుగా అన్నాడు ఇందర్.

    "అమ్మయ్య కూర వుడికింది కదా! అయితే అన్నం పెట్టి రానా"

    "నే పెట్టి వస్తాలే. అన్నట్లు అన్నానికి కొలత ఏమిటి?" అన్నం అనే పదార్ధాన్ని ఎంత గొప్పగా వండుతుందో తెలుసుకుందామని అడిగాడు.

    "అన్నం వండటం మరీ తేలిక. బియ్యంలో అయితే ఉత్త నీళ్ళు పోయడమే. కూర అయితే చాలా వెయ్యాలి."

    "అవును నేను ఇంతకీ అన్నం ఎలా వండాలో చెప్పలేదు."

    "గిన్నెలో బియ్యం పోయాలి. కాసిని నీళ్ళు దాని మీద పొయ్యాలి. చెయ్యి ఓ సారి ముంచి తీయాలి. అంతే ఆ బియ్యం పొయ్యిమీద పెడితే అన్నం వుడుకుతుంది."

    "చెయ్యి ఎందుకు పెట్టాలిట?" ఇందర్ నవ్వాపుకుని అడిగాడు.

    "ఏమో మీరు రోజూ బియ్యంలో నీళ్ళుపోసి ఓ సారి చెయ్యి పెట్టి చూస్తారు. అలా చేయటం నేను చాలాసార్లు చూశాను." ఇలా చెప్పాలంటే అవంతికి నవ్వు వస్తుంది. నవ్వంటూ వస్తే మొదటికే మోసం జరుగుతుంది. అందుకే అమాయకంగా అందులో కాస్త సీరియస్ నెస్ చేర్చి నమ్మదగ్గట్లుగా చెప్పింది.

    "అయితే యింకేం అన్నం వండటం వచ్చింది."

    "నేనీ పూట అన్నం వండుతాను" సర్దాపడిపోతూ అంది అవంతి.

    "ఉహూ ఒకే రోజు అన్నీ నీవు వండితే మీ బుచ్చికక్కి నన్ను తిడుతుంది. ఒరేయ్ భడవా! నా పిల్లచేత వంట వండిస్తావురా అని తనచేతికర్రతో నాలుగు వడ్డిస్తుంది."

    "మా బుచ్చికక్కికి చేతికర్ర లేదు కాలికర్ర లేదు."

    "అపర్ణా!"

    "ఊ"

    "ఈ పూట నీవు కూర చేశావు కాబట్టి అన్నం నేను వండుతాను రేపు నీవు అన్నం వండు. నేను కూర చేస్తాను."

    "సరే"

    "కూర ఎలా వండాలో చెప్పవా?"

    "దొండకాయలని సరీగా సగానికి తరిగాను, కొన్ని పెద్ద ముక్కలు కొన్ని చిన్న ముక్కలు కాకుండా చాలా జాగ్రత్తగా తరిగాను...."

    "బుట్టలో వున్న ముప్పావు కిలో దొండకాయలు తరిగావా!"

    "ఆ.... కూర చాలొద్దేమిటి!"

    "అవునులే రుచిగా వుంటే ఊది పారేస్తాము కదా!"

    "నేను అదే ఆలోచించాను. కాస్త మిగిలితే రాత్రికి తినొచ్చు కదా అని వండేశాను. ముందు గిన్నెలో నూనె పోశాను."

    "గిన్నెలో వున్న నూనెంతా పోశావా!"

    "ఆ...."

    "ఏంటి మొత్తం గిన్నెడు!"

    "ఆ...."

    వారం వచ్చే నూనె ఒకపూటకే గోవిందా! అనుకున్న ఇందర్ మిగతా సరుకులు కూడా అన్నీ ఖాళీ అయ్యాయేమోనని దిగులు పడుతూ "కూర ఎలా చేశావో దాంట్లో ఏమేమి వేశావో వివరంగా చెప్పు" అన్నాడు. ఆ విచారించేది ఏదో ఒకసారి విచారించవచ్చని.

    కూరలో ముందు ఏమి వేసింది తర్వాత ఏమేమి వేసింది వివరంగా చెప్పింది అవంతి.

 Previous Page Next Page