Previous Page Next Page 
అభయారణ్యం పేజి 35


    "ఎందుకు నవ్వుతున్నారు?"

    "నేనూ భర్తనేగా ఆర్తీ! నా మైనస్ పాయింట్స్ మా ఆవిడకి తప్ప మీకు తెలీవుగా."

    "ఉన్నా మీరు కరెక్ట్ చేసుకోగలరు."

    "కానీ చెప్పదే."

    "అంటే?" ఆర్తి నవ్వేసింది. "అంత అపురూపమైన భర్తగా ఆమెను మీరు ఇంప్రెస్ చేసుంటారు"

    "ఏమో....."  వెంటనే అన్నాడు. "మీరూ ఇక బాధపడనవసరం లేదు. ఇకముందు మిమ్మల్నీ ఇంప్రెస్ చేస్తుంటాను."

    ఆర్తి నేత్రాలు అరమోడ్పులయ్యాయి. "నేను మీ అభిమానినేగా?"

    భార్యని ఇంప్రెస్ చేసే భర్తగా మాట్లాడుతూ చివరగా ఆర్తినీ కలిపి ఆ విషయం ప్రస్తావించినందుకు క్షమార్పణల్లా అన్నాడు "సారీ..... నోరు జారేనా?"

    "ఫర్వాలేదు......" నోరు జారినందుకు కాదు, జారానని అన్నందుకు ఆర్తికి కోపం వచ్చింది." మనం ఫ్రెండ్స్ గా."

    "థేంక్స్" అన్నాడు తేజా.

    "దేనికి?"

    "మీరు ఫాన్ స్థాయి నుంచి ఫ్రెండు దాకా ఎదిగినందుకు."

    "మీరు అవకాశం యిచ్చారు."

    "ఇచ్చానో, మీరు తీసుకున్నారో అదలా వదిలేసి ఇకనుంచీ మీకు ఎప్పుడు ఇబ్బందిగా వున్నా నాకు ఫోన్ చేసి మాట్లాడండి."

    నవ్వింది ఆర్తి. "బ్రెయిన్ వాష్ చేస్తుంటారా?"

    "పొరపాటుపడుతున్నారు ఆర్తీ! మీకు తెలీదు- మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను."

    ఆర్తి మొహం వివర్ణమైపోయింది. "మరీ అంత అతిశయోక్తులు మాట్లాడకండి"

    "ఇది నిజం ఆర్తీ! ప్రతీదీ వూహించి రాయడం రచయితకి తప్పని సరయినా మీలాంటి పరిచయస్థులు చెప్పే కొన్ని వాస్తవాలు కథల్ని మించి ప్రేరణ అందిస్తాయి. అందుకే నాకు స్ఫూర్తి కలిగించే మంచి స్నేహితురాలిగా మిమ్మల్ని అంగీకరించేశాను."

    "అలాంటప్పుడు అర్జెంటుగా ఇంకో పనిచేయండి."

    "చెప్పండి."

    "అలా 'అండి' అని అడ్రస్ చేయండ మానేయండి."

     తేజా మౌనంగా ఉండిపోయాడు.

    "ఏమిటీ..... నిశ్శబ్దంగా వుండిపోయారు?" అంది ఆర్తి. అప్పటికీ తేజా నుంచి జవాబు రాకపోయేసరికి "సారీ! మీకు ఇష్టం లేకపోతే వద్దు" అంది.

    "అదికాదు ఆర్తీ....." ఏమనుకున్నాడో వెంటనే అన్నాడు "ఓ.కె. ఇకనుంచి నిన్ను అలాగే అడ్రస్ చేస్తాను."

    "బలవంతంగా ఒప్పుకుంటున్నారా?"

    "అబ్బే!"

    "మరి మీ గొంతేమిటి అలా అయిపోయింది?"

    "ఓ నిజం చెప్పనా?" నిట్టూర్పుగా ఆగి అన్నాడు "నేను కొన్ని వందలమంది అభిమానుల్తో  ఫోన్ లో మాట్లాడి వుంటాను. అయితే ఇన్నిసార్లు మాట్లాడింది నీతో..... ఇంత దగ్గరైంది నీతో మాత్రమే."

    పులకింతగా అంది "నమ్మమంటారు."

    "నీ మీద ఒట్టు ఆర్తీ."

    "థేంక్స్" అనూహ్యమైన భావాల ఒరిపిడి ఆమెను ఉద్విగ్నతకి గురిచేస్తుంటే అది భయమో లేక సంకోచమో తెలీని స్థితిలో వెంటనే అంది "ఒ రిక్వెస్ట్."

    "చెప్పండి."

    "మిమ్మల్ని చూడాలనుంది."

    "..........."

    "ఏమిటి ఆలోచిస్తున్నారు?"

    "ఎక్కడ కలుసుకుందామని."

    "మీ ఇష్టం వచ్చినచోట- ఎక్కడయినా" క్షణమాగి అందామె "రెస్టారెంట్ లో అయిన ఫర్వాలేదు"

    "చూద్దాం."

    "మీరు సంకోచించాల్సిన అవసరంలేదు తేజా! మీతో మనసు విప్పి మాట్లాడే స్థితికి చేరుకున్న నేను మీరు నాపై చూపిస్తున్న కన్ సర్న్ కి ఆనందిస్తూ మీతే ముఖాముఖీ మాట్లాడాలనుకుంటున్నాను. అంతే తప్ప మరే ఉద్ధేశ్యం లేదు."

    "అలాగే."

    "థేంక్స్! ఎప్పుడు, ఎక్కడ కలుద్దామో మీరే నిర్ణయించండి."

    ఫోన్ క్రెడిల్ చేసిన ఆర్తి ఆ తర్వాత కానీ ఆలోచించలేకపోయింది తనెంత తొందరపడిందీ.

    అయితే......

    తేజా అంతకుమించి నిశ్చేష్టతలో కూరుకుపోయాడు.

    ఆర్తి అన్న మాటల్లో దొర్లిన 'కన్ సర్న్' అన్న పదం ఒక్కటే కాదు 'మరో వుద్దేశ్యం లేదు' అన్న వాక్యం కూడా అతడ్ని చాలా ఆందోళన పరిచింది.

    తెలియకుండా తనూ చాలా దూరం వెళ్ళిపోయినట్లు అతడికీ బోధపడిపోతూంది.

    కానీ ఆర్తి మాటలు ఆమెకు కూడా అర్థంకాని 'సబ్ కాన్షన్ నెస్' లోని మరేవో ఆలోచనలకి రూపం ఇస్తున్నట్లుగా వుంది.

    "ఏమిటి ఆలోచిస్తున్నారు?"

    భాను గొంతు వినగానే తేరుకున్నాడు తేజ.

    "ఈ వేళ సాయంకాలం మీరో ఫంక్షన్ కి వెళ్ళాలి."

    అర్థంకానట్టు చూశాడు తేజ.

    "అదేనండి శ్రీమంత్ అన్నయ్య చెప్పలేదూ..... ఏ మూడ్ లో వున్నారూ?" భాను గుర్తుచేసింది.

    గిల్టీగా తల వంచుకున్నాడు తేజా.
 

 Previous Page Next Page