Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 36

    "చాలా ఈజీదే అడుగుతాను... బోడెమ్మ నెత్తిన ఏం కప్పుకుంటుంది?... ఎ) తివాచీ బి) బనారస్ సిల్కు గుడ్డ సి) కాశ్మీర్ శాలువ డి) తెల్లని సైనుగుడ్డ... ప్రశ్నని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను..." అంటూ యాంకర్ ప్రశ్నని రిపీట్ చేసింది.
    లత ఊ...ఆ...ఊ... అంటూ కాస్సేపు ఆలోచించి "కాశ్మీర్ శాలువ"అంది.
    "హిహిహి...అలా అని ఎందుకు అనుకున్నారు?"
    "అంటే గుండుమీద కాశ్మీర్ శాలువ కప్పుకుంటే గుండుకే అందం వస్తుంది కదా... అందుకని!" ఠక్కున చెప్పింది లత.
    "ష్యూరా?...హిహిహి!..."
    లత అనుమానంలో పడింది "ప్లీజ్ ఒక్క నిముషం ఆగండి..." అంది.
    "టేక్ యువర్ ఓన్ టైమ్..." అంది యాంకర్.
    కొన్ని క్షణాలు ఆలోచించిన లత "ఆ...తెల్లని సైను గుడ్డ!!" అని చెప్పింది.
    "రైట్..." లత గూబ అదిరేలా అరిచింది యాంకర్."సైను గుడ్డ అని ఎలా చెప్పారు?"
    "నా సిక్త్ సెన్స్ చెప్పింది!"
    "లతగారూ... మీరు మా ప్రోగ్రాంలో పాల్గొనడానికి అర్హత సంపాదించారు... కంగ్రాట్స్!" గావుకేకపెట్టింది యాంకర్.
    లత మళ్లీ కెవ్వుమని అరిచి మూర్ఛపోయింది.
                              *   *   *
    ఆ రోజు రానేవచ్చింది... లత,ఆనందరావ్ లు "ఎవడిదంటే వాడిదే" టీవీ ఛానల్ స్టూడియోకి వెళ్లారు.
    "బంగారు బొమ్మ రావేమే" ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది... ప్రముఖ యాంకర్ ఉదరజాను ఎదురుగా వేడి సెట్లో (హాట్ సీట్) లో కూర్చుంది.
    "లతగారూ...హిహిహి... మీ మొదటి ప్రశ్న... రాముడికి సీత ఏమవుతుంది?..." అడిగింది ఉదరజాను.
    లత కళ్లు తేలేసింది.
    "ఏం?... కష్టమైన ప్రశ్న? హిహిహి..." అడిగింది ఉదరజాను.
    "అవును..." అంది లత బిక్కమొహం వేసి.
    ఆ ప్రోగ్రాంకి వచ్చిన ఆడియన్స్ అందరూ అబ్బ...ఉస్...ఉస్... అంటూ చేతులు ఊపసాగారు ఎంతీజీనో అన్నట్టు.
    ఉదరజాను "ఉష్..." అంటూ చూపుడు వేలు నోటికి అడ్డు పెట్టి వారి వైపు చూసింది మాట్లాడొద్దని.
    లత గుడ్లు పైకి పెట్టి ఆలోచిస్తూనే ఉంది ఇంకా.
    "ఆప్షన్స్ కావాలా హిహిహి?..." అని అడిగింది ఉదరజాను
    లత అవును అన్నట్టు తల ఊపింది.
    "ఇదిగో లతగారూ... మీ ఆప్షన్స్... రాముడికి సీత ఏమవుతుంది అన్న ప్రశ్నకి ఆప్షన్స్ ఎ) భార్య బి) మరదలు సి) పక్కింటి అమ్మాయి డి) లపాకీ.
    లత చటుక్కున లపాకీ అని సమాధానం చెప్పింది.
    "రాముడికి సీత లపాకీ అవుతుందనీ మీరు అంటున్నారు... ఆర్ యూ ష్యూర్?...హిహిహి..." అడిగింది ఉదరజాను.
    ఆడియన్స్ అంతా బాధగా బుస్సుమని నిట్టూర్చారు. ఆ "బస్సు" శబ్దానికి లత తను పొరబాటు చేసినట్టు గ్రహించింది.
    "కాదు... కాదు... ఉండండి..." అని కాస్సేపు ఆలోచించి "భార్య" అని సమాధానం చెప్పింది లత.
    "యూ ఆర్ రైట్..." గట్టిగా అరిచింది ఉదరజాను.
    ఆ అరుపుకి ఉలిక్కిపడ్డ లత వెనక్కి వెల్లకితలా పడిపోయింది. ఉదరజాను గబగబా లేచి వచ్చి హిహిహి అని నవ్వుతూ లతని లేపి కుర్చీలో కూర్చోబెట్టింది.
    "ఊ... చెప్పండి... రాముడికి సీత భార్య అవుతుందని ఎలా చెప్పగలిగారు?హిహిహి" అడిగింది కళ్లు ఎగరేస్తూ ఉదరజాను.
    "చిన్నపుడు మా అమ్మమ్మ చెప్పినట్టు గుర్తు!" అంది లత గర్వంగా.
    "గుడ్... ఇదిగోండి కరెక్ట్ ఆస్సర్ చెప్పినందుకు మీకు రెండుగ్రాముల బంగారు!"
    లత చేతిలో రెండు కాయిన్స్ పెట్టింది.
    "ఇప్పుడు మా రెండో  ప్రశ్న... బొగ్గు ఏ రంగులో ఉంటుంది?..."
    ఇలాంటి ప్రశ్నలు ఉదరజాను అడగడం లత జాగ్రత్తగా ఆలోచించి జవాబులు చెప్పడం జరిగింది.
    ఓ అయిదు నిమిషాలకి లత యాభైగ్రాముల బంగారు గెల్చుకుంది. లత మొహంలో చచ్చేంత అనందం... ఆమె ఎగిరి ఎగిరి  నవ్వసాగింది హాట్ సీట్లో.
    "లతగారు ఇప్పటిదాకా యాభైగ్రాముల బంగారు గెల్చుకున్నారు.... చూస్తుంటే ఆమె మా దగ్గర కిలోల కొద్దీ బంగారు గెల్చుకుని మా ఛానల్ కి గుండు కొట్టించేసి వెళ్లేలా ఉన్నారు..." అంది ఉదరజాను ఆడియన్స్ తో, లత కిలకిలా నవ్వింది.
    "లతగారూ... ఇప్పుడు మరో ప్రశ్న... ఈ ప్రశ్నకి మీరు జవాబు చెప్తే మీరు ఒకేసారి యాభై గ్రాములు గెల్చుకుని మొత్తం వంద గ్రాములకి చేరుకుంటారు... చెప్పలేకపోతే మీరు ఇదివరకు గెల్చుకున్న యాభై గ్రాములు కూడా పోగొట్టుకుని ఒట్టి చేతుల్తో ఇంటికి వెళ్తారు..." చెప్పింది ఉదరజాను.
    "అడగండి... గాంధీతాతకి పిలకుంటుందా లేదా... ఇలాంటి ప్రశ్నేగా మీరు అడిగేది... హిహిహి..." అంది లత.
    "అవును... చాలా ఈజీ ప్రశ్న అడుగుతాను... జరాసంధుడు మీకు తెల్సా?..."
    "ఓ... అతన్ని భీముడు చంపుతాడు...హిహిహి...తెండి... నా యాభైగ్రాముల బంగారం నాకిచ్చెయ్యండి..." సంతోషంతో చప్పట్లు కొడ్తూ అంది లత.
    "ఆగవమ్మాతల్లీ... నేను జరాసంధుడ్ని ఎవరు చంపారు అని అడగలేదు... జరాసంధుడు తెలుసన్నారు కాబట్టి ఈ ప్రశ్నకి జవాబు కూడా మీరు ఈజీగానే చెప్తారని అనుకుంటున్నాను... ఇకపోతే మా ప్రశ్న..జరాసంధుడి భార్య పిన్నికి మరదలు భర్త పేరేంటి?...." చిలిపిగా అడిగింది ఉదరజాను.
    లత కెవ్వుమని భయంకరంగా అరిచి వెనక్కి విరుచుపడిపోయి మూర్ఛపోయింది.
    ఆ విధంగా లత అంతలోనే యాభైగ్రాముల బంగారాన్ని గెల్చుకుని అంతలోనే దాన్ని పోగొట్టుకుని యింటికి వెళ్లింది.
    "బంగారు బొమ్మ రావేమే" ప్రోగ్రాం సక్సెస్ చూసి మిగతా టీవీ ఛానల్స్ కూడా ఇలా బంగారు గెల్చుకుంటాం అనే ఫీలింగ్ కలిగించే ప్రోగ్రాములు పెట్టేశాయ్. ఆడాళ్ళంతా చూపుడు వేలు నొప్పెట్టేలా ఆ ఛానల్స్ నెంబర్లు నొక్కుతూనే ఉన్నారు.
    లత ప్రస్తుతం వెర్రెక్కినదాన్లా ప్రతి ఛానల్ కి రాత్రనకా పగలనకా ఫోన్ చేయడంతోనే గడిపేస్తుంది.
                             *    *    *

 Previous Page Next Page