సన్మానాలు చేస్తాం రండి...
డోర్ బెల్ మోగింది.
డింభకశ్రీ సోఫాలోంచి లేచి తలుపు తీసాడు.
గుమ్మంలో నిల్చున్న వ్యక్తి డింభకశ్రీ కంట్లో వేలుపెట్టి పొడిచాడు.
"ఓర్నాయ్ నో నా కన్ను... నాకేమన్యాయం చేసా నీ నోట్లో మన్ను..." కన్నుమీద చెయ్యి పెట్టుకుని చిందులేస్తూ ఘొల్లుమన్నాడు డింభకశ్రీ.
"ఆహా... ఆహా... మీ మాటల్లో కూడా రైయింది కదండీ... మీ ఏడుపులో కూడా కవిత్వం ఉంది. కదండీ...ఆహా...ఓహో..."డింభకశ్రీ వంక పరవశంగా చూస్తూ అన్నాడా వ్యక్తి.
"ఇంతకీ ఎవరండీ మీరు? మా ఇంటికొచ్చి నా కంట్లోనే పొడుస్తారు? అన్నాడు మొహం చిట్లిస్తూ డింభకశ్రీ.
"అబ్బే... నేను కావాలని మీ కంట్లో పొడవలేదండీ... మీరు తలుపు తెరవలేదనుకుని డోర్ బెల్ నొక్కబోయి మీ కంట్లో వేలుబెట్టా...హి!" అన్నాడు అతనునవ్వాపుకుంటూ.
"ఇంతకీ ఏం పనిమీద వచ్చారు?"
"నాపేరు లంబోదరం అండీ... మిక్కాస్త దురదుందని విని వచ్చా...' అన్నాడు లంబోదరం కొంటెగా నవ్వుతూ.
"హర్రే!... నాకు దురదుందని మీకెవరు చెప్పారు?... కొంచెం ఏం కర్మ? దురద చాలా ఎక్కునగానే ఉంది..." అంటూ చేతులు బర బరా గోక్కున్నాడు డింభకశ్రీ. "నేను ఈ దురద తగ్గడానికి చాలా మందులు వాడను... ఈ మధ్యనే చర్మ రోగాల స్పెషలిస్టు డాక్టరు చమ్డాల్రావుని కూడా కలిసాను. ప్రస్తుతం ఆయనరాసిన మందులు వాడ్తున్నా... కానీ ఏమంతగుణం కనిపించలేదు. ఏం మీ దగ్గర ఇంకా మంచి మందులున్నాయా?... సరేగానీ ఓసారి వీపు గోకరా చచ్చేంత దురదేస్తుంది" అంటూ వెనక్కి తిరిగాడు డింభకశ్రీ.
లంబోదరం కిసుక్కున నవ్వి డింభకశ్రీ చొక్కా ఎత్తి వీపుమీద గోకుతూ అన్నాడు.
"నేనేం ఈ దురద గురించి రాలేదు సార్... హిహి..."
"మరి?..." ముందుకు తిరిగి ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించాడు డింభకశ్రీ.
"మీకు సన్మానం చేయించుకోవాలనే దురదుందని తెల్సి వచ్చా" అన్నాడు లంబోదరం.
"ఉందనుకోండి... కానీ ఏం లాభం? నాబాధని తీర్చెదెవరు?..." దిగులుగా మొహంపెట్టి అన్నాడు డింభకశ్రీ.
"అదేంటిసార్... నేను లేనూ?... మీలాంటివాళ్లని వెతికి పట్టుకుని ఈడ్చుకెళ్లి స్టేజిమీద కూలేసి సన్మానం చెయ్యడమే కదా మా పని?..."
"ఆ!... నిజ్జంగానా?... మరి ఇంతసేపూ చెప్పలేదేం??... రండి రండి... లోపలికి రండి..." ఉక్కిరి బిక్కిరి అయిపోతూ లోపలికి ఆహ్వానించాడు డింభకశ్రీ.
ఇద్దరూ లోపలికి వెళ్లి కూర్చున్నారు.
"ఇప్పుడు చెప్పండి... చెప్పక దాస్తే తప్పండి" అన్నాడు డింభకశ్రీ పళ్లు ఇకిలిస్తూ.
"మీరు సన్మాన స్రవంతి అనే అసోసియేషన్ గురించి వినే ఉంటారు..." అన్నాడు లంబోదరం.
"సన్మాన స్రవంతా?... అలాంటి అసోసియేషన్ గురించి నేనెప్పుడూ విన్లేదే?!..."
"అదేంటి! అంతపేరు ప్రఖ్యాతులున్న సంఘం గురించి మీరు విన్లేదా?... దాదాపు వెయ్యిమంది దాకా ఆ సంఘం ద్వారా సన్మానాలు పొందారు"
`` "లేదే?... ఎప్పుడూ విన్లేదే..." నోరు వెళ్ళబెట్టి అన్నాడు డింభకశ్రీ.
"హు... అనవసరంగా మీ వీపుగోకి టైం వేస్టుచేస్కున్నా... నే వస్తా..." విసుక్కుంటూ లేచినిలబడ్డాడు లంబోదరం.
"అర్ ర్రె!... మీరట్టా లేచి నిల్చుంటే ఎలా?... సన్మాన స్రవంతేగా?... నేవిన్నా... నేనిన్నానోచ్... మీతో ఊర్కే అబద్ధం చెప్పాను... కూర్చోండిసార్..." అన్నాడు లంబోదరం భుజాలుపట్టి సోఫాలో కూర్చోబెడ్తూ.
"అట్లారండి దారికి... ఆ... ఆ సన్మాన స్రవంతి ఉందే ... దానికి నేను సెక్రట్రీని... నేను ఎందుకు వచ్చానంటే మీకు మాసంస్థ తరుపున సన్మానం చేద్దామని..."
డింభకశ్రీ అనందం పట్టలేక లంబోదరాన్ని కౌగిలించుకుని "ఎంతమంచి వాడవురా... ఎన్నినోళ్ల పొగడుదురా..." అని పాటందుకున్నాడు.
"మీరిట్టాగే నన్ను ఎముకలిరిగేలా గట్టిగా పట్టుకుంటే మీకు చేద్దామనుకున్న సన్మానం కాన్సిల్ చేయాల్సి ఉంటుంది..." అన్నాడు లంబోదరం డింభకశ్రీ పట్టునుండి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ.
ఆ మాటవింటూనే డింభకశ్రీ చటుక్కున లంబోదరాన్ని విడిచిపెట్టి నాలుక కొరుక్కుని ఆ తర్వాత చెంపలేసుకుని దూరంగా కూర్చున్నాడు.
"చెప్పండిసార్... నిజంగానే నాకు సన్మానం చేయాలని అనుకున్నారా సార్!... ఎప్పుడు సార్... త్వరగా చెప్పండి సార్..." అన్నాడు ఆతృతగా డింభకశ్రీ.
"మీకు ఈనెల ఇరవైన సన్మానం చేద్దామని అనుకుంటున్నాం... ఇష్టమే కదా?" సూటిగా డింభకశ్రీ మొహంలోకి చూస్తూ ప్రశ్నించాడు.
"ఇష్టమే... కాదంటే మీతో కష్టమే..." అన్నాడు డింభకశ్రీ.
"అలాగైతే సన్మానానికి నా ఏర్పాట్లు నేను చేస్కుంటా, ఓ మూడ్నాలుగు వేలు ఎడ్వాంసును ఇవ్వండి నేనెళ్ళిపోతా..." అన్నాడు లంబోదరం.
"అదేంటి?... నేను డబ్బులివ్వడం ఏంటి? మీరే సన్మానం చేసి నాకు శాలువా కప్పి పర్సు ఇస్తారుగా?" ఆశ్చర్యంగా అన్నాడు డింభకశ్రీ.
"సన్మానం కాన్సిల్..." అరుస్తూ లేచి నిలబడ్డాడు లంబోదరం.
"అంత కోపం అయితే ఎలాగండీ... అజ్ఞానిని. నాకు అర్ధం అయ్యేలా చెప్పండి..." అంటూ లంబోదరాన్ని కూర్చోబెట్టాడు డింభకశ్రీ.
"మీవి ఎన్ని కవితలు ప్రచురింపబడ్డాయ్?" అడిగాడు లంబోదరం.
"మూడో, నాలుగో ప్రచురింపబడ్డాయండీ..." సిగ్గుపడ్తూ చెప్పాడు డింభకశ్రీ.
"మరి మూడు నాలుగు కవితలు రాసిన మీలాంటి కవులకి ఖర్చులు భరించి సన్మానం ఎవరు చేస్తారనుకున్నారు... ఆ?" కళ్లు ఎగరేస్తూ ప్రశ్నించాడు లంబోదరం.
"అంటే ప్రచురింపబడింది మూడు నాలుగైనా నేను రాసినవి, ప్రచురింపబదనివి చాలా ఉన్నాయండీ... చదివి వినిపించమంటారా? హిహి...."
"ఏదీ చదవండీ చెప్తా..." ముక్కు పొంగిస్తూ అన్నాడు లంబోదరం.
"ముల్లు గొప్పా పువ్వు గొప్పా... గుచ్చుకుంటుంది ముల్లు నొచ్చుకుంటుంది పువ్వు.
పువ్వంటే నవ్వు ముల్లంటే కొవ్వు..."
కవిత్వం చెప్పాసాగారు డింభకశ్రీ...
"మీరిట్టాగే కవిత్వం వినిపిస్తే నేను సన్మానం కాన్సిల్ చేస్తానంతే..."పళ్లు నూర్తూ అన్నాడు ;లంబోదరం. "ఏదో మీకు సన్మానాల దురదుంది అని పోన్లే కదా సన్మానం చేద్దామని నేనొస్తే వేషాలేస్తున్నారే... హమ్మా..."
డింభకశ్రీ చెంపలు వేస్కున్నాడు.
"సారీ అండీ... ఇంకెప్పుడూ అట్టాచేయను... మీరు కోరినవిధంగా అడ్వాన్సు ఇస్తాను. నాకు సన్మానం చేయండి... ఇంతకీ సన్మానంకి ఎంత ఖర్చవుతుంది?"
"సన్మానాల్లో రకలున్నాయ్. పాసింజర్ సన్మానం, ఎక్స్ప్రెస్ సన్మానం, సెమీలగ్జరీ సన్మానం, లగ్జరీసన్మానం, సూపర్ డీలక్స్ సన్మానం... ఇలాగన్నమాట...
"సన్మానం పేర్లు భలేగున్నాయ్!" అన్నాడు ఆశ్చర్యపోతూ డింభకశ్రీ.
"ఇదివరకు నేను ఆర్టీసీలో పంజేసేలే... సొంతంగా ఈ సన్మానాల బిజినెస్ పెట్టుకున్నాక అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసేసా..."
"ఇంతకీ ఈ సన్మానాల్లో తేడాలు చెప్తారా?"
"పాసింజర్ సన్మానం అయితే ఒక చిన్న హాల్లో సాదాసీదాగా చేసేస్తాం. ఎక్స్ ప్రెస్ అయితే కాస్త బాగా చేస్తాం, సెమీ లగ్జరీ అయితే ఇంకాస్త బాగా, లగ్జరీ అయితే ఘనంగా, సూపర్ డీలక్స్ అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తాం. రేట్లు అయిదువేలు, ఏడువేలు, పదివేలు, పన్నేండువేలు, ఇరవై వేలు..."
"అమ్మో... అంతంత రేట్లే..." గుండెలమీద చెయ్యేస్కున్నాడు డింభకశ్రీ.
....ఖర్చు కూడా అలాగే ఉంటుంది. హాలు బుక్ చేయాలి. ఇన్విటేషన్లు ప్రింట్ చేయాలి, జనాన్ని పోగుచేయాలి, శాలువలు కొనాలి, చీఫ్ గెస్టుని, పంక్షను ప్రిసైడ్ చేసేవాళ్లనీ,వక్తల్నీ పిలవాలి... అందరికీ పేరు పేరునా దండలు వేయాలి!... ఖర్చు అవుతుంటే అవదూ మరి? సూపర్ డీలక్స్ సన్మానం అయితే చప్పట్లు కొట్టేవాళ్లని కూడా తెస్తాం, నగరంలోని వేరే వేరే సంస్థల పేర్లతో బోల్డన్ని దండలు కూడా వేయిస్తాం..." అన్నాడు లంబోదరం.
"అమ్మో... అంత ఖర్చు నేను భరించలేను లెండి.. నాకు సెమీలగ్జరీ సన్మానం చాలు" అన్నాడు డింభకశ్రీ.
"అలాగే... నాలుగువేలు ఎడ్వాన్సు కొట్టించండి... మిగతా డబ్బు సన్మానానికి ముందురోజు ఇచ్చెయ్యాలి.
లేకపోతే సన్మానం రోజు ఆ సభకి మీరంటే గిట్టనివాళ్లు వచ్చి మీమీద రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లూ విసుర్తారు."
"ఆ టైముకి వాళ్లెలా వస్తారు?"
"వాళ్లుకూడా మా మనుషులేగా మరి!" నవ్వుతూ సమాధానం ఇచ్చాడు లంబోదరం.
"సరేగానీ.. ఓ విషయం చెప్తారా?... మీరిలా జనానికి సన్మానం ఎందుకు చేస్తున్నారో చెప్తారా?"అడిగాడు డింభకశ్రీ.
"భలేవారే..సన్మానాలు చెయ్యకపోతే ఎలా? అవి చెయ్యబట్టేగా నేను లక్షలు సంపాదించుకున్నా... అంతేకాక మీలాంటి వాళ్ల దురదకూడా తీర్తుంది... సరేగానీ... నాకిహ ఎడ్వాంసు కొట్టించండి... నే వెళ్లిపోతా..."
డింభకశ్రీ లంబోదరానికి ఎడ్వాన్సు డబ్బులు ఇచ్చాడు. లంబోదరం ఓసారి డింభకశ్రీ వీపుగోకి వెళ్లిపోయాడు.
ఆ క్షణంనుండి ఇవరయ్యో తారీఖు ఎప్పుడొస్తుందా అని చొంగకార్చుకుంటూ ఎదురు చూడసాగాడు డింభకశ్రీ.
*** శుభం ***