బంగారు బొమ్మ రావేమే
ఆఫీసునుండి ఆనందరావ్ ఇంటికి వచ్చాడు.
"లత... లతా..." అంటూ హాల్లో సోఫాలో కూర్చుని షూలేసులు విప్పుతూ అరిచాడు.
లత నల్లచీర కట్టుకుని జట్టు విరబోస్కుని బయటికి వచ్చింది. ఆమెని చూస్తూనే ఆనందరావ్ చటుక్కున లేచి నిలబడి గడగడా ఒణుకుతూ "దె...దె...దెయ్యం..." అన్నాడు.
"అవున్లెండి... పెళ్లయ్యి నాలుగేళ్లు అయ్యింది కదా... మీకు నేను దెయ్యంలానే కనిపిస్తాను!" కోపంగా అంది లత...
"అయ్య బాబోయ్... నేను ఏ దెయ్యాన్నీ చేస్కోలేదు బాబోయ్...!" భయంతో వణికిపోతూ అన్నాడు ఆనందరావ్.
"మీరు దెయ్యాన్ని చేస్కోలేదు... నన్ను చేస్కున్నారు... ఇప్పుడు మీ కంటికి నేను దెయ్యంలా కనిపిస్తున్నాను!..." పళ్లు కొరుకుతూ అంది లత.
"హర్రె!... ఈ గొంతు ఎక్కడో విన్నానే..." ఆలోచనగా అన్నాడు ఆనందరావ్.
"ఇదిగో... ఇక్కడ విన్నారు..." మొహం మీద పడ్డ వెంట్రుకల్ని వెనక్కి తోస్తూ అంది లత.
"హర్రె... నువ్వేనా?... నల్లచీర కట్టుకుని నెత్తి చుట్టూ జట్టు చిందర వందరగా పరిచేస్కుని... కళ్లు ఈడ్చుకుంటూ వస్తే నిజంగా దెయ్యం అనుకుని హడిలి చచ్చాననుకో...హిహిహి... అయినా ఈ అవతారం ఏంటి?..."
"ఈ అవతారం కాక నాకు మరేంటి?!... నా బతుక్కి ఇంతకంటే ఏముందని?"
"నీ బతుక్కి ఏమైందే?!..."
"ఏమైందో పక్కింట్లోకి ఓసారి తొంగిచూస్తే తెలుస్తుంది. ఈ వేళ పక్కింటాయన వాళ్లవిడకి ఓ మాంచి నెక్లెస్ కొన్నాడు తెల్సా?... ఈ నాలుగు సంవత్సరాలలో మీరు ఏనాడైన నాకు నక్లెస్ మాట అటుంచి చిన్న ఉంగరం అయినా కొన్నారా?..." ముక్కు చీదింది లత.
"ఉంగరం ఏం ఖర్మే... నీకు నక్లెస్ లూ... వడ్డాణాలూ... దండవంకీలూ అన్నీ కొంటాగా?... నాకు ఉద్యోగంలో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు రానియ్..." అన్నాడు ఆనందరావ్ అనునయంగా.
"అవి వచ్చేదీ లేదు చచ్చేదీ లేదు... ఈలోగా నేను ముసల్దాన్ని కూడా అయిపోతాను.. నగల మాట సరే... వయసులో ఉన్న పెళ్లాన్ని కదా... కనీసం ఓ ముద్దు ముచ్చట కూడా లేదు... పక్కింటాయన చూడండి... ఆఫీసు కెళ్లేప్పుడు ఆవిడని ముద్దుపెట్టుకుని వెళ్తాడట! మీరెప్పుడైన అలా చేసారా?"ఉక్రోషంగా అంది లత.
"నాకూ అలా చెయ్యాలనే ఉంటుందే.. కానీ ఆవిడ్ని ముద్దుపెట్టుకుంటే వాళ్లాయన ఊర్కుంటాడా అని?!..." అమాయకంగా అడిగాడు ఆనందరావ్.
లతకి ఒళ్లుమండి ఆనందరావ్ ని ఓ జల్లకాయ్ కొట్టింది... ఆ దెబ్బకి ఆనందరావ్ తూలుకుంటూ వెళ్లి వంటగదిలో పడ్డాడు.
"మీతో మాట్లడేకంటే టీవీ చూస్కోడం నయం... ఎలాగూ వంటగదిలో పడ్డారు కదా... మీరే కాఫీ పెట్టుకుని తాగండి..." అంది లత అరుస్తూ.
ఆనందరావ్ బుర్రకాయ్ రుద్దుకుంటూ లతని బండబూతులు తిట్టుకుంటూ కాఫీ పెట్టుకుని తాగి హాల్లోకి వచ్చాడు. అక్కడి దృశ్యం చూసిన ఆనందరావ్ ఆశ్చర్యంతో నోరు తెర్చాడు.
లత హాల్లో"తద్దినక...ధినక ధినక... తద్ధినక..." అంటూ డ్యాన్స్ చేస్తుంది. ఒక అయిదు నిమిషాలు పాటు ఎగిరి ఆనక ఆయాసం వచ్చి నేలమీద దబ్బున కూలబడిపోయింది. నోరు తెర్చుకుని చూస్తున్న ఆనందరావ్ వంక చూసి "ఏం అవాక్కయ్యారా?హిహిహి?" అని అడిగింది.
"ఏం అవాక్కవడమో ఏమో... ఇందాక నిన్ను చూసి దెయ్యం అనుకున్నాను... ఇప్పుడేమో పిచ్చిక్కిందేమో అనుకున్నాను... ఏంటి లత ఈ గందరగోళం?..."
"గందరగోళం లేదూ... మీరేం నాకు నగా నట్రా ఏం కొనివ్వక్కర్లేదు... మీరు చెప్పినవన్నీ నేనే సంపాదించుకుంటా.... ఒక్కనైట్ లో సంపాదిస్తా..." అంది లత కన్నుకొట్టి చిలిపిగా చూస్తూ.
ఆనందరావ్ లత ఎదురుగా నేలమీద కూలబడిపోయి "బేర్ ర్ ర్ ..." మని ఏడవడం మొదలుపెట్టాడు.
'అదేంటీ... నేను చెప్పింది విని సంతోషించాలిగానీ... అలా ఏడుస్తారేం?... ఇప్పుడు నేనేమన్నాననీ?!.." ఆశ్చర్యంగా అడిగింది లత.
"ఇమ్కేమనాలీ...ఒక్క నైట్ కే బోల్డంత సంపాదిస్తానని అన్నావ్ గా... నువ్విలాంటి బిజినెస్ లు స్టార్ట్ చేస్తే నేమారుకోను...ఆ! అయినా నీకే ఎయిడ్స్ వస్తుందమ్మా... నాకేం!!?" అన్నాడు ఆనందరావ్ బుంగమూతి పెట్టి.
అది వినగానే లత పడీ పడీ నవ్వింది.
"ఓరి మీ అమాయకత్వం కూలా... నేను అలా సంపాదిస్తానని అనుకున్నారా?... నేను ఇదిగో... దీనితో సంపాదిస్తాను.." అంటూ టీవీ వంక చూపించింది.
"దీంతోనా?... దీనిని అమ్మితే నాలుగైదు వేలు కూడా రావేమో కదా?... అయోమయంగా అన్నాడు ఆనందరావ్.
"అదేమరి మీ తెలివితేటలంటే..." అంటూ ఆనందరావ్ కి గట్టిగా జల్లకాయ్ కొట్టింది.
"ఇందాక మీరు వంటగదిలో కాఫీ పెట్టుకుంతున్నప్పుడు టీవీలో"ఎవడిదంటే వాడిదే" టీవీ ఛానల్ చూశాను... అందులో "బంగారు బొమ్మ రావేమే!..." అన్న ప్రోగ్రాం అనౌన్స్ చేశారు...మనం ఆ ఛానల్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదైనా ప్రశ్న అడుగుతారట!... దానికి జవాబు చెప్తే మనల్ని ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చెయ్యడానికి సెలెక్ట్ చేస్తారు... తర్వాత ఆ ప్రోగ్రాంలో యాంకర్ అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్తే మనకి ప్రశ్న ప్రశ్నకీ బంగారు చొప్పున బోల్డంత బంగారు ఇస్తారు!" అని సంబరంగా చెప్పింది లత....
"అయితే సరే... నాకు బంగారు కొనే బాధ తప్పిందిగా...హిహిహి..." అంటూ నవ్వాడు ఆనందరావ్.
ఆరోజు నుండీ లత రాత్రనకా పగలనకా"ఎవడిదంటే వాడిదే" ఛానల్ కి ఫోన్లు కొట్టసాగింది. ఎన్నిసార్లు కొట్టిన ఆ ఛానల్ నెంబర్ కలవడమే లేదు...కంటిన్యువస్ గా ఎంగేజ్ లోనే ఉంటుంది.
"చూశారా ఆప్రోగ్రాంకి ఎంతమంది చేస్తున్నారో..... మరి అప్పనంగా బంగారు ఇస్తుంటే ఫోన్ చెయ్యరా మరి?... అందుకే ఫోన్ ఎప్పుడూ ఎంగేజ్ వస్తూంది! అయినా నేను ఫోన్ సరిగా చెయ్యడం లేదు!" అంది లత.
"అదేంటి అలా అంటావ్.... రాత్రనక పగలనకా ఫోన్ లు చేస్తూనే ఉన్నావ్ కదా?" ఆశ్చర్యంగా అన్నాడు ఆనందరావ్.
"ఏం చెయ్యడం?"... నేను వంట చేస్తున్న టైమ్ మిస్ కావడం లేదా?... నేను బట్టలు ఉతికే టైమ్ మిస్ కావడం లాడ?...." పళ్లు కొరుకుతూ అంది లత.
అంతే... ఆనందరావ్ కి వంటపనీ బట్టలు ఉతికే పనీ తగిలింది... ఆ టైమ్ లో కూడా లత ఎడతెరిపిలేకుండా ఫోన్ చేస్తే... దాదాపు రెండు వారాల తర్వాత "ఎవడిదంటే వాడిదే" ఛానల్ నెంబర్ తగిలింది.
లత "కెవ్ వ్ వ్ " మని అరిచి ధబేలుమని నేలమీద పడిపోయింది. ఆ యాంకర్ కంగారుగా "హలో.... హలో... హలో..." అని అరుస్తూనే ఉంది. వెంటనే ఆనందరావ్ రిసీవర్ అందుకుని "హలో..." అన్నాడు.
'ఏమైంది సార్.... కెవ్వుమని ఎవరో అరిచారు?...." అడిగింది యాంకర్.
"మా ఆవిడేనండీ ... మీ ఫోన్ తగిలేసరికి ఆనందంతో కెవ్వుమని అరిచి మూర్ఛపోయింది" అన్నాడు ఆనందరావ్.
"అవునా?... హిహిహి... మీరింకా అదృష్టవంతులు... మీ ఆవిడ మూర్ఛపోయింది అంతే... మొన్న ఒకామె అయితే గుండాగి చచ్చిపోయింది... ఎంతైనా అప్పనంగా బంగారు వస్తుందంటే ఆనందమే కదా? హిహిహి..." అంది యాంకర్.
"మీ సంబరం నల్లగుండా... కాస్త ఆగండి మేడం... మా ఆవిడ్ని లేపుతా..." అని ఆనందరావ్ లత మొహం మీద నీళ్ళు చల్లి ఆమెని లేపి రిసీవర్ ఆమె చేతికి ఇచ్చాడు.
లత "హలో" అంది.
"హలో... నేను బంగారుబొమ్మ రావేమే ప్రోగ్రాం నుండీ మాట్లాడ్తున్నా... మా ఫోన్ తగిలితే మీకెలా అనిపిస్తుంది?..." అడిగింది యాంకర్.
"ఎప్పుడు గుండాగి చస్తానో నాకే తెలీదు మేడం... అలా ఉంది" అంది లత ఆనందంతో గట్టిగా ఏడుస్తూ.
"ఊర్కోండి మేడం... ఊర్కోండి..." అంటూ యాంకర్ ఓ అయిదు నిముషాలు ప్రయత్నించి లతని ఊరుకోబెట్టింది.
"ఇప్పుడు మీ వివరాలు చెప్పండి..." అని అడిగింది.
లత తన పేరూ, భర్త పేరూ, భర్త ఏ ఉద్యోగం చేస్తాడు... వాళ్లు ఎక్కడ ఉంటారూ మొదలయిన వివరాలు యాంకర్ కి చెప్పింది.
"ఇప్పుడు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను... దానికి మీరు సమాధానం చెప్తే మీరు మా ప్రోగ్రాంలో పాల్గొనడానికి క్వాలిఫై అవుతారు..."
"కాస్త ఈజీవి అడగండి మేడం!" భయం భయంగా అంది లత.