"వీడో పేద్ద జీనియస్ అనుకుని ప్రేమించావు కదా! ఇప్పుడు తెలిసిందా ఎంత థర్డ్ గ్రేడ్ చవటను ప్రేమించావో."
ప్రతిమకు భవానీశంకర్ గురించి తండ్రి అలా మాట్లాడటం నచ్చలేదు. "కానీ డాడీ...ఇదంతా మీ మంచికోరే..."
"ట్రాష్! వాడి బ్రెయిన్ లో మెదడనేది అసలు లేదు. మునిసిపల్ గార్బేజ్ వుంది. కావాలంటే మెడినోవాలో ఎక్స్ రే తీయించి చూస్కో."
"డాడీ...అతను..."
"ఏమయినా సరే నువ్విలాంటి ఫోర్త్ గ్రేడ్ ఫెలోని చేసుకోవడానికి వీల్లేదు."
"ఫోర్త్ గ్రేడేమిటి? ఇందాక థర్డ్ గ్రేడ్ అన్నారుగా?"
"అది అచ్చు పొరపాటు ఫోర్త్ గ్రేడ్ కరెక్ట్"
ప్రతిమ ఇంక మాట్లాడదల్చుకోలేదు. ఆ సమయంలో తానేం మాట్లాడినా మార్కండేయులు రివర్స్ వచ్చేస్తాడని అర్థమయిపోయింది. కారు కూడా చాలా కోపంగా శబ్దాలు చేసుకుంటూ వెళుతోంది.
"హా! ఫిఫ్టీన్ లాక్స్. మ్యాడ్ ఫెలోస్. మాడ్ ఇడియట్స్" తనలో తను గొణుక్కోసాగాడు మార్కండేయులు.
* * * *
సుధీర్ కుమార్ అమాంతం విజయ్ ని కౌగిలించుకున్నాడు ఆనందం పట్టలేక.
"ఏమిటిది? కలా, నిజమా?" సంభ్రమంగా అడిగాడతను.
"నిజమే అంకుల్! చూడండి కావాలంటే" అంటూ అతని చేయి గిల్లాడు విజయ్.
"అబ్బా" అన్నాడు భవానీశంకర్ చప్పున చేయి వెనక్కు లాక్కుంటూ.
"ఓ సారీ సెక్రట్రీ. నేను గిల్లింది నీ చెయ్యా?" నొచ్చుకుంటూ అన్నాడు విజయ్.
"అవున్సార్!" అన్నాడు అతను వినయంగా.
"మీ సెక్రట్రీ చెయ్యయినా, నా చెయ్యయినా ఒక్కటే! ఏం ఫర్లేదు. ఇది కల కాదనీ, నిజమనీ రుజువయిపోయింది" అన్నాడు సుధీర్ కుమార్.
"అవునంకుల్! ఋజువైపోయింది" అన్నాడు విజయ్.
"కానీ మా ఫ్యాక్టరీ వర్కర్స్ తో సమ్మె ఎలా చేయించగలిగారసలు. నేనూ మా పాత జనరల్ మేనేజర్ ఎంతో ప్రయత్నించినా వాళ్ళు సమ్మె చేయనేలేదే? దొంగ వెధవలు?" అడిగాడు సుధీర్ కుమార్.
"అదంతా సైకో ఎనాలిసిస్ సుధీర్ కుమార్ జీ! వర్కర్స్ వారి యూనియన్ లీడర్స్ తాలూకు మెదళ్ళు కొంచెం పెక్యూలియర్ గా పనిచేస్తాయి. స్ట్రయిక్ చెయ్యమంటే చెయ్యరు. చేయవద్దంటే చేస్తారు. రైల్వే యూనియన్ లు మీరు చూసే వుంటారు. ఒక యూనియన్ జీతాలు పెంచమనీ, బోనస్ ఇవ్వమనీ స్ట్రయిక్ చేస్తే రెండో యూనియన్ అవేమీ వద్దని డ్యూటీ చేస్తారు" చెప్పాడు భవానీశంకర్.
"అవునవును! ప్రపంచంలో ఎవరికీ అంతుపట్టని వింత యూనియన్లు రైల్వే వాళ్ళవి" గుర్తుతెచ్చుకుంటూ అన్నాడు ఆయన.
"కనుక ఆ వింత మెదడు స్టడీ చేసి మీ వర్కర్సుకి హెల్మెట్ పెట్టాను. అంతే! బోల్తా పడ్డారు."
"అంటే మన ఫ్యాక్టరీకి ఈ వర్కర్సు సమ్మె వల్ల రోజుకి ఎనిమిది లక్షల నష్టం వచ్చేస్తూంది కదూ?"
"అవున్సార్! రోజుకి ఎనిమిది లక్షల చొప్పున నెలకు రెండు కోట్ల నలభై లక్షల చొప్పున సంవత్సరానికి ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై లక్షలు లాస్ వచ్చేస్తుంది మనకి."
"ఆహా! అద్భుతం! అమోఘం! అంటే షుమారు రెండేళ్ళలో నేను ఆస్తంతా వదిలించుకుని అందమైన ఓ గుడిశెలో నులకమంచం మీద పడుకుని..." అతని పాటను చప్పున భవానీశంకర్ పూర్తిచేశాడు.
"పడుకుని నల్లానల్లనోడు ఓ సందమామా నిండు వెన్నేలోడు ఓ సందమామా...అని పాడుకుంటూ తలుపు సందులోంచి నులకమంచం మీద పడే వెన్నెల చల్లదనాన్ని అనుభవిస్తూ, ఆహా! వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ సార్ అది! నిజంగా మీ జన్మధన్యమయిపోతుంది" భవానీశంకర్ మాట్లాడుతుంటే నిజంగానే ఆ దృశ్యాన్ని తనివితీరా అనుభవించి తిరిగి బాధగా ఈ లోకంలోకొచ్చాడు ఆయన.
అతనికి భవానీశంకర్ మీద విపరీతమైన ప్రేమ కలిగింది "ఆహా! ఎంత చక్కగా వర్ణించావోయ్ శంకరనారాయణా! పాపం నువ్వు సగం గుడిశెలో జీవితం గడపబట్టీ అంత అందంగా ఆ అనుభవాన్ని కళ్ళముందుంచగలిగావ్!"
"అవున్సార్! మళ్ళీ ఎప్పటికయినా నేను మీతోపాటు ఒకసారి మారిపోయి, ఈ సిటీ వదిలేసి మా ఊళ్ళో మళ్ళీ మిగతా సగం గుడిశె కూడా గవర్నమెంట్ లోన్ తీసుకుని కట్టించి...అప్పుడు..."
ఆయనకి భవానీశంకర్ మీద ప్రేమ కట్టలు తెంచుకుంది. అతని చెయ్యి పట్టుకుని బలంగా నలిపి వదిలేశాడు.
"మనిద్దరం పక్క పక్క గుడిశెల్లో వుందామోయ్. అప్పుడు జీవితం ఇంకా థ్రిల్లింగ్ గా వుంటుంది" అన్నాడు ఆప్యాయంగా.
* * * *
మర్నాడు మార్కండేయులు నిద్రలేచి అలవాటు ప్రకారం నైట్ గౌనుతో బాల్కనీలో కొచ్చి వళ్ళు విరుచుకుని ఆవలిస్తుంటే హఠాత్తుగా గేటు ముందు గుంపుగా నిలబడ్డ జనం కనిపించారు.
అదిరిపడి కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు. సందేహం లేదు. ఎవరో తనింటిముందు ఎందుకో గుమిగూడారు. వాళ్ళందరినీ భవానీశంకర్, ప్రతిమా, ప్రకాష్ పలుకరిస్తున్నారు.
ఒక్క ఉదుటున రూమ్ లోకి పరుగెత్తి త్వరత్వరగా రడీ అయ్యి తన ఆఫీసులోకి చేరుకున్నాడతను.
"వాళ్ళంతా ఎవరు?" భవానీశంకర్ నడిగాడు కోపంగా.
"ఇదీ మరీ థర్డ్ గ్రేడ్ ప్రశ్న మైడియర్ ఫాదరిన్లా! ఎవరేమిటి? సినిమా బయ్యర్లు! మనం తీసిన సినిమా కొనడానికి వచ్చిన జిల్లాలవారీ కొనుగోలుదార్లు! ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేశాను. వాళ్ళను లైన్ లో నిలబెట్టడానికి! అవసరమైతే మైల్డ్ గా లాఠీఛార్జీ చేయమని కూడా చెప్పాను వారికి" చెప్పాడు భవానీశంకర్.
"వాట్? మనం తీసిన సినిమా కొనడానికి అంతమంది ఎగబడుతున్నారా? నిన్న మొన్నటివరకూ మన సినిమా పేరు చెప్తేనే పారిపోయారు కదా? ఐ డోంట్ బిలీవ్."
"అవును! మీరు నమ్మరు. ఎందుకంటే మీ బ్రెయిన్లో మున్సిపల్ గార్బేజ్ నిండి వుంది కనుక."
మార్కండేయులుకి కోపంతో మొహం ఎర్రబడింది.
"వాట్ నాన్సెన్స్ యూ ఆర్ స్పీకింగ్."
"కమాన్ ఓల్డ్ మాన్ - ఇంగ్లీష్ కాసేపు పోస్ట్ పోన్ చేసి బయ్యర్స్ తో బేరాలాడి ఎడ్వాన్స్ లు తీసుకోండి!"
అప్పుడే ప్రతిమ ఓ బయ్యర్ తో లోపలకు అడుగుపెట్టింది "డాడీ! ఈయన మా ఫ్రెండ్ ఫాదర్!
ఆ జిల్లాకు మన సినిమా రైట్స్ ఈయనకే ఇప్పించమని రికమండేషన్ తీసుకొచ్చాడు. మీరెంత రేటు చెప్పినా సిద్ధమేనట."