"ఊహు! వద్దులే! నేను వెళ్ళగలను."
"నేను వెళ్ళలేను జయా!" ఆమెతోపాటు నడుస్తూ అన్నాడతను. ఇంకేమీ మాట్లాడకుండా ఆఫీస్ వేపు వడివడిగా అడుగులు వేయసాగిందామె. అప్పటికే లంచ్ బ్రేక్ అయిపోయి పావుగంట దాటింది. ఆఫీస్ దగ్గరకు చేరుకుంటూనే ఎదురుగ్గా వస్తూన్న చంద్రకాంత్ ని చూసి గాబరా పడిపోయింది జయ. తను లంచ్ టైమ్ లో లేకపోవడం, తిరిగి ఓ యువకుడితో ఆఫీసుకి చేరుకోవడం-దీన్ని అతనెలా భావిస్తాడు?
"నీకోసమే చూస్తున్నాను." అన్నాడు చంద్రకాంత్ ఆమె పక్కన ఉన్న కిషోర్ వంక చూస్తూ!
"మా క్లాస్ మేట్ సరిత అన్నయ్య! వీరు మావారు." ఇద్దరికీ పరిచయం చేసింది జయ. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు తన గొంతు వణకడం తనకే స్పష్టంగా తెలిసిపోతోంది.
"హలో! గ్లాడ్ టు సీయూ!" కరచాలనం చేశాడు కిషోర్.
"ఇద్దరం రెస్టారెంట్ కెళ్ళి కాఫీ తీసుకు వస్తున్నాం." అతి కష్టంమీద గొంతు పెగల్చుకుని అందామె." చాలా కాలం తరువాత కనబడ్డారీయన."
"ఓహో...అలాగా!"
"మీరు ఏమయినా పనిమీద వచ్చారా?" చంద్రకాంత్ నడిగింది జయ.
"అవును! నువ్వు త్వరగా ఇంటికి రావాలి! మీ అమ్మకు హఠాత్తుగా గుండెనొప్పి వచ్చిందట."
జయకు ఏడుపొచ్చేసింది.
"అమ్మకా?"
"అవును!"
"ఉండండి! ఇప్పుడే పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాను! వస్తా కిషోర్!" అనేసి లోపలకు హడావుడిగా నడిచిందామె.
"వస్తానండీ! మరోసారి కలుస్తాను." అంటూ తనదారిన తను వెళ్ళిపోయాడు కిషోర్!
కొద్దినిమిషాల తర్వాత చంద్రకాంత్ తోపాటు ఇంటికి చేరుకుందామె. అప్పటి కప్పుడే బయల్దేరి జయ వాళ్ళ ఊరు చేరుకున్నారిద్దరూ.
మంచానికంటుకుపోయిన తల్లిని చూస్తూనే ఒక్కసారిగా ఏడ్చేయసాగింది జయ.
విజయ ఆమెను దగ్గరకు తీసుకుంది!
"ఏయ్! ఏడుపెందుకు? ఇదేం ప్రమాదకరమయినది కాదని చెప్పార్లే డాక్టరుగారు." అంది ఓదార్పుగా. కానీ అలా అంటూంటే ఆమెకు దుఃఖం ఆగలేదు. అతి కష్టంమీద దుఃఖం ఆపుకుంది.
రాత్రయ్యేసరికి పార్వతికి స్పృహ తప్పింది. జయ, విజయ ఇద్దరూ ఇక ఏడుపు ఆపుకోలేకపోయారు.
చంద్రకాంత్ మళ్ళీ డాక్టరుని తీసుకొచ్చాడు.
ఆయన మరో ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ తరువాత కొద్దిసేపటికి తిరిగి స్పృహలోకొచ్చిందామె. తన దగ్గరగా కూర్చుని ఏడుస్తోన్న జయ, విజయాలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది.
"నేనిక బ్రతకను. నీకేమీ చేయలేకపోయాను! నాకు నీదే దిగులు" అంది దుఃఖపూరితమైన గొంతుతో విజయ తల నిమురుతూ.
"నాకేమీ ఫరవాలేదమ్మా! ఇప్పుడు ఏం తక్కువైందని?" ఓదార్పుగా అంది విజయ.
పార్వతి మాట్లాడలేదు.
ఆమెకిప్పుడు కొంత సంతృప్తిగా ఉంది.
విజయ భారం చంద్రకాంత్ వహిస్తాడు.
"ఇద్దరూ అమాయకులే బాబూ! ఏమైనా తప్పులు చేస్తే క్షమించు" ఆ తరువాత ఆమెకు మళ్ళీ స్పృహ తప్పింది. తెల్లవారుజామున ఆమె కన్ను మూసింది.
తమతోపాటు విజయను కూడా తీసుకువచ్చేశారు చంద్రకాంత్, జయలు.
విజయ ఆ షాక్ నుంచి చాలారోజుల వరకూ కోలుకోలేకపోయింది.
అతనుంటున్నచోటే తనూ ఉండటం ఇష్టంలేకపోయినా గత్యంతరం లేకపోయింది విజయకు. మొట్టమొదటిసారిగా చంద్రకాంత్, జయల సంసారిక జీవితాన్ని దగ్గరుండి పరిశీలించే అవకాశం కలిగిందామెకి.
జయ చంద్రకాంత్ విషయంలో చూపుతున్న ఉదాశీనత, నిర్లిప్తత, అలక్ష్యం ఆమెకు ఆశ్చర్యం కలిగించినాయి.
చంద్రకాంత్ కూడా ఆమె ప్రవర్తనకు లోలోపల బాధపడుతున్నట్లు అనిపించిందామెకి.
అతను లేని సమయంలో జయ దగ్గర ఆ విషయం కదిపిందామె.
"జయ! నేనోమాట అడుగుతాను. ఏమీ అనుకోవు గదూ?"
ఆమె ఆశ్చర్యంగా చూసింది అక్క వేపు.
"నువ్వు అడిగితే నేనేమైనా అనుకోవడమా? నువ్వు ఇవ్వాళ కొత్తగా మాట్లాడుతున్నావక్కా! ఏమిటో చెప్పు నువ్వడగదల్చుకుంది?"
"నువ్వూ, చంద్రకాంత్ గారు ఎలాంటి కలతలు లేకుండా వుంటున్నారా?"
"అలాంటివేమీ లేవు! నీకెందుకా అనుమానం వచ్చింది?"
"ఏమో! నాకే తెలీదు. పోనీ ఈ విషయం చెప్పు! ఆనందంగా వున్నావా?"
ఆమె నవ్వింది.