Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 35


    "అబ్బే, నేనేం చేశాను.... కమల" తడబడుతూ గాభరాగా అంది. ఆమె వళ్ళంతా చెమటలు పట్టాయి.
    "అయితే మీరు మీవారినించి పిస్తోలు తీసుకున్నారన్నమాట!" లాయరు మొహంలో గర్వం తళుక్కుమంది.
    అప్పటికి లాయరు ప్రశ్నలోని తికమక గ్రహించి గాభరాగా సర్దుకొంటూ_ "అబ్బే ఆయన నాకివ్వందే, నేను ఎంత ప్రయత్నించినా ఆయన నన్ను త్రోసేసి వెళ్లిపోయారు."
    "కమలాదేవీ" మీరు మీవారినించి ఆ పిస్తోలు తీసుకున్నారని.... ఆయన అది మీనించి తీసుకోడానికి పెనుగులాడారని మీరీయక పోతే అప్పుడు 'పిస్తోలు లేకపోతే చావదల్చినవారికి అనేక మార్గాలు, నీవు నన్ను ఆపగలననుకుంటున్నావా' అని విసురుగా వెళ్ళిపోయారని, ఆ తరువాత మీరు ఆవేశంతో, కోపంతో అవమానంతో కసితో ఆ పిస్తోలు తీసుకుని ఆయనని వెంబడించి హోటల్ కి వెళ్లారని, అక్కడ కిటికీ దగ్గిర పొంచి మీ భర్త, సుజాతల మధ్య సంభాషణ అంతా వింటూ మీవారు సుజాతని బ్రతిమిలాడడం, తనకి భార్య లెక్కలేదని. ఆమె ఏమన్నాసరే తనను వివాహం చేసుకుంటానని, అలా జరగని పక్షంలో యిద్దరం కలిసే చనిపోదామని అనడం విని ఆవేశం, అసూయ భరించలేక కిటికీ కర్టెను తొలగించి సుజాతని చంపాలని, ఆమె పీడవదిలించుకుని మీ భర్తని దక్కించుకోవాలనుకున్నారు_ కాని అలవాటులేక, చాతకాక గురితప్పి ఆ గుళ్ళు మీ భర్తగారికి తగిలాయి_ అప్పటికిగాని మీరు చేసిన పని తెలిసిరాలేదు, కిటికీలోంచి పిస్తోలు లోపలికి విసిరేశారు. అప్పుడు కేకపుపెట్టి నలుగురిని పిలిచారు.... "గంభీరంగా కమలని చూస్తూ వేలుపెట్టి ఆమెని బెదిరిస్తున్నట్టు తీక్షణంగా తన వాదం సాగిస్తున్నాడు డిఫెన్సులాయరు.
    "అబద్ధం.... అంతా అబద్ధం...." అంటూ అరిచింది మధ్యలోనే కమల. ఆమె మొహం ఎర్రబడిపోయింది. ఆవేశంతో, గాభరాతో భయంతో ఆమెకి వణుకువచ్చింది.... సుజాత ఆశ్చర్యంగా వింటోంది.
    ప్రాసిక్యూటర్ ఒక్క ఉదుటున లేచినిల్చుని "అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఏ ఆధారమూ ఏ సాక్ష్యమూ లేకుండా సాక్షిని కేవలం తికమకపెట్టి తప్పుదారి తొక్కించే ఈ నేరారోపణకి అభ్యంతరం తెలియచేస్తున్నాను_" అన్నాడు.
    జడ్జిగారు ఒక్క క్షణం ఆలోచించి 'అబ్జక్షన్ సస్టెయిండ్' అన్నారు "డిఫెన్సులాయరు సాక్షిమీద ఆరోపించిన ఆరోపణకి తగిన సాక్ష్యాలు వుంటే చూపాలి" అన్నారు.
    "యువర్ ఆనర్, సాక్ష్యం, ఆధారం చూపలేకపోయినా ఆనందరావుని చంపడానికి ముద్దాయికి ఎంత అవకాశం ఉందో, సుజాతని చంపి తనకి అడ్డు తొలగించుకోవాలని హతుని భార్య అనుకుంటే ఆమెకి అవకాశం వుందని చెప్పటమే నా ఉద్దేశం.శ్రీమతి కమల హోటలుకి రావడం ఒక్క బాయ్ మాత్రం చూశాడు. సుజాత వుంటున్న గది నెంబరు అడిగింది! ఆ గది వరండా మలుపులో చివరవున్న గది కనక అక్కడ ఆమె నిల్చోడం, ఆమె ఏంచేసినా ఎవరికి కనిపించదు. ఆ సమయంలో అక్కడెవరూ లేరు కూడానూ. ఈ పాయింటు జడ్జిగారు గుర్తించాలని మనవి."  
    "అవచ్చు, కాని ఏ ఆధారమూలేని ఆరోపణ నిలవదు. నౌ యుకెన్ ప్రొసీడ్ విత్ యువర్ ఎగ్జామినేషన్_" అన్నారు జడ్జి. డిఫెన్సు లాయరు ముఖం ఓడిపోయినట్లు అయింది. వున్న ఒకే అవకాశం, సుజాతని దోషిగా నిరూపించడానికి తనకున్న చిన్న ఆశ జారిపోయిందని నిరాశపడ్డాడు.
    "నా తరువాయి సాక్షి ముద్దాయి సుజాత...." అన్నాడు లాయరు. కమల నెత్తిమీద బరువు దిగిపోయినట్లు, బ్రతుకు జీవుడా అన్నట్టు తేలిగ్గా ఊపిరి తీసుకుని బోను దిగింది.
    "కుమారి సుజాతా.... ఆనందరావు హత్య జరిగినరోజు హోటల్ గదిలో ఏం జరిగిందో వివరంగా చెబుతారా?.... ఆనందరావుని ఆవేశంతో
    ఏమన్నారు? కసిగా తూలనాడి దూషిస్తే ఆనందరావు ఏమన్నాడు?"
    హ... తను ఆనంద్ ని తూలనాడిందా! దూషించిందా!.... వూహు.... అనుకుంది కాని ఏఒక్కటీ చెయ్యలేకపోయింది. ఆవేశంగా కసిగా నిందించాలనుకుంది. చెంప పగలగొట్టాలనుకుంది. నీచుడా అని మొహంమీద ఉమ్మేయాలనుకుంది... కాని ఇందులో ఏదీ చెయ్యలేకపోయింది. ఆనంద్ ని చూడగానే_ ఆనంద్ మొహం గుర్తుపట్టలేనంతగా నల్లబడిపోయిన, సర్వస్వం పోగొట్టుకున్నట్టున్న ఆ మొహంలో బాధ, ఆ కళ్ళలో ఆవేదన చూడగానే చలించిపోయింది. అతను ఏమీ చెప్పనక్కరలేకుండానే తనకోసం అతను పడుతున్న వ్యధ ఎంతటిదో తెలిసింది. కసిగా తిట్టాలి అనుకున్న తను 'ఆనంద్' అంటూ బేలగా అరిచి అతని గుండెలమీద వ్రాలిపోయి భోరుమంది. ఇరువురూ ఒకరిని హత్తుకుని ఒకరు రోదించారు.... 'సుజా, నన్ను తిట్టు, కొట్టు, చంపు, నీ యీ ప్రేమ, నీ క్షమ నేను భరించలేను. నీ యీ ఔదార్యానికి నేను తగను.' చంటిపిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని తను ఓదార్చవలసివచ్చింది. 'సుజా' పద ఎక్కడికైనా వెళ్లిపోదాం. ఈ మనుష్యులు, ఈ సంఘం, కట్టుబాట్లు ఏమీలేని చోటకిపోదాం. నీవుంటే నీవు నాప్రక్కన వుంటే నరకమైనా సరే ఫరవాలేదు. సుజా, నీకు నేనేం చెయ్యను. ఇంత అసమర్ధుడిని ఎందుకు ప్రేమించావు. తనని ఓదార్చి, సమాధానపరచాల్సిన ఆనంద్ అంత బేలగా తనని కౌగలించుకుని ఏడుస్తూంటే ఆనంద్ ప్రేమ ఎంతటిదో తనని అభిషేకం చేస్తున్న ఆ కన్నీళ్లే తెల్పుతూంటే.... అతనిని ఓదార్చడం తనవంతయింది.

 Previous Page Next Page