Previous Page Next Page 
కొత్తనీరు పేజి 35


    బయట టాక్సీహారన్ మోగింది. శకుంతల గాభరాగా లేచి నిలబడింది. నిస్సహాయంగా కూతురివైపు చూసింది. "రాధా!......అదిగో వచ్చేశారు వాళ్ళు.....ఈ ఒక్కసారికి నా మాట విను తల్లీ..." అంటూ ఆమె చెయ్యి పట్టుకుంది.
    సూర్యనారాయణ హడావిడిగా లోపలికి వచ్చాడు. "అవతల వాళ్ళు వచ్చేశారు.....ఇంకా ఇలాగే ఉందేమిటి ఇది?.....ఏం చేస్తున్నారు ఇంతసేపూ?" అని ఉరిమి చూశాడు ఇద్దరివేపూ. శకుంతల బెరుగ్గా కూతురివైపు చూసింది.
    "ఏమిటి అలా దిష్టిబొమ్మల్లా నిలబడ్డారు? త్వరగా తెమల్చుదాన్ని"
    "రాధ!.....రాధ.....రానంటూంది.....అది కూర్చోదట......పెళ్ళి చేసుకోదట!" భయం భయంగా అంది శకుంతల.
    సూర్యనారాయణ ముఖం జేవురించింది.
    "ముందు లే, మాట్లాడక-వెళ్ళి చీర కట్టుకురా.....!" అని ఆజ్ఞాపించాడు అనూరాధని. ఆ క్షణంలో సూర్యనారాయణ కోపాన్ని ఎలా నిగ్రహించుకున్నాడో అతనికే తెలియదు.
    అనూరాధ కదలలేదు. ఆమె మౌనం ఆమె నిశ్చయం ఎంత దృఢమైందో తెలియచేస్తూంది.
    సూర్యనారాయణ కోపంతో వణికిపోయాడు. కళ్ళలో నిప్పులు కురిపించాడు. "నీకే చెపుతున్నాను. వినబడటంలేదూ?...." అన్నాడు పళ్ళు కొరుకుతూ.
    "నేను రాను.....నేను చేసుకోనంటూంటే ఎందుకు పిలవాలి వాళ్ళని?....." రాధ ధైర్యంగా తల యెత్తి తండ్రి ముఖంలోకి చూసింది.
    "అన్నింటికి నీ ఇష్టమే అనుకుంటున్నావా? నీ పర్మిషన్ తీసుకుని నేను అన్ని పనులు చేయాలా?" అని ఆడిపోశాడు సూర్యనారాయణ.
    "నా పెళ్ళి విషయం నా ఇష్టం కాకపోతే మరెవరి ఇష్టం?"
    "నా ఇష్టం! నేను నీకు తండ్రి నన్న మాట మరచిపోకు. నీ మంచిచెడ్డలు నాకు కాకపోతే మరెవరికి?"
    "నా మంచి కోరేవా రయితే నా కిష్టం లేని పని చెయ్యనే చెయ్యరు!"
    సూర్యనారాయణలో సహనం ఆఖరి మెట్టుకు వచ్చింది. అవతల పెళ్ళివారు వచ్చి కూర్చున్నారు. ఆలస్యం చెయ్యడానికి వీల్లేదు. నయాన్నో, భయాన్నో రాధని ముందు వాళ్ళకి చూపించాలి. మర్యాద కాపాడుకోవాలి. ఏం చెయ్యాలో తోచని అసహాయస్థితిలో రాధ వైపు తీక్షణంగా చూశాడు సూర్యనారాయణ. మనిషి ఆవేశంతో అస్థిరంగా వున్నాడు. ఒళ్ళంతా చెమటలు పోశాయి.
    శకుంతల కూతురి వైపు, భర్త వైపు బెదురుగా చూస్తూ నిలుచుంది.
    "రాధా, ఆఖరిసారి అడుగుతున్నాను.....తక్కిన వన్నీ తరవాత మాట్లాడుదాం.....ముందు వచ్చి వాళ్ళ దగ్గిర ఓ నిమిషం కూర్చుంటావా లేదా?" కూతురి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు సూర్యనారాయణ.
    రాధ జవాబియ్యకుండా తల వంచుకుంది.
    "రావా?.....రావూ! ఆడదానివి నీ కింత పొగరా? నన్నే ఎదిరిస్తున్నావా?" రాధ జుట్టు ఎడంచేత్తో పట్టుకుని శక్తికొద్దీ చెంపపెట్టు పెట్టాడు సూర్యనారాయణ. "ఇంక లే.....లేవకపోతే నీ అంతం చూస్తాను!" అతని కళ్ళలో ఎర్ర జీర కనిపించింది.
    తండ్రి చేతుల్లోంచి తల విదిలించుకుని, తిరస్కారం చూపి, విసురుగా ముఖం తిప్పుకుని, క్రింది పెదవి నొక్కిపట్టి అంది అనూరాధ.
    "కొడితే, తిడితే బెధరడానికి నేనేం అమ్మని కాను!.....అమ్మ అన్నీ నోరుమూసుకు సహించింది కాని.....నే నలా సహించేది లేదు....."
    సూర్యనారాయణ మళ్ళీ విసురుగా చెయ్యి ఎత్తాడుగాని, దాన్ని దించుతూ-"నోరుముయ్.....అట్టే పేలకు....నీ రోగం తరవాత అణుస్తాను.... ......ఇంట్లో వాళ్ళున్నారు కనక బతికిపోయావు....." అన్నాడు.
    శకుంతల గజగజ వణుకుతూ ఇద్దరిమధ్యకి వచ్చి నిలబడి "మీ ఇద్దరికి మతిపోయిందా? ఏమి టీ గొడవ, ఇంట్లో పెళ్ళివారిని పెట్టుకుని! మీరు వెళ్ళండి, బాగుండదు. దాన్ని నేను తీసుకువస్తాను" అంది గాభరాగా.
    సూర్యనారాయణ బుసలుకొడుతూ రాధవైపు చూసి, గది లోంచి వెళ్ళిపోయాడు.
    శకుంతల కూతురికేసి చురచుర చూసింది. ఆమె తల వంచుకుంది.
    "అనూరాధ......ఇప్పుడు కనక నువ్వు నా మాట వినకపోతే .....నా శవం చూస్తావు.....అప్పటితో నా బాధలన్నీ విరగడవుతాయి. ఏదో ఒకటి వెంటనే చెప్పు...." కర్కశంగా అంది శకుంతల. రాధ గభాలున తలయెత్తి ఏదో చెప్పబోయింది. పెదవులు అదిరాయి. వెంటనే తల తిప్పుకుని, కళ్ళు తుడుచుకుని విసురుగా గదిలోంచి వెళ్ళిపోయింది. శకుంతల స్థాణువులా నిలబడిపోయింది.
    రాధ రోషంగా పెట్టె తెరిచి ఓ పట్టుచీర లాగి, కట్టుకున్న చీర విప్పి మంచంమీదికి విసిరివేసింది. పట్టుచీర కట్టుకుని.....ఆపళంగా వెళ్ళబోతున్న రాధ చేయి పట్టుకుంది శకుంతల.
    "ఆ కళ్ళు తుడుచుకో.....ముఖం కడుక్కునిరా!" స్థిరంగా అంది శకుంతల, రాధ జుత్తు దువ్వెనతో సరిచేస్తూ.
    రాధ విసురుగానే వచ్చి పెళ్ళి కొడుకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. పెదవులు బిగించిన రాధ ముఖం మీద ఏడుపు చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
    పెళ్ళికొడుకు, అతని తల్లి, తండ్రి ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. పెళ్ళి కొడుకు రాధ కేసి పట్టి పట్టి చూశాడు.
    శకుంతల అతిథి మర్యాదలు జరిపింది, కాఫీఫలహారాలు పట్టుకొచ్చి.
    "నీ పే రేమిటమ్మా." పెళ్ళికొడుకు తల్లి అనూరాధని నఖశిఖ పర్యంతం పరీక్షిస్తూ అడిగింది. అనూరాధ జవాబియ్యలేదు.

 Previous Page Next Page