ఖయ్యాము కవిత్వమునందు ప్రతీకలు ప్రయుక్తములు. అట్లే కరుణశ్రీ గారి ఖయ్యామునందును ప్రతీకల ప్రాబల్యము తప్పదు. ప్రణయిని ఖయ్యాము ప్రియురాలు; సాఖీ; మధువునందించెడి స్త్రీ. ఇది బహిరంగమైన లౌకికమైన అర్థము. ప్రతీకగా గ్రహించినప్పుడు జీవాత్మ ప్రతిఫలించును; కొన్ని యెడల భక్తి భావము ప్రతిఫలించును. ఇచ్చట పరమేశ్వరుడు ప్రతీకలో ఒదగక స్పష్టముగానే ప్రశస్తి నందుకొనుచున్నాడు. నడుమనున్నది ప్రపంచము. ఇదియు స్పష్ట ప్రసన్నమే. జీవాత్మ పరమాత్మల నడిమి వంతెనవంటిది ప్రపంచము. దీనిని తిరస్కరించుటకు వీలులేదు; యథాతథముగా స్వీకరించుటకును వీలులేదు. దీని నుపయోగించుకొనియే జీవి జీవేశ్వరుని గుర్తింపవలయును; చేరుకొనవలయును. కావున. ఇందలి క్రమము జీవ జీవేశ్వరైక్యాను సంధానమునకు సరియగు ప్రస్థానమును ప్రతీయమానము చేయుచున్నది.
ప్రణయిని :- మేలుకొల్పు, సుప్రభాతము, బాలరవి, పికస్వామి, వసంతారామము, గులాబి, అమరగానము, మధురాసవము, మలయానిలములు, తుమ్మెదలు, జీవితక్షణ భంగురత్వము, వనవిహారము, ప్రేయసి, నవయాత్రికులు, కాలధర్మము, కోడికూత, మృత్యుగళము, విధి క్రూరత్వము, అనంతత్వము, ప్రకృతిసౌందర్యము, భావనాసౌకుమార్యము, ఆనంద రసాధి దేవత, సుందరభంగిమలు, దైవకటాక్షము, మధురానుబంధము, నవ్వులతోట, కట్టిడిబ్రహ్మ, పూర్వ వాసనల సంభావన, చేతికందిన స్వర్గము, ఆకాంక్ష.
ప్రపంచము :- తప్పులు పట్టుట, భాగ్యవ్యత్యయము, దానవత్వము, కాలకర్కశత్వము, కుమ్మరి, మాలి, దైవరహస్యము, ధూర్తజగము, శత్రుమిత్ర వివేకము, పరోపకారము, స్వార్థత్యాగము, అత్యాశ, స్వతంత్రత, ప్రవాస భూమి, జ్ఞానములేని దేవులాట, పాంధుడు, ప్రబోధము, దొంగభక్తులను పరిహసించుట, వైకుంఠపాళి, ఈర్ష్యాళువు, కుండల ప్రశ్న, కష్టసహిష్ణుత, హింసానిరసన, దాంభికత్వము. కుహనాపరోపకారులు, భక్తి మహత్వము, ఐహికసుఖము, ఆనందలాక్షణికము, దైవవిశ్వాసము, మోక్షార్హత, చిత్తశుద్ధి, దయ, మనోనిగ్రహము, జ్ఞానము, స్వాభీష్టములు, జాగరూకత.
పరమేశ్వరుడు :- దేవుని యునికి, జగన్నాటకము, పాత్రధారులు, సూత్రధారి. వినోదయాత్రికుడు, విశ్వకుటుంబి, వ్యర్థజీవనము, భగవత్ ప్రేమ, సమిష్టి సంతుష్టి, భగవంతుని నివాసస్థానములు, భగవంతుని మహత్వము, నామ మహిమ, భగవద్రూపములు, భగవన్మహిమలు, భగవంతుని యెడల అభియోగము, భరతవాక్యము, అభేదము, పనివిలువ. నాస్తికనిరసనము, దయాస్వరూపము, అంతిమకాంక్ష.
పైయంశములన్నియు సుకుమార సుందరములై రసభావమందిరములై 'అమర్ ఖయ్యాము' కావ్యమునందు ఆకర్షణ ధ్యేయములై ఆస్వాదనీయము లగుచున్నవి. కొన్ని ప్రతీకలను కవిగారే భంగ్యంతరముగా వివరించిరి. వానిని ముందు చూతము.
ద్రాక్షాసవము, వధువు, మద్యము, మైరేయము, సారాయి, శీధువు మొదలయిన విధముగా పేర్కొన బడినది 'సుర' యనియే భౌతికవాదుల యభిప్రాయము. ప్రతీక వాదులు దానిని భగవంతుని అనుగ్రహ ప్రసాదముగా గుర్తించిరి. అందువల్లనే శ్రీ దాతార్ తన గ్రంథమునకు 'The Nectar of Grace' అని పేరు పెట్టెను. కరుణశ్రీ అదే భావముతో 'ఆ తండ్రిదే పరమానుగ్రహమంచు ద్రాక్షరసమున్ భావించి సేవించెదన్' అని పల్కిరి.
ప్రణయిని జీవాత్మయని ముందే చెప్పితిని. శాస్త్రిగారు కవితావస్త్రముల కమనీయ రూపముతో ప్రదర్శించిన ప్రణయినీ చిత్రమిది.
'రసమయివై, సదా హృదయరంజనివై, యనురాగపూర్ణవై,
కుసుమితవల్లివై, మధురకోమల హాసవిలాసరేఖవై,
అసదృశ సుప్రసన్నముఖివై, సఖివై మురిపించు నిన్ను కై
వస మొనరించుకొంటి భగవంతుని చెంతకు చేరు కోర్కెతో.'
ఇచ్చట భక్తిభావము మానవాకృతి నొందినది. ఇచ్చట ప్రణయిని భక్తికి ప్రతీక. ఇందలి ప్రతివిశేషణమును ప్రణయినికి అన్వయించునట్లే భక్తికి సైతము అన్వయించును. మూలమునందును, ఉర్దూసాహిత్యమునందును 'బుత్' అనుపదము నుపయోగించుకొని శ్లేషద్వారమున సారస్యము సాధించుట గోచరించును. విగ్రహము, సుందరయువతి అని ఆపదమునకు రెండర్థములు గలవు. కరుణశ్రీగారు శ్లేష నాశ్లేషింపకయే రెండు భావములను ప్రభావవంతముగా ప్రతీతము గావించుచున్నారు.
'దయగల దేవదేవుడు గదా కరుణించెను నాకు 'శ్రీ శుభో
దయ'వగు నిన్ను; "సుందరసుధా మధురాధర గోస్తనీ రస
ప్రియ" వగు నిన్ను; "శాంతి సముపేత సముజ్జ్వల సాహితీ సమా
శ్రయ"వాగు నిన్ను; నా వలపుజంటగ! నా తొలినోముపంటగా.'
ఇందలి ప్రియురాలు భక్తి కావచ్చును. జీవాత్మ కావచ్చును. ఒక వ్యక్తికి భక్తి కలుగవలయునన్నను భగవంతుని దయ అవసరమే. ఆ దయ కొన్ని యెడల అవ్యాజము కావచ్చును. కొన్ని యెడల తొలి నోము పంటకు సూచన కావచ్చును. ఈ ప్రియ శ్రీశుభోదయ - రసప్రియ - సాహితీ సమాశ్రయ.
'ఏడ్చుచు పుట్టినా రెపుడొ! యేడ్చుచు పోదురు రేపు! సాటివా
రేడ్చుదు రీర్ష్యతోడ; పెడయేడ్పుల సంత జగమ్మిదంత; ఇ
ట్లేడ్చుచు మొండి బండ బ్రతు కీడ్చుట మంచిదొ! గోస్తనీ రస
మ్మోడ్చుక త్రావి కన్ను లరమోడ్చుట మంచిదొ నిశ్చయింపుమీ!'
ఈ సత్యమును వివరింపవలసిన యవసరము లేదు. పుట్టినప్పు డేడ్వనివాడు తక్కినవారి నేడ్పించును. 'జన్మ దుఃఖం జరా దుఃఖం' అని అన్నప్పుడు ఏడుపే వినిపించుచున్నది. ఏడ్చుచు బ్రతుకుటకంటె మద్యముత్రాగి కన్ను లరమోడ్చుట మంచిది. ఇది బాహ్యార్థము. భగవదనుగ్రహమే మధువని చెప్పుటచేత భగవదనుగ్రహమును పొంది, అరమోడ్పుకన్నులతో ఆరాధనపరాయణుడై యుండుట మంచిదని ప్రతీయమానార్థము. ఇచ్చట యతిప్రాసలు ఎంతో ముచ్చటగా పడినవి. ఎచ్చటను కృత్రిమత్వము లేదు. వెదకులాట లేదు. సంభాషణ రీతికి అద్దము పట్టినట్లున్నది. అయినను కవి నాలుగవపాదమునం దొక చమత్కారము చేసెను. 'గోస్తనీ రసమ్మోడ్చుక త్రావి' అని యన్నప్పుడు యతిస్థానమందు 'ఓ' నిల్చినది. కావున పదవయక్షరముగా దానికి మిత్రాక్షరమును వాడవలయును. అట్లు వాడలేదు. 'మో' అని వాడెను. ఇది భ్రాంతిని కలిగించు స్థానము. కొందరు ఇట్టిదానిని 'అఖండయతి' అని యందురు. కాని యిట్టిది అఖండయతి కాజాలదు. ఇది కరుణశ్రీగారు యెరిగి చేసినపని. గోస్తనీరసమునకును ఓడ్చుకొనుటకును మధ్య ఎంతమాత్రము వ్యవధానముండరాదని కవి ఆంతర్యము. అందువల్లనే దానిని విడదీసి చదువరాదని శాసించుచున్నట్లుగా యతితో నిబంధించెను. ఈ విధముగా ఇచ్చట ఛందోగతముగా ఒక వైచిత్రిని సాధించెననుట నాకు సమ్మతము.
జీవితము క్షణిక మన్న విషయ మీ పద్యములో నిరూపితము -
'కాలము నిల్వబోదు క్షణకాలము; మృత్యువుచేతిలోని కూ
జాలము; నిల్వజాలని నిజాలము; ఎప్పటి కేమొ చెప్పగా
జాలము; గాన ఎందుకిక జాలము? బాలకురంగనేత్ర! నీ
వాలుగనుల్ తళుక్కుమన వంచుము శీధువు పానపాత్రలో?'
శబ్దశిల్పమున కీ పద్యము హృద్యమయిన కల్కితురాయి. యమకమును అనుప్రాసమును సుదీర్ఘ సమాసములలో, సంస్కృత శబ్దములలో భట్టుమూర్త్యాదులు చూపకపోలేదు. తెలుగు పదములలో చేమకూర సౌందర్యమును సాధించినమాట వాస్తవమే. కాని ఇంత తేలికగా సమాసముజోలికే పోకుండ సాధారణ శబ్దములలో శిల్పమును ప్రదర్శించుట ప్రశంసనీయము. కాలము - క్షణకాలము - కూజాలము - నిజాలము - (చెప్పగా) జాలము - జాలము. వీనిలో తెలియని మాటకాని బరువైన మాటకాని యొక్కటికూడ లేదు. పైగా 'కూజాలము' అన్న అన్యదేశ్యముచేత ఖయ్యాము వాతావరణము దరిదాపులకు చేరుచున్నది. ఇట్లే రోజాపువ్వులు, తాజా సౌరభాములు మొదలయిన అన్యదేశ్య ప్రయోగము వాతావరణ సృష్టికి పుష్టిని చేకూర్చుచున్నది. బహరాము, పాదుషా, సుల్తాను, సాఖీ మొదలయిన పదములు కూడ అట్టివే.
కరుణశ్రీ కోడికూతలో ఒక చమత్కారము చేసిరి. 'కొక్కొరొకో' అను నది కోడికూతకు అనుకరణము. దానికి తుల్యముగా 'ఎరుంగలే రొక్కొరొకో!' అని ప్రయోగించెను. ఈ రెండింటికి మధ్య 'ఇదేటి కునుకో' అని నిక్షిప్తము చేసిరి. అనగా కోడికూత త్రిరావృత్తమయినది. 'ఒక్కొరు' అన్న ఏకార్థకశబ్దముపై 'ఒకో' అన్న ఆశ్చర్యార్థకావ్యయమును చేర్చుటచేత ఇది సిద్ధించినది. ఇట్లు శబ్దమును సిద్ధింపజేసికొను నేర్పు కృతబుద్ధులయిన కొందరకు మాత్రమే యుండును. ఇట్టిదే 'కాకికూత' యందును గోచరించును. ఆపద్యమును చూడుడు-
'స్థిరములు "కావు కావు" చలజీవితముల్; సిరిసంపదల్; సుఖం
కరములు "కావు కావు"; పలుగద్దెలు మిద్దెలు నాత్మశాంతి కా
కరములు 'కావు కావు'; నవకమ్ములు నిత్యము 'కావుకా' వటం
చరచుచు నుండె కాకి; కను మల్లదిగో బహరాము గోరిపై.'