Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 37


    'కావు కావు' అనెడి ముక్తాయింపు కాకిగోలకు ప్రతిధ్వని. కాని గంభీరమైన విషయమును, భేరిమ్రోగించి చెప్పవలసిన విషయమును, మిక్కిలి సులభముగా చెప్పుట యిచ్చట ముచ్చట గొల్పును.

    'బ్రతుకొక కొండలోయ; పొరపాటుగ ప్రక్కకు కాలు వైచినన్
    పతనము తప్ప; దీయిరుకుబాట పయిం బయనించి యెందరో
    సతమతమైరి; యాత్ర కొనసాగినవా రొకరైన లేరు; పం
    డితులును పాదుషాలు బురిడీపడిరీ గరిడీ పరీక్షలో'.

    ఖయ్యాము జీవితయాత్రలో ప్రమత్తుడు కాడు. ప్రతి అడుగు భద్రముగా వేయవలయుననియే అతని హెచ్చరిక. లేనియెడల పతనము తప్పదు. 'బురిడీ పడిరీ గరిడీ పరీక్షలో' అన్నచోట వారి పతనావస్థ ధ్వన్యమాన మగుచున్నది. రకార డకారములు ఇకారముతో కూడి వచ్చుట అధఃపతనమును స్ఫురింపజేయుచున్నది. ఇంక, అవి స్థానవ్యత్యయము నొందుట, హ్రస్వదీర్ఘములను పరస్పరము మార్చుకొనుట ఆపండితులును పాదుషాలును ఒకరితో ఒకరు అల్లుకొనిపోయి క్రిందుమీదులుగా పొర్లుచు పడిన వైఖరికి వ్యంజకమగుచున్నది. శబ్దశక్తిని సముచితయుక్తితో ఉపయోగించుటకిది యొక చక్కని ఉదాహరణము.
    భగవంతుడున్నాడనుటకు నిదర్శనముగా చెప్పిన పద్యమిది-

    'అంబరచుంబితంబులు మహాగిరులున్, సువిశాలముల్ సము
    ద్రంబులు, పొంగిపారెడి తరంగిణులున్, ఫలపుష్పపత్ర పూ
    ర్ణంబులు చె' ట్లనంతగగనంబును దేవుని యున్కి దెల్ప ని
    త్యంబు నిదర్శనంబులు, ప్రదర్శనముల్ పరమాత్మ శక్తికిన్.'

    అద్భుత జనకమై అలౌకిక చమత్కృతిమంతమగున దెల్ల భగవదక్తిత్వమునకు నిదర్శనమే - అది యెవ్వరికైన స్వానుభవ సంవేద్యమే.
    'భగవంతుడు నాకేమిచ్చెను? కష్టాలు తప్ప' అనువారు కూడ చాలా మందియున్నారు. వారికి సమాధానమిది-

    "నిలువగా ధాత్రి, త్రావగా నీళ్ళొసంగి
    బ్రతుకుటకు గాలి, తియ్యని పండ్లొసంగి
    పవలు రాత్రులు శ్రమపడి, ప్రజల పాల
    నం బొనర్చెడు విశ్వకుటుంబి వీవు."

    ఇట్లే మానవుని వినోదయాత్రికునిగాను, ప్రపంచమును విశ్రాంతి శిబిరము గాను భావించుట బాగున్నది. భగవంతుడు సూత్రధారియై జగన్నాటక మాడించును. నరులు పాత్రధారులై అతడు చెప్పినట్లు నటింతురు. కావున బాగోగులు అతనికే దక్కవలయును. ఇచ్చటనే మాయ క్రమ్ముకొని మంచి జరిగినప్పుడు కర్తృత్వము తనదిగాను, చెడు జరిగినప్పుడు విధిదిగాను భావించుట జరుగుచున్నది. 'సర్వము నీదే' యన్న శరణాగతి భావ మున్నప్పుడు ఇట్టి భావన కలుగదు; ఇట్టి బాధయు నుండదు. భగవంతునిపైని చేయు ఆరోపణలకు మూలకారణము అగ్నానముల్ దైవరహస్యమును మానవులు తామై యెంత శోధించియు సాధింపలేరు. భగవంతుడు తానై ప్రదర్శించినప్పుడు తెలిసినంత తెలిసికొని ఆనందము ననుభవించుటయే మానవుని కర్తవ్యము.

    'వేసము వేసి పంపితివి వేదిక మీదకు; "పాడువేళ" నా
    మీసము జారిపోయి విషమించె పరిస్థితి; ప్రేక్షకుల్ పరీ
    హాసము చేయ నుండిరి; రహస్యముగా తెరవేయు మంచు నీ
    కోసము చూచితిన్; కసరుకొంటి; విదెక్కడి దర్శకత్వమో!'

    ఈ సృష్టి ఎప్పుడో జరిగినది. ఈనాటకమునకు నాంది యెప్పుడో పఠించిరి. 'భరత వాక్యము విన్పడ దెన్నినాళ్ళకున్', ఈనాటకమునకు ముగింపు లేదు. 'జగన్మిథ్యా' అని 'ప్రపంచము క్షణికము' అని యన్నప్పుడు 'అత్యంతాభావము' కలుగునని కొందర భావము. అది భ్రమోత్పన్నము. 'పాత్రలు వచ్చెడు నిష్క్రమించెడున్; రంగము వెంటనే మరొక రంగము సాగుచునుండె; దృశ్యముల్ రంగులు మారుచున్నవి; తెరల్ పడుచున్నవి; లేచుచున్నవిన్'. ఇట్లు మార్పు నొందుటయే కాని క్షణికమని యన్నప్పుడు జగత్తు సర్వము నాశనమగునని భావము కాదు.

    పైపద్యమునందు హాస్యము లాస్యము చేయుచున్నది. పాత్రధారి అపహాస్యము పాలయ్యెను. అది భగవద్విలాసమే. అట్లే మరొకడు చేతకానివాడు సభారంజకుడయినాడు; అభినందనపాత్రుడైనాడు. అదియు భగవద్విలాసమే.

    'నను మెడపట్టి గెంటితివి నాటకరంగముపైకి; చేత కా
    దని బతిమాలుకొన్న వినవైతివి; కన్నులు విప్పి సభ్యులన్
    కనుగొనినంత కాళ్ళు వడకం దొడగెన్; సరిక్రొత్త నర్తనం
    బనుకొని చప్పటుల్ చరచి రందరు; చాల్ తెరదింపుమో ప్రభూ!'

    'తెరకావల వేసము విప్పినంత రాజెవడొ! బటుండెవండొ! స్ఫురియింపదు సర్వము నొక్కరూపమై' అని యన్నప్పుడు 'ఆత్మభేదము లేదు, ఉపాధి వల్లనే మానవులలో భిన్నత్వము కానవచ్చుచున్నది' అన్న ఆధ్యాత్మిక సామ్యవాదము స్ఫుటముగా వినిపించుచున్నది.

    'త్రాగుట తప్పుగాదు; మతి తప్పి ఎగాదిగ నూగి గాలిలో
    రేగుట సుంత తప్పు; చెలరేగి బజారున సాగి తూగి యూ
    రేగుట కొంత తప్పు; ఎదురేగి జనమ్ముల నాగి పిచ్చిగా
    వాగుట గొప్ప తప్పు; పరవళ్ళు క్షమింపగరాని తప్పగున్'.

    'త్రాగుట తప్పే అయినను తన మానాన తాను బ్రతుకుచున్నాడు. మనకేమి?' అనెడి ఉపేక్షా భావమువల్లనే 'త్రాగుట తప్పుగాదు' అని నిర్ణయము చేయుట జరుగుచున్నది. తరువాత వానిని తప్పులుగా నెలకొల్పుటకు సైతము 'త్రాగుట తప్పుకాదు' అని యనుట ఆవశ్యక మగుచున్నది. ఇది లౌకికార్థము. ఇచ్చట ప్రధానమైనది ప్రతీయమానమగు ఆధ్యాత్మికార్థము. ఒకడు భగవద్భక్తుడు కావచ్చును; భగవదనుగ్రహమును పొందవచ్చును. ఆ అనుగ్రహప్రాప్తిని గురించి నలుగురికి చాటుకొనుట యందే అతడు నిమగ్నుడు కారాదు. అట్టి అనుగ్రహప్రాప్తి లేనివారి కంటె తనలో ఆధిక్య మున్నదని విఱ్ఱవీగరాదు; బిఱ్ఱబిగియరాదు. అట్టివారిని తక్కువచేసి ప్రవర్తింపరాదు. అట్లు చేసినయెడల భగవత్ర్పసాదమును దుర్వ్యయము చేయుటయే. అది పెద్దతప్పు.
    ఇట్లు అనేకవిధములైన అందములు అమర్ ఖయ్యామ్ కావ్యమునందు విందులు చేయుచున్నవి. 'ప్రాణము తీయనేర్చిన దురంధరులందరు; లేడు బొందిలో ప్రాణము పోయనేర్చిన కృపాపరుడొక్కడు' 'నీచమగు యాచనకంటెను చావు మేలు' 'నీయంతట నీవు నిల్వబడరా' 'విడరా పరతంత్ర భావముల్' 'ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గమున్నదే' 'పంకిలము సేయకు స్వామివరప్రసాదమున్' ' మధుర భాషణమే మణి భూషణంబురా' 'విపన్నుల నాదరింపుమా' 'నిత్యమృత్యు నృత్యాలయ మీజగత్తు' 'కనికరము నేర్చుకొనని ముష్కరుడు నరుడు' 'మనసు నరికట్టలేని పామరుడు నరుడు' 'తెరువు తెలియని వట్టి వానరుడు నరుడు' మొదలయిన ప్రబోధములు సూత్రప్రాయములై అల్లుకొనిపోయి సత్పాత్రసృష్టికి ఆలవాలములు కాగలవనుటలో సందేహము లేదు.  
    అశ్లీలము పొంత బోని శృంగార మొకవంక, ఆపన్నత లేని ప్రపన్నత యొక వంక ఉమర్ ఖయ్యామును పొదువుకొనియున్నవి. శాంతమును శృంగారమును విరుద్ధరసములు. అవి ఒక్కచోట ఉండవు. కాని రహస్యాత్మక ప్రవృత్తి గల కవి వానిని సరసముగా సమ్మేళనము పొందించెను. అందువల్లనే ఖయ్యామును 'శాంత శృంగార తపస్వి'గా నేను సంబోధింతును; సంభావింతును. ఆ ఉమర్ ఖయ్యాము వయఃపరిమితి లేని స్థితి నందుకొని తెలుగునాట అమర్ ఖయ్యాముగా పదము మోపినాడు. ఆయన స్వాదుప్రసాదమును అందుకొని ఆస్వాదించుట, అనుగుణముగా ప్రవర్తించి అభ్యుదయము నందుట మనవంతు.

                                                       సర్వే జనాః స్సుఖినో భవంతు.

 Previous Page Next Page