అతడు క్రీ.శ. 18-5-1048వ తేదీన బుధవారమునాడు సూర్యోదయ సమయమున జన్మించెనని స్వామి గోవిందతీర్థ నిర్ణయించెను. అతడు తన బాల్యమును జన్మస్థలమయిన బల్ఖు నందే గడపెను. విద్యల నభ్యసించెను. పలు శాస్త్రములందు ప్రావీణ్యమును గడించెను. చక్కని ఆరోగ్యముతో, నిశితమయిన ప్రజ్ఞతో, సాటిలేని జ్ఞాపకశక్తితో అతని బాల్యము హాయిగా గడచిపోయెను. పదునెనిమిదేండ్లు వచ్చుసరికి తండ్రిని గోల్పోయి, జీవితభృతికొరకు కడుపు చేత పట్టుకొని కాళ్లరుగునట్లు తిరుగవలసి వచ్చెను. దీనితో చదువునకు స్వస్తిచెప్పక తప్పినది కాదు. సమర్ఖండునందలి 'అబూతాహిర్ అబ్దుర్ రహమాన్ బిన్ అహ్మద్ అలక్ సారియా' అనెడి ధనవంతుడు ఖయ్యాము నాదరించి అతని అన్వేషణల కవకాశమును కలిగించెను. అతడే 'బుఖారా' పరిపాలకుడైన 'షంసుల్ ముల్క్'తో పరిచయము కలిగించెను. ఖయ్యాముపట్ల ఇతనికి గౌరవము పెరిగి 'సుల్తాన్ మలిక్ షా'కు పరిచయము గావించెను. ఆ విధముగా ప్రభుసాదర గౌరవములతో 'ఇస్పహాను' లోని గవేషణాగారమునకు ప్రధానుడై పరిశోధనలను నిర్వహింపసాగెను. పారశీక పంచాంగమును పరిష్కరించు శాస్త్రజ్ఞుల కధ్యక్షుడై మలిక్ షా కోరికను సంతృప్తికరముగా సఫలము చేసెను. మలిక్ షా మరణానంతరము (1092) ఖయ్యాము కొలదికాలము మాత్రమే రాజధానిలో నుండెను. ప్రభుత్వ సహాయము తొలగిపోయినది. ఖయ్యాము తన డెబ్బదినాల్గవయేట క్రీ.శ. 1122లో నైషాపూరులో దేహయాత్ర చాలించెను.
౪
ఖయ్యాము జీవిచచరిత్ర వలెనే ఖయ్యాము తత్వముకూడ ప్రశ్నలమయమై పోయినది. కొందరి దృష్టిలో అతడు కేవలనాస్తికుడు, భోగవిలాసప్రియుడు. కొందరి దృష్టిలో దైవభక్తుడు, శీలసంపన్నుడు.
కొందర దృష్టిలో దేహాత్మవాది; కొందర దృష్టిలో ఆధ్యాత్మికవాది. కొందర కాతడు పలాయనవాది; కొందరకు పరమక్రియానిరతుడు. కొందరకు స్వైర వృత్తి పరాయణుడు; కొందరకు కర్మాధీన ప్రవృత్తి పరాయణుడు.
'మట్టిలో పుట్టిన దేహము మట్టిలో కలియును. అంతటితో సరి' అన్నదియే ఖయ్యాము నిశ్చయమని కొందరందురు; 'ఆ మట్టినుండి పాత్రలు పుట్టవచ్చును, గరిక మొలవచ్చును, పువ్వులు పూయవచ్చును. కావున సృష్టియందలి ప్రతి పదార్థమును ఆ విధమైన భావముతో గౌరవింపవలయును' అన్నదియే ఖయ్యాము నిశ్చయమని కొందరందురు.
'ఖయ్యామునకు ఇహమునందు మాత్రమే ఇష్టము. పరము లేనేలేదు' అని కొందరు భావింపగా, 'ఇహము ప్రవాససౌధము మాత్రమే. నివాససౌధము వేరుగా నున్నది' అని కొందరు భావించుచున్నారు.
ఖయ్యాము విషాదయోగమును మాత్రమే బోధించుచున్నాడని కొందరు భావింపగా, తమ నాడులలో ఉత్సాహమును పూరించుచున్నాడని కొందరు భావింతురు.
'మగువ, మధువు అనియే ఖయ్యాము ఆక్రోశ'మని కొందరు; 'ఆ మగువ మగువకాదు, ఆ మధువు మధువుకాదు' అని కొందరు.
'సర్వజాతి సమైక్యమే అతని లక్ష్యము' అని కొందరు; అతనికి సమాజ స్పృహయే లేదు' అని కొందరు.
ఇట్లు పరస్పర విరుద్ధాభిప్రాయములు ప్రాచుర్యము నొందియున్నవి. హెడోనిస్ట్, ఎపిక్యూరియన్, సూఫీ, మిస్టిక్ మొదలయిన ముద్రలు కూడా ఖయ్యాముపై పడినవి.
వేమనకు ఆటవెలదివలె అతనికి రుబాయి వచోవిధేయమయినది. అట్లు గానము చేసినవానిని శిష్యులో మిత్రులో లిపిబద్ధము చేసి భద్రపరచియుందురు. ఒకే భావముతో భిన్న పద్యము లుండుటకీ ఆశు ధోరణియే కారణము.
అయినను వివేకవంతులు కణకణమును సంగ్రహింతురు. క్షణక్షణమును సద్వినియోగ మొనరింతురు. ఎట్టయెదుట సౌందర్యము రసరూపమునొంది ప్రవహించుచున్నప్పుడు అం దోలలాడకయుండుట కవితాప్రియులకు శక్యముకాదు. హృదయపాత్రికలో నింపుకొనక తలమునుకలుగా మునుగక ఔగాములు చర్చించుట నిరర్థక ప్రయత్నము. సౌందర్యములో మునిగి సత్యమును సాక్షాత్కరించుకొని శివత్వమునొందుట సహృదయ లక్షణము. ఖయ్యాము కవిత్వము సామాన్యపాఠకుని సైతము మాన్యసహృదయుని చేసినది. చరిత్రకెక్కిన ఖయ్యాము విశేషములు చరిత్రగర్భములో కలిసిపోయినవి; కవితాపతాకము విశ్వవిహాయస వీథులలో వెలుగులు వెలయించుచున్నది.
ఉమర్ ఖయ్యాము రుబాయీలను వంగభాషలోనికి కవితారూపమున అనువదించిన శ్రీ నరేంద్రదేవ్ కావ్యవస్తువును అయిదు ఖండములుగా విభజించి తన పీఠికయందు ప్రదర్శించెను. 'ఖానా పీనా మజా కర్నా' ఇదేకదా ఉమర్ ప్రబోధము?- అని అనాలోచితముగా అడుగువారికి ఈ విభాగము కనువిప్పు కాగలదు. దాని నిచ్చట ఆంధ్రీకరించి చూపుచున్నాను-
1. అభియోగము :- నియతిచక్రము నిర్నిరోధము; అదృష్ట దురదృష్టములు అపరిహార్యములు; మనుష్యశక్తి పరిమితము; జీవితము క్షణమాత్రస్థాయి; ఈశ్వరుని ఆలోచనారహితత్వము మున్నగునవి.
2. అవహేళన :- మనుష్యుని అహంకారము; బుద్ధిహీనత; అంధవిశ్వాసము; ఛాందసత్వము; స్పర్థ మున్నగునవి.
3. ప్రేమ :- విరహవేదన; సంయోగానందము; దర్శనవ్యాకులత; అదర్శనావేదన; ప్రణయ ప్రభావము; ప్రణయ సార్థకత్వము మున్నగునవి.
4. సౌందర్యము :- ప్రాకృతిక శోభ; వసంత వైభవము; సద్యఃస్ఫుటిత పుష్పము; సుందర కవిత; సుమధుర సంగీతము; పక్షుల కలనాదములు; పున్నమి వెన్నెల; వనశ్రీ; తరుణీలావణ్యము; నదీతీర శాద్వలములు; ప్రభాత ప్రశాంత విహాయసము మున్నగునవి.
5. తత్వము :- ఆధ్యాత్మ దర్శనము; భగవద్భక్తి; సృష్టిరహస్యము; పాపపుణ్య విచారణ; స్వర్గ నరక విచారణ; సాకీ ద్రాక్షాసవ సంభావన; జన్మ మృత్యుచింతన; ఈశ్వరవాదము మున్నగునవి.
నిజమునకు పైని చెప్పిన అయిదు విభాగములు ఖయ్యాము కవితాభారతికి పంచప్రాణము లనవచ్చును. పై అంశములను అభివ్యక్తము చేసిన విధానము ఆత్మస్థానము నలంకరించుచున్నది.
౫
"ఉమరు ఖయామ్ మహాకవి రసోజ్జ్వల మార్గము నాశ్రయించి యీ
అమరు ఖయామ్ రచించితి; తదాస్తిక భావన నుగ్గడించితిన్;
సుమధురమైన ఆ సుకవి సుందరభావ మొకించుకంత యిం
దమరిన - చిత్తగింపగల రాంధ్రమహోదయు లౌచితీప్రియుల్."
అని కరుణశ్రీగారు అమర్ ఖయామ్ కావ్యాంతమునందు సుమనోంజలి ఘటించుచున్నారు. ఇది పూలదోసిలి; సరసులకై పట్టిన అంజలి. ఖయామ్ సుందర భావములు సుమధురములు - పూలభారమువంటి భారము కలవి; మిక్కిలి తియ్యనివి. ఆంద్రరసికులు ఔచితీప్రియులు. ఎన్ని చెప్పికొన్నను ఔచిత్యము చెడినప్పుడు అన్నియు చెడినట్లే. అది యున్నప్పుడే చైతన్యస్ఫూర్తి. అట్టి ఆత్మస్ఫూర్తి కలవారు ఆంధ్రపాఠకులు. ఉమర్ ఖయామ్ మహాకవి. క్షుణ్ణమయిన మార్గములో వెళ్ళెడివాడు ప్రసిద్ధకవి కావచ్చును; ప్రజాకవి కావచ్చును. తనదైన మార్గమును నిర్మించుకొన్నవాడే మహాకవి. అట్టి మహాకవికే అనుయాయు లుందురు; ఆశ్రితు లుందురు. ఆ మహాకవి మార్గము రసోజ్జ్వలము.
పై వివరణను సమన్వయించుకొన్నప్పుడు తేలిక మాటల పొందిక తేలికయైన భావస్పందన స్పష్టముగా సాక్షాత్కరించును. పాపయ్యశాస్త్రిగారు నిశ్చితముగా ఖయ్యామును ఆస్తికునిగానే నిర్ణయించుకొనిరి. లోకప్రవాద మెట్లున్నను 'లోచూపు' గల కవులు. సహృదయులు బహుసంఖ్యాకులు అట్లే నిర్ణయించుచున్నారు. ఖయ్యాము వ్రాసిన 'కూజానామా' ఒక్కటి చాలును - అతడు ఆస్తికుడని నిర్ణయించుటకు; సృష్టికర్త అస్తిత్వము నంగీకరించుచున్నాడని చెప్పుటకు. కావుననే పాపయ్యశాస్త్రిగారు స్పష్టభాషలో 'తదాస్తిక భావన నుగ్గడించితిన్' అని చెప్పుచున్నారు.
పాపయ్యశాస్త్రిగారి హృదయములో ఉమర్ ఖయామ్ ప్రవేశించిన దీనాడు కాదు; ఉదయశ్రీ ప్రథమ భాగము ఉదయించునాటికే ఆ ప్రవేశము జరిగినది. సంపూర్ణమైన ఆవిష్కారమున కింతకాలము పట్టినది.
అమర్ ఖయామ్ కావ్యమునందు మూడేమూడు విభాగములున్నవి. మొదటిది ప్రణయిని. రెండవది ప్రపంచము. మూడవది పరమేశ్వరుడు. మరల ఒక్కొక్క విభాగమునందు అనేకాంశములు రుచిరాంశువులై మన దృష్టి నాకర్షించును; రుచిమంతములై మన ఆస్వాదన శక్తిని పెంచి ఆరాధనవైపు మరలించును. వాని సంగతిని చూచుటకు ముందు ఈ త్రితయమును తెలిసికొందము.
'పాపయ్యశాస్త్రిగారిది ప్రజా హృదయస్పందన సమర్థమైన రచన. ఇట్టి యెడల మధ్యలో ఇంకొకరి జోక్యమేల?' అన్న ఆగ్రహము పాఠకులకు తప్పక కలుగును. శాస్త్రిగారి విషయములోనే కాదు. ఎవరి విషయములోనైన ఇట్టి ఆగ్రహము కలుగవలసినదే; కలుగకుండుట అక్రమము; అసమంజసము. కాని కొందరకు కొంచెము వివరణ మార్గసూచిక ఆవశ్యక మనుటయు యథార్థమే. అప్పుడే పీఠికలకు ఆవశ్యకత కలుగునది.