Previous Page Next Page 
నయనతార పేజి 36

 

    అయ్యో పాపం , పూర్తిగా తడిసిపోయారు .... వుండండి , తువ్వాలిస్తాను .... తుడుచుకుందురు గాని."
    "పరవాలేదండి , కాస్త తగ్గాక వెళ్ళిపోతాను ...."
    'అంతవరకు అలా నీళ్ళోడుతూంటే జబ్బు చేయ్యదూ. ఫరవాలేదు తుడుచుకోండి ...." అంటూ సీతమ్మ తుండుగుడ్డ అందించింది. అతను తల తుడుచుకున్నాడు. షర్టు విప్పి నీళ్ళు పిండి కిటికీ రెక్క మీద ఆరేశాడు. పేంటు నీళ్ళు కారుతున్నా మరో దారిలేక అలాగే వుండిపోయాడు. అతనికి కట్టుకోడానికి ఏదన్నా ఇస్తే బాగుండుననిపించినా , అతనికి యీయ తగ్గవి ఏం కనిపించలేదు సీతమ్మకి. తడిసిన చీర, కట్టుకున్న చీర, చాకలి దగ్గిరున్న చీర తప్ప ఏం వున్నాయి తన దగ్గిర అనుకుంది. ఓ క్షణం పోయాక పెట్టె అడుగున పరిచిన భర్త పాత పంచె ఒకటి వుండాలని గుర్తు వచ్చి పెట్టె తెరచి అది తీసింది. ఆ యువకుడికి ఆ పంచె యీయాలంటే మొహమాటం అన్పించినా అదే అందించింది. "ఇంట్లో ఇంకేమీ లేదు. ఇది .....ఇది మీకు కావలిస్తే కట్టుకోండి...." బిడియంగా అంది.
    అతను 'పరవాలేదు లెండి ' అన్నా ...... వంటినంటుకు పోయిన టైట్ ప్యాంటు , నీళ్ళు గారుతున్న ఆ ప్యాంటుతో కూర్చోగలగడం అటుంచి నిలబడడం కూడా కష్టమనిపించింది. అటు బయట వర్షం తగ్గే సూచన కనపడలేదు.
    "వర్షం తగ్గేట్టు లేదు, బట్టలు మార్చుకుని కూర్చోండి, ఎంతసేపలా నిలబడగలరు.... పరవాలేదు కట్టుకోండి" అంటూ సీతమ్మ వంటింటిలోకి వెళ్ళింది. తప్పదన్నట్టు ఆ పంచెని రెండు మడతలు వేసి లుంగీ కట్టుకున్నాడు ఆతను.
    సీతమ్మ వచ్చి ఉన్న ఆ ఒక్క నులక మంచం ముందుకు జరిపింది. "కూర్చోండి ..... ఎంతసేపు నిలబడతారు...."
    అతను కూర్చున్నాడు. "బయలుదేరేసరికి వర్షం లేదండి, సగం దూరం వచ్చేసరికి మొత్తెసింది.... అందులో పెట్రోలు ఇప్పుడే అయిపోవాలా ..... పాపం అనవసరంగా మీకిచ్చింది ...." నొచ్చుకుంటూ అన్నాడు.
    "ఇబ్బందికేముంది లెండి ....' సీతమ్మ మొహమాటం గానే అంది. వున్నది ఒక్కటే గది! అపరిచిత యువకుడు రాత్రి!..... అతని ముందే కూర్చోలేక మానలేక ఇబ్బంది గానే వుంది సీతమ్మకి.
    అతను సిగరెట్టు పెట్టె తీశాడు. అగ్గిపెట్టె తడిసి వెలగలేదు. అది చూసి సీతమ్మ లోపల్నుంచి అగ్గిపెట్టె తీసుకొచ్చి ఇచ్చింది.... "ఇన్ని పాలన్నా లేవు . కొంచెం టీ చేసి యిద్దామన్నా ...." అంది.
    'అయ్యో .... బాగుంది . అవన్నీ ఎందుకండీ .... వర్షంలో తడిసి వచ్చాను. నా అవసరం కొద్ది ....' అతను బిడియంగా అన్నాడు.
    పిల్లలిద్దరూ కొత్త వ్యక్తిని కాసేపు కుతూహలంగా చూశారు. తరువాత నిద్రకి ఆగలేక కునికిపాట్లు పడుతున్నారు. సీతమ్మ ..... మంచం మీద అతను కూర్చున్నాడు. కనక పిల్లలిద్దరికి చాప మీద బొంత పరిచింది... .... "మీరిద్దరూ పడుకోండర్రా..... జోగుతున్నారు ...." అంది.
    "అయ్యో .... మంచం తీసుకోండి. ఆ చాప యిలా యియండి. నేను కూర్చుంటాను..... ప్చ్..... నా వల్ల మీకెంత ఇబ్బంది అయింది ..... ప్లీజ్ .... మీరు కూర్చోండి ఎంతకని నిలబడతారు ...." నిలబడి నొచ్చుకుంటూ అన్నాడు.
    'అయ్యో పరవాలేదు కూర్చోండి.... కూర్చోండి ..... పిల్లలు ఇలా పడుకుంటారు లెండి . ఒక్క పూటకి ఏముంది. ఏదో వర్షం వచ్చింది గనక మీరు వచ్చారు. లేకపోతే మాలాంటి వాళ్ళ ఇళ్ళకి మీరెందుకు వస్తారు..... కూర్చోండి ...." అంది సీతమ్మ పిల్లలిద్దరిని పడుకోబెట్టి , ఆ చాప మీదే కూర్చుంది సీతమ్మ.
    బొట్టు లేని ఆమె ముఖం చూసి "మీ వారికేం పని!" అని అడగాలనుకున్న ప్రశ్న అడగడం అనవసరమనుకున్నాడు అతను. పాపం! ఈ చిన్నపిల్లలిద్దరిని పెట్టుకుని  ఎలా, ఏ ఆధారంతో జీవిస్తుందో ..... అడగాలని వున్నా సభ్యతా అడ్డు వచ్చి అడగలేకపోయాడు. ఆ గదిలో వున్న ఒక్క నులక మంచం,  రెండు పాత ట్రంకు పెట్టెలు, దండెం మీద మాసిన గుడ్డలు, చాప మీద బొంత , అలమారాలో అద్దం ముక్క, పళ్ళూడిన దువ్వెన ..... కావిడి పెట్టె మీద వున్న నాలుగయిదు గిన్నెలు..... ఏది చూసినా ఆమె లేమిని పట్టిస్తున్నాయి..... గదిని, ఆమెని చూసిన అతను పాపం అని మరోసారి అనుకున్నాడు.
    సూటుబూటుతో గొప్పింటి బిడ్డగా కనిపించే అతన్ని చనువుగా మీ నాన్న కేం పని, ఏం చదువుతున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావూ అని అడగాలనుకున్న ప్రశ్నలని అడగలేకపోయింది సీతమ్మ.
    నులక మంచం మీద కూర్చుని సిగరెట్టు కాల్చుకుంటూ వర్షం తగ్గడం కోసం ఆరాటంగా చూస్తున్నాడు అతను.
    అతను వెడితే నిద్రపోదాం అనుకుంటూ సీతమ్మ నిద్ర ముంచుకు వస్తున్నా ఆపుకుంటూ కూర్చుంది. చీకట్నే లేచి యింట్లో పనిపాట చూసుకుని, అక్కడి కెళ్ళి రోజంతా చాకిరీ చేసిన సీతమ్మ నిద్రకి ఆగలేక కూర్చునే కునికిపాట్లు పడుతుంది.
    ఛా..... పాడు వర్షం యిలా పట్టుకుందేమిటి! తన ప్రోగ్రాం అంతా అప్సెట్ అయిపొయింది. సిగరెట్టూ మీద సిగరెట్టు కాలుస్తూ చిరాకు పడిపోతున్నాడు అతను.
    సీతమ్మ అలా గోడకి జారగిలబడే నిద్రలోకి జారింది.
    సీతమ్మని చూస్తుంటే పాపం అన్పించింది అతనికి. తను వెడితే పాపం హాయిగా పడుకుని నిద్రపోతుంది! పరాయి మగాడిని ఎదురుగా పెట్టుకుని ఎలా పడుకోగలదు ఆవిడ. ఇలా .... ఒక్కటే గది వుందని తెలిస్తే మరి కాస్త దూరం వెళ్ళి ఇంకెవరి ఇంటి ముందన్నా అగేవాడు! వెళ్ళి పొతే .....స్కూటర్ వదిలేసి నడిచి వెళితే ..... అసలు వర్షం కాస్తన్నా తగ్గిందేమో .... అతను లేచి నెమ్మదిగా గడియతీశాడో లేదో ఒక్క విసురుగా గాలి జల్లు మొహం మీద కొట్టింది. ప్రచండ వేగంతో బయటగాలి ప్రళయనృత్యం చేస్తుంది. ఆ గాలికి ఉక్కిరిబిక్కిరి అయి అతి కష్టం మీద తలుపు మూయగాలిగాడు. ఆ గాలి వేగానికి, ఆ జల్లుకి కునికి  పాట్లు పడుతున్న సీతమ్మ ఉలిక్కిపడి లేచింది. "ఏమిటి తలుపు తీశారు..... వెళ్ళిపోతారా " అంది.

 Previous Page Next Page